కరోనావైరస్: తెలంగాణ ఆస్పత్రుల్లో తగినన్ని బెడ్స్ ఉన్నాయా? ప్రభుత్వం భరోసా ఇస్తున్నా అనుమానాలు ఎందుకు?

ఫొటో సోర్స్, TSMSIDC
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో రోజు రోజుకీ కరోనావైరస్ రోగుల సంఖ్య పెరుగుతోంది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వేగం మరింత పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వం 50 ఏళ్ల లోపు కోవిడ్-19 రోగుల్ని వారి వారి ఇళ్ల వద్దే క్వారంటైన్లో ఉంచి చికిత్స అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా గాంధీ ఆస్పత్రి నుంచి 393 మంది రోగుల్ని ఇంటికి పంపుతున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాజారావు సోమవారం నాడు తెలిపారు.
దీంతో కరోనావైరస్ రోగులకు చికిత్స అందించే విషయంలో అనేక సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో కోవిడ్-19 రోగులకు చికిత్స విషయంలో ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు రోగులకు సరిపడా బెడ్స్ తెలంగాణాలో ఉన్నాయా..? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.
అయితే జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు లేని వారిని మాత్రమే ఇంటికి పంపుతున్నట్టు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పారు. “ఇవాళ 393 మంది కరోనా పేషెంట్లను గాంధీ నుంచి పంపుతున్నాం. ఇళ్లలో ప్రత్యేకంగా ఒక గది ఉండి క్వారంటైన్‌లో ఉండేందుకు తగిన సౌకర్యాలున్న 310 మంది హోం క్వారంటైన్‌కు పంపాం. మిగిలిన 83 మందిని అమీర్‌పేటలోని ప్రకృతి చికిత్సాలయానికి తరలించాం" అని ఆయన వివరించారు.
అంతకు ముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, కోవిడ్ నిపుణుల కమిటీ సభ్యులు, ఇతర వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరిస్థితి విషమంగా ఉన్న వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని, వైరస్ సోకినప్పటికీ లక్షణాలు లేని వారికి హోమ్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు సీఎం తెలిపారు.
అదే సమావేశంలో తెలంగాణలో వైరస్ బారిన పడ్డ వారికి చికిత్సనందించే సామర్థ్యంపై కూడా చర్చ జరిగింది. కోవిడ్-19 రోగులకు చికిత్స అందించడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, పరికరాలు సిద్ధంగా ఉన్నాయని, ఎంతమందికైనా చికిత్స చేసే సామర్థ్యం ప్రభుత్వ ఆస్పత్రులకు ఉందని రాష్ట్ర వైద్యశాఖ అధికారులు, నిపుణులు స్పష్టం చేశారు. ఈ విషయంలో కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేసి, ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రచారం వెనుక కుట్ర ఉందని కూడా వారు అనుమానం వ్యక్తం చేశారు.
అదే రోజు రాష్ట్రంలో కోవిడ్-19 రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని, ప్రజారోగ్య శాఖ డైరక్టర్‌ను జూన్ 17న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. అలాగే అంతకుముందు రాష్ట్రంలో జరుగుతున్న కోవిడ్-19 పరీక్షల తీరుపైన, అలాగే రక్షణ కిట్లకు సంబంధించి తగిన నివేదిక ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం ఆ మేరకు నివేదికను సమర్పించినప్పటికీ అది పూర్తి స్థాయిలో లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఆస్పత్రుల్లో మరణించిన వ్యక్తుల మృత దేహాలకు కూడా కరోనా పరీక్షలు జరపాలని కోర్టు చెప్పింది. దానిపై స్టే కోరుతూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఆ కేసుపై ఇంకా విచారణ జరగాల్సి ఉంది.
మరోవైపు కరోనా ర్యాండమ్ టెస్టులు చేయడం లేదని ఆగ్రహించిన హైకోర్టు, తగినన్ని రక్షణ కిట్లు సరఫరా చేయకపోవడం వల్లే వైద్యులకు కరోనా సోకిందని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అలాగే హెల్త్ బులిటెన్లలో తప్పుడు లెక్కలు ఇస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సినవసరం ఉందని స్పష్టం చేసింది.
జూన్ 7న ఓ టీవీ ఛానెల్‌కు చెందిన పాత్రికేయుడు మనోజ్ కుమార్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పాయారు. తన సోదరునికి ఆస్పత్రిలో అందిన వైద్యంపై అనేక ప్రశ్నలు లేవనెత్తారు ఆయన సోదరుడు సాయినాథ్. అలాగే మనోజ్ ఆస్పత్రిలో ఉండగా అక్కడ సౌకర్యాలపై తన సోదరునికి పంపిన మెసేజ్‌లు కూడా బాగా వైరల్ అయ్యాయి.
అంతేకాదు గాంధీ ఆస్పత్రి లో సరైన వైద్యం అందకే తన తమ్ముడు చనిపోయారని సాయినాథ్ ఆరోపించారు. కనీసం బెడ్‌కి బెడ్‌కి మధ్య దూరం కూడా ఎక్కువ లేదని కూడా ఆయన అన్నారు. ఇదే విషయాన్ని, గాంధీ ఆస్పత్రికి చెందిన ఒక జూనియర్ డాక్టర్ కూడా నిర్ధరించారు. "బెడ్స్ ఫుల్ అయిపోయాయి. చాలా మందిని ఇళ్ళకి పంపించేందుకు అంతా సిద్ధం చేయమన్నారు. కరోనావైరస్ పాజిటివ్ ఉన్నా, లక్షణాలు లేని వారిని ఇంటికి పంపుతున్నాం" అని ఒక జూనియర్ డాక్టర్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గాంధీ ఆస్పత్రిలో బెడ్స్ ఖాళీ లేవా? వాస్తవమేంటి?
పీఎల్ విశ్వేశ్వర రావు, డా.చెరుకు సుధాకర్ వేసిన పిటిషన్ విచారణలో భాగంగా, మే 11 నాటికి రాష్ట్రంలో ఉన్న వసతులపై ప్రభుత్వం హైకోర్టుకు ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 5,168 ఐసోలేటెడ్ బెడ్స్, ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అందులో 1500 బెడ్స్ గాంధీ ఆస్పత్రిలో ఉండగా, 1237 బెడ్స్ ఇటీవల గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన టిమ్స్ లో ఉన్నాయని తెలిపారు.
అయితే ఇప్పటి వరకు టిమ్స్‌లో రోగుల్ని ఉంచాల్సినవసరం రాలేదని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా.శ్రీనివాస్ రావు తెలిపారు. ఇక జిల్లాల విషయానికి వస్తే మొత్తం 49 ఆస్పత్రులలో 1263 ఐసోలేటెడ్ బెడ్స్, ఐసీయూ బెడ్స్ ఉన్నాయని కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. కోర్టుకు ఇచ్చిన మరో నివేదికలో రాష్ట్రంలో సమారు 60వేల కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశామని సర్కారు తెలిపింది.
“గాంధీ ఆసుపత్రి కరోనా పేషంట్లతో కిక్కిరిసిపోతోందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కొన్ని పేపర్లు, టీవీలలో కూడా అలాగే ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది పూర్తిగా అబద్ధం. గాంధీ ఆసుపత్రిలో 2,150 మందికి చికిత్స అందించే అవకాశం ఉంది. ఇందులో ఆక్సిజన్ సౌకర్యం కలిగిన బెడ్లు వెయ్యి వరకు ఉన్నాయి. ప్రస్తుతం గాంధి ఆసుపత్రిలో కేవలం 247 మంది కరోనా పేషంట్లు మాత్రమే ఉన్నారు. గాంధిలో ఉన్న సౌకర్యాలనే పూర్తిగా వాడుకునే అవసరమే ఇంత వరకు రాలేదు. వైరస్ సోకిన వారిలో చాలా మంది కోలుకుని డిశ్చార్జి అయి, ఇంటికెళ్లారు. ఎలాంటి లక్షణాలు లేని వారికి హోమ్ ట్రీట్మెంట్ అందిస్తున్నాం” అని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
డాక్టర్ శ్రీనివాస్ బీబీసీతో మాట్లాడుతూ.. “డిశ్చార్జ్ చేసిన వారికి పరీక్షలు చేసి, ఐసొలేషన్‌కి అవకాశం ఉన్న వారికి ఇళ్ళకి పంపించాం. అవకాశం లేని వారిని ప్రభుత్వ ఐసొలేషన్ వార్డుల్లో పెట్టాం. ఫలితంగా, సీరియస్ కేసులపై వైద్య సిబ్బంది ఎక్కువ దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుంది" అని వివరించారు.

ఫొటో సోర్స్, getty images
పెరుగుతున్న కేసులను ఎలా చూడాలి?
తెలంగాణాలో కేవలం నెల రోజులలోనే మరణాల సంఖ్య 400 శాతం పెరిగింది. మే 10 వరకు మరణించిన వారి సంఖ్య 30 ఉండగా, జూన్ 10 నాటికి మరణాల సంఖ్య 156. మరణిస్తున్న వారందరు కూడా వయసు మీరిన వారే. కరోనా మరణాలుగా చెప్పబడేవన్నీ కూడా కేవలం కరోనా వల్ల మాత్రమే సంభవించిన మరణాలు కాదు.
దాదాపు 95 శాతం ఇతర కారణాలతో చనిపోయిన వారే. కిడ్నీ, గుండె, లివర్, శ్యాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడే వారు, క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు, షుగర్, బిపి ఉన్న వారు చనిపోతున్నారు. ఇతర జబ్బులతో చనిపోయినప్పటికీ, వారికి కరోనా పాజిటివ్ ఉంది కాబట్టి, కరోనాతోనే చనిపోయినట్లు నిర్థారిస్తున్నారని అధికారులు తెలిపారు.
"రాష్ట్రం లో ఉన్న పాజిటివ్ కేసులు, మరణించిన వారి సంఖ్యను చూస్తే మిగితా రాష్ట్రాలతో పోలిస్తే మోర్టాలిటీ ఎక్కువగా ఉందని అనిపించవచ్చు కాని వాస్తవం అది కాదు. ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు కరోనాకి వైద్యం మెరుగ్గా అందించే ప్రయత్నం చేస్తున్నాం. మనోజ్ విషయం లో కూడా అదే జరిగింది." అని డా శ్రీనివాస్ తెలిపారు.
లాక్ డౌన్ సడలింపులు ఇవ్వటం వల్లే ప్రజల కదలికలు పెరిగాయని కేసుల సంఖ్య పెరగడానికి కారణం అదేనన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. "మనకు కేవలం జీహెచ్ఎంసి లో ఉన్న ఎక్కువ జనాభా కారణంగా లోకల్ ట్రాన్స్మిషన్ జరిగింది. లాక్ డౌన్ ఎత్తివేయటంతో కేసులు కూడా పెరుగుతున్నాయి" అని డాక్టర్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.

పరీక్షల సంఖ్య పెంచారా?
ఐసిఎంఆర్ నుంచి తీసుకున్న డేటా ప్రకారం మే 3 నాటికి తెలంగాణలో నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 20,311. అదే జూన్ 2 నాటికీ 31,721. అంటే నెల రోజుల వ్యవధిలో రోజుకి 380 పరీక్షలు నిర్వహించారు. అయితే "అసలు టెస్టులు ఎవరికీ చేయాలి, చేసిన తరువాత ఏం చేయాలి అన్న విషయంపై అంతర్జాతీయ స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ స్పష్టతా లేదు. ఎక్కడ కూడా మీరు ఇన్ని టెస్టులు చేయాలని ఒక బెంచ్‌మార్క్‌కూడా లేదు. ప్రతి రాష్ట్రం వారి వారి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాయి.
“పరీక్షలు ఎవరికి అవసరమో వారికే చేస్తున్నాం. టెస్టులు చేయటం అంటే కొన్ని కోట్ల రూపాయల నిధులు కావాలి. నిజంగా అవసరం ఉన్న వారికి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఫర్వాలేదు. అలాగని ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహిస్తూ వెళ్తూ అందుబాటులో ఉన్న టెస్టింగ్ కిట్స్ అన్నింటిని వాడేస్తే.. భవిష్యత్తులో నిజంగా అవసరమైనప్పుడు పరిస్థితి ఏంటి?” అని ప్రశ్నించారు డా.శ్రీనివాస్. అయితే రాష్ట్రంలో అవసరం ఉన్నా లేక పోయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం అని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
మరో వైపు తెలంగాణ లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక నిపుణుల బృందాన్ని రాష్ట్రానికి పంపనుంది. తెలంగాణతో పాటు, మహారాష్ట్ర, తమిళ నాడు, రాజస్థాన్, అస్సాం, హర్యానా, గుజరాత్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, దిల్లీ, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లకు కేంద్ర బృందాలు వెళ్తాయి. కోవిడ్-19 విషయంలో ఆయా రాష్ట్రాలకు మార్గదర్శనం చేస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తక్కువ సంఖ్యలో కోవిడ్ పరీక్షలు, మరణాల సంఖ్య పెరగడం, బెడ్స్ సరిపడా లేక పోవటం ఇలా అనేక సమస్యలపై కేంద్ర బృందాలు వచ్చే రెండు నెలలు రాష్ట్రాల్లోనే ఉండి పని చేస్తాయని కేంద్రం తెలిపింది. తెలంగాణాలో నాలుగు జిల్లాలో కేంద్ర బృందం పని చేయనుంది.

153మంది వైద్య సిబ్బందికి కరోనా
తెలంగాణలో ఇప్పటి వరకు 153 మంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. అయితే వారిలో ఏ ఒక్కరి పరిస్థితి అంత సీరియస్‌గా లేదు. దాదాపు 80 మంది జూనియర్ డాక్టర్లకు కరోనా అని తేలింది. ఉస్మానియాలో 54, గాంధీలో 8, నిమ్స్ లో 18 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. అయితే ఉస్మానియాలో ఒక జూనియర్ డాక్టర్ నుంచి మిగిలిన వారికి వైరస్ సోకిందని అధికారులు చెబుతున్నారు. కేవలం వైద్యులే కాదు కొందరు పాత్రికేయులు కూడా వైరస్ బారిన పడ్డారు.
‘ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేం’
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజారోగ్యశాఖ డైరక్టర్ డాక్టర్ శ్రీనివాస్ కోరారు. ”ప్రజల్ని కాపాడుకోవడంలో ఇప్పటి వరకు ప్రభుత్వం తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. ఇప్పుడు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా బాధ్యతను వహించాల్సిన సమయం వచ్చింది. ఒక్క చేత్తో చప్పట్లు కొట్ట లేం కదా..! ప్రజలు కూడా వీలైనంతగా అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వైరస్ బారిన పడకుండా ఉంటారు” అని శ్రీనివాస్ చెప్పారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి
- పదో తరగతి పరీక్షలు రద్దు: తెలంగాణలో ఇంటర్నల్ అసెస్మెంట్తో పాస్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయం
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- 4 ఏళ్ల చిన్నారి నుంచి 62 ఏళ్ల వృద్ధుడి వరకు, ఒకే కుటుంబంలో 18 మందికి కరోనావైరస్.. అంతా ఎలా బయటపడ్డారంటే..
- ‘లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా మావే...’ కొత్త మ్యాప్ ప్రతిపాదనకు నేపాల్ పార్లమెంటు ఆమోదం
- అమెరికాలో నల్లజాతీయుల ఉద్యమం నుంచి భారత దళిత ఉద్యమకారులు నేర్చుకోవాల్సింది ఏమిటి?
- కరోనా లాక్డౌన్: కష్టకాలంలో డిజిటల్ వైపు మళ్లి, లాభాలు పొందిన రైతులు, మత్స్యకారులు
- ఆరు వసంతాల తెలంగాణ: ఉద్యమం నాటి ఆశలు, ఆకాంక్షలు ఎంతవరకూ నెరవేరాయి?
- లాక్ డౌన్‌తో దేశంలో ఆకలి చావులు పెరుగుతాయి: 'ఇన్ఫోసిస్' నారాయణ మూర్తి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








