పేదరిక నిర్మూలన: 800 మీటర్ల ఎత్తున్న శిఖరాల మీద నివసించే ప్రజలను పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్న చైనా

ఉక్కు నిచ్చెనలపై పసిబిడ్డతో చైనా మహిళ

చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో నివసించే కొందరు జనం 800 మీటర్ల ఎత్తున్న పర్వత శిఖరాలను తమ ఇళ్లుగా చెప్పుకునేవాళ్లు. కానీ వారిని ప్రభుత్వం ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో నివాస సముదాయాలకు తరలిస్తోంది.

పిల్లలు, పెద్దలు శిథిలమైన నిచ్చెనల మీదుగా శిఖరాలు ఎక్కుతున్న ఫొటోలు బయటకు రావటంతో అటులెర్‌ గ్రామం పేరు మార్మోగిపోయింది.

అక్కడ నివసించే దాదాపు 84 కుటుంబాలను స్థానికంగా పేదరిక నిర్మూలన కార్యక్రమం కింద ఇప్పుడు కొత్తగా నిర్మించిన ఫ్లాట్లలోకి తరలించారు.

2020 చివరి నాటికి దేశంలో పేదరికాన్ని నిర్మూలించే జాతీయ కార్యక్రమంలో భాగంగా ఈ పని చేపట్టారు.

‘నాకంటూ ఓ ఇల్లు దక్కటం సంతోషంగా ఉంది’

అటులెర్‌ గ్రామస్తులు తమ ఇళ్లకు వెళ్లాలంటే చంటి పిల్లలను ఎత్తుకుని పాడైపోయిన నిచ్చెనలు ఎక్కుతూ శిఖరాల మీదకు చేరుకోవాలి. వారికి అవసరమైన సామాన్లను కూడా అలాగే తెచ్చుకోవాలి. ఈ ప్రమాదకర దృశ్యాల ఫొటోలు 2016లో బయటకు రావటంతో ఈ గ్రామం పతాక శీర్షికలకు ఎక్కింది.

ఆ వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి శిథిలమైన నిచ్చెనల స్థానంలో ఉక్కు నిచ్చెనలు అమర్చింది.

ఇప్పుడు.. ఆ శిఖరాల మీద నివసించే కుటుంబాలను అక్కడికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే ఝాజూ పట్టణానికి తరలించారు.

కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి 50 చదరపు మీటర్లు, 75 చదరపు మీటర్లు, 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సామాన్లున్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్లలో వారికి నివాసం కల్పిస్తారు.

యీ మైనారిటీలకు చెందిన ఈ గ్రామస్తులు తరతరాలుగా అటులీయర్ శిఖరాల మీద నివసిస్తున్నారు. ఇప్పుడు పట్టణాల్లో నివసించటం వీరిలో చాలా భారీ మార్పు.

గ్రామస్తులు సంతోషంగా ఉన్న ఫొటోలను చైనా ప్రభుత్వ మీడియా చూపింది. వారిలో ఒకరు ‘ఇప్పుడు నాకు ఒక మంచి ఇల్లు దక్కటం చాలా సంతోషాన్నిస్తోంది’ అని చెప్తున్నట్లు ప్రభుత్వ టీవీ చానల్ సీజీటీఎన్ కథనం ప్రసారం చేసింది.

చైనా కొండ శిఖరాలపై గ్రామాలు

ఫొటో సోర్స్, Getty Images

‘భారీ ఆర్థిక భారం’

ఇటువంటి గృహనిర్మాణ పథకాలకు ప్రభుత్వం భారీ రాయితీలు ఇస్తుంటుందని, అది దాదాపు70 శాతం వరకూ ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్‌లో మానవ భౌగోళిక శాస్త్రం ప్రొఫెరస్ మార్క్ వాంగ్ చెప్పారు. ఇంత సబ్సిడీ ఉన్నా కూడా కొన్ని కుటుంబాలకు ఈ అపార్ట్‌మెంట్లను కొనే స్తోమత ఉండదని పేర్కొన్నారు.

‘‘కొంతమంది నిజంగా పేద గ్రామీణులకు ఆ 30 శాతం చెల్లించటం కూడా కష్టమే. దీంతో వాళ్లు అప్పులు చేయాల్సి వస్తుంది. ఫలితంగా మరింత అప్పుల్లో కూరుకుపోతారు’’ అని ఆయన బీబీసీతో చెప్పారు.

‘‘నిరుపేదలకు ఇది చాలా పెద్ద ఆర్థిక భారం. కొన్ని ఉదంతాల్లో వాళ్లు శిఖరాల మీద ఉండిపోవాల్సి వస్తుంది’’ అని తెలిపారు.

చైనా ప్రభుత్వ మీడియా సంస్థ చైనా డైలీ కథనం ప్రకారం.. పట్టణంలోని అపార్ట్‌మెంటుకు మారటానికి ప్రతి వ్యక్తి 2,500 యువాన్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే నలుగురు సభ్యులున్న కుటుంబానికి 10,000 యువాన్లు ఖర్చవుతుంది.

ఇది నిజంగా తక్కువ ధరేనని వాంగ్ పేర్కొన్నారు. ఇతర నివాస ప్రాజెక్టుల్లో ఇల్లు మారటానికి 40,000 యువాన్ల వరకూ చెల్లించాల్సి ఉంటుందని తాను విన్నట్లు చెప్పారు.

చాలా పేదరిక పునరావాస కార్యక్రమాల్లో గ్రామస్తులు మారాలా వద్దా అనేది ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తారని, వారు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు మారరని వాంగ్ తెలిపారు.

గ్రామస్తులకు కేటాయించిన అపార్ట్ మెంట్లు

ఫొటో సోర్స్, CGTN/Youtube

ఫొటో క్యాప్షన్, గ్రామస్తులకు కేటాయించిన అపార్ట్ మెంట్లు

‘‘చాలా ఉదంతాల్లో గ్రామీణ పట్టణానికి లేదా పట్టణ శివారు ప్రాంతాలకు మారటం జరుగుతుంది. అంటే పెద్ద నగరానికి మారుతున్నట్లు కాదు. ప్రతి ఒక్కరికీ పట్టణ జీవితం నచ్చదు. ఆ జీవితం కావాలనుకున్న వారిలో చాలా మంది అప్పటికే గ్రామాలు విడిచిపెట్టి పెద్ద నగరాలకు మారిపోయి ఉంటారు’’ అని ఆయన చెప్తున్నారు.

‘‘సాధారణంగా ప్రభుత్వం ఈ పునరావాసం కల్పించే ప్రాంతం ఎంత దూరంలో ఉండాలనే పరిమితి విధిస్తుంటుంది. ఇది ఎక్కువ మంది ప్రజలకు సానుకూలంగా ఉంటుంది. దీనివల్ల వారు తమ పొలాలను కూడా తమ ఆధీనంలోనే ఉంచుకోవచ్చు’’ అని వివరించారు.

ఈ కొత్త అపార్ట్‌మెంట్ సముదాయంలో అటులెర్‌ గ్రామస్తులతో పాటు సిచువాన్ ప్రావిన్స్‌లోని ఇతర పేదలకు కూడా పునరావాసం కల్పిస్తున్నారు.

అటులెర్‌ గ్రామంలో సుమారు 30 కుటుంబాలు కొనసాగుతాయి. దానిని పర్యాటక కేంద్రంగా మార్చబోతున్నారు.

చైనా ప్రభుత్వ మీడియా సంస్థ చైనా డైలీ కథనం ప్రకారం.. ఈ కుటుంబాలే స్థానిక పర్యాటక రంగానికి ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తాయి. హోటళ్ల నిర్వహణ, పర్యాటకులకు గైడ్లుగా వ్యవహరించటం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

అటులీయర్ గ్రామస్తులు

ఫొటో సోర్స్, Getty Images

ఈ గ్రామానికి కేబుల్ కార్లు ఏర్పాటు చేయటం, చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేయటం వంటి ప్రణాళికలను గ్రామీణ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ గ్రామాన్ని సెలవుల్లో గడిపే రిసార్టుగా మార్చాలన్న ప్రణాళికలూ ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అందుకోసం 6.30 కోట్ల యువాన్లు పెట్టుబడులు పెడతారని కూడా ప్రభుత్వ మీడియా చెప్పింది.

ఈ అభివృద్ధి చర్యల ద్వారా ఈ ప్రాంతానికి మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నా.. ఈ ప్రాంతపు పర్యావరణాన్ని కాపాడటానికి ఎటువంటి రక్షణ చర్యలు చేపడతారనే స్పష్టత లేదు.

చైనాలో 2020 నాటికి పేదరికాన్ని నిర్మూలిస్తామని దేశాధ్యక్షుడు షి జిన్‌పింగ్ ప్రకటించారు.

చైనా వ్యాప్తంగా పేదరికానికి ఒకే ప్రామాణిక నిర్వచణం లేదు. ప్రతి రాష్ట్రానికి అది మారుతుంది.

అయితే.. వార్షిక ఆదాయం 2,300 యువాన్లను జాతీయ ప్రమాణంగా విస్తృతంగా ప్రస్తావిస్తుంటారు. ఆ ప్రమాణం కింద చూస్తే 2017లో చైనాలో మొత్తంగా మూడు కోట్ల మంది పేదరికంలో నివసిస్తున్నారు.

కానీ 2020 గడువు వేగంగా ముగిసిపోతోంది. కరోనావైరస్ విజృంభణ వల్ల ఈ ప్రణాళిక గతి తప్పవచ్చునని వాంగ్ అంటున్నారు.

‘‘కోవిడ్-19 లేకున్నా కూడా ఈ గడువులోగా లక్ష్యం సాధించటం కష్టమవుతుంది. ఇప్పుడు పరిస్థితి మరింత కష్టంగా మారింది’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)