తిరుమల దర్శనం: లాక్‌డౌన్ తర్వాత తిరుమలలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? - కొండ మీద నుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, శంకర్. వి
- హోదా, బీబీసీ కోసం
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల వెంకన్న ఆలయం తలుపులను ఎనభై రోజుల తర్వాత జూన్ 8 నుంచి మళ్లీ తెరిచారు. దీంతో భక్తుల రాకకు మార్గమేర్పడింది.
మారిన పరిస్థితుల్లో పరిమిత సంఖ్యలో దర్శనాలకు అనుమతిస్తుండడంతో పాటు జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.
జాగ్రత్తలు, తనిఖీలు ఉన్నప్పటికీ దర్శనానికి పట్టే సమయం భారీగా తగ్గిందని భక్తులు చెబుతున్నారు.

అలిపిరి నుంచే హడావిడి
తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లాలనుకునేవారికి కొండ దిగువన అలిపిర నుంచే సందడి మొదలవుతుంది.
నేను మార్చి 14న తిరుమల వెళ్లినప్పుడు అలిపిరి వద్ద భక్తుల రాకపోకలు ఎక్కువగా కనిపించాయి.
అప్పటికే అనేక అంక్షలు మొదలయ్యాయి. సామాజిక దూరం, థర్మల్ స్క్రీనింగ్ వంటివి కనిపించాయి.
విదేశీ యాత్రికులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధుల ప్రవేశాలను టీటీడీ అధికారులు నిలిపివేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ తొలి కేసు మార్చి 12న నెల్లూరులో నమోదుకావడం.. తిరుమలకు నెల్లూరు జిల్లా పొరుగునే ఉండడంతో మరింత అప్రమత్తమయ్యారు.
ఆ ప్రభావంతో సహజంగా మార్చి నెలలో కనిపించే యాత్రికుల సంఖ్య కన్నా ఈ ఏడాది మార్చి మధ్య నాటికి సుమారు 30 శాతం మంది యాత్రికులు తగ్గినట్టు టీటీడీ రికార్డులు చెబుతున్నాయి.
మార్చి 16 నుంచి రోజుకు సగటున 50 వేల కంటే తక్కువ మంది యాత్రికులు కొండపైకి వచ్చారు.
2019 మార్చి నెలలో ఈ సగటు 62 వేలుగా ఉండేది.లాక్‌డౌన్‌కు ముందే తిరుమల ప్రవేశం నిషేధందేశవ్యాప్తంగా మార్చి 22న జనతా కర్ఫ్యూతో ఆంక్షలు మొదలై ఆ తరువాత 24 అర్థరాత్రి నుంచి లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది.
కానీ, తిరుమలలో ఉన్న పరిస్థితుల రీత్యా మార్చి 19 అర్థరాత్రి నుంచే యాత్రికుల రాకపోకలపై నిషేధం విధించారు.

కాలినడకన వచ్చే భక్తులు, వాహనాల్లో ఘాట్ రోడ్డు ద్వారా కొండకు చేరుకునే వారిని కూడా నిలిపివేశారు.
అప్పటికే దర్శనాలకు, వసతి సహా ఇతర కార్యక్రమాలకు టికెట్లు బుక్ చేసుకున్న వారికి నగదు తిరిగి చెల్లించేందుకు టీటీడీ సిద్ధమైంది.
ఆ తర్వాత నిత్యం వేల మంది భక్తులతో కోలాహలంతో కనిపించాల్సిన ఏడుకొండలు బోసిపోయాయి.
చరిత్రలో తొలిసారిగా ఇంత సుదీర్ఘకాలం పాటు సాధారణ భక్తులకు ఆలయ ప్రవేశం దూరం అవుతుందని అప్పట్లో ఎవరూ ఊహించనది.
తొలుత కేవలం మార్చి నెలాఖరు వరకు నిషేధం అమలవుతుందని టీటీడీ ప్రకటించింది.
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పెంచాల్సిన పరిస్థితి వచ్చింది.

యాత్రికులు లేకపోవడంతో వన్యప్రాణుల సందడి
తిరుమల కొండలపై సహజంగా ఘాట్ రోడ్డులో రోజుకి 20 గంటల పాటు వాహనాల రద్దీ కనిపించేది.
కాలినడకన వెళ్లే భక్తులు కూడా రాత్రి 10గం.ల నుంచి తెల్లవారి 3 గం. ల వరకూ మినహా నిత్యం నడకన దారిన సాగుతూ ఉండేవారు.
అలాంటిది హఠాత్తుగా అటు వాహనాలు, ఇటు భక్తుల రాక ఆగిపోవడంతో తిరుమల కొండలపై ఉన్న వన్యప్రాణాలకు ఊరట లభించినట్టయ్యింది. అరుదుగా కనిపించే వివిధ రకాల జంతువులు నిత్యం కెమెరాకి చిక్కుతూ తిరుమల కొండలపై సంచరించడం లాక్ డౌన్ సమయంలో అందరూ గమనించారు.
చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లు సహా వివిధ జంతువులు యథేచ్ఛగా సంచరించాయి.
లాక్ డౌన్ సమయంలో కొద్దిమంది టీటీడీ సిబ్బంది మాత్రమే కొండపైకి రాకపోకలు సాగించేవారు.
అదే సమయంలో అలిపిరి నుంచి కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో రక్షణ చర్యలు పెంచే పనులు కూడా చేపట్టారు.

పునః ప్రారంభానికి వారం ముందు నుంచే సన్నాహాలు
లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తూ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజా రవాణా వంటివి కూడా ప్రారంభమయ్యాయి. వాటితో పాటు ఆలయాలు ప్రారంభించేందుకు అనుగుణంగా ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దానికి అనుగుణంగా యాత్రికులను అనుమతించడానికి ముందుగా తగు జాగ్రత్తల కోసం టీటీడీ ప్రయత్నాలు ప్రారంభించింది.
వారం ముందు నుంచి సన్నాహాలు చేసింది. క్యూ లైన్లలో ప్రధానంగా మార్పులు చేసింది. మార్కింగ్ చేసింది. శానిటైజర్లు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నించింది.
భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు, గ్లౌజులు ధరించేలా సిబ్బందిని సన్నద్ధం చేసింది.
సాధారణ భక్తులను నియంత్రించేందుకు లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.
ముఖ్యంగా యాత్రికుల సంఖ్యను తగ్గించడానికి అనుగుణంగా గంటకు 500 మంది చొప్పున రోజుకి 13 గంటల పాటు మాత్రమే దర్శనాల్లో 6,500 మంది వరకూ అనుమతి ఇస్తామని ప్రకటించింది.
లాక్ డౌన్ అలిపిరి గేట్ వద్ద జాగ్రత్తలుజూన్ 8న టీటీడీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను అనుమతించారు.
వారితో పాటు మీడియా కవరేజ్ కోసం కొండపైకి వెళ్లాం.

దర్శనాలు పునరుద్ధరించిన తరువాత ఇలా..
తొలుత అలిపిరి వద్ద పోలీసులు మా వాహనాన్ని ఆపి పరిశీలించారు. అందరూ మాస్కులు ధరించాలని సూచించారు.
ఆ తర్వాత అలిపిరి గేట్ వద్ద అలిపిరి గేట్ వద్ద మా సోడియం క్లోరైడ్ పిచికారీ చేశారు. మాకు శానిటైజర్ అందించారు. ఆ తర్వాత బ్యాగులను పరీక్షించి, మాకు థర్మల్ స్క్రీనింగ్ చేశారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ముందుకెళ్లే అనుమతి ఇచ్చారు.
టీటీడీ సిబ్బంది కూడా కొందరు వ్యక్తిగత వాహనాల్లో, ఎక్కువ మంది బస్సులలో కొండపైకి రావడం కనిపించింది.
వారందరినీ కూడా ఆయా వాహనాలు దించి భౌతికదూరం పాటించమని సూచిస్తూ, శానిటైజర్, థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాత అనుమతి ఇచ్చారు.
దాంతో అలిపిరి గేట్ ముందు బస్సు ఓసారి బస్సు దిగి, గేట్ దాటిన తర్వాత మరోసారి బస్సు ఎక్కేందుకు అందరూ క్యూ లైన్లో నిలవడం కనిపించింది.
అలిపిరి గేట్ వద్ద కొందరు సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహించడం, ఆరంభంలో అక్కడి పరిస్థితిని టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి పర్యవేక్షించడం కనిపించింది.
ఏపీ పోలీసులు, టీటీడీ సిబ్బంది సమన్వయంతో ఈ తనిఖీలు సాగించారు.ఇక కాలినడకన వెళ్ళే మార్గంలో తొలిరోజు అనుమతి లేదు.
దాంతో అక్కడ పూర్తిగా ఖాళీగా కనిపించింది. 10వ తేదీ నుంచి సామాన్య భక్తులకు అనుమతించబోతున్న తరుణంలో ఆ మార్గాన్ని సిద్ధం చేసేందుకు కొందరు సిబ్బంది సన్నాహాల్లో ఉన్నారు.

తిరుమల కొండలు ఏ తీరున ఉన్నాయి...
నిత్యం రద్దీతో కనిపించే తిరుమల కొండలను గతంలో చూసిన మాకు ఖాళీగా ఉన్న తిరుమల వీధులు వింతగా కనిపించాయి.
గతంలో ఎన్నడూ చూడని పరిస్థితి చూడాల్సి వచ్చింది. వ్యాపారాలు తమ దుకాణాలు తెరవడానికి సిద్ధపడలేదు.
భక్తులు వచ్చిన తర్వాత తెరుస్తామని కొందరు మాట్లాడినప్పుడు చెప్పారు. దాంతో కొండపైన అన్న ప్రసాదంలో తప్ప ఇతర మార్గాల్లో ఆహారం లభించే అవకాశం కనిపించలేదు.
చివరకు ఆశ్చర్యంగా అన్నీ చూస్తూనే తిరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో ప్రవేశించాం.
అక్కడ కూడా 90శాతం ఖాళీ. కానీ భౌతికదూరం పాటించేలా గతంలో ముగ్గరు, నలుగురు భక్తులు కూడా కూర్చున్న టేబుల్ కి ప్రస్తుతం ఇద్దరు మాత్రమే కూర్చునేలా మార్పులు చేశారు.
తొలి పూట ఉప్మా అందించారు.మార్చి నెలలో చూసినప్పుడు భక్తులతో కిటకిటలాడుతూ కనిపించిన మాడ వీధుల్లో భక్తుల సంఖ్య చాలా నామమాత్రంగా కనిపించింది.
చివరకు ప్రధాన ఆలయం వద్దకు చేరుకున్నప్పటికీ అక్కడ కూడా అరకొరగానే భక్తులు ఉన్నారు.
కొందరు సిబ్బంది, దర్శనం చేసుకుని వచ్చిన వారితో మాట్లాడినప్పుడు కేవలం 20 నిమిషాల్లో దర్శనం పూర్తవుతుందని చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది.
గతంలో గంటల తరబడి వేచి చూసినా దొరకని దర్శనం ఇప్పుడు నిమిషాల వ్యవధిలో తీరిగ్గా చేసుకోవడానికి అవకాశం లభించడంతో వారంతా ఆనందం వ్యక్తం చేశారు.
దర్శనాలకు వెళ్లే దారిలో..తిరుమలలో దర్శనం అంటే వీఐపీ దర్శనం కూడా అర్థగంట సమయం కనీసంగా పడుతుంది. అలాంటిది నిమిషాల వ్యవధిలో పూర్తి చేసుకున్నామని కొందరు చెప్పడంతో పరిశీలన కోసమని బయలుదేరాం.
సర్వదర్శనం క్యూ లైన్లలో బయలుదేరాం. ఉదయం 10.57కి మొదలయిన మా నడక ప్రధాన ఆలయానికి చేరే సరికి 11.12 నిమిషాలయ్యింది.
కేవలం 15 నిమిషాల నడకతో ప్రధాన ద్వారం దాటగలిగాం.
మార్గం మధ్యలో తొలుత సబ్బు నీళ్లతో చేతులు కడుక్కునే ఏర్పాటు తాత్కాలిక పద్ధతిలో చేశారు. అది కూడా కాలితో నొక్కితే నీళ్లు వచ్చేలా ఏర్పాటు చేయడంతో ఎక్కడా చేతులతో కుళాయిలు తిప్పాల్సిన అవసరం లేదు.
ఆ తర్వాత మరోసారి థర్మల్ స్కానింగ్ నిర్వహించారు. మరి కొద్ది నిమిషాల నడకలో ముందుకు వచ్చిన తర్వాత శానిటైజర్ అందించారు.
ఆ తర్వాత మా వివరాలు సేకరించారు. ఆధార్ కార్డ్ లేదా అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరి అని చెప్పారు.
కంటైన్మెంట్ జోన్ల నుంచి వచ్చే వారిని అడ్డుకుంటామని చెప్పిన తరుణంలో నిర్ధారించుకునేందుకు అన్నట్టుగా అక్కడి సిబ్బంది చెప్పారు.
అక్కడి నుంచి సాధారణ భక్తులు గతంలో వేచి చూసేందుకు ఉన్న కంపార్ట్ మెంట్లను చూసుకుంటూ ముందుకు సాగాం.
అన్ని కంపార్ట్ మెంట్లలో కూడా సీటింగ్ మధ్యలో భౌతికదూరం పాటించేందుకు మధ్యలో మార్కింగ్ చేశారు.
ఇక క్యూ లైన్లలో కూడా మార్కింగ్ కోసం స్టిక్కర్లు అతికించారు. 2 మీటర్ల దూరం పాటించేలా వాటిని ఏర్పాటు చేసినట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు.
ప్రధాన ఆలయానికి వచ్చే సరికి రెండు చోట్ల చెకింగ్ లు, నాలుగు చోట్ల శానిటైజర్లు అందించడం, ఒక చోట కాళ్లు కడుక్కునే ఏర్పాటు కూడా చేశారు.

సులభ దర్శనం
ప్రధాన ఆలయంలో గతంలో తోపులాట లేకుండా వెంకటేశ్వరుని దర్శనం సాధ్యమయ్యేది కాదు.
కానీ ప్రస్తుతం బౌతికదూరం పాటించాల్సి రావడం, తొలిరోజు దర్శనాలకు వచ్చిన వారి సంఖ్య తక్కువగా ఉండడంతో సుమారు 2 నుంచి 3 నిమిషాల పాటు అక్కడ అన్నీ పరిశీలిస్తూ సాగేందుకు అవకాశం దక్కింది. అందులోనూ గతంలో మూడు లైన్లలో ఉండేది, ఇప్పుడు రెండు లైన్లు మాత్రమే ఉండడంతో చాలా సేపు వెంకటేశ్వరుని దర్శనం లభిస్తోందని చెప్పవచ్చు.
దర్శనం వద్ద కూడా గతంలో దండం పెట్టుకుంటున్న వారిని కూడా పక్కకు లాగేందుకు ఓ వ్యవస్థ ఉండేది.
కొన్ని క్షణాల్లోనే తదుపరి వచ్చే వారి కోసం అక్కడి నుంచి తొలగించేవారు. కానీ, ఈసారి కేవలం జరగండి అంటూ చెప్పడమే తప్ప నేరుగా తోసివేసే పద్ధతికి అవకాశం లేకుండాపోయింది.
మొత్తంగా 18 నిమిషాల్లోనే సర్వదర్శనం పూర్తి చేసుకుని హుండీ వద్దకు వచ్చి అక్కడి పరిస్థితిని చూసిన తర్వాత తీర్థ ప్రసాదాలు అందిస్తారా లేదా అని ఎదురుచూస్తుండగా దద్దోజనం అందించారు.
ఆ తర్వాత అక్కడే చేతులు కడుక్కునే ఏర్పాటు కూడా తాత్కాలిక పద్ధతిలో చేశారు.
ఆతర్వాత 20 నిమిషాల్లోనే అన్ని పూర్తి చేసుకుని ఆలయం నుంచి బయటకు రాగలిగే అనుభవం అసాధారణం అని మాతో పాటు వచ్చిన మిత్రుడు కూడా చెప్పారు.
లడ్డూ కౌంటర్లు ఖాళీదర్శనం తర్వాత తిరుమలలో ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతం లడ్డూ కౌంటర్లు. ప్రస్తుతం కేవలం సిబ్బంది మాత్రమే దర్శనాలు చేసుకుంటుండడం, సాధారణ భక్తులు లేకపోవడంతో లడ్డూ కౌంటర్లు కూడా ఖాళీగా ఉన్నాయి.
కొన్ని సెకండ్లలోనే కావాల్సినన్ని లడ్డూలు తీసుకునే అవకాశం వచ్చింది. గతంలో ఉన్న పరిమితి కూడా తొలి రోజు లడ్డూల విషయంలో కనిపించలేదు.
మిగిలిన మా పనులన్నీ పూర్తి చేసుకుని మళ్లీ మధ్యాహ్న భోజనం కోసం వెళ్లినప్పుడు కూడా వేచి చూడాల్సిన అవసరం లేకుండానే కడుపునిండిపోయింది.
గతంలో క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన సమయంలో ఆకలితో ఎంతో మంది యాత్రికులు తమ వంతు వచ్చే వరకూ ఎదురుచూసిన పరిస్థితిని చూశాం.
ఈసారి అన్నప్రసాదం హాళ్ళలో కూడా చేతులు శుభ్రపరుచుకునేందుకు సబ్బునీళ్లు ఏర్పాటు చేశారు.

ఆ మూడు ప్రాంతాలే అత్యంత కీలకం.. మరిన్ని జాగ్రత్తలు అవసరం
తిరుమల ఆలయంలో టీటీడీ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తికి ఉన్న అవకాశాలను నియంత్రించడం కోసం మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.
ముఖ్యంగా కళ్యాణకట్ట విషయంలో విధులు నిర్వహించే వారికి పీఈటీ కిట్లు అందిస్తున్నారు. కానీ కేవలం ఏసీలో వినియోగించడానికి అనుగుణంగా సిద్ధం చేసిన కిట్లను ఎండల వేడిలో ఉంచుకోవడానికి క్షౌరవృత్తిదారులు తీవ్రంగా సతమతం అవుతున్నారు.
కొందరు వినియోగించడానికి కూడా అయిష్టత చూపుతున్నారు. కిట్లు మార్చడం, నాణ్యత పెంచడం అత్యవసరంగా కనిపిస్తోంది.
తొలిరోజు పెద్దగా తలనీలాలు సమర్పించే వారు కనిపించలేదు గానీ సాధారణ భక్తులు కొండపైకి వచ్చిన తర్వాత సమస్య ఏర్పడేందుకు ఆస్కారం ఉంటుంది.
హుండీని తాకడం తిరుమలలో ఎక్కువ మందికి ఆనవాయితీ. అక్కడ హెర్బల్ శానిటైజర్లు అందించే ఏర్పాటు చేశారు. కానీ కొందరు మాత్రం దానిని విస్మరించి హుండీని తాకడం మా కంట పడింది.
ఎక్కువ సంఖ్యలో వచ్చినవారందరినీ నియంత్రించడం మరింత కష్టం అవుతుంది. కాబట్టి మరింత శ్రద్ధపెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.అన్నప్రసాదం వద్ద అందరికీ అవగాహన లేకపోవడంతో సిబ్బందిలో ఎక్కువ మందికి గ్లౌజులు లేవు. కొందరు మాస్కులు కూడా వేసుకోవడం లేదు.
దానివల్ల కూడా సమస్యలు తలెత్తే ప్రమాదముంది.
ఇక క్యూలైన్లలోనూ, ఇతర కీలక ప్రాంతాల్లోనూ భౌతికదూరం కోసం వేసిన స్టిక్కర్లు కొన్ని చోట్ల ఊడిపోతున్నాయి. ప్రస్తుతం మార్గం మధ్యలో సిబ్బంది భౌతికదూరం కోసం అప్రమత్తం చేస్తున్నప్పటికీ అందరూ ఆచరించడం లేదు.
సాధారణ భక్తులు ప్రవేశం తర్వాత అది మరింత సమస్య అవుతుంది. కాబట్టి మార్కింగ్ మరింత పగడ్బందీగా చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.తిరుమల కొండపై ప్రైవేటు హోటల్స్ , ఇతర వ్యాపారాలు పూర్తిగా ప్రారంభమయ్యే అవకాశాలు వెంటనే కనిపించడం లేదు.
కాబట్టి టీటీడీ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.కొండకు వెళ్ళాలనుకున్న వారిదే ఎక్కువ బాధ్యతటీటీడీ అధికారుల ఆదేశాలు, సిబ్బంది ప్రయత్నాలు ఒక భాగం అయితే కొండపైకి వెళ్తున్న వారి వ్యక్తిగత బాధ్యతే కీలకం.
అన్ని చోట్లా, ప్రతీ సందర్భంలోనూ అప్రమత్తం చేయడం టీటీడీ తో సహా ఎవరి తరం కూడా కాదు. కాబట్టి వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడమే ఉత్తమ మార్గం.
ఇప్పటికే మూడు నెలల సుమారు జాగ్రత్తలు పాటిస్తున్న వారంతా ఇప్పుడు వెంటనే హైరానా పడడం కన్నా ఆచితూచి వ్యవహరించడం ఉత్తమమనే విధంగా ప్రస్తుత పరిస్థితి ఉంది.
టీటీడీ ఛైర్మన్ సహా పలువురు అధికారులు కూడా అదే చెబుతున్నారు. యాత్రికుల సహకారం లేకుండా తమ కృషి సాధ్యం కాదంటున్నారు. కాబట్టి అందుకు తగిన విధంగా స్పందించడం కీలకం.
ఇవి కూడా చదవండి:
- కూతురి కోసం దాచిన రూ. 5 లక్షలు లాక్‌డౌన్ బాధితులకు ఖర్చు చేసిన సెలూన్ యజమాని
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








