పదో తరగతి పరీక్షలు రద్దు: తెలంగాణలో ఇంటర్నల్ అసెస్మెంట్‌తో పాస్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయం

కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
తెలంగాణ ముఖ్యంమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 5,34,903 మంది పదవ తరగతి విద్యార్థులున్నారు. మొత్తం ఆరు సబ్జక్టులు, 11 పేపర్లుండగా, అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని సిఎం నిర్వహించారు.
ఈ సమావేశంలో పదవ తరగతి పరీక్షల విషయంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. తెలంగాణలో ఏమి చేయాలనే విషయంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తెలంగాణలో అనుసరించాల్సిన పద్దతిని ఖరారు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరగణలోకి తీసుకుని పదవ తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. డిగ్రీ, పిజి తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్‌లోని శేఖర్ అనే విద్యార్థి బీబీసీ తో మాట్లాడుతూ, పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక గందరగోళానికి గురైనట్లు తెలిపారు. "లాక్‌డౌన్‌లో స్కూల్ మూసివేశారు, అందరు హాయిగా ఆడుకుంటుంటే, నేను టెన్షన్‌తో చదివిందే చదువుతూ సమయం గడిపాను. కాకపోతే ఇప్పుడు నేను పదవ తరగతి సిలబస్ పర్ఫెక్ట్ అని చెప్పగలను. పరీక్షలు రద్దు చేసినందుకు సంతోషంగానూ ఉంది. అలాగే బాధగా కూడా ఉంది" అని శేఖర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
హైకోర్టు ఏం చెప్పింది...
జూన్ 5 న తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్ 10వ తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి సికింద్రాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాలో పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతించింది. జూన్ 8 నుండి యధావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే, జిల్లాలో కంటైన్మెంట్ జోన్లో ఉండే విద్యార్థులకు సప్లిమెంటరీ అవకాశం ఇస్తూ గత శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
జీహెచ్ఎంసీ మినహా మిగతా ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించవచ్చని చెప్పడంతో, రెండుసార్లు పరీక్షలు నిర్వహించాలా అని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఆలోచనలో పడ్డాయి. తల్లితండ్రులు, విద్యావేత్తలు తమ అభిప్రాయాన్ని తెలుపుతూ, కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన తరువాతే ఒకేసారి రాష్ట్రమంతటా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
ఈ పరిస్థితుల్లో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ముఖ్యమంత్రితో సమావేశమై తదుపరి నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో చివరకు పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది.
ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుత రావు తెలిపారు. తల్లి తండ్రులుకూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నివాసి హనుమంత రావు, " విద్యార్థులు పరీక్షలు రాసి ప్రమోట్ అయి ఉంటే బాగుండేది. కానీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రద్దు చేయటమే సరైన నిర్ణయం" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు: ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- జార్జ్ ఫ్లాయిడ్ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
- కరోనావైరస్: ‘గుజరాత్లో కరోనా కల్లోలానికి ప్రత్యక్ష సాక్షిని నేనే.. 20 ఏళ్ల కలల జీవితం మూడు రోజుల్లో కూలిపోయింది’
- కరోనావైరస్: వ్యాక్సీన్ ప్రయోగాల్లో ఆఫ్రికా వాళ్ళు తప్పకుండా ఉండాలి... ఎందుకంటే?
- హైదరాబాద్: నిజాం పాలకుల క్వారంటైన్ హాస్పిటల్... ఇప్పుడు కోరంటి దవాఖానా
- కరోనావైరస్: ప్రపంచ వస్తూత్పత్తి కేంద్రంగా చైనా స్థానాన్ని భారత్ సొంతం చేసుకోగలదా?
- కరోనావైరస్: ఫేస్‌మాస్కుల ఫ్యాషన్ కొత్తపుంతలు తొక్కుతోంది...
- కరోనావైరస్: రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏం తినాలి.. వేటిని దూరం పెట్టాలి
- కరోనావైరస్: యూట్యూబ్‌లో తప్పుదోవ పట్టించే వీడియోలు చూస్తున్న కోట్ల మంది యూజర్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








