సౌదీ అరేబియా కోసం పాకిస్తాన్ తన మిత్రదేశమైన ఇరాన్‌కు ఎదురు తిరుగుతుందా?

ఫొటో సోర్స్, X/@kbsalsaud
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, సౌదీ అరేబియా రక్షణ మంత్రి ఖలీద్ బిన్ సల్మాన్‌ను కలిశారు.
సౌదీ అరేబియా చమురు సంస్థ ఆరామ్‌కో రిపైనరీ మీద ఇరాన్ దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ భేటీ జరిగింది.
సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం ఉంది. దీని ప్రకారం, ఈ రెండు దేశాల్లో ఏ దేశం మీద దాడి జరిగినా రెండో దేశం మీద కూడా చేసినట్లే.
పాకిస్తాన్‌కు ఇరాన్‌తో సత్సంబంధాలున్నాయి. బీబీసీ ఉర్దూ ప్రకారం, ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడిని పాకిస్తాన్ ఖండించింది.
ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ హత్యను కూడా పాకిస్తాన్ ఖండించింది. అయితే, ఇరాన్ ప్రతీకార దాడుల్లో భాగంగా సౌదీ అరేబియాపై దాడుల తర్వాత, తాము సౌదీ అరేబియాకు మద్దతుగా నిలుస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిస్పందనగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది.
సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్లు లేదా క్షిపణులతో దాడి చేస్తే ఏర్పడే పరిస్థితులు, వాటిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆసిమ్ మునీర్, సౌదీ రక్షణ మంత్రి చర్చించినట్లు పాకిస్తాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్‌ను ఉటంకిస్తూ బీబీసీ ఉర్దూ తెలిపింది.
ఈ చర్చలు రెండు దేశాల రక్షణ ఒప్పందం పరిధిలోనే జరిగాయి.
పాకిస్తాన్ - సౌదీ అరేబియా గతేడాది 'వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం'పై సంతకం చేశాయి.

ఫొటో సోర్స్, Harun Ozalp/Anadolu via Getty Images
సౌదీకి మద్దతుగా పాక్ రంగంలోకి దిగుతుందా?
ఇరాన్ యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే పాకిస్తాన్ ఇంధన భద్రత ప్రమాదంలో పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పాకిస్తాన్ ఇంధన అవసరాల్లో ఎక్కువ భాగం ఇరాన్ ద్వారానే భర్తీ అవుతున్నాయని విదేశీ వ్యవహారాల విశ్లేషకులు డాక్టర్ కమర్ చీమా బీబీసీ ఉర్దూతో చెప్పారు.
పాకిస్తాన్ బలహీన ఆర్థిక వ్యవస్థ కారణంగా ఏదో ఒక వైపు మొగ్గుచూపాల్సి రావొచ్చని పాకిస్తాన్ జర్నలిస్ట్ అస్మా షిరాజీ అభిప్రాయపడ్డారు.
ఏదేమైనా, ఇరాన్, సౌదీ అరేబియాతో సత్సంబంధాల కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది.
పాక్ - సౌదీ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అలాగే, పాకిస్తాన్‌కు ఇరాన్ పొరుగు దేశం. ఈ రెండు దేశాల మధ్య లోతైన సాంస్కృతిక సంబంధముంది.
పాక్ ఆర్మీ చీఫ్, సౌదీ రక్షణ మంత్రి మధ్య జరిగిన సమావేశం వ్యూహాత్మకమైనదిగా భావిస్తున్నారు.
పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చేతులు కలపాలని తుర్కియే కూడా కోరుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొంది.
దీనిని "ఇస్లామిక్ నాటో" గా చూస్తున్నారు. నాటో నియమావళిలోని ఆర్టికల్ 5 ప్రకారం సభ్య దేశంపై జరిగే దాడి మిగతా సభ్య దేశాలపై జరిగినట్లు భావిస్తారు.
అయితే, పాకిస్తాన్ కేవలం హెచ్చరికలతో సరిపెడుతుందా? లేకుంటే సౌదీ అరేబియాకు మద్దతుగా ఇరాన్‌పై దాడులకు దిగుతుందా? అనే ప్రశ్నలకు స్పష్టత రావాల్సి ఉంది.

ఫొటో సోర్స్, SAUDI PRESSS AGENCY
నిపుణులు ఏమంటున్నారు?
"ప్రస్తుత పరిస్థితిలో పాకిస్తాన్ వైఖరి చాలా స్పష్టంగా ఉంది" అని ఖమర్ చీమా చెప్పారు.
పాకిస్తాన్ రెండు పడవలపై ప్రయాణం చేస్తోందనే వాదనలతో ఆయన విభేదించారు.
"ఇరాన్‌తో పాకిస్తాన్ స్నేహాన్ని కొనసాగించింది. అయితే, సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం చేసుకుంది. పాకిస్తాన్ ఏ పరిస్థితుల్లోనైనా సౌదీ అరేబియాకు అండగా నిలుస్తుంది" అని ఖమర్ చీమా అన్నారు.
"ఇప్పటి వరకు సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరిగాయి. అయితే, సౌదీ భూభాగంపై దాడులు జరిగినప్పుడు, ఆ దేశపు ఆస్తులు - మౌలిక వసతులు దెబ్బతిన్నప్పుడు.. అలాంటి పరిస్థితుల్లో ఇరాన్‌పై సౌదీ అరేబియా దాడి చేస్తే పాకిస్తాన్ ఒప్పందం నుంచి వెనక్కి తగ్గదు" అని ఆయన అంటున్నారు.
ఖమర్ చీమా చెప్పిన దాని ప్రకారం, "పాకిస్తాన్ - సౌదీ అరేబియా మధ్య రక్షణ ఒప్పందం ఉన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. అలాంటప్పుడు అది వెనక్కి ఎలా తగ్గుతుంది? అందుకే సౌదీలోని అమెరికన్ స్థావరాలపై ఇరాన్ చాలా తక్కువగా దాడులు చేసింది. సౌదీ మీద దాడులు చేస్తే, ఒప్పందం ప్రకారం తాము కూడా యుద్ధంలోకి అడుగుపెట్టాల్సి వస్తుందని పాకిస్తాన్ ఇప్పటికే ఇరాన్‌ను హెచ్చరించింది."
"పాకిస్తాన్ విదేశాంగ మంత్రి సౌదీ అరేబియాతో పాటు ఇరాన్‌ను సంప్రదించారు. దీనర్థం ఏంటంటే, మీరు యుద్ధంలోకి రావాలని పాకిస్తాన్‌ను సౌదీ అరేబియా కోరితే, పాకిస్తాన్ వెనక్కి వెళ్లదు" అని అస్మా షిరాజీ అంటున్నారు.

ఫొటో సోర్స్, GOVERNMENT OF PAKISTAN
పాక్ - సౌదీ రక్షణ ఒప్పందంలో ఏముంది?
పాకిస్తాన్ - సౌదీ అరేబియా 2025లో రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ రెండూ సున్నీ మెజారిటీ దేశాలు. రెండు దేశాల మధ్య బలమైన చారిత్రక సంబంధం ఉంది.
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు సౌదీ అరేబియా అనేకసార్లు సాయం అందించింది. ప్రతిగా పాకిస్తాన్ రక్షణ సహకారానికి హామీ ఇచ్చింది.
అయితే, 2025లో ఒప్పందం చేసుకున్న తర్వాత ఇది అధికారికంగా మారింది.
ఈ రెండు దేశాల్లో ఏ దేశం మీద దాడి జరిగినా అది రెండో దేశంపై కూడా జరిగినట్లే అనేది ఒప్పందంలో కీలకమైన అంశం.
రెండు దేశాల పదాతి, వాయు, నౌకా దళాలు ఇప్పుడు మరింత సహకరించుకుంటున్నాయి, నిఘా సమాచారాన్ని పంచుకుంటున్నాయి.
పాకిస్తాన్ అణ్వాయుధ దేశం, గల్ఫ్‌లో సౌదీ అరేబియా భద్రతకు ఆధారపడదగినదిగా మారింది.
సౌదీ అరేబియా దశాబ్దాలుగా పాకిస్తాన్‌కు ఆర్థిక మద్దతుదారు. ఆర్థిక సహాయ ప్యాకేజీలు, రుణాలు, చమురు కొనుగోళ్ల చెల్లింపుల వాయిదా, ఇతర సంక్షోభ సమయాల్లోనూ భారీగా పెట్టుబడులు అందిస్తోంది.
2025లో చమురు కొనుగోళ్లకు సంబంధించి పాకిస్తాన్ చెల్లించాల్సిన 1.2 బిలియన్ డాలర్ల చెల్లింపులను సౌదీ అరేబియా వాయిదా వేసింది.
పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలను సమతుల్యం చేసుకోవడానికి సౌదీ అరేబియా అనేకసార్లు సాయపడింది.
2014లో పాకిస్తాన్ కేంద్ర బ్యాంకులో సౌదీ అరేబియా నేరుగా 1.5 బిలియన్ల డాలర్లు డిపాజిట్ చేసింది.
రక్షణ ఒప్పందం తర్వాత సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్‌కు మరింత సాయం అందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
"పాకిస్తాన్ ఇప్పుడు సౌదీ అరేబియా డబ్బును ఉపయోగించి తనకు అవసరమైన అమెరికన్ ఆయుధాలు కొనుగోలు చేయవచ్చు. ట్రంప్ ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఆయుధాలు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది" అని పాక్ మాజీ దౌత్యవేత్త హుస్సేన్ హక్కానీ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













