కరోనావైరస్: ‘హీరో’ల నిర్వచనాన్ని ఈ మహమ్మారి మార్చేస్తుందా?

కోవిడ్-19 ప్రపంచ మొత్తాన్నీ కబళించాలని తపనపడుతున్న ఒక విలన్ కావచ్చు. కానీ, దాని పీచమణిచే శూరులు లేకపోలేదు.
హీరో అనే భావన ఇప్పుడు అంతర్జాతీయంగా మారుమోగుతోంది. బ్రిటన్‌లో విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్.. కరోనా మీద పోరులో ముందు వరుసలోని ‘ధీరోదాత్తులైన’ సిబ్బంది గురించి మాట్లాడారు. రేడియో ప్రకటనల్లో మన వైద్య సిబ్బంది ‘హీరో’లకు మద్దతుగా బాజా మోగిస్తున్నాయి.
థాయ్‌లాండ్‌లో కళాకారులు ‘మన హీరోలకు మద్దతివ్వండి’ అంటూ ఆన్‌లైన్ ఉద్యమం మొదలుపెట్టారు.
అమెరికాలో డెమొక్రాట్ పార్టీ వాళ్లు అత్యవసర కార్మికులకు అధిక వేతనాలు చెల్లించటానికి ‘హరోస్ ఫండ్’ అనే పేరుతో ఒక పథకాన్ని ప్రతిపాదించారు.
కాలిఫోర్నియాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫిలిప్ జింబార్డోకు కొత్త ఆలోచన వచ్చింది. ‘స్టాన్‌ఫర్డ్ జైలు ప్రయోగం’తో పేరు సంపాదించుకున్న సైకాలజిస్ట్ ఆయన.
ఆ ప్రయోగంలో ఓ నమూనా జైలును తయారు చేసి అందులో విద్యార్థులకు ఖైదీలు, జైలు వార్డెన్ల పాత్రలు ఇచ్చారు. విద్యార్థులు తమ పాత్రల్లో మరీ లీనమవటంతో ఆ ప్రయోగాన్ని అర్థంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది.
దాంతో, చెడు స్వభావం గురించి చాలా పట్టున్న సైకాలజిస్ట్‌గా జింబార్డో కీర్తిగడించారు. ఇటీవలి కాలంలో ఆ దుష్ట స్వభావానికి పూర్తిగా వ్యతిరేకమైన అంశం మీద ఆయన దృష్టి పెట్టారు. ఆ అంశమే ‘హీరోయిజం’. ఇది.. ‘హీరో స్టడీస్’ అని వ్యవహరిస్తున్న మనస్తత్వ అధ్యయన విభాగానికి పురుడు పోసింది.
‘‘ఈ అంశాన్ని గతంలో మరింత లోతుగా ఎందుకు పట్టించుకోలేదో నాకు తెలియదు. అసలు మానవ స్వభావంలో అత్యుత్తమ లక్షణం హీరోయిజమే. మనమందరం కాంక్షించగల ఆదర్శమిది. ‘హీరో’ పదాన్ని ఉపయోగించటంలో అతిశయోక్తి ఉందనేది నిజమే. ఈ రోజుల్లో హీరోలు అంటే సెలబ్రటీలు అనుకుంటున్నారు. ఇప్పుడు హీరో అనే భావన పలుచబడి ఉండొచ్చు. ఉదాహరణకు, పొరిగింటి వారి కోసం కూరగాయలు కొనితెచ్చే వారికి కూడా ఈ మాటను అన్వయిస్తున్నారు. కానీ, అది సేవాతత్వం, మంచితనం. ప్రస్తుత కోవిడ్ సంక్షోభం - హీరోయిజం అనే దానికి మరింత కచ్చితమైన భావనలను వెలుగులోకి తెస్తుందని నేను అనుకుంటున్నా’’ అని జింబార్డో చెప్పారు.

‘‘మానవ అస్తిత్వంలో కాంతి పుంజం’’
ధీరోదాత్త చర్యలకు తన సొంత నిర్వచనం విషయంలో జింబార్డో చాలా నిక్కచ్చిగా ఉంటారు. అపరిచితుల కోసం, తనకు కొంత ప్రమాదం ఉన్నా – కేవలం తన శరీర అవయవానికో, తన ప్రాణానికో కాదు - తన కుటుంబానికి, తన కెరీర్‌కు తన సామాజిక స్థానానికి కూడా ప్రమాదమున్నా కూడా ముందడుగు వేయటమే హీరోయిజం అని ఆయన భావిస్తారు.
అధికార వ్యవస్థలు పాల్పడే తప్పులను బహిర్గతం చేసేవారు హీరో కావచ్చు. అలాగే వృత్తినిపుణులు – సాధారణ వ్యక్తుల మధ్య కూడా ఆయన స్పష్టమైన విభజన రేఖ గీస్తారు: ఒక అగ్నిమాపక సిబ్బంది కాలుతున్న భవనంలో చిక్కుకున్న ఓ చిన్నారిని కాపాడితే అది వారి బాధ్యతను నిర్వర్తించటం. అదే పని అటుగా వెళుతున్న సాధారణ పాదచారి చేస్తే అది హీరోయిజం.
ఇదే తరహాలో.. అమెరికాలో పారిశ్రామికవేత్త ఆండ్రూ కార్నెగీ 1904లో నెలకొల్పిన కార్నెగీ మెడల్.. అసాధారణ ధీరోదాత్తత ప్రదర్శించే సాధారణ పౌరులకు అందిస్తారు కానీ విధి నిర్వహణలో భాగంగా అలాంటి పనులు చేసే వారు ఈ మెడల్‌కు అర్హులు కాదని దాని విధివిధానాలు స్పష్టం చేస్తున్నాయి.
మరి కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న వైద్య సిబ్బంది సంగతేమిటి?
‘‘నిఖార్సైన హీరోయిజం అంటే ఏమిటి అనే విషయం గురించి మనం ఆలోచించేలా ఈ పరిస్థితి పురిగొల్పుతోందని నేను అనుకుంటున్నా’’ అని జింబార్డో పేర్కొన్నారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

‘‘సాధారణంగా.. తమ జీవితాంతం ఒక ఆదర్శానికి అంకితమై జీవించిన వారిని – మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి వారిని – హీరోలుగా అభివర్ణిస్తుంటాం. లేదంటే ఏదో ఒక్క ధీరోదాత్తమైన పని చేసిన వారిని హీరోలుగా పరిగణిస్తుంటాం. ఈ గొప్ప గౌరవ బిరుదును తమ జీవితాలను నిజంగా పణం పెడుతున్న మరింత ఎక్కువ మందికి ఇవ్వటానికి మనం సిద్ధంగా ఉండాలని ఇప్పుడు గుర్తిస్తున్నామేమో.
ముఖ్యంగా ఇప్పుడు వైద్య సిబ్బంది చేస్తున్నది ఇదేనన్నది స్పష్టం. ఇటువంటి ముప్పు వారి విధి నిర్వహణ వివరాల్లో ఎప్పుడూ లేదు. ఇంకా చెప్పాలంటే వారు ప్రతి రోజూ తమ జీవితాలను పణంగా పెడుతున్నారు. అది చాలా గొప్ప హీరోయిజం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, హీరోయిజం వెనుక ఉండేదేమిటి అనేది ఇప్పటికీ పెద్దగా తెలియదు. ఇందులో వ్యక్తిత్వం అనేది ఒక అంశమని ఫిలడెల్ఫియాలోని టెంపుల్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్ ఫ్రాంక్ ఫార్లే చెప్పారు. ఆయన.. విపరీత ప్రవర్తనల మీద పట్టున్న నిపుణుడు.
ధీరోదాత్తమైన పనులు ఒక వ్యక్తి తన ప్రతిష్టను కాపాడుకోవాలన్న వాంఛతో పుట్టుకొచ్చే పనులు కావచ్చు. బలమైన అతి ఆత్మవిశ్వాసం కావచ్చు. బహుశా ‘థ్రిల్ (ఉద్విగ్నత) కోరుకునే తత్వం– టి-వ్యక్తిత్వం అంటారాయన – కూడా కావచ్చు.
ఆస్పత్రుల్లో పనిచేసే జనం జబ్బును ఎంతగా నయం చేస్తున్నారో, అంతగా తమ ప్రాణాలని రిస్కు చేస్తున్నారనే కోణంలో మనం ఆలోచించం. కానీ, ఈ తరహా లక్షణాలు వైద్య సిబ్బందిలో కనిపిస్తాయి. అసలు ప్రమాదానికి దూరంగా ఉండాలనుకునే వారు ఐసీయూ విధుల్లోనే చేరరు’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘అయినప్పటికీ, వైద్య సిబ్బంది ప్రవర్తన వెనుక కారణం చాలా అస్పష్టంగా ఉంటుంది. నేను కొన్నేళ్లుగా హీరోయిజం గురించి అధ్యయనం చేస్తున్నాను. అది అర్థమైందని ఇప్పటికీ చెప్పలేను. అదో విశిష్టమైన లక్షణం. మానవ అస్తిత్వంలో ఓ కాంతి పుంజం’’ అని అభివర్ణించారు ఫార్లే.

‘‘మన మనస్తత్వాన్ని అధిగమించడం’’
హీరోలు అరుదుగానే ఉంటారు. కానీ, ధీరోదాత్తంగా ప్రవర్తించటానికి సింసిద్ధం కావడాన్నినేర్పించవచ్చునని జింబార్డో అంటారు. ఆయన స్థాపించిన ‘హీరోయిక్ ఇమాజినేషన్ ప్రాజెక్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ 12 దేశాల్లో ప్రాథమికోన్నత పాఠశాల వయసు విద్యార్థులతో కలిసి పనిచేస్తోంది. కొందరు ధీరోదాత్తంగా ప్రవర్తిస్తే మరికొందరు ఎందుకు ప్రవర్తించరనేది ఇంకా మెరుగ్గా అర్థం చేసుకోవటానికి వారి మానవ మనస్తత్వం గురించి అవగాహన అందిస్తోంది.
అంటే, ఏదైనా సమస్యను ఎవరో ఒకరు చూసుకుంటారని భావించటం, ఎవరైనా కష్టాల్లో ఉంటే అది వారికి తగినదే అని భావించటం వంటి అంశాలూ ఇందులో ఉన్నాయి. మనతోటి వారి తీరు, మూక ప్రవర్తనలు కూడా మన మీద ఎలా ప్రభావం చూపుతాయనేదీ ఉంది. మనకు పెద్దగా సంబంధం లేని వారికి సాయం చేయటానికి మనం తక్కువగా మొగ్గు చూపుతామనే విషయమూ ఉంది.
హీరో కన్‌స్ట్రక్షన్ కంపెనీ వ్యవస్థాపకుడు మాట్ లాంగ్డన్ కూడా, హీరోయిజాన్ని బోధించే ఆలోచన మీద దృష్టి సారించారు. ఇటువంటి ఆలోచనలను సంస్థల సమావేశాలకూ, తరగతి గదుల్లోకీ ఆ సంస్థ తీసుకెళుతోంది. ఫోర్డ్, రియల్ ఎస్టేట్ వన్, హీరో రౌండ్ టేబుల్ వంటివి వీటిలో ఉన్నాయి.
అయితే, హీరోల గురించి మన ఆలోచనలు కూడా చాలా గందరగోళంగా ఉంటాయని లాంగ్డన్ చెప్తారు. హీరోలు స్వచ్ఛంగా ఉండాలని మనం భావిస్తాం. ‘‘గత ఏడాది చివర్లో ఒక ఉగ్రవాదిని ఓ నార్వాల్ తిమింగలం కొమ్ముతో ఎదుర్కొన్న ఒక వ్యక్తి.. ఒక హత్య కేసులో దోషిగా నిర్ధారితుడయ్యాడు. అదెలా సాధ్యమని మనం అనకుంటాం’’ అని ఆయన ఉదహరించారు.
‘‘హీరోయిజం అనేది పరిస్థితులను బట్టి ఉంటుంది. హీరోను పిలిచేది ఆ పరిస్థితి. ఆ పరిస్థితిని హీరో సృష్టించడు. ధీరోదాత్తంగా వ్యవహరించే ఆ అవకాశం ఒక జీవితకాలంలో దొరక్కపోవచ్చు’’ అని వివరించారు లాంగ్డన్.
‘‘హీరోలు ప్రత్యేకమైన మనుషులు కాదు. కానీ ఇతరులు రంగంలోకి దిగకుండా అడ్డుకునే మనస్తత్వాన్ని అధిగమించి వస్తారు వాళ్లు. అయితే ఇప్పుడు హీరోయిజాన్ని పునర్నిర్వచించే అవకాశం – అది ప్రతి రోజూ ఉంటుందని చెప్పగలిగే అవకాశం మనకు వచ్చింది. నర్సులను జనం ఏవో కల్పిత పాత్రలుగా చూడరు. హీరోయిజాన్ని మనం చాలా భిన్నంగా చేసేందుకు ఈ మహమ్మారి వీలు కల్పించవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు.
కరోనావైరస్ మహమ్మారి చూపే సానుకూల ప్రభావాల్లో, నిజమైన హీరోయిజాన్ని గుర్తించే సామర్థ్యం ఒకటని ఫిలిప్ జింబార్డో అంగీకరిస్తారు. ఇది పరిస్థితులను మెరుగుపరచవచ్చునని ఆయనంటారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- అధికారం పదిలం చేసుకోవడానికి కరోనాను వాడుకుంటున్నారా
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- హోక్కైడో: లాక్ డౌన్ ఎత్తేశాక మళ్లీ మొదలైన కరోనా కేసులు.. జపాన్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి?
- "నా హౌస్‌మేట్ సామాజిక దూరం పాటించడంలేదు, అర్ధరాత్రి వేరేవాళ్లను తీసుకొస్తున్నాడు"
- కరోనావైరస్: ఈ వ్యాధి చికిత్సకు క్లోరోక్విన్ పనిచేస్తుందా.. అందుకు ఆధారాలు ఉన్నాయా
- కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- కరోనావైరస్: కోవిడ్-19 రోగి చనిపోతే అంత్యక్రియలు ఎలా చేయాలి?
- ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








