దిల్లీ హింసాత్మక దాడులతో ఆగిన పెళ్లి... కరోనా మహమ్మారి భయం నీడలో ఇలా జరిగింది

ఫొటో సోర్స్, chinki/BBC
- రచయిత, చింకీ సిన్హా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది జూన్ 7, గులిస్తా షేక్ గులాబీ రంగు గోడలున్న తన గదిలో కూర్చుని ఉంది. చిన్ననాటి స్నేహితురాలు ఆయేషా ఆమె కళ్లకు ఐ-షేడ్ వేస్తోంది. గులిస్తా చేతుల్లో చిన్న అద్దం ఉంది. ఆ రాత్రి ఆమె పెళ్లి.
కానీ, మొదటి అంతస్తులో ఆకుపచ్చ టైల్స్ తో ఉన్న ఆ గది గురించి మీకు ఇంతకు ముందే తెలుసు. గులాబీ గోడలున్న ఆ గది గురించి కొంతకాలం క్రితం జరిగిన సంభాషణ మీకు గుర్తుండే ఉంటుంది.
ఈశాన్య దిల్లీలో ఉన్న ఈద్గా శరణార్థుల శిబిరాన్ని వడగళ్ల వర్షం ధ్వంసం చేసినపుడు గులిస్తా షేక్ సిద్దిఖీ నవంబర్‌లో జరగబోతున్న తన పెళ్లి గురించి చెప్పింది.
ఫిబ్రవరిలో హింస చెలరేగినప్పుడు, శివ విహార్‌లోని చాలా ఇళ్లలో జరిగినట్లు తమ ఇంట్లో దోచుకోకుండా ఉండే బావుండునని అప్పుడు ఆమె కోరుకుంది.
తన గదిలో గోడలకు గులాబీ రంగు వేశామని, పెళ్లికి తనకు, వరుడికి పెట్టాల్సిన బంగారం, బట్టలు, మిగతా వస్తువులను తండ్రి చాలా ఏళ్లుగా కూడబెట్టాడని చెప్పింది.
ఆ సమయంలో వారు హింస వల్ల నిరాశ్రయులైన వారితో కలిసి ఈద్గా శరణార్థి శిబిరంలో ఉన్నారు. ఫిబ్రవరి 25న హింసాత్మక ఘటనల్లో ఎంతోమంది చనిపోయారు. అవి చెలరేగిన తర్వాత వారు తిరిగి ఇంటికి రాలేదు.
తన పెళ్లి గురించి ఆమె మాట్లాడిన ఆ రోజు మార్చి 14. ఆ సమయంలో వారు తిరిగి ఇంటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.
వారి ఇరుగుపొరుగు ఇళ్లన్నీ చూస్తుంటే యుగాంతంలో సన్నివేశంలా ఉంది. కనుచూపు మేరలో కాలిపోయిన భవనాలు ఇంకా కనిపిస్తున్నాయి. న్యాయం కోసం, పరిహారం కోసం వారు ఇప్పటికీ ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు.
గులిస్తా కుటుంబం మే 22న తిరిగి తమ ఇంటికి వచ్చింది. జూన్ 7న ఆమె పెళ్లి ఖరారైంది.
గత ఏడాది నవంబర్‌లో ఆమెను పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి, అల్లర్లలో ఆమె అన్నీ పోగొట్టుకుందేమో అని ఈ ఏడాది వివాహాన్ని రద్దు చేసుకున్నాడు.
అలా సంబంధాలు తెంచుకుంటే అక్కడ సమాజంలో పరువు పోతుంది. దాంతో తండ్రి ఆమెకు వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని మరో వరుడిని వెతికారు.
పెళ్లి ఆగిపోతే ఆ ప్రాంతాల్లో వారు దానిని ఒక మచ్చలా భావిస్తారు. అందుకే త్వరగా ఒక వరుడిని వెతికి, అందరికీ విందు ఇచ్చేయాలి.

ఫొటో సోర్స్, chinki/BBC
ఆ ప్రాంతాల్లో ఈమధ్య చాలా పెళ్లిళ్లు జరుగుతున్నాయని వారు చెబుతున్నారు. సంబంధాలు వెతకడం, పెళ్లి చేసేయడం అంతా వారంలో జరిగిపోతోంది. లాక్‌డౌన్ రెండేళ్లపాటు కొనసాగుతుందేమో అని స్థానికులు భయపడుతున్నారు. మిగతా సమయాలతో పోలిస్తే కరోనా కాలంలో వివాహాల ఖర్చు కూడా తక్కువే అవుతోంది. పెళ్లిళ్లకు అతిథులను కూడా 50 మందినే అనుమతిస్తున్నారు.
“నేను పెళ్లయ్యాక ప్రేమలో పడతానేమో, ఇప్పుడు నేను ఒక గృహిణిగానే ఉంటాను” అంటుంది గులిస్తా. ఆమె వయసు 22, ఆ గదిలో ఒక అరలో ఒక చిన్న ట్రోఫీ ఉంది. నాలుగో తరగతిలో క్లాస్ ఫస్ట్ రావడంతో ఆమెకు దానిని ఇచ్చారు. ఆమె దాన్ని తన కొత్త ఇంటికి తీసుకెళ్లడం లేదు. అది అక్కడే ఉంటుంది.
ఆమె అక్క 24 ఏళ్ల షగుఫ్తా స్కూల్లో గులిస్తా బాగా చదివేదని చెప్పారు. ఇద్దరూ ఒక స్థానిక స్కూలుకు వెళ్లేవారు. షగుప్తా ఏడో తరగతిలోనే చదువు మానేసింది. తల్లి అనారోగ్యంతో చనిపోవడంతో, అక్కచెల్లెళ్లు ఇద్దరూ ఇల్లు చూసుకోవాల్సి వచ్చింది. అప్పుడు వారు పక్క సందులో ఉన్న ఒక చిన్న ఇంట్లో ఉండేవారు. ఈ ఇంటిని గత ఏడాది కొనుగోలు చేసి అందులోకి వచ్చారు.
“గులిస్తా అత్తవారిల్లు ఇలా ఉండదు. కానీ, ఆడపిల్ల చివరకు ఎక్కడికెళ్లాలో అక్కడికి వెళ్లక తప్పదు కదా అని మా నాన్న అంటారు” అని షగుఫ్తా చెప్పారు.
గులిస్తా 12వ తరగతి వరకూ చదివింది. తర్వాత చదువు మాన్పించారు. ఆమె పై చదువులు చదివి, టీచర్ కావాలనుకుంది. కానీ షగుఫ్తాకు పెళ్లైపోవడంతో, తర్వాత ఆమే ఇల్లు చూసుకోవాల్సి వచ్చింది. తల్లి 11 ఏళ్ల క్రితమే చనిపోవడంతో నలుగురు పిల్లలనూ తండ్రి పెంచి పెద్ద చేశాడు.

ఫొటో సోర్స్, chinki/BBC
గులిస్తా తండ్రి షంసూల్ సిద్దిఖీ దియోబంద్, అలీఘర్‌లో చదివారు. ఎన్నో కలలు కన్నారు. కానీ అన్నీ ఛిద్రం అయిపోయాయి. తర్వాత ఆయన ట్యూషన్లు చెప్పుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఫిబ్రవరిలో అల్లర్లు జరిగినపుడు, ఇంటి నుంచి పారిపోయి వారు వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్నారు. ఆ అల్లర్లలో ఘోరంగా ధ్వంసమైన ప్రాంతాల్లో శివ్ విహార్ ఒకటి. దాంతో ఈ కుటుంబం చివరికి ఈద్గా కాంప్ చేరింది. ప్రధాని జనతా కర్ఫ్యూ ప్రకటించినపుడు దాన్ని హఠాత్తుగా మూసేయడంతో ఈ కుటుంబం ఒక మదరసాలో గడిపింది. చివరికి ఈద్ తరవాత తిరిగి ఇంటికి వచ్చింది.
ఆ సమయంలో సాయంకోసం గులిస్తా, ఆమె సోదరుడు ఎన్నో వారాలపాటు జర్నలిస్టులకు, స్వచ్ఛంద సంస్థలకు ఫోన్లు చేశారు. తండ్రి ఏళ్ల తరబడి కూడబెట్టినదంతా అల్లర్లలో దోచేయడంతో తండ్రికి కట్నం కోసం యినా సాయం చేయాలనుకున్నారు.
షగుఫ్తా నీలి లెహంగా బయటకు తీసింది. దానిపై గులాబీ చమ్కీలతో పువ్వులు కుడుతున్నారు. గులిస్తాకు అలాంటిదే ఆకుపచ్చది తెచ్చారు. కానీ తను వరుడి కుటుంబం పంపించిన గులాబీ వివాహ దుస్తులనే ధరించాల్సి ఉంటుందని చెప్పింది.
మహమ్మారితో లాక్‌డౌన్ ఉండడం వల్ల పెళ్లికి ఎక్కువ మంది అతిథులు వస్తారని ఆమె అనుకోవడం లేదు. గులిస్తా మాస్క్ ధరించడం లేదు. అది వేసుకుంటే బాగుండదేమో అని చెప్పింది.
షగుఫ్తా రెడీ కావడానికి 23 ఏళ్ల రుఖ్సర్ సాయం చేస్తోంది. వారిద్దరూ కలిసే పెరిగారు. ఆమె తండ్రి రోజు కూలీకి పనిచేస్తాడు. వారు ఐదుగురు అక్కచెల్లెళ్లు.
“ఇప్పుడు చాలా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మా నాన్న నా కోసం కూడా సంబంధం చూశారు. నగరంలో ఈ ప్రాంతంలో ఉన్న అమ్మాయిలు ప్రేమలో పడరు” అని రుఖ్సర్ చెప్పింది.
ఆమె ఒక స్థానిక సెలూన్‌లో బ్యూటీషియన్‌గా శిక్షణ తీసుకుంది. తన స్నేహితురాలు షగుఫ్తాను రెడీ చేసిన తర్వాత ఆమె తన మెరూన్ గౌన్ వేసుకోబోతోంది.
“మేం పేదలం. ఈ లాక్ డౌన్ తర్వాత జీవనం ఇంకా కష్టంగా మారింది. బహుశా నా పెళ్లైపోయాక అయినా మా నాన్నకు భారం కాస్త తగ్గుతుందేమో” అంది

ఫొటో సోర్స్, chinki/BBC
పక్కనే ఉన్న మరో వరుసలో రాజ్ అనే ఒక యువకుడికి అదే సాయంత్రం నిశ్చితార్థం జరుగుతోంది. అతడు ఒక సామాజిక కార్యకర్తగా పనిచేసేవాడు. శివ్ విహార్‌లో తన తల్లి, సోదరులతో ఉంటాడు. కానీ హింస జరుగుతున్నప్పుడు వారు తమ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. వాళ్లు ఇంకా అక్కడికి తిరిగి రాలేదు. దగ్గరే ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ సాయంత్రం వారంతా నిశ్చితార్థం కోసం అతడి పాత ఇంటికిచేరారు. అతడి పెళ్లి జూన్ 29న జరగబోతోంది. పెళ్లి కోసం పోగు చేసినదంతా దోచేసారని అతడు కూడా చెప్పాడు.
“పాత ఇంటికి, కొత్తగా కొన్ని గదులు జోడించి మళ్లీ కట్టుకోవాలి. కానీ ఇప్పుడు మేం ఇంకా ఎదురుచూడాలి. నష్టానికి మాకు ఎలాంటి పరిహారం అందలేదు” అని రాజ్ చెప్పాడు.
కానీ జీవితం ముందుకు సాగాలి. ధ్వంసమైన అతడి ఇంట్లో ఇటుకలు కనిపిస్తున్నాయి. అతడి తల్లి పప్పీ దేవి ఒక మూల నిలుచుని చీకట్లో ఉన్న ఇంటిని చూస్తున్నారు. “పరిస్థితులు ఇకనైనా మెరుగుపడతాయేమో” అన్నారు.
ఆ వరుసల్లో చాలా ఇళ్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కోసం దరఖాస్తు చేసిన వాళ్లందరూ బయటకు వచ్చి “మీరు మాకేమైనా సాయం చేస్తారా?” అని అడుగుతున్నారు. సాయం కోసం వేడుకుంటున్నారు. కానీ కరోనా మహమ్మారి అన్నీ స్తంభించేలా చేసింది.
గులిస్తా వాళ్లున్న ఇళ్ల వరుస బయట షమీమ్ తన కూతురు గుల్ఫషాన్‌తో కూర్చుని ఉన్నారు. ఇలాంటి కారణాల వల్లే ఆమె కూతురి వివాహం కూడా రద్దయ్యింది. వాళ్లకు ఇల్లు లేదు, వస్తువులు కూడా ఏవీ లేవు, ఇవ్వడానికి కట్నం కూడా లేదు.
“ఇక్కడ చాలా పెళ్లిళ్లు ఆగిపోయాయి. కానీ మేం మా కొడుకు పెళ్లి మాత్రం రద్దు చేయలేదు” అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, chinki/BBC
వాళ్లు ధ్వంసమైన తమ ఇంటిని మళ్లీ కట్టారు. దాని కిటికీలు పాడైపోయి ఉన్నాయి. షమీమ్ కుటుంబం బట్టలు ఐరన్ చేసి జీవించేది. ఇప్పుడు అది కూడా కష్టమైపోయింది. అయినా షమీమ్ తన కొడుకు పెళ్లిని రద్దు చేయలేకపోయారు. అది జూన్ 1న వధువు ఇంట్లోనే జరిగింది.
గుల్ఫషాన్ వయసు 21, ఆమె గ్రాడ్యుయేషన్ చేస్తోంది. ఆమె తల్లిదండ్రులు మళ్లీ కొంత కట్నం కూడబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని నగలు కూడా కొనాలని షమీమ్ చెప్పారు.
వివాహాల్లో సామాజిక దూరం పాటించాలని, కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కానీ ఈ ఏడాది మొదట్లో హింస చెలరేగిన ఈ ప్రాంతంలోని ఇరుకిరుకు సందుల్లో జనం మళ్లీ సాధారణ జీవితం గడిపేందుకు తిరిగి వస్తున్నారు.
తగలబడిన ఇళ్ల గోడలపై ఇప్పటికీ అలాగే ఉన్న మసి మనకు కనిపిస్తుంది. ఒక పార్కింగ్ ప్రదేశంలో తగలబడిన కార్లు తుప్పు పట్టి ఉన్నాయి.
ఎక్కడ చూసినా జనం కనిపిస్తున్నారు. మంటలు చెలరేగడం, రక్తపాతం, కత్తులు, రాడ్లతో అల్లరిమూకల స్వైరవిహారం చూసిన వారికి కనిపించని శత్రువైన కరోనా వైరస్ పెద్దగా భయపెట్టడం లేదు. అక్కడున్న కొంతమంది ఇప్పుడు ఎంత నష్టానికైనా అలవాటు పడిపోయారు.
అన్నీ కోల్పోయినా గులిస్తా తండ్రి తన కూతురుకి ఒక సంబంధం వెతికారు. వాళ్లు మొబైల్లో ఆమెకు ఫొటో చూపించారు. వరుడు జాకీర్ హుస్సేన్ కాలేజీ దగ్గరే ఉన్న షకూర్ కి దండీలో ఉంటాడు. జబ్బు పడిన తల్లితో ఉంటున్న అతడు పెయింటర్‌గా పనిచేస్తూ నెలకు 12 వేలు సంపాదిస్తున్నాడు. గులిస్తా తండ్రి అది మంచి సంపాదనే అనుకుంటున్నారు.

ఫొటో సోర్స్, chinki/BBC
పెళ్లి రోజు రాత్రి మాస్కులు ధరించమని, సామాజిక దూరం పాటించమని ఆయన అతిథులకు చెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ ఎవరూ దానిని పట్టించుకోలేదు. వాళ్లు పాత ముస్తాఫాబాద్‌లో ఉన్న ఒక మ్యారేజ్ హాల్లో జరిగే పెళ్లి కోసం స్థానిక అధికారుల నుంచి ముందే అనుమతులు తీసుకున్నారు.
నిఖా కార్యక్రమం ఆలస్యం అవుతోంది. మౌల్వీ రాత్రి 9.30కు వచ్చారు. మ్యారేజ్ హాల్ కింది అంతస్తులో ఉన్న ఒక తాత్కాలిక వేదికపై 26 ఏళ్ల వరుడు ఫైజన్ ఖాన్ తన స్నేహితులతో కూర్చుని ఉన్నాడు. అతడి ముఖానికి అడ్డంగా పూలు కట్టారు. మెడలో 20 రూపాయల నోట్లు కుట్టిన మాల ఉంది.
అతడు తన పెళ్లి కోసమే ప్రత్యేకంగా కొనుక్కున్న మాస్క్ వేసుకుని ఉన్నాడు. దానిమీద టామ్ అండ్ జెర్రీ బొమ్మలు ప్రింట్ చేసి ఉన్నాయి.
“నేను ఈరోజు కోసం చాలా ఎదురుచూశా. ప్రతి ఒక్కరూ ఈ రోజుకోసమే ఎదురుచూస్తారు” అని ఫైజన్ చెప్పాడు.
కానీ అతడికి పెళ్లికి సిద్ధం కావడానికి నెల రోజుల సమయం కూడా దొరకలేదు. లేదంటే అతడు ఇల్లూవాకిలీ ఏర్పాటు చేసుకునే విషయంలో మరింత కష్టపడి పనిచేసుండువాడు.
గులిస్తా ఫొటో చూపించగానే, అతడికి నచ్చింది. తండ్రి చనిపోవడంతో కుటుంబాన్ని పోషించడానికి ఫైజన్ 7వ తరగతిలోనే చదువు మానేశాడు. కానీ ఆరోజు రాత్రి అలాంటి విషాదాల గురించి అతడు మాట్లాడాలనుకోవడం లేదు. అతడి తల్లి చాలారోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. కోడలి సాయం ఆమెకు ఇప్పుడు చాలా అవసరం.
అతిథులందరూ వెళ్లిపోయాక ఆ జంట పక్కపక్కనే నిలబడి, చేతులు పట్టుకుని ఫొటోలకు పోజులిచ్చింది. వారి పెళ్లి ఆల్బం, మహమ్మారి వ్యాపిస్తున్న కాలంలో ఒక జ్ఞాపకంగా, ముక్కలైన బతుకుల్లో ఒక ఆశగా మిగిలిపోనుంది.
అతడు తన నూతన వధువు కోసం ఉగరం తెచ్చాడు. వాళ్లు ఆ రాత్రి అతడి ఇంటికి వెళ్లిపోయారు. గులాబీ చెమ్కీ పూలు ఉన్న లెహెంగా ఏదైనా శుభకార్యం వచ్చేవరకూ పెట్టలోకి చేరుకుంటుంది. ఆమెకు అప్పగింతల ఆచారం తా జరగలేదు. అజి ఎందుకో ఆమెకు తెలీదు.

ఫొటో సోర్స్, chinki/BBC
ఆమె తండ్రి హాలు బయట ఉన్నారు. అక్కడ దీపాలు వెలగడం లేదు, పూలు లేవు, ఏ అలంకరణలూ లేవు. రెండు టేబుళ్లు, కుర్చీలు, అతిథుల కోసం కాస్త బిరియానీ, ఖుర్మా మాత్రం ఉన్నాయి.
“ఒక వయసొచ్చిన అమ్మాయి తండ్రి గుండెలపై భారమే. నేను తనకు వరుడిని ఎప్పటికీ వెతకలేనేమో అని భయపడ్డా. ఈ పెళ్లికి నాకు ఒకటిన్నర లక్ష ఖర్చైంది. సమయం అనుకూలంగా ఉంటే, ఈ పెళ్లిని నేను మరింత మెరుగ్గా చేసేవాడినేమో” అని ఆయన అన్నారు.
కూతురు వెళ్లిపోయాక షంసూల్ తన అప్పులు తీర్చడానికి పని చేయడం కొనసాగించాల్సి ఉంటుంది. కానీ ఆయన కూతురి కోసం కాస్త కట్నం అయినా కూడబెట్టగలిగారు. బంగారం కొనలేకపోయినా ఒక డిన్నర్ సెట్, కాస్త ఫర్నిచర్ ఇచ్చాడు. వరుడికి సూటు, బంగారం గొలుసు కూడా ఇవ్వలేదు. బహుశా ఆయన వాటిని ముందు ముందు ఇస్తాడేమో.
“నేను ఏం చేయగలనో చేశాను” అన్నాడు మ్యారేజ్ హాల్ బయట చీకట్లో దూరం నుంచి ఒక గొంతు వినిపిస్తోంది. ఎవరో ఒక ముసలావిడ “మేం ఎన్నో చావులు, శవపేటికలు చూశాం. చాలా పెళ్లిళ్లు కూడా చూశాం. ఈ వైరస్ మా జీవితాల్లోంచి ప్రేమను దూరం చేయలేదు” అన్నారు. తర్వాత అంతా మసగ్గా కనిపించింది.
తర్వాత ఉదయం ఫోన్ చేసిన గులిస్తా సోదరి అంతా బాగానే జరిగిందని చెప్పింది. గులిస్తా ఇప్పుడు తన కొత్త ఇంట్లో ఉంది. గులాబీ గోడలున్న ఆమె గది అంతా ఇప్పుడు నిశ్శబ్దం ఆవరించి ఉంది. కొన్ని పాత బట్టలు, పిన్నులు, పాత స్కూల్ బ్యాగ్, ఆ ట్రోఫీ, కొన్ని కలలను ఆమె అక్కడే వదిలేసి వెళ్లింది.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
- గృహ హింస: ‘లాక్‌డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్‌లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో ‘పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు
- ఎవరెస్ట్ ఎత్తు ఎంత? చైనా ఎందుకు మళ్లీ లెక్కిస్తోంది? 4 మీటర్ల తేడా ఎందుకు వచ్చింది?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?కరోనావైరస్: సౌదీ అరేబియా ఎప్పుడూ లేనంత కష్టాల్లో కూరుకుపోయిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








