కరోనావైరస్ దిల్లీ: ‘అందరికీ వార్తలు చెప్పే నేనే ఒక వార్తగా మారిపోతున్నానా?’ - ఒక రిపోర్టర్ స్వీయ అనుభవం.. దేశ రాజధానిలో తెలుగువాళ్లు ఎలా ఉన్నారంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశ రాజధాని దిల్లీలో ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స దిల్లీ పౌరులకు మాత్రమే లభిస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటన దిల్లీయేతరులను కలవర పెడుతోంది.
ఉద్యోగ రీత్యా గానీ , వ్యాపార రీత్యా కానీ, దిల్లీలో నివాసముంటున్న వారికి ఈ వార్త కాస్త కంగారుని, భయాన్ని కలిగించింది. అయితే, వీరికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే హాస్పిటళ్లలో చికిత్స లభిస్తుందని చెప్పారు.
దిల్లీలో ఎప్పటి నుంచో నివాసముంటున్నప్పటికీ కొంతమందికి తమ తల్లితండ్రులకి దిల్లీలో నివాస పత్రాలు లేకపోవడం, బంధువులు, కుటుంబానికి దూరంగా ఉండటం వలన ఏ క్షణం ఎలా ఉంటుందోననే భయం మాత్రం అందరినీ వెంటాడుతోంది.
అయితే.. దేశ రాజధాని దిల్లీలో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్స దిల్లీ పౌరులకు మాత్రమే లభిస్తుందని సీఎం కేజ్రీవాల్ చేసిన ప్రకటనను దిల్లీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ బైజాల్ రద్దు చేయడంతో రాజధానిలో నివసించే దిల్లీయేతరులు ఊపిరి పీల్చుకున్నారు.
అయినా దిల్లీయేతరుల్లో భయాందోళనలు తొలగిపోలేదు. ఎల్‌జీ ఆదేశాలతో దిల్లీ నివాసులకు చాలా పెద్ద సమస్య తెచ్చిపెట్టిందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
క్షణక్షణం భయంభయం...
దిల్లీలో జూన్ 08 వ తేదీ నాటికి 27,000 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 761 మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీలో నివసిస్తున్న తెలుగు వారు తమ భయాలను, ఆందోళనలను బీబీసీ తెలుగుతో పంచుకున్నారు.
"ఈ కోవిడ్ 19 జీవితానికే జీవితాన్ని నేర్పిస్తున్నట్లుగా ఉంది" అని రాజేశ్వరి అనే గృహిణి అన్నారు. ఆమె భర్త , ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి గత 10 ఏళ్లుగా దిల్లీలో నివాసముంటున్నారు.
వారుండే ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉండటం వలన ఒక తెలియని భయం నేటికీ వెంటాడుతోందని చెప్పారు. ‘‘లాక్‌డౌన్ అనగానే ఏదో 15 రోజులో, నెల రోజులో ఉంటుందనుకున్నాను కానీ ఇప్పుడిది ఎప్పటికి తీరుతుందో అర్ధం కావటం లేదు’’ అని అన్నారు.
ఆమెకి తొమ్మిదేళ్ల పాప, నాలుగేళ్ల బాబు ఉన్నారు. వారిని ఇంటిలోనే కట్టి పెట్టి ఉంచాలంటే కూడా చాలా కష్టంగా ఉంటోందని చెప్పారు. "అమ్మా! ఈ కరోనా ఎప్పుడు వెళ్ళిపోతుందని నా నాలుగేళ్ల బాబు అడుగుతుంటే నాకేమి సమాధానం చెప్పాలో అర్ధం కావటం లేదు”.
“క్షణక్షణం ఎలా ఉంటుందో తెలియని భయం. మరో క్షణంలో ఎవరినైనా కలవగలమో లేదో తెలియని భయం. ఒక రకమైన చెప్పలేని నిస్సహాయత నన్ను వెంటాడుతున్నాయి. కనీసం పక్కింట్లోకి కూడా తొంగి చూడలేని పరిస్థితి ఇది”.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఒక వారం క్రితం పొద్దున్న ఏడు గంటలకి హైదరాబాద్లో ఉన్న మా అమ్మగారితో మాట్లాడాను. 11 గంటలకి ఫోన్ చేసేసరికి మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లో చేర్చినట్లు మా తమ్ముడు చెప్పారు. అసలు ఆ క్షణంలో నాకు ఏమి చేయాలో పాలుపోలేదు.
ఒక వైపు అనారోగ్యం, మరో వైపు లేని కోవిడ్ సోకుతుందేమో అనే భయం నాకు నిద్ర పట్టనివ్వలేదు. కుటుంబం, ఉద్యోగం, ఆరోగ్యం... ఏది కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
“ఒక వైపు చిన్నప్పటి నుంచి కని పెంచిన కుటుంబం. మరో పక్కన బతుకు తెరువు కోసం చేస్తున్న ఉద్యోగాలు, ఇంకొక వైపు ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత”. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో అర్ధం కాని పరిస్థితి ఉందని అన్నారు.
ఆమె ఇప్పుడు కోలుకున్నారు. కానీ, ఇప్పుడు వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం వలన ప్రయాణం చేయాలంటే భయంగా ఉంది. ఇటు నుంచి వెళ్లలేము, అటు నుంచి ఎవరినీ రమ్మని చెప్పలేని పరిస్థితి చాలా ఇబ్బంది పెడుతోంది. ఒక రకమైన మానసిక వ్యధ వెంటాడుతోంది. అసలు వార్తలు చూడాలంటే కూడా భయంగా ఉంటోందని అన్నారు.
“ఏదన్నా జరిగితే ఇక్కడ ఎవరి సహాయాన్ని అడుగుతాం? కుటుంబం, బంధువులు అంతా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నారు. ఇద్దరు చిన్న పిల్లలతో అతి జాగ్రత్తగా వ్యవహరించడం తప్ప మరో మార్గం కనిపించటం లేదు”.
“ఎన్నడూ ఊహించని పరిస్థితి. నా మనఃస్థితిని నేనసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను."

కోవిడ్-19ని జయించిన గోపీకృష్ణ
దిల్లీలో గత ఎనిమిదేళ్లుగా ఉద్యోగ రీత్యా నివసిస్తున్న గోపీకృష్ణ కరోనా బారినపడి, ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. కోవిడ్ పాజిటివ్ అని తెలియగానే ఒక రకమైన ఆందోళన వెంటాడిందని, ఇంటి దగ్గరున్న అమ్మ నాన్నలు బాగా గుర్తు వచ్చారని చెప్పారు.
“అందరికీ వార్తలు చెప్పే నేనే ఒక వార్తగా మారిపోతున్నానా అనే ఆలోచన నన్ను చాలా నిరాశకి గురి చేసింది”. ఆయన కోవిడ్ 19 కి చికిత్స తీసుకోవడానికి 12 రోజులు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారు. ఐసీయూలోనూ చికిత్స పొందారు. నెల రోజుల కిందట కేసులు ఎక్కువగా లేకపోవడం వలన తనకి మంచి చికిత్సే లభించిందని, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని అన్నారు.
ఆయనని ముందు కోవిడ్ వార్డ్‌లో పెట్టినప్పుడు ఒక ప్యాన్ తెచ్చి టాయిలెట్‌కి వెళ్ళిరమ్మంటే ఒక్క క్షణం ఏమి చెయ్యాలో, కోపంతో ఎవరి మీద అరవాలో అర్ధం కాలేదని అన్నారు. మొత్తం 8 మంది కోవిడ్ రోగులున్న ఉన్న వార్డులో మిగిలిన అందరూ మహిళలే ఉంటే తానొక్కడినే పురుషుడినని, కనీసం తన చుట్టూ పరదాలు కూడా లేవని, ఆ క్షణంలో మాత్రం నరకం కనిపించిందని అన్నారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

తనని ఐసీయూలో పెట్టినప్పుడు మాత్రం భయం తార స్థాయికి చేరిందని, ఒకవైపు ఇంట్లో భార్య, రెండేళ్ల కొడుకు. వాళ్ళకెక్కడ వస్తుందో అనే భయం, తనని హాస్పిటల్లో చేర్చేందుకు సహాయం చేసిన మిత్రులకి కూడా పాజిటివ్ సోకిందని తెలియగానే తన వలన ఇంకెంత మందికి వ్యాపిస్తుందో అనే బాధ తనని వెంటాడుతూనే ఉన్నాయని చెప్పారు.
‘‘అసలు పరిస్థితి ఎలా ఉంటుందో అనే సందిగ్ధతతో బాగా ఇబ్బంది పడ్డాను. నిజామాబాద్‌లో ఉండే తన తల్లితండ్రులు రాలేని పరిస్థితి. ఇక్కడ ఉండే స్నేహితులే పూర్తిగా సహాయం చేశారు’’ అని చెప్పారు.
“ఇంటికి తిరిగి వెళతానా లేదా, తన భార్యని, రెండేళ్ల బాబుని చూస్తానా లేదా అనే భయం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. వారెలా ఉన్నారో అనే భయం కూడా అనుక్షణం ఉండేది. కాకపొతే నా ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఎప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఉండేవాడినని” ఆయన తెలిపారు.
‘‘ఇంటికి తిరిగి వచ్చాక ఊర్లో ఉన్న మా అమ్మ నాన్నలు ఊపిరి పీల్చుకున్నారు. డిశ్చార్జ్ రిపోర్ట్ మెడిసిన్స్ తీసుకుని నా బైక్ సానిటైజ్ చేసి ఇంటి దారి పట్టా. అర గంటలో ఇంటికి చేరుకున్నా..నా భార్య హారతితో ఆహ్వానం పలికి దిష్టి తీసింది. నా కొడుకు డాడీ అంటూ వాడిలో సంతోషం.’’
‘‘వాళ్ళని కష్ట పెట్టా అని కళ్ళలో నీళ్ళు తిరిగాయి. స్నానం చేసి ఉన్న రెండు గదుల్లో ఒక గదిలో నేను ప్రత్యేకంగా ఉంటూ మాస్క్ పెట్టుకుంటూ జాగ్రత్తలు పాటిస్తున్నాను. ఇంటికి రాగానే అందరికి మెసేజ్ పెట్టి కృతజ్ఞతలు చెప్పా. చాలా మంది కాల్స్ చేసి జాగ్రత్తలు చెప్పారు..పలకరించారు. ప్రస్తుతం 14 రోజుల్ హోమ్ క్వారంటీన్ లో ఉన్నాను...’’
‘‘ఒకసారి ఊరికి వెళ్లి అమ్మ నాన్నలని చూసి రావాలి. నాకోసం చాలా మొక్కులు మొక్కారట. ఒకసారి నన్ను చుస్తే కానీ వాళ్ళు పూర్తిగా కుదుట పడరు. జూన్ నెలలో ఒకసారి వెళ్లి రావాలి. మానసికంగా ధైర్యంగా ఉంటే కరోనాను కచ్చితంగా గెలవచ్చు’’ అని గోపీ కృష్ణ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
సొంత గూటికి దూరంగా తెలియని భయం
"అసలు ఈ నగరంలో ఎందుకుండాలి? ఇక్కడ ఏదన్నా అయితే ఎవరు కాపాడతారు?’’ అని దిల్లీలో ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తి ప్రశ్నించారు.
తనకి దగ్గు, ఆయాసం ఉండి నగరంలోని బీఎల్‌కే హాస్పిటల్‌కి వెళితే, కరోనా లక్షణాలున్నాయని ఆర్ఎంఎల్ హాస్పిటల్‌కి పంపారు. ‘‘లాక్‌డౌన్ సమయంలో తెల్లవారుజామున అక్కడ నుంచి వెళ్ళడానికి టాక్సీ కానీ, మరో రవాణా సదుపాయం కానీ లేవు. నన్ను బీఎల్‌కే హాస్పిటల్లో దించిన ఆఫీస్ క్యాబ్ నన్ను హాస్పిటల్ దగ్గర దించేసి వెనక్కి వెళ్ళిపోయింది’’ అని ఆయన తెలిపారు.
‘‘ఆ సమయంలో దారి లేక నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ ఆర్‌ఎంఎల్ హాస్పిటల్‌కి వెళ్ళాను. అక్కడ కరోనా వార్డ్‌కి వెళితే, నువ్వు విదేశాల నుంచి రాలేదు, ఎవరినీ కలవలేదు కాబట్టి నీకు వైద్య పరీక్షలు చేయనవసరం లేదని చెప్పి మందులిచ్చి పంపేశారు. నాకసలు ఆ సమయంలో ఎవరి సహాయం తీసుకోవాలో, ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. చాలా ఒంటరిగా అనిపించింది’’ అని వివరించారు.
“ఈ ఊరిలో ఉండటం నాకు భద్రతగా సురక్షితంగా అనిపించలేదు”.
కొన్ని రోజుల తర్వాత స్నేహితుల సహాయం తీసుకుని ఊరికి వెళ్లిపోయినట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మా అమ్మ దిల్లీలో వైద్యం ఎలా?
దిల్లీలో గత 14 ఏళ్లుగా నివాసముంటున్న పెండ్యాల విజయ్ కుమార్ మరో రకంగా బాధ పడుతున్నారు.
“గుంటూరులో ఉంటున్న మా అమ్మగారిని లాక్ డౌన్ అవ్వగానే దిల్లీకి రమ్మని టికెట్ బుక్ చేసాను. దిల్లీ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మమ్మల్ని కలవర పెడుతోంది” అని చెప్పారు.
“మా అమ్మగారు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ, సాధారణ ఆరోగ్య సమస్యలు ఏమన్నా తలెత్తితే ఆమెకి దిల్లీ ప్రభుత్వం జారీ చేసిన అధికారిక పత్రాలు ఏమి లేవు. ఒక వైపు వైరస్ భయం మరో వైపు ఏదైనా అనారోగ్యం వస్తే ఎలా అనే ఆందోళన అయితే ఉందని” అన్నారు.
‘‘మా అమ్మగారు మా దగ్గర కాక మరెక్కడ ఉంటారని ప్రశ్నించారు’’ అయితే కేజ్రీవాల్ పర్భుత్వ ఉత్తర్వును లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేయటం కాస్త ఊరటనిచ్చింది.
గత మూడేళ్ళుగా దిల్లీలో ఒక ప్రభుత్వ ఆఫీసులో పని చేస్తున్న వడ్డే నరసింహ రావు మాత్రం ఇంట్లో వాళ్ళు వెనక్కి తిరిగి రమ్మని చెబుతున్నా , ఈ సమయంలో ప్రయాణం చేసి ముప్పు తెచ్చుకోవడం తనకి ఇష్టం లేదని అన్నారు.

ఫొటో సోర్స్, ARVIND KEJRIWAL / FACEBOOK
దిల్లీలో పెరుగుతున్న కేసులు
ప్రస్తుతం పెరుగుతున్న రీతిలో కేసులు పెరిగితే జూన్ నెలాఖరుకల్లా దిల్లీలో ఒక లక్ష కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావచ్చని ఐదుగురు వైద్యులతో కూడిన నిపుణుల కమిటీ స్థానిక రిపోర్టర్లకి చెప్పారు.
మరో వైపు దిల్లీలో సరైన వైద్య సహాయం అందటం లేదంటూ అనేక మంది వాపోతున్నారు. అమర్ ప్రీత్ అనే కార్పొరేట్ ఉద్యోగి తన తండ్రికి వైద్యం అందక మరణించినట్లు ట్వీట్ చేసారు.
ఈ పరిస్థితిని సరిదిద్దుతామని, అవసరమైతే దిల్లీలో ఉన్న హోటళ్ళని, ఫంక్షన్ హాళ్ళని కోవిడ్ చికిత్స కోసం వాడతామని కేజ్రీవాల్ చెబుతున్నారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:
- అన్‌లాక్ 1: ఆలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు ఓపెన్.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
- 2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా?
- తెలంగాణలో విద్యుత్ చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారా? అసలు బిల్లులను ఎలా లెక్కిస్తున్నారు?
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
- ముంబయి మహా నగరానికి 125 ఏళ్లుగా నిరంతరాయంగా భోజనం అందిస్తున్న డబ్బావాలా
- కరోనా లాక్‌డౌన్: సూర్యుడు కనిపించని చీకటి జీవితం ఎలా ఉంటుంది?
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- హోక్కైడో: లాక్ డౌన్ ఎత్తేశాక మళ్లీ మొదలైన కరోనా కేసులు.. జపాన్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి?
- "నా హౌస్‌మేట్ సామాజిక దూరం పాటించడంలేదు, అర్ధరాత్రి వేరేవాళ్లను తీసుకొస్తున్నాడు"
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- కరోనావైరస్: కోవిడ్-19 రోగి చనిపోతే అంత్యక్రియలు ఎలా చేయాలి?
- ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








