తెలంగాణ: 'డాక్టర్లు ఉండాల్సింది ఆస్పత్రిలో, ఐసీయూల్లో... రోడ్డు మీద కాదు' -ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్

హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో తమపై దాడిని నిరసిస్తూ ఆందోళనకు దిగి రోడ్డుపై బైఠాయించిన జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు.
జూనియర్ డాక్టర్లను చర్చల కోసం సెక్రటేరియట్‌కు రావాలని బుధవారం ఉదయం కోరిన ఈటల ఆ తరువాత ఆయనే స్వయంగా గాంధీ ఆస్పత్రికి చేరుకుని వారిని కలుసుకున్నారు. వారికి తగిన రక్షణ కల్పిస్తామని, డాక్టర్లు ఉండాల్సింది ఆస్పత్రిలో, ఐసీయూల్లో కానీ రోడ్డు మీద కాదని, అందరూ వెంటనే విధులకు హాజరు కావాలని రాజేందర్ కోరారు.
జూనియర్ డాక్టర్ల సమస్యలను ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చిన ఈటల, "ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆందోళనకు దిగడం వల్ల మనం చిన్నగవుతాం. మీరు బాగుండకపోతే మేం బాగుండే పరిస్థితి లేదు. మీ ఆత్మ గౌరవం, మా ఆత్మ గౌరవం వేరు వేరు కాదు. మీరు చేసే సేవల మీదనే రాష్ట్రానికి మంచి పేరు రావడమన్నది ఆధారపడి ఉంది. కాబట్టి, మీరు ఆందోళనను వెంటనే విరమించి విధులకు హాజరు కావాలి" అని కోరారు.
ఆరోగ్య శాఖ మంత్రి విజ్ఞప్తి మేరకు జూనియర్ డాక్టర్లు తమ ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. దాంతో, మంత్రి ఈటల వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఉదయం ఏం జరిగింది...
గాంధీ ఆసుపత్రి బయట రోడ్డుపై బైఠాయించిన వీరిని ఆందోళన విరమించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. చర్చల కోసం వైద్యుల ప్రతినిధులు సచివాలయానికి రావాలని ఆయన ఆహ్వానించారు.
మరోవైపు గాంధీ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి దాడికి తెగబడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. వారిపై ఐపీసీలోని వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు.
"వైద్య సిబ్బందిపై ఎలాంటి పరిస్థితుల్లోనూ దాడులను సహించేది లేదు. కఠినమైన చర్యలు తీసుకుంటాం." అని హైదరాబాద్ పోలీసులు కూడా ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"కుర్చీలతో కొట్టారు"
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి (55) కరోనావైరస్ సోకడంతో మూడు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో చేరారు.
శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకు తన పరిస్థితి గురించి వివరించామని డాక్టర్ లోకిత్ వివరించారు. అయినప్పటికీ శ్వాస తీసుకోవడంలో సహకరించే కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్ (సీపీఏపీ) మాస్క్‌ను తీసేసి ఆయన వాష్‌రూమ్‌కు వెళ్లారని, అక్కడ ఆయనకు గుండె నొప్పి వచ్చిందని చెప్పారు. మంగళవారం రాత్రి 7.30కు అతడు చనిపోయినట్లు పేర్కొన్నారు.
అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే అతడు చనిపోయాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిపై వారే దాడిచేశారని లోకిత్ చెప్పారు.
"రోగితోపాటు వచ్చినవారు.. మొదట ప్లాస్టిక్ కుర్చీతో జూనియర్ డాక్టర్‌పై దాడి చేశారు. దీంతో కుర్చీ ఇరిగిపోయింది. తర్వాత ఇనుప కుర్చీని తీసుకొని కొట్టారు. దీంతో ఓ జూనియర్ డాక్టర్ నడుముకు ఎడమ వైపు దెబ్బ తగిలింది. వెంటనే అక్కడకు వచ్చిన వైద్యులు, నర్సులపైనా కుర్చీలు విసిరారు." అని లోకిత్ వివరించారు.

"గత రెండు నెలల్లో ఇలా దాడులు జరగడం ఇది రెండోసారి. ఆరోగ్య శాఖ మంత్రి, పోలీసు కమిషనర్ ఇలా ఎందరు హామీలు ఇస్తున్నా దాడులు జరుగుతున్నాయి. కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఆందోళన చేపట్టకూడదని ఇదివరకు నిరసన చేపట్టలేదు. ఇప్పుడు మళ్లీ దాడి జరిగింది. ఇప్పుడు మా డిమాండ్లు నెరవేరే వరకూ నిరసన చేపడతాం."అని లోకిత్ అన్నారు.
జూనియర్ డాక్టర్ల డిమాండ్లు ఇవే
- ఎమర్జెన్సీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అందరికీ ఎస్‌పీఎఫ్ భద్రత కల్పిస్తామని ఇదివరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే మాకు ఎలాంటి భద్రతా కల్పించడం లేదు. ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలి.
- ఇతర రాష్ట్రాల మాదిరిగా కోవిడ్ కేసులను నగరంలోని మిగతా ఆసుపత్రులకూ పంపించాలి.
- రాష్ట్రంలోని కోవిడ్ కేంద్రాల్లో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను పూర్తిగా పాటించాలి
- ఇదివరకు ఇలాంటి ఘటనల్లో తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలను మీడియా ముందు ఉంచాలి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- న్యూజీలాండ్‌లో 'జీరో' కరోనావైరస్ కేసులు ఎలా సాధ్యమయ్యాయి?
- భారత్ - చైనా ఉద్రిక్తతలు: లద్దాఖ్‌లో క్షణక్షణం... భయం భయం
- 'ప్రేమించి గర్భవతి అయిన కూతురిని తల్లిదండ్రులే చంపేశారు'
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








