కరోనావైరస్: గుజరాత్‌లో కోవిడ్-19 మరణాలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
గుజరాత్.... మోదీ 13 ఏళ్ల పాలన తర్వాత దేశం మొత్తానికే ఓ ఆదర్శమైన రాష్ట్రంగా ప్రచారంలోకి వచ్చింది. గుజరాత్ మోడల్ అంటూ అవకాశం వచ్చినప్పుడల్లా బీజేపీ పదే పదే చెప్పుకుంటూ వచ్చింది. కానీ కరోనావైరస్ దెబ్బకు ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం విమర్శలజడిలో తడిసి ముద్దవుతోంది. కేసుల సంఖ్యలో దేశంలోనే నాలుగో స్థానంలో ఉండటం, మరణాల రేటు అధికంగా ఉండటం ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెట్టేస్తోంది.
మే 20న పర్వీన్ బనోకి శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది మొదలయ్యింది. ఆ విషయాన్ని తన కొడుకు మిర్ పఠాన్‌కి చెప్పగానే వెంటనే ఆయన దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు.
54 ఏళ్ల తన తల్లికి డయాబెటిస్, హృద్రోగ సమస్యలు కూడా ఉన్నాయన్నది ఆయన ఆందోళన. దానికి తోడు అహ్మదాబాద్‌లోని వాళ్లు నివసిస్తున్న ప్రాంతానికి పక్కనే ఉన్న గోమతిపూర్‌లో ఇటీవల అత్యధికంగా కోవిడ్-19 కేసులు బయటపడ్డాయి.
అయితే ఆ తరువాత 30 గంటలసేపు వాళ్ల కుటుంబానికి నరకం కనిపించింది. మొత్తం 3 ఆస్పత్రులకు వెళ్లినా వాళ్లకు ఆమెను చేర్పించేందుకు బెడ్ దొరకలేదు. ఆ 3 ఆస్పత్రులలో రెండు ప్రైవేటు ఆస్పత్రులు కాగా మూడోది ప్రభుత్వ ఆస్పత్రి.
మరో దారి లేక ఆమెను ఇంటికి తీసుకొచ్చేశారు. ఆమె పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో మర్నాడు ఉదయాన్నే ఆమెను అహ్మదాబాద్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. దేశంలోనే అత్యుత్తమ సౌకర్యాలున్న ఆస్పత్రులలో అది కూడా ఒకటి.
వెంటనే ఆమెకు కోవిడ్-19 పరీక్ష కోసం స్వాబ్‌ను సేకరించారు. అప్పటికే ఆమె రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తగ్గిపోయాయి. దీంతో వెంటనే ఆక్సిజన్ అందించారు. ఆ రోజంతా అదే పరిస్థితి ఉండటంతో వెంటనే వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పైకి చేర్చారు.
కొన్ని గంటల తర్వాత అంటే మే 22 అర్థరాత్రి తర్వాత 1.22 గంటల సమయంలో ఆమె మరణించారు. మర్నాడు వెలువడిన కరోనావైరస్ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ అని తేలింది.
బీబీసీ అడిగిన ప్రశ్నలకు ఆస్పత్రి సమాధానం చెప్పలేదు. కానీ పఠాన్ మాత్రం తన తల్లిని మరి కాస్త ముందుగానే ఆస్పత్రిలో చేర్చి ఉంటే బతికి ఉండేవారంటూ కన్నీరు మున్నీరయ్యారు.
అదే సమయంలో కరోనారోగులకు తగిన విధంగా చికిత్స అందించడం లేకపోతోందంటూ అహ్మదాబాద్ ప్రభుత్వాసుపత్రి హెడ్ లైన్స్‌లోకి వచ్చింది. 490 మందికి పైగా ప్రాణాలు పోవడంతో హైకోర్టు ఆ ఆస్పత్రిని ఓ చీకటి కొట్టంగా వ్యాఖ్యానించింది. అటు కోవిడ్-19 విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ చీవాట్లు పెట్టింది. అయితే ప్రభుత్వం మాత్రం తాము అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నామని చెప్పుకొచ్చింది.

గుజరాత్‌లో అత్యధిక మరణాలకు కారణాలేంటి?
పశ్చిమ గుజరాత్‌లో అతి పెద్ద నగరం అహ్మదాబాద్. సుమారు 70లక్షల జనాభా ఉంటుంది.
ఈ నగరంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో 75శాతం ఇక్కడే ఉన్నాయి. ముఖ్యంగా మరణాలు అధికంగా ఉన్నాయి.
సుమారు 21,500 కేసులతో దేశంలోనే నాల్గో స్థానంలో ఉంది గుజరాత్. కానీ వ్యాధి సోకిన వారిలో మరణాల శాతం మాత్రం 6.2. దేశంలోని సరాసరితో పోల్చితే ఇది 2.8శాతం ఎక్కువ.
అహ్మదాబాద్ ఆస్పత్రుల్లో సంభవిస్తున్న మరణాలపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు, మరణించిన వారిలో 80శాతానికి పైగా కోవిడ్‌కు తోడు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని అవి కూడా వారి మృతికి కారణం కావచ్చని చెప్పింది.
అయితే ప్రజారోగ్య నిపుణులు మాత్రం మరణాల రేటు పెరగడానికి ఒకే కారణాన్ని గుర్తించడం కష్టమని అంటున్నారు.
కొందరు రాష్ట్రంలో ఇతర రోగాలతో బాధపడే వారి శాతం ఎక్కువగా ఉందని అంటున్నారు. అయితే అది కేవలం ఒక్క గుజరాత్‌కే పరిమితం కాలేదని, తమిళనాడులో డయాబెటిక్ రోగులు ఎక్కువగా ఉన్నారని కానీ అక్కడ మరణాల రేటు తక్కువగానే ఉందని మరి కొందరు అభిప్రాయపడ్డారు.
అయితే కోవిడ్ మరణాలను భారత్ తక్కువ చేసి చూపిస్తోందా అన్న ప్రశ్నలు ఉన్నప్పటికీ, ఒక వేళ అదే నిజమైతే అందుకు గుజరాత్ రాష్ట్రం మినహాయింపు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పదే పదే దిల్లీలో జరిగిన మత సమావేశాలకు హాజరైన వారిని, విదేశీయుల్నే తప్పుపడుతూ వచ్చారు.
అయితే ఇది కేవలం గుజరాత్‌కు మాత్రమే పరిమితం కాలేదు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా భారీ సంఖ్యలో విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. అలాగే దిల్లీలో జరిగిన మత సమావేశాలకు హాజరైన వారు ఉన్నారు. అలాంటి వారిని చాలా మందిని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం వారికి చికిత్స అందించింది. ఒక వేళ ఇదే కారణం అనుకుంటే గుజరాత్‌లో మాత్రమే మరణాల సంఖ్య ఎక్కువగా ఎందుకు ఉన్నట్టు?

తక్కువ సంఖ్యలో పరీక్షలు, ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో అపనమ్మకం
“ప్రజలను ఆస్పత్రుల్లో చేరడం ఆలస్యం ఒక కారణం కావచ్చు” అని అహ్మదాబాద్ హాస్పటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అధినేత భరత్ గాడ్వి అభిప్రాయపడ్డారు.
ఓ వైపు ప్రైవేటు ఆస్పత్రులు కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు నిరాకరిస్తుంటే... మరోవైపు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు చాలా మంది ఇష్టబడటం లేదని వైద్యులు అంటున్నారు. అయితే ప్రజలు ప్రభుత్వాసుపత్రులపై విముఖతతో ఉండటానికి కారణం వాటిపై జనానికి నమ్మకం లేకపోవడమే. అందుకు తోడు అక్కడ సౌకర్యాల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది.
బహుశా ప్రజల్లో నెలకొన్న ఓ రకమైన మూఢ నమ్మకం కూడా ఇందుకు కారణం కావచ్చని అహ్మదాబాద్ ప్రభుత్వాసుపత్రి హెడ్ డాక్టర్ రణ్ దీప్ గులారియా అభిప్రాయపడ్డారు.
“కోవిడ్-19 విషయంలో ఆస్పత్రులకి వచ్చి పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు భయపడుతున్నారు” అని అన్నారు.
మే నెలలో ఒక్కసారిగా ఆస్పత్రుల్లో అడ్మిషన్లు పెరగడానికి కారణం స్క్రీనింగ్ పరీక్షల సంఖ్యను పెంచడమే. ఫలితంగా పళ్లు, కూరగాయలు అమ్మేవారు, షాప్ కీపర్లను సూపర్ స్పెడర్స్‌గా వైద్యులు గుర్తించారు.
అయితే నిపుణులు మాత్రం ఇప్పటికీ పరీక్షల సంఖ్య తక్కువగానే ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాల గురించి వారు ప్రస్తావిస్తున్నారు.
“ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో ముఖ్యంగా కంటైన్మెంట్ జోన్ల విషయంలో ప్రభుత్వ దృష్టి సారించలేదు” అని ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కార్తికేయ భట్ వ్యాఖ్యానించారు.
అహ్మదాబాద్‌లోని ఓల్డ్ సిటీలో 10 నుంచి 11 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని అక్కడ జన సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆ ప్రాంతాలకు నగరంలోని ఇతర ప్రాంతాలకు సంబంధాలను నిలిపేసినప్పటికీ ఆయా జోన్లలో వైరస్ వ్యాప్తి ఎలా ఉంటోందన్న విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని కార్తికేయ అభిప్రాయపడ్డారు. అసలు భౌతిక దూరం అన్న మాటే లేదని వ్యాఖ్యానించారు మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రజల్లో ప్రభుత్వాసుపత్రుల పట్ల అపనమ్మకం, వ్యాధి తీవ్రత గురించి సరైన అవగాహన లేకపోవడం, చాలా మంది చాలా ఆలస్యంగా ఆస్పత్రుల్లో చేరడమే ఈ పరిస్థితికి కారణమని అబ్జర్వర్స్ రిసెర్చ్ ఫౌండేషన్‌కి చెందిన నిపుణులు అభిప్రాయపడ్డారు.
కరోనా బారిన పడి తిరిగి కోలుకున్న వారు కూడా ఈ సంక్షోభాన్ని ఆస్పత్రులు ఎదుర్కోలేకపోతున్నాయని అంటున్నారు.
“కొన్ని గంటల పాటు వేచి చూసిన తర్వాత నాకు బెడ్ దొరికింది” అని 67 ఏళ్ల లక్ష్మీ పర్మార్ అన్నారు. ఆమె అహ్మదాబాద్ ప్రభుత్వాసుపత్రిలో పది రోజుల పాటు చికిత్స పొందారు.
“ఉదయం కనీసం అల్పాహారం కూడా ఇచ్చేవారు కాదు. స్థానిక రాజకీయ నాయుకుడికి జోక్యం చేసుకోమని ఫిర్యాదు చేశాను. కేవలం 2 టాయిలెట్లను 40 నుంచి 50 మంది ఉపయోగించుకోవాల్సి వచ్చేది” అని తాను చికిత్స పొందిన ఆస్పత్రిలో పరిస్థితిని ఆమె వివరించారు."
కోవిడ్ దెబ్బకు రాష్ట్రంలోని వైద్య సౌకర్యాలు ఎంత ఘోరంగా ఉన్నాయో ప్రపంచానికి తెలిసిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
“ఈ మహమ్మారి రాకుండా ఉండే రాష్ట్రంలోని ఆస్పత్రుల గురించి ఏ ఒక్కరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు రాష్ట్రంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరత ఏ స్థాయిలో ఉందో తెలిసింది. లాక్ డౌన్ సమయంలో కూడా వీలైనంత త్వరగా నియామకాలు జరుగుతాయని మేం చూశాం” అని ప్రొఫెసర్ భట్ అన్నారు.
గుజరాత్‌లో ప్రతి వెయ్యి మందికి కేవలం 0.3 బెడ్స్ మాత్రమే ఉన్నాయని. ఇదే జాతీయ స్థాయిలో సగటు 0.55గా ఉందని ఇటీవల జరిగిన అధ్యయనాల్లో తేలింది.
కేసుల సంఖ్య భారీగా పెరగడానికి ఆస్పత్రుల్లో బెడ్స్ లేకపోవడం, తగినన్ని పీపీఈ కిట్లు అందుబాటులో లేకపోవడం, క్వారంటైన్ సౌకర్యాలు లేకపోవడం ప్రధాన కారణాలు. కొద్ది వారాలుగా కేసుల విషయంలో గుజరాత్ రాష్ట్రాన్ని మించిపోయింది తమిళనాడు. కానీ మరణాల రేటు విషయంలో మాత్రం గుజరాత్ పరిస్థితి ఘోరంగానే ఉంది.
ప్రభుత్వం ఏమంటోంది?
“మా కర్తవ్యాన్ని నిర్వహించడంలో విఫలమయ్యాం అన్న వాదనను నేను ఏకీభవించను” అని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నితిన్ భాయ్ పటేల్ బీబీసీతో అన్నారు.
“ప్రస్తుతం ఆస్పత్రులలో 23వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఆస్పత్రిలోనూ వైద్య సిబ్బంది అహర్నిశలు పని చేస్తున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన అత్యుత్తమ వైద్య పరికరాలను మేం వారికి అందిస్తున్నాం. ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోంది” అని చెప్పుకొచ్చారు.
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించక ముందే అంటే మార్చి 19నే గుజరాత్‌లో తొలి కోవిడ్ కేసు నమోదయ్యింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైత ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని చాలా మంది విమర్శిస్తున్నారు.
“ప్రభుత్వ విధానాలు మరింత మెరుగ్గా ఉండాల్సింది. మొదట్లో పరీక్షలు నిర్వహించడంలోనూ, ఐసోలేషన్ చెయ్యడంలో బాగానే ఉన్నట్లు కనిపించింది. కానీ రాను రాను పాలనా విభాగం అలసిపోయినట్టు కనిపించింది” అని గాడ్వి అభిప్రాయపడ్డారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి
- ఈఎస్ఐ అక్రమాలు: మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన ఏసీబీ
- లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత న్యూజీలాండ్‌లో జీవనం ఇలా ఉంది..
- లాక్ డౌన్ ముగిసిందని పార్టీ చేసుకున్నారు.. 180 మందికి కరోనావైరస్ అంటించారు
- మెడికల్ కాలేజీల్లో 50 శాతం ఓబీసీ కోటా పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం కోర్టు
- దిల్లీ హింసాత్మక దాడులతో ఆగిన పెళ్లి... కరోనా మహమ్మారి భయం నీడలో ఇలా జరిగింది
- డారెన్ సామీ 'ఆగ్రహం' భారత్‌లో సామాజిక వాస్తవాలను బయటపెట్టిందా
- నోట్‌బుక్స్ విడుదల చేసిన షావోమీ.. చైనా వ్యతిరేక సెంటిమెంట్ ప్రభావం ఈ కంపెనీపై లేదా
- తిరుమలలో లాక్డౌన్ తరువాత దర్శనం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? - కొండ పైనుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- కరోనావైరస్: ఇదే చివరి మహమ్మారి కాదా.. భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








