సీతారాం ఏచూరి బోనం ఎందుకు ఎత్తుకున్నారు? ఈ ‘చిత్రం’ వెనుక కథేంటి?

ఫొటో సోర్స్, Pippala Venkatesh
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్టు) కార్యదర్శి సీతారాం ఏచూరి హైదరాబాద్‌లో బోనం ఎత్తుకున్న ఫొటో మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. దేశ వ్యాప్తంగా అనేకచోట్ల వైరల్ అయ్యి కామెంట్లతో హోరెత్తుతోంది. ఇంతకీ ఈ చిత్రం వెనుక ఉన్న కథేంటి?
హైదరాబాద్‌లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎన్నికల సంస్కరణలు అనే అంశం మీద సమావేశం జరిగింది. వామపక్షాలు దళిత బహుజనులను కలుపుకుని పోవడంలో విఫలమయ్యాయని వస్తున్న విమర్శలకు ప్రతిగా తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చొరవతో ఏర్పాటైన సంఘం.. బహుజన లెఫ్ట్ ఫ్రంట్.
సామాజిక రంగంలో ఆధిపత్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అనేక సంఘాలు, కొన్ని పార్టీలతో ఈ విశాల వేదికను ఏర్పాటు చేశారు. సీపీఎం నేతలతో పాటు అయిలయ్య లాంటి దళిత బహుజన మేధావులు కార్యకర్తలు తరచుగా ఈ వేదికపై కనిపిస్తూ ఉంటారు. జులై 15వ తేదీ ఆదివారం జరిగిన సమావేశానికి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం లాంటివారితో పాటు ఏచూరి కూడా బతుకమ్మను ఎత్తుకుని నడిచారు. వేదిక వద్దకు చేరుకోగానే పాత్రికేయులు బతుకమ్మను ఎత్తుకున్నారు కదా, బోనం కూడా ఎత్తుకోవాలని కోరారు. దాంతో ఏచూరి బోనం ఎత్తుకుని ఫొటోలకు పోజులిచ్చారు.
వాస్తవానికి హైదరాబాద్లో ఇపుడు బోనాల సీజన్ నడుస్తోంది. ఎటుచూసినా బోనాల సందడే. బోనాల్లో బతుకమ్మ ఆడే సంప్రదాయమేదీ లేదు. కానీ ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు సూచికగా మారిపోతున్న బతుకమ్మను ఈ సందర్భంగా సీపీఎం నాయకులు తలకెత్తుకోవడం ఆసక్తికరమైన అంశం.

ఫొటో సోర్స్, Pippala Venkatesh
బతుకమ్మ-బోనం
బతుకమ్మ ప్రధానంగా దసరా సందర్భంగా సాగే పండుగ. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. దసరా నవరాత్రులూ బతుకమ్మ ఆడుతారు. ఆశ్వయుజమాస శుద్ధపౌఢ్యమి నుంచి తొమ్మిదిరోజుల పాటు ఈ పండుగ సాగుతుంది. గౌరీ పూజ ఈ పండుగలో అంతర్భాగం. గౌరీ రూపంగా భావించే బతుకమ్మను ఉద్దేశిస్తూ తొమ్మిదిరోజులు రకరకాల పదార్థాలతో నైవేద్యాలు చేసి పెడతారు. అనేక అవతారాల పేర్లతో బతుకమ్మను సంబోధిస్తారు. తొమ్మిదిరోజులు సాగే పాటల పూల నృత్యాల పండుగలో బతుకమ్మను ఉద్దేశించి పాటలు పాడతారు. రకరకాల ఆకులతో పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ చేరి స్ర్తీలు మాత్రమే ఆడతారు. పసుపు బొట్టు అంటూ పరస్పరం తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటారు.
ఈ పండుగ మూలాల గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. గౌరీ లేదా శక్తి స్వరూపిణి అవతారం లేటెస్ట్ అడిషన్ అని.. పూర్వపు గ్రామదేవతల పూజాదిక రూపాన్ని తర్వాతి కాలంలో సంప్రదాయక గౌరీ రూపం ఆక్రమించిందని ఒక ప్రధాన కథనం. అప్పట్లో మహమ్మారి వ్యాధులు చుట్టుముట్టినపుడు అప్పటి ప్రజలు గ్రామదేవతలను ఈ రూపంలో పూజించారని చెప్పే వారున్నారు. పూర్వం ఒక భూస్వామి చేతుల్లో అత్యాచారానికి గురై చనిపోయిన బాలికను గ్రామంలోని బాధితులంతా కలిసి బతుకమ్మా అని దీవించారని అప్పటినుంచి ఆ బాలికను స్మరిస్తూ శక్తికోసం గౌరీ మాతను పూజిస్తూ ఈ పండుగ జరుపుకొంటారని ఇంకొక కథనం ప్రచారంలో ఉంది.

అలాగే భూస్వాములు గడీల్లో దళిత ఆడవాళ్లను బరిబాతల బతుకమ్మలను ఆడించి పైశాచిక ఆనందం పొందేవారని కొందరు దళిత వాదులు వాదిస్తుంటారు. వారు ఈ బతుకమ్మల తంతును నిరసిస్తుంటారు. దళితురాళ్లతో కలిసి మామూలుగా బతుకమ్మలు ఆడేచరిత్ర ఉందా అని నిలదీస్తుంటారు. కొందరు ప్రత్యామ్నాయంగా దళిత బతుకమ్మలు ఆడించడం కూడా ఉన్నది.
కానీ తెలంగాణ సమాజంలో అతి పెద్ద పండుగ అయిన బతుకమ్మను పాటించే కుటుంబాలలో సెక్యులర్ లిబరల్ కుటుంబాలు అయితే చాలా చేరిపోయాయి. దీన్ని ఆధ్యాత్మికతలో భాగంగా కాకుండా సంస్కృతిలో భాగంగా చూడాలనే వాదన ఒకటి ముందుకొస్తున్నది. ఆకులు పూలతో ఆరాధిస్తూ సాగే తంతు కాబట్టి ప్రధానంగా ప్రకృతి పండుగగా భావించాలనే భాష్యం సామాజిక సారస్వతంలో పెరుగుతున్నది. సెక్యులర్ నేరేటివ్స్ ఇటీవలి కాలంలో చాలా ముందుకొచ్చాయి. ప్రాంతము, కులము, మతము రాజకీయ సింబాలిజమ్లో భాగమవుతున్న తరుణాన మిగిలిన చాలా సాంస్కృతిక అంశాల మాదిరే ఇది కూడా విభిన్న భాష్యాలకు నెలవుగా మారింది. సంప్రదాయం ప్రకారం ఇది స్ర్తీలు మాత్రమే ఆడే పండుగ. ఇపుడు రూపం మారుతున్నది.

ఫొటో సోర్స్, Getty Images
బతుకమ్మ వేరు బోనాలు వేరు. సీపీఎం నాయకులు ఏ కారణంతో బతుకమ్మలు నెత్తికెత్తుకున్నప్పటికీ తెలంగాణలో ఇపుడు సాగుతున్న ఉత్సవం బోనాలు. బతుకమ్మ కాదు. బోనం అంటే నైఘంటికార్థం భోజనం. ఈ సందర్భంలో అది నైవేద్యం. ప్రస్తుతం హైదరాబాద్లో మహంకాళీ బోనాలు సాగుతున్నవి. అంటే మహంకాళిని ఉద్దేశించి హిందూ భక్తులు నైవేద్యం అర్పిస్తూ చేసే పూజాసంప్రదాయం అని చెప్పుకోవచ్చు.
సీతారాం ఏచూరి బతుకమ్మను తలకెత్తుకుని ఊరేగింపులో పాల్గొనడంతో పాటుగా అమ్మవారి నైవేద్యం అని భక్తులు భావించే బోనం కూడా నెత్తికెత్తుకున్నారు. పూలతో కనిపిస్తున్నది బతుకమ్మ. నెత్తిమీద కుండతో కనిపిస్తున్నది బోనం.
ఎంత జనాన్ని ఆకట్టుకోవడం అవసరమైతే మాత్రం కమ్యూనిస్టు పార్టీ నేతలు మరీ ఈ స్థాయికి వెళతారా అనేరీతిన విమర్శలు వచ్చాయి. ఈ వివాదంపైన స్పందించేందుకు సీతారం ఏచూరి అందుబాటులో లేరు. అయితే ఈ వ్యవహారాన్ని తెలంగాణ సాంస్కృతిక కోణంలోంచి మాత్రమే చూడాలని, మతకోణం లోంచి ఆధ్యాత్మిక కోణంలోంచి చూడరాదని ఏచూరికి సన్నిహితులైన సీపీఎం నేతలు చెపుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కల్వకుంట్ల కవిత: 'ఆంధ్రప్రదేశ్లోనూ బతుకమ్మ ఆడుతా'
- బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. ఒకే వేదికపై 30 వేల బతుకమ్మలు
- BBC Special: బోనాల్లో 'రంగం' చెప్పే మాతంగి స్వర్ణలత ఎవరు?
- హైకోర్టు విభజన ఇంకెంత దూరం?
- తెలంగాణలో కొత్త జోన్లతో కొలువులొచ్చేనా?
- అభిప్రాయం: సమ న్యాయం జరిగేలా స్థానికతను నిర్వచించాలి
- ప్రపంచంలో ‘పవిత్రమైన’ ఏడు మొక్కలు
- తిరుమలలో తన మతం గురించి సోనియా ఏం చెప్పారు?
- ప్రాణాలు నిలుపుకోడానికి.. మతం మారుతున్నారు!
- వియత్నాం హిందువులు : ఒకప్పుడు రాజ్యాలు ఏలారు.. ఇప్పుడు కనుమరుగవుతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








