కరోనావైరస్ లాక్ డౌన్ ఎక్కువ ప్రాణాలను హరిస్తుంది.. దేశంలో ఆకలి చావులు పెరుగుతాయి: 'ఇన్ఫోసిస్' నారాయణ మూర్తి - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Infosys
కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్‌డౌన్ మరికొంత కాలం కొనసాగితే వైరస్‌తో కన్నా ఆకలి కారణంగానే దేశంలో ఎక్కువ మంది చనిపోతారని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి హెచ్చరించినట్లు ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. కరోనాతో కలిసి సాగేందుకు సిద్ధపడాలని, ఆరోగ్యంగా ఉన్నవారు ఉద్యోగాలకు తిరిగొచ్చేలా వీలు కల్పించాలని, ముప్పు ఎక్కువగా పొంచి ఉన్నవారిని మాత్రం రక్షించుకోవాలని ఆయన సూచించారు.
బుధవారం జరిగిన ఒక వెబినార్‌లో ఆయన పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
"భారత్‌లో కరోనా సోకిన వారిలో 0.25-0.5 శాతం మంది మరణించారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని కరోనా మరణాల రేటుతో పోలిస్తే ఇది స్వల్పం" అని పేర్కొన్నారు.
వివిధ కారణాల వల్ల భారత్‌లో ఏటా 90 లక్షల మంది చనిపోతుంటారని తెలిపారు. అందులో నాలుగో వంతు మంది కాలుష్యం కాటుకు బలవుతున్నారని చెప్పారు.
"గత రెండు నెలల్లో కరోనాతో చోటుచేసుకున్న వెయ్యి మరణాలను వాటితో పోల్చి చూసినప్పుడు ఈ మహమ్మారి మనం ఊహించినంత ఆందోళనకరమైనదేమీ కాదని స్పష్టమవుతుంది" అని అన్నారు.
భారత్‌లో 19 కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేయడమో, స్వయం ఉపాధి పొందడమో చేస్తున్నారని మూర్తి చెప్పారు. లాక్‌డౌన్ ఎక్కువకాలం కొనసాగితే వీరిలో చాలా మంది జీవనోపాధిని కోల్పోతారని, ఆకలి చావులు సంభవిస్తాయని హెచ్చరించారు.
దేశంలో కరోనా నిర్ధరణ పరీక్షలు చాలా తక్కువగా జరిగాయని నారాయణ మూర్తి చెప్పారు. ఈ వైరస్‌ను ఎదుర్కొవడానికి టీకా తయారుచేసేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే ఆ టీకా భారతీయుల జన్యువులకు సరిపోలుతుందా అన్నది ఇంకా తేలలేదన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి వినూత్న ఆలోచనలు చేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సూచించారు.
వేలి నుంచి రక్తం చుక్కను సేకరించి చేసే రోగ నిర్ధరణ పరీక్ష విధానాన్ని చైనా అభివృద్ధి చేసిందని, దాని వల్ల దేశంలో వ్యాధి నిర్ధరణ పరీక్షలు పెరగడానికి వీలు కలిగిందన్నారు. అలాంటి పరీక్షను దేశంలోనే సహేతుక ధరతో అభివృద్ధి చేయడానికి భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలెవరూ ముందుకు రాలేదని పేర్కొన్నారు.
దేశంలో కరోనా మరణాలు తక్కువగా ఉండటానికి భారతీయుల్లో జన్యుపరమైన అంశాలు, వేడి వాతావరణం లేదా బీసీజీ టీకాలు పొందడం కారణమై ఉండొచ్చని మూర్తి తెలిపారు. దీన్ని నిర్దిష్టంగా తేల్చేందుకు పరిశోధనలు అవసరమని చెప్పారు. వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు భౌతిక దూరం పాటించేలా, రక్షణాత్మక దుస్తులు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
"ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో మనం మారిన పరిస్థితులను గమనించి, అందుకు అనుగుణంగా నడుచుకోవాలి. కరోనా వైరస్‌తో కలిసి సాగేందుకు సిద్ధపడాలి. కరోనా రాకముందు ఏం చేసేవాళ్లమో ఇప్పుడూ అదే చేయడం మొదలుపెట్టాలి. అదే సమయంలో ముప్పు ఎక్కువగా ఉన్న వారిని రక్షించుకోవాలి" అని సూచించారు.
పని ప్రదేశంలో ఒక షిఫ్ట్‌కు బదులు మూడు షిఫ్ట్‌లను నిర్వహించాలని, తద్వారా రద్దీ తగ్గుతుందని, భౌతిక దూరాన్ని పాటించడానికి వీలవుతుందన్నారు. మహమ్మారి కారణంగా భారత ఐటీ రంగానికి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఖర్చులు తగ్గించుకొని, టెక్నాలజీపై ఎక్కువ పెట్టుబడులు పెడతాయన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వలస కూలీల కోసం నాన్‌స్టాప్ రైళ్లు.. కేంద్ర సర్కారు సుముఖం?
దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులు, యాత్రికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించేందుకుగాను కేంద్రం ప్రత్యేకంగా నాన్‌స్టాప్ రైళ్లను ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. వలస కూలీల కోసం ప్రత్యేక నాన్‌స్టాప్ రైళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రానికి తెలంగాణ సహా కేరళ, బిహార్, యూపీ రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రాల పరస్పర అంగీకారంతో వలస కార్మికుల తరలింపునకు బుధవారం కేంద్రం అనుమతినిచ్చింది. వారిని బస్సుల్లో ప్రత్యేక జాగ్రత్తల మధ్య తరలించాలని కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది.
లక్షల సంఖ్యలో ఉన్న కార్మికులను బస్సుల్లో తరలించడం ఓ ప్రహసనంతో కూడిన ప్రక్రియ అని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ప్రత్యేక నాన్‌స్టాప్ రైళ్లు ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలు గురువారం ప్రధాని మోదీకి లేఖ రాశాయి. దీంతో కేంద్రం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది.
ఒకవేళ కేంద్రం దీనికి పచ్చజెండా ఊపితే వలస కార్మికులకు ఊరట లభించే అవకాశం ఉంది. రెండు మూడు రోజుల్లో కూలీలంతా తమ స్వస్థలాలకు చేరుకుంటారు. అయితే, ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. తమ స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలకు వెంటనే ఆరోగ్య పరీక్షలు చేయాలని.. కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే ప్రభుత్వ క్వారెంటైన్ కేంద్రాలకు తరలించాలని, లక్షణాలు లేకుంటే 14 రోజులు హోం క్వారెంటైన్‌లో ఉంచాలని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
అయితే, లక్షల సంఖ్యలో చేరుకునే కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించడం సాధ్యమవుతుందా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు కోరినట్లుగా వలస కూలీల తరలింపునకు ప్రత్యేక రైళ్లను అనుమతిస్తారా? అనే ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ దాటవేత ధోరణిలో స్పందించారు. ప్రస్తుతానికైతే మార్గదర్శకాల్లో పేర్కొన్న విధంగా రోడ్డు మార్గం ద్వారా బస్సుల్లోనే తరలింపు ప్రక్రియ జరగాలని ఆమె స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో అన్ని ప్రవేశపరీక్షలకు దరఖాస్తు గడువు పెంపు
టీఎస్ ఎంసెట్, టీఎస్ ఐసెట్-2020 సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షల ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును మే 15 వరకు ప్రభుత్వం పొడిగించిందని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఎడ్‌సెట్, లాసెట్, ఈసెట్, పీజీసెట్, పీఈసెట్, పీజీఈసెట్‌లకు కూడా ఈ అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. గతంలో ప్రకటించిన గడువు మే ఐదో తేదీతో ముగియనుండటం, మే ఏడు వరకు లాక్‌డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి వేర్వేరు ప్రకటనలు విడుదలచేశారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో జాతీయస్థాయి వ్యవసాయ కోర్సుల ప్రవేశపరీక్ష (ఐకార్-2020) దరఖాస్తుల గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 15 వరకు పొడిగించింది. జూన్ 1న నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షను కూడా వాయిదావేసింది. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ‘లాక్‌డౌన్’.. పంటను కోయలేరు, అమ్మలేరు..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్: మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- ఎయిర్ ఇండియా పైలట్లు కరోనావైరస్ బారిన పడే ముప్పు ఎక్కువ ఉందా?
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- కరోనావైరస్ ప్రభావంతో భారత్‌లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








