మెడికల్ కాలేజీల్లో 50 శాతం ఓబీసీ కోటా పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం కోర్టు

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

తమిళనాడులో మెడికల్ సీట్లలో 50 శాతం ఓబీసీ కోటా కోసం వేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.

రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లోని సీట్లలో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ డీఎంకే, అన్నాడీఎంకే, సీపీఎం, తమిళనాడు ప్రభుత్వం, ఇంకా చాలామంది వేసిన పిటిషన్లను పరిశీలించి, వాటిపై ఆదేశాలు జారీ చేయడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

"తమిళనాడులో వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం అన్ని రాజకీయ పార్టీలూ కలిసి వచ్చాయి. ఇది ఒక అసాధరణ విషయం. కానీ, రిజర్వేషన్ ప్రాథమిక హక్కు కాదనే నిర్ణయానికే సుప్రీంకోర్టు కట్టుబడి ఉంది" అని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటైన ధర్మాసనం తెలిపింది.

ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ పిటిషనర్లకు ఉందని సుప్రీం కోర్టు తెలిపింది.

అయితే, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ, వైకో తదితర పిటిషనర్లు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలన్న పిటిషన్‌ను ఉపసంహరించుకోడానికే మొగ్గు చూపుతున్నారు.

'తమిళనాడు వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డు తెగల ( విద్యాసంస్థల్లో సీట్లు, రాష్ట్ర సేవల్లో నియమకాలు లేదా ఉద్యోగాలలో రిజర్వేషన్లు) చట్టం 1993'ను అమలు చేసేలా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కేంద్రం ఆదేశించేలా చేయాలని కోరుతూ పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు.

2006 చట్టం కింద ఓబీసీలకు కేటాయించిన 27 శాతం సీట్లలో వారికి అవకాశం కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఫలితంగా గత మూడేళ్ళలో 10 వేల సీట్లను ఇతరులు కొల్లగొట్టారని వారు ఆరోపించారు.

దీనిపై న్యాయ వ్యవహారాల నిపుణులు, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ స్పందిస్తూ, "రిజర్వేషన్ ప్రాథమిక హక్కు కిందకు రాదని గతంలో కూడా సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 పౌరులకు సమానత్వ హక్కును కల్పిస్తోంది. రిజర్వే,న్లను అందుకు మినహాయింపుగా సూచించింది" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)