ఈఎస్ఐ అక్రమాలు: మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన ఏసీబీ.. ఇది జగన్ కుట్ర అని చంద్రబాబు నాయుడు ఆరోపణ

ఫొటో సోర్స్, facebook/AtchannaiduK
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కింజారపు అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు శనివారం ఉదయం అరెస్ట్ చేశారు.
విజయవాడ నుంచి బస్సుల్లో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వెళ్లిన పోలీసులు, ఏసీబీ అధికారులు తెల్లవారుజామున ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 7.20 గంటలకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ కేసుతో సంబంధం ఉన్న సీకే రమేష్ కుమార్ (తిరుపతి), జీ విజయ కుమార్ (రాజమండ్రి), డాక్టర్ జనార్దన్ (కడప), ఈ రమేష్ బాబు, ఎంకేబీ చక్రవర్తిల(విజయవాడ)ను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డైరెక్టర్ రవికుమార్ మీడియాకు తెలిపారు.
వీరిని విజయవాడలో కోర్టు ముందు హాజరు పరుస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈఎస్ఐలో రూ.150 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయ్యాయని విజిలెన్స్ విచారణలో తేలిందని, దీంతో ఈ కేసును ఏసీబీ చేపట్టిందన్నారు.
నకిలీ బిల్లులు, ఇన్‌వాయిస్‌లతో నిధులు కాజేశారని, ఈ టెండర్ విధానాన్ని పాటించలేదని వెల్లడించారు.
ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని తెలిపారు. ప్రభుత్వం తరపున ఉత్తర్వులు ఇవ్వాల్సిన ఉన్నతాధికారులకు తెలియకుండానే ఇవన్నీ జరిగాయన్నారు.
అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోళ్లలు అక్రమాలు జరిగాయని గతంలో విజిలెన్స్ విభాగం తెలిపింది.
అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారంపై హోం శాఖ మంత్రి సుచరిత స్పందించారు.
ముందుగా నోటీసులు ఇచ్చాకే అరెస్ట్ చేశామని, ఈ వ్యవహారంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు. ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగిందని, ఇందులో ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదిలిపెట్టేది లేదని అన్నారు.

ఫొటో సోర్స్, ACB/Sharath
‘అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశాం’ - ఏసీబీ
ఈఎస్ఐ అక్రమాలకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసినట్లు ఏసీబీ ధృవీకరించింది. ఈ మేరకు అచ్చెన్నాయుడు బంధువు కింజారపు సురేశ్ కుమార్‌కు అరెస్టు సమాచార లేఖను ఏసీబీ అందజేసింది.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో ఉదయం 7.20 గంటలకు అరెస్టు చేసినట్లు వెల్లడించింది.

ఫొటో సోర్స్, facebook/AtchannaiduK
‘అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారు.. ఇది జగన్ కుట్ర’ - చంద్రబాబు నాయుడు
అసెంబ్లీకి మరో 4 రోజు ముందు అచ్చెన్నాయుడు కిడ్నాప్ చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇది జగన్ కుట్రే అని ఆయన అన్నారు.
ఈ మేరకు చంద్రబాబు ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో.. ‘‘ప్రభుత్వం బడుగు బహీన వర్గాలకు చేస్తున్న మోసం, అన్యాయాలపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారు. ఇది సహించలేని జగన్ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి రాత్రి 100 మంది పోలీసు ఆయన ఇంటిపై పడి అక్రమంగా కిడ్నాప్ చేశారు. ఆయనను మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదు. వారి కుటుంబ సభ్యులు ఫోన్‌లో కాంటాక్ట్ చేసినా ఫోన్ అందుబాటులో లేకుండా చేశారు. నేను ఫోన్ చేసినా అచ్చెన్నాయుడు ఫోన్ అందుబాటులో లేదు. ఇది జగన్ అరాచకం, ఉన్మాదం తప్ప మరేమీ కాదు... పిచ్చి పరాకాష్టకు చేరినట్లుగా ఉన్నది. ప్రజల్లో జగన్ మోసాలకు, అవినీతికి వ్యతిరేకంగా వస్తున్న అసంతృప్తి ఫ్రస్ట్రేషన్‌గా మారి ఈ రకమైన ఉన్మాద చర్యలకు ఒడికడుతున్నారు.
ఎక్కడకు తీసుకువెళ్ళారో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు... ముందస్తు నోటీసు ఇవ్వలేదు.. ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సీయం జగన్, హోంమంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలి. శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కిడ్నాప్ చేయడం ఇది చట్టాన్ని ఉల్లంఘించడంకాక మరేమిటి? బీసీలకు జరుగుతున్న అన్యాయంపై శాసనసభా వేదికగాను, ఇతరత్రా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజలకు తెలియజేసినందువల్ల దానిని సహించలేక జగన్ చట్టవ్యతిరేకంగా కిడ్నాప్ చేశారు'' అని ఆరోపించారు.

అచ్చెన్నాయుడిపై కేసు ఏంటి.. ఈఎస్ఐలో ఏం జరిగింది?
రూ. 21 వేల కంటే తక్కువ జీతం ఉన్న ఉద్యోగులకు వారి జీతం నుంచి కొంత, కంపెనీ కొంత, ప్రభుత్వం కొంత సొమ్ము జత చేయడం ద్వారా ప్రభుత్వమే హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుంది. ఇదే ఈఎస్ఐ.
దానికి సంబంధించి ముందుగా రాష్ట్రం ఖర్చు పెడితే, తరువాత ఈఎస్ఐ కార్పొరేషన్ వాటా డబ్బు రాష్ట్రానికి వస్తుంది. కార్మిక శాఖ పరిధిలో ఉండే ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ అనే సంస్థ ఈ నిర్వహణ చూస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈఎస్ఐ కింద 4 ఆసుపత్రులు, 3 పరీక్షా కేంద్రాలు, 78 డిస్పెన్సరీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కొనుగోళ్లలో ఈ అక్రమాలు జరిగాయన్నది విజిలెన్స్ నివేదిక సారాంశం.
2014 - 2019 మధ్య ఐఎంఎస్ కి ముగ్గురు డైరెక్టర్లు పని చేశారు. ముగ్గురి హయాంలోనూ కొనుగోళ్లలో అక్రమాలు జరగాయన్నది విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వాదన. ఈ ముగ్గురి హయాంలో మొత్తం రూ. 975.79 కోట్ల విలువైన కొనుగోళ్లు జరిగాయి. ఈ కొనుగోళ్లలో ఈఎస్ఐ పాటించాల్సిన నిబంధనలనూ, 2012 నాటి జీవో 51లోని నిబంధనలనూ పాటించలేదనీ, దాని వల్ల ఖజానా కోట్ల రూపాయల నష్టం చేశారని విజిలెన్స్ పేర్కొంది. వీటిలో డా. బి రవి కుమార్ హయాంలో రూ. 325.21 కోట్లు, డా. సి కె రమేశ్ కుమార్ హయాంలో రూ. 227.71 కోట్లు, డా. జి విజయ కుమార్ హయాంలో రూ. 435.85 కోట్ల కొనుగోళ్లు జరిగాయి.
ఈ ముగ్గురి హయాంలో మందులు కొనడానికి రూ. 293 కోట్ల 51 లక్షలు కేటాయించగా, వారు ఏకంగా రూ. 698 కోట్ల 36 లక్షల విలువైన మందులు కొన్నారు. అంటే అదనంగా రూ. 404.86 కోట్లు ఖర్చు చేశారు.
2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 సంవత్సరం వరకూ నాన్ రేట్ కాంట్రాక్టర్ల నుంచి రూ. 89.58 కోట్ల మందులు కొన్నారు. ఈఎస్ఐలో ముందుగా నమోదయిన రేట్ కాంట్రాక్టర్ల నుంచే మందులు కొనాలి. కానీ అలా జరగలేదు. నిజానికి ఇవే మందులు రేట్ కాంట్రాక్టర్ల నుంచి కొంటే రూ. 38.56 కోట్లకే వచ్చుండేవి. అంటే, రూ. 51.02 కోట్లు అదనంగా చెల్లించారు.
ల్యాబ్ కిట్లు రూ. 237 కోట్లకు లెజెండ్ ఎంటర్‌ప్రైజెస్, అవంతర్ పెర్ఫార్మెన్సస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఓమ్ని మెడి అనే సంస్థల నుంచి కొన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా బయటి మార్కెట్ కంటే 36 శాతం అదనంగా, అంటే రూ. 85 కోట్ల 32 లక్షల రూపాయల అధిక ధరకు కొన్నారు. ఓపెన్ టెండర్ కాకుండా నామినేషన్ పద్ధతిలో కొన్నారు. ఇక ల్యాబ్ సామాగ్రి కోసం కూడా నామినేషన్ పద్ధతిలో లెజెండ్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి రూ. 2.45 లక్షలకు కొన్నారు. ఈ రెండింటికీ టెండర్లు వేయలేదు.
రూ. 47.77 కోట్లతో సర్జికల్ ఐటెమ్స్ కూడా టెండర్ లేకుండా కొన్నారు. ఈఎస్ఐ సంస్థ 2018-19 సంవత్సరానికి నిర్ణయించిన రేట్ కాంట్రాక్టు కంటే ఇది రూ. 10.43 కోట్లు అదనం. ఇక రూ. 6 కోట్ల 62 లక్షలతో ఫర్నిచర్ కొన్నారు. అది మార్కెట్ ధర కంటే రూ. 4 కోట్ల 63 లక్షలు ఎక్కువ. ఇది టెండర్లు లేకుండానే చేశారు.
మందుల్లో రూ. 51 కోట్ల 2 లక్షలూ, ల్యాబ్ కిట్లలో రూ. 85 కోట్ల 32 లక్షలూ, సర్జికల్ ఐటెమ్స్ లో రూ. 10 కోట్ల 43 లక్షలూ, ఫర్నీచర్లలో రూ. 4 కోట్ల 63 లక్షలూ మొత్తం కలపి రూ. 151 కోట్ల 40 లక్షలు అదనంగా ఖర్చు చేశారు.
రాశి ఫార్మా, వీరేశ్ ఫార్మా సంస్థల పర్చేజ్ - సేల్ ఇన్‌వాయిస్‌ల మధ్య ఉన్న తేడా ప్రకారం చూస్తే రూ. 5 కోట్ల 70 లక్షలు అదనంగా చెల్లించారు. ఇక రూ. 9.50 కోట్ల మందుల ఆర్డర్లు పొందిన జెర్కాన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో ఫార్మాసిస్ట్‌గా ఉన్న కె ధనలక్ష్మి కోడలు రావిళ్ల రవి తేజస్వి. ఈ సంస్థకు రమేశ్ కుమార్, విజయ కుమార్‌ల హయాంలో ఆర్డర్లు ఇచ్చారు. ఇక జలం ఎన్విరాన్మెంట్ సంస్థకు ఇచ్చిన ఆర్డర్లలోనూ అవకతవకలు ఉన్నాయి. ప్రొడిజి సంస్థ నుంచి ఒక్కోటీ రూ. 17 వేలు ఖరీదు చేసే బయో మెట్రిక్ మెషీన్లను ఒక్కోటీ రూ. 70 వేల చొప్పున వంద మెషీన్లు కొన్నారని విజిలెన్స్ పేర్కొంది.
ఈ విచారణలో భాగంగా చాలా కొటేషన్లు మార్చేశారని స్పష్టమైంది. కొటేషన్ల కవర్లపై ఉన్న చేతిరాత ఈఎస్ఐ సిబ్బందివే ఉన్నాయంటున్నారు విజిలెన్స్ అధికారులు. పోనీ ఇదంతా చేసింది కార్మికులకు ఉపయోగపడిందా అంటే, అదీ లేదంటున్నారు అధికారులు. కొన్నవాటిలో చాలా మందులు, ఇతర పరికరాలు ఏడాదిగా ఉపయోగం లేకుండా పడున్నాయని విజిలెన్స్ చెబుతోంది. వీరు ఐపీసీలోని వివిధ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం కింద నేరం చేశారు.
అచ్చెన్నాయుడు జోక్యం
టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి పనులు ఇవ్వండి అని అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు ఒక లేఖ రాశారు. దీంతో అప్పటి ఐఎంఎస్ డైరెక్టర్ రమేశ్ కుమార్ ఆ లేఖ ఆధారంగా వారికి పనులు ఇచ్చేశారు. ఈసీజీ సేవలు, ఇంకా టోల్ ఫ్రీ సేవల కోసం వారికి నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చారు. మార్కెట్లో సుమారు రూ. 200 కంటే ఎక్కువ ఖర్చుకాని ఈసీజీకి రూ. 480 రూపాయలు చొప్పున ఆ సంస్థకు చెల్లించారు. ఇక ఎన్ని ఫోన్లు, ఎక్కడి నుంచి వచ్చాయన్న దాంతో సంబంధం లేకుండా కాల్ సెంటర్ బిల్లులు ఇచ్చేశారు. ఆ సంస్థకు రూ. 8 కోట్లు చెల్లించారు. 2016 నవంబరులో మంత్రి అచ్చెన్నాయుడు టెలి హెల్త్ సర్వీసెస్ సంస్థ తరపున లేఖ ఇచ్చారు. అందులో స్పష్టంగా ఆ సంస్థతో ఎంఓయు కుదుర్చుకోండి అని రాసి ఉంది.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ అంశంపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, తెలంగాణ రాష్ట్రంలో చేసినట్లే ఆంధ్రప్రదేశ్‌లో కూడా చేయాలని మాత్రమే సూచించానని చెప్పారు. రికార్డులన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయి కాబట్టి చూసుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి:
- BBC Special: బోనాల్లో 'రంగం' చెప్పే స్వర్ణలత ఎవరు?
- #గమ్యం: రైల్వేలో ఉద్యోగం పొందడం ఎలా?
- భారత్ - చైనా ఉద్రిక్తతలు: లద్దాఖ్‌లో క్షణక్షణం... భయం భయం
- కరోనావైరస్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌తో మీ మీద అడుగడుగునా నిఘా పెడుతున్నారా?
- కరోనావైరస్: ‘హీరో’ల నిర్వచనాన్ని ఈ మహమ్మారి మార్చేస్తుందా?
- కరోనావైరస్ రోగులకు ఆక్సీమీటర్లు ఎందుకు ఇస్తున్నారు.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయి
- కరోనా లాక్డౌన్: సూర్యుడు కనిపించని చీకటి జీవితం ఎలా ఉంటుంది
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- గుజరాత్: బ్రెజిల్‌కు ఆనాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతోంది
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- సీతారాం ఏచూరి బోనం ఎందుకు ఎత్తుకున్నారు? ఈ ‘చిత్రం’ వెనుక కథేంటి?
- BBC Special: పోతురాజు - బోనాల పండుగలో ఈ వేషం ఎవరు వేస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








