దిల్లీ హింస: పిల్లలకు పాలు తేవడానికి వెళ్లాడు, శవమై వచ్చాడు

దిల్లీ హింస
    • రచయిత, చింకీ సిన్హా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీలోని జాఫ్రాబాద్ స్ట్రీట్ నెంబర్ 37లో ఆ ఇంటి ముందు ఓ యువకుడి అంతిమయాత్రకు మహిళలు, పురుషులు పెద్దసంఖ్యలో అక్కడకి చేరుకున్నారు. ఓ ఇంట్లో గది లోపల ఆ యువకుడి మృతదేహం ఉంది.

ఇంట్లోని పిల్లలకు పాలు తీసుకురావడానికి బయటకు వెళ్లాడు మహమ్మద్ ఇర్ఫాన్. కానీ, మూడు రోజుల తర్వాత అతడి శవం జాఫ్రాబాద్‌లోని ఇంటికి చేరింది. ఇర్ఫాన్ మృతదేహాన్ని కర్తార్ నగర్‌లోని అతడి ఇంటికి తీసుకెళ్తే అక్కడ మళ్లీ హింస చెలరేగే ప్రమాదముందని పోలీసులు ఇర్ఫాన్ కుటుంబానికి సూచించారు.

News image

"అతడి ముఖం చూడండి, అతడి ముఖంలో ఏదో మెరుపు ఉన్నట్లు లేదూ" అని అక్కడే ఉన్న ఓ మహిళ వ్యాఖ్యానించారు.

అక్కడున్న వారంతా మౌనంగా ఉన్నారు. అతడి ఫొటో తీయమని వెనక నుంచి నన్ను ఓ వ్యక్తి అడిగారు.

"అతడిని ఏం చేశారో మీరే చూడండి, ఓ కత్తితో అతడిపై దాడికి దిగారు" అని ఆ వ్యక్తి నాతో అన్నారు.

అతడి శరీరంపై తెల్లని గుడ్డను కప్పి ఉంచారు.

"తెలుపు అంటే రంగులు వెలిసిపోవడం కాదు, ఏ రంగూ లేకపోతేనే తెలుపు వస్తుంది. మీ బాధలు, కష్టాలను దూరం చేసే రంగు తెలుపు" అని అక్కడే ఉన్న ఒకరు నాతో అన్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

సోదరి వివాహానికి లోన్ తీసుకున్నాడు

మృతదేహాన్ని ఉంచిన గది ఓ స్టోర్ రూమ్‌లాగా ఉంది. అక్కడే ఇర్ఫాన్ మృతదేహాన్ని శుభ్రపరిచి, దానికి పరిమళ ద్రవ్యాలు పూశారు.

ఆ గదిలో ఓ ట్యూబ్ లైట్ ఉంది. తలపై గాయాలతో ఉన్న ఇర్ఫాన్ మృతదేహం చుట్టూ కూర్చుని మహిళలు, పురుషులు బిగ్గరగా ఏడుస్తున్నారు. నేను ఇంక అక్కడ ఉండలేకపోయాను. ఇలాంటి సమయంలో రిపోర్టింగ్ చేయడం అంత సులభం కాదు.

ఓ మహిళ నాతో చెప్పారు... "ఫిబ్రవరి 26 సాయంత్రం, పిల్లలకు పాలు తీసుకురావడానికి అతడు బయటకు వెళ్లాడు. పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని వాళ్లు చెప్పారు. ఈ ప్రాంతంలో పర్యటించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ కూడా భయపడాల్సిన పనిలేదన్నారు."

ఈ హింసలో మరణించిన మహమ్మద్ ఇర్ఫాన్ వయసు 27. అతడు పిల్లలకు స్కూల్ బ్యాగుల తయారీ పని చేసేవాడు. సోదరి వివాహం కోసం ఆరు నెలల క్రితం లోన్ తీసుకున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులున్నారు. ఉస్మాన్‌పూర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.

దిల్లీ హింస

"బుధవారం సాయంత్రం ఇంటికి 300 మీటర్ల దూరంలో అతడు పడి ఉన్నాడు. శరీరంపై చాలా గాయాలున్నాయి. కత్తిపోట్లున్నాయి. తల ముక్కలైపోయింది" అని పొరుగింట్లో ఉంటున్న జకీర్ నబీ మిరాజ్ తెలిపారు.

ఇర్ఫాన్‌ను జగ్ ప్రవేశ్ హాస్పటల్‌కు, ఆ తర్వాత జీటీబీ హాస్పటల్‌కు తరలించారు. కానీ, అక్కడే అదేరోజు అతడు చనిపోయాడు.

మాస్క్ ధరించిన ఓ మహిళతో పాటు మరో ఇద్దరు మహిళలు ఆ గదిలోకి వచ్చారు. ఆమె వణుకుతోంది. ఆమె పేరు గులిస్తాన్, ఇర్ఫాన్ భార్య. రక్తపు మరకలతో ఉన్న ఆమె భర్తను చివరిసారిగా చూస్తోంది.

ఇర్ఫాన్ మృతదేహం కోసం మూడు రోజులుగా ఎదురుచూస్తున్నామని అతడి సోదరుడు గుల్జార్ అహ్మద్ తెలిపారు. పోలీసులతో సుదీర్ఘ చర్చల తర్వాత శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన మృతదేహంతో ఇంటికి చేరారు. మృతదేహం ఇంటికి చేరాక, ఆ ప్రాంతంలో మళ్లీ హింస చెలరేగే ప్రమాదముందని పోలీసులు తెలిపారు.

దీంతో ఇంటి బయట అల్లర్లను నియంత్రించే పోలీసు వాహనం ఆగి ఉంది. అక్కడ ఎక్కడ చూసినా ఆయుధాలతో పోలీసులు, పారామిలిటరీ సిబ్బందే కనిపించారు. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ, ఇక్కడున్న పోలీసులు, భద్రతా దళాలను చూస్తే, ఇదేదో అసాధారణ పరిస్థితిలా కనిపిస్తోంది.

దిల్లీ హింస

ఫొటో సోర్స్, Getty Images

సాయంత్రం 5 గంటలకు, ఆ వీధి బయట ముగ్గురు మహిళలు నిలబడి ఉన్నారు. వారిలో ఒకరు ఏడుస్తున్నారు.

"అతడిని దూరంగా తీసుకెళ్లారు. ఇలాంటి హింసను మేం ఎప్పుడూ చూడలేదు. మేం ఈద్ మాదిరిగానే దీపావళిని కూడా జరుపుకుంటాం. వాళ్లంతా బయట నుంచి వచ్చారు. చాలామందిని చంపారు" అని ఆమె అన్నారు.

ఇర్ఫాన్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి.

అక్కడున్న ఓ వ్యక్తి అంటున్నాడు.. మహిళలు శ్మశానానికి రాకూడదు.

వీటన్నింటి మధ్యలో.. ఇర్ఫాన్ తల్లి ఖురేషా ముఖంలో శూన్యం కనిపిస్తోంది. ఇర్ఫాన్ తల్లి ఇతర మహిళలంతా కూర్చున్న ఓ చిన్న హాల్‌లో ఓ పక్కగా కూర్చున్నారు. ఇర్ఫాన్ పిల్లలిద్దరు అక్కడ తలుపు దగ్గర నిలబడ్డారు. వారిలో ఒకరు మొబైల్‌తో ఆడుకుంటున్నారు. వారి వయసు ఐదు, మూడేళ్లు. వారికి తన తండ్రి ఇలా మరణించాడని తెలియదు. అసలు తన తండ్రి మరణించాడని కూడా వారికి తెలియదు.

దిల్లీ హింస

"మాకు ఆందోళనలు, హింస వద్దు, మాకు న్యాయం కావాలి" అని ఆమె అన్నారు.

ఖురేషాకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కానీ, వాళ్ల గొంతులు మూగబోయాయి. వాళ్లిప్పుడు తీవ్రమైన దుఃఖంలో ఉన్నారు.

"వాళ్లు అతడి తలను ఛిద్రం చేశారు. అతడు చేసిన తప్పేంటి?" అని ఖురేషా ప్రశ్నిస్తున్నారు.

సోదరి సల్మా ఏడుస్తునే ఉన్నారు. ఇర్ఫాన్ భార్య కూడా పక్కనే కూర్చున్నారు. కానీ ఆమె ఈ లోకంలో లేరు. ఆమె కళ్లు దుఃఖంతో ఎక్కడో చూస్తున్నాయి.

ఇంతలో ఆ గదిలోకి ఓ వ్యక్తి వచ్చాడు. చీకటి పడే లోపే మహిళలంతా ఇంటికి వెళ్లాలని అందరికీ సూచించాడు.

"పరిస్థితులు బాగోలేవు. ఇప్పుడు వెళ్లిపోండి. ఎందుకంటే, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు" అని అతడు వారితో అన్నాడు.

దిల్లీ హింస

ఆ రాత్రి జరిగిన హింస కలిగించిన భయం నుంచి ఆమె ఇప్పటికీ బయటపడలేదు. ఇర్ఫాన్ పాలకోసం బయటకు వెళ్లినప్పుడు సమయం రాత్రి 7.30 గంటలు.

అల్లరిమూక అతడిపై దాడిచేసింది. బయట ఏదో జరుగుతున్న శబ్దాలు ఈ కుటుంబానికి వినపడ్డాయి. ఇర్ఫాన్‌పై దాడిచేసిన తర్వాత వారంతా అక్కడినుంచి పారిపోయారు.

ఇర్ఫాన్ తండ్రి ఓ గుండెజబ్బు రోగి. ఆయన పదేపదే అందరికీ ఒకటే చెబుతున్నారు... "నిజాన్ని రాయండి. ఈ అల్లర్లలో ఓ అమాయకుడు చనిపోయిన విషయం రాయండి" అని.

ఈ కుటుంబానికి ఇర్ఫానే ఆధారం. మేమిప్పుడు ఏం చేయాలి అని ఇర్ఫాన్ తల్లి రోదిస్తున్నారు.

బయట చీకటి పడుతోంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. నన్ను కారు దగ్గర దిగబెట్టేందుకు ఓ వ్యక్తి నాకు తోడుగా వచ్చాడు.

"వెళ్లిపోండి, రోడ్లపై తిరిగేందుకు ఇది మంచి సమయం కాదు, ఈ ప్రాంతాల్లో పరిస్థితులు ఏం బాగోలేదు" అని అతడు నాతో చెప్పాడు.

మరో మహిళ అతడి భుజంపై చెయ్యి వేసింది. ఇక్కడకు వచ్చినందుకు ధన్యవాదాలు అని నాకు చెప్పింది. వాళ్ల కళ్లలో కన్నీరు ఉబికివస్తోంది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)