ఈ కులం ఏంటి? ఈ మతం ఏంటి? వీటిని వదిలేసుకుంటే పోలా.. అని మీకెప్పుడైనా అనిపించిందా?

వీడియో క్యాప్షన్, ఈ కులం ఏంటి? ఈ మతం ఏంటి? వీటిని వదిలేసుకుంటే పోలా.. అని మీకెప్పుడైనా అనిపించిందా?

బీఎస్ఎన్ మల్లేశ్వర రావు, బీబీసీ ప్రతినిధి

సబ్సిడీలు వదులుకోండి.. రాయితీలు వదులుకోండి.. అంటూ ప్రచారం చేసే ప్రభుత్వం 'కులాన్ని వదులుకోండి, మతాన్ని వదులుకోండి' అని ఎందుకు ప్రచారం చేయదు? వదులుకున్న వాళ్లకు గుర్తింపు ఎందుకివ్వదు? మీరెప్పుడైనా ఆలోచించారా? అలా ఆలోచించిన హైదరాబాదీ దంపతులు ఇపుడు కోర్టులో పోరాడుతున్నారు.

ప్రభుత్వ అప్లికేషన్స్‌లో, స్కూల్ అడ్మిషన్స్ ఫారాల్లో కులం లేదు, మతం లేదు అనే కాలమ్ లేకపోవడం ఏంటి? కులాన్ని మతాన్ని వదిలేసుకోవాలనుకునే వారికి ఛాయిస్ ఉండాలి కదా! అనేది ఆయన పోరాటపు సారాంశం.

ఈయన పేరు దువ్వూరి వెంకట రామకృష్ణారావు. వేంకటేశ్వర స్వామి, రాముడు, శ్రీకృష్ణుడు వంటి హిందూ దేవుళ్ల పేర్లు కలిగిన ఈయన పుట్టుకతో బ్రాహ్మణుడు.

ఇద్దరు కూతుళ్లతో రామక‌ృష్ణా రావు

ఫొటో సోర్స్, D Ramakrishna Rao

ఫొటో క్యాప్షన్, తనకు పుట్టిన ఇద్దరు అమ్మాయిలకు ఏ మతంతోనూ సంబంధం లేకుండా సహజ, స్పందన అని పేర్లు పెట్టారు

అయితే, అటు కులాన్ని, ఇటు మతాన్ని వదిలేసుకుని బతకాలని కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నారు. ఆయన భార్య సలాది క్లారెన్స్ క‌ృపారాణి.

తమకు పుట్టిన ఇద్దరు అమ్మాయిలకు ఏ మతంతోనూ సంబంధం లేకుండా సహజ, స్పందన అని పేర్లు పెట్టారు.

ఆదర్శంగా ఉండాలని మైనార్టీ తీరే వరకూ ఏ కులం, మతం లేకుండా పిల్లల్ని పెంచాలని నిర్ణయించుకున్నారు.

కానీ, వారి ఆదర్శాలకు ప్రభుత్వ నిబంధనలు అడ్డొచ్చాయి.

కూతురి స్కూల్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే 'మీ కులం, మతం ఏంటో రాయండి' అని స్కూల్‌ వాళ్లు పట్టుబట్టారు.

'నాకు ఏ కులమూ లేదు. ఏ మతమూ లేదు' అని రామకృష్ణారావు చెప్పినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదో ఒక కులం, మతం రాయాల్సిందేనని స్పష్టం చేశారు.

రామక‌ృష్ణారావు కుటుంబం సెల్ఫీ

ఫొటో సోర్స్, D Ramakrishna Rao

ఫొటో క్యాప్షన్, ‘మా ఇంట్లో ఏ మతాన్నీ ఆచరించం. కానీ, నా పిల్లలు అన్ని మతాల గురించి తెలుసుకుంటారు. తర్వాత వాళ్లకు నచ్చిన మతాన్ని ఎంచుకుంటారు’

బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్లు, స్కూల్ అడ్మిషన్‌ ఫారమ్‌లు, స్కూల్‌ లీవింగ్ సర్టిఫికెట్లు, రేషన్ కార్డులు, ఎంప్లాయ్‌మెంట్ అప్లికేషన్లు, ఫ్యామిలీ సర్టిఫికెట్లకు కులం, మతం వివరాలు చెప్పాల్సి వస్తోంది.

ఆధార్ కార్డు, ఓటరు కార్డు పొందేందుకు మాత్రం అవి అక్కర్లేదు.

ప్రస్తుతం మతం అనే ఆప్షన్ కింద మన దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధం, జైన్, ఇతరులు మాత్రమే ఉన్నాయి. నాస్తికులం అని చెప్పుకునే అవకాశం లేదు.

''ఆరు మతాల్లో ఏదో ఒకటి ఎంచుకోకుంటే.. ఇవేమీ కాని మరో మతం 'ఇతరులు' అనేది ఎంచుకోవాల్సి వస్తోంది. అంతే తప్ప 'నాకు మతం లేదు' అని చెప్పుకునేందుకు అవకాశమే లేదా?'' అని రామకృష్ణారావు తొలుత పాఠశాల యాజమాన్యాన్ని, తర్వాత డీఈఓను, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

వాళ్లెవ్వరూ స్పందించకపోవటంతో కేంద్ర మానవ వనరుల శాఖ, జాతీయ జన గణన విభాగం దృష్టికి కూడా తీసుకెళ్లారు. వాళ్లేమో ఇది రాష్ట్ర సమస్య అని సమాధానం ఇచ్చారు.

తన కుటుంబ సభ్యులతో రామకృష్ణా రావు

ఫొటో సోర్స్, D Ramakrishna Rao

ఫొటో క్యాప్షన్, మీరెప్పుడైనా గమనించారా? జనాభా లెక్కల సర్వే చేసేప్పుడు కుటుంబ యజమాని కులం, మతం ఏంటని అడుగుతారే తప్ప.. ఇంట్లో కుటుంబ సభ్యుల కులం, మతం గురించి అడగరు

ఎవ్వరూ దీన్ని పరిష్కరించకపోవటంతో భార్యాభర్తలిద్దరూ హైకోర్టులో కేసు వేశారు.

రామకృష్ణారావు దంపతుల వాదనల్లో మెరిట్‌ ఉందని గుర్తించిన హైకోర్టు ఆయనకు న్యాయం చేసింది. మతాన్ని వెల్లడించలేదన్న కారణంతో స్కూల్‌ అడ్మిషన్‌ తిరస్కరించకూడదని 2010లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

కానీ, నాలుగేళ్ల తర్వాత రామకృష్ణారావు మరో కూతురికి కూడా ఇదే సమస్య తలెత్తింది. దీంతో మళ్లీ ఆయన హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.

తనది మాత్రమే కాదని, తనలాంటి వాళ్లందరి సమస్యను పరిష్కరించాలని కోరారు. దానిపై విచారణ జరుగుతోంది. తెలంగాణ టీచర్ల సంఘం కూడా పిటిషన్‌ వేసి ఈ కేసులో భాగస్వామి అయ్యింది.

ఐదు ప్రధాన మతాల గుర్తులు

ఫొటో సోర్స్, iStock

ఫొటో క్యాప్షన్, మన దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధం, జైన్, ఇతరులు మాత్రమే ఉన్నాయి. నాస్తికులం అని చెప్పుకునే అవకాశం లేదు

మూడేళ్ల కిందట బాంబే హైకోర్టు ఒక కేసులో చారిత్రక తీర్పు ఇచ్చింది.

''..మతం ఏంటో చెప్పాలని ఎవరినీ బలవంతం చేయొద్దు. తమకు ఏ మతమూ లేదని చెప్పే హక్కు ప్రజలకు.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ప్రకారం ఉంటుంది'' అని పేర్కొంది.

కానీ, అనేక ప్రభుత్వ దరఖాస్తుల్లో మతం లేదు అని చెప్పుకునే అవకాశం ఇప్పటికీ లభించలేదు. పండిట్ నెహ్రూ వంటి అజ్ఞేయవాది ప్రథమ ప్రధానిగా పనిచేసిన దేశంలో మాకు కులం లేదు, మతం లేదు అని చెప్పుకునే అవకాశం ప్రభుత్వాలు ఇవ్వకపోవడం అన్యాయమని రామక్రిష్ణారావు లాంటి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)