మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై వారానికి 5 రోజులే పని.. మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంది?

ఫొటో సోర్స్, Getty Images
మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై వారానికి అయిదు రోజులే పని చేయనున్నారు. ఫిబ్రవరి 29 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేసి శని, ఆదివారాలు అధికారికంగా సెలవు తీసునుకోనున్నారు ప్రభుత్వ ఉద్యోగులు.
ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థలు, స్థానిక సంస్థలు అన్నిట్లో పనిచేసే అన్ని స్థాయిల ఉద్యోగులూ ఈ కొత్త విధానంలోకి వస్తారు.
పోలీసులు, అగ్నిమాపక, పారిశుద్ధ్య సేవలు వంటి సర్వీసులు దీనికి మినహాయింపు. దీంతో మహారాష్ట్రలోని సుమారు 20 లక్షల మందికి ఈ వారానికి అయిదు పనిదినాల విధానం వర్తిస్తుంది.
ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇంతవరకు మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారానికి ఆరు రోజులు పనిచేసేవారు. ప్రతి నెలలో రెండు, నాలుగు వారాలు మాత్రమే వారానికి అయిదు రోజులు పనిచేసేవారు. అంటే, ప్రతి నెలా రెండో, నాలుగో శనివారం వారికి సెలవు ఉండేది. ఇకపై ఆదివారంతో పాటు ప్రతి శనివారం సెలవు దినమే.
పని దినాలు తగ్గించిన ప్రభుత్వం రోజువారీ పనివేళలను 45 నిమిషాల మేర పెంచింది. ఇంతకుముందు రోజుకు 7 గంటలుగా ఉన్న పనివేళలను 7 గంటల 45 నిమిషాలుగా మార్చింది. ఇందులోనే 30 నిమిషాల భోజన విరామం కూడా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం చెబుతున్న కారణమేంటి
వారంలో పనిదినాలు తగ్గించడం వల్ల ఉద్యోగులు, అధికారులు వ్యక్తిగత జీవితానికి మరికొంత సమయం కేటాయించే వీలు కలుగుతుందని ప్రభుత్వం తెలిపింది.
దీంతో పాటు విద్యుత్, నీరు, డీజిల్, పెట్రోల్ ఖర్చూ తగ్గుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ కొత్త విధానం ప్రకారం ఏడాదికి 264 పని దినాలు, నెలకి 176 చొప్పున ఏడాదికి 2,112 పని గంటలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

ఫొటో సోర్స్, APGovt
నాలుగేళ్లుగా ఏపీలో సెక్రటేరియట్ ఉద్యోగులకు అమలు
వారానికి అయిదు పని దినాల విధానం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా కాలంగా అమల్లో ఉంది. దేశంలోని కొన్ని ఇతర రాష్ట్రాల్లోనూ ఈ విధానం అమలవుతోంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ సెక్రటేరియట్ ఉద్యోగులకు ప్రస్తుతం వారానికి అయిదు పని దినాలే ఉన్నాయి.
2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత కొన్నాళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల పాలన సాగింది.
అయితే, 2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. 2016లో అమరావతి కేంద్రంగా పాలన ప్రారంభించింది.

ఫొటో సోర్స్, APgovt
ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌ను హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చారు. దాంతో ఉద్యోగులూ రావాల్సి వచ్చింది.
అయితే, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెక్రటేరియట్ ఉద్యోగులు పిల్లల చదువులు, ఇతర కారణాలు చెబుతూ పూర్తిగా నిర్మితం కాని కొత్త రాజధాని అమరావతికి రావడానికి సుముఖత చూపకపోవడంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి కొన్ని వెసులుబాట్లు కల్పించారు. అందులో భాగంగానే సెక్రటేరియట్ ఉద్యుగులకు వారానికి అయిదు రోజుల పనిదినాల విధానం ఏడాది కాలానికి తీసుకొచ్చారు.
దాంతో పాటు వారు హైదరాబాద్ నుంచి అమరావతికి రాకపోకలు సాగించడానికి వీలుగా ప్రత్యేక రైలు వేశారు, రెండు రాష్ట్రాల్లోనూ నివాసం ఉంటే రెండు చోట్లా ఇంటి అద్దె భత్యం ఇస్తామనీ ప్రకటించారు.
2016 జూన్ 27 నుంచి ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులకు, వివిధ కార్పొరేషన్ల ఉద్యోగులకు, అమరావతి కేపిటల్ రీజియన్లో పనిచేసే ఇతర ప్రభుత్వ సంస్థలకు వారానికి అయిదు రోజుల పని దినాలు అమలయ్యాయి. ఏడాది తరువాత దాన్ని ఆ ప్రభుత్వం పొడిగించింది.

ఫొటో సోర్స్, APgovt
అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా సెక్రటేరియట్ ఉద్యోగులకు అదే విధానాన్ని కొనసాగిస్తోంది.
ఈ మేరకు ఆయన ప్రభుత్వం 2019 జూన్ 27న ఈ విధానాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఫొటో సోర్స్, facebook/premsinghtawang
ఇతర రాష్ట్రాల్లో..
ప్రస్తుతం దేశంలోని పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలా వారానికి అయిదు పని దినాల విధానం అమలవుతోంది.
సిక్కిం, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్, బిహార్, దిల్లీ వంటి రాష్ట్రాల్లో స్వల్ప వ్యత్యాసాలతో వారానికి అయిదు పని దినాల విధానం ఉంది.
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లే గత ఏడాది సిక్కింలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది.
సిక్కింలో రెండున్నర దశాబ్దాల పవన్ కుమార్ చామ్లింగ్ పాలన తరువాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ప్రేమ్ సింగ్ తమాంగ్ అదే ఏడాది జూన్ నుంచి దీన్ని అమల్లోకి తెచ్చారు.
ఉత్తరాఖండ్‌లో ఎన్‌డీ తివారీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002లో సెక్రటేరియట్ ఉద్యోగులకు వారానికి 5 పనిదినాల విధానం తీసుకొచ్చారు.

ఫొటో సోర్స్, facebook/harish rawat
అయితే, 2014 ఫిబ్రవరిలో పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయాలన్న కారణంతో అప్పటి సీఎం హరీష్ రావత్ మళ్లీ పని దినాలను పెంచుతూ వారానికి 6 రోజులు చేశారు.
అనంతరం 2016 ఫిబ్రవరిలో హరీశ్ రావత్ సీఎంగా ఉన్నప్పుడే మళ్లీ పని దినాలను 5కి తగ్గించారు.
బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం అత్యవసర సర్వీసులు మినహా మిగతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారానికి 5 పని దినాలు నిర్ణయించింది. అయితే, ఆ రాష్ట్రంలో కార్యాలయాల పనివేళలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఉంటాయి.
రాజస్తాన్‌లో 2008 సెప్టెంబరు 1 నుంచి అప్పటి వసుంధర రాజె ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ విధానం అమల్లోకి తెచ్చింది.
పంజాబ్‌లోనూ ఇదే విధానం అమల్లో ఉంది.
అస్సాం, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల నుంచి ఇలాంటి డిమాండ్లు అనేకసార్లు వచ్చాయి.
అస్సాం ప్రభుత్వం 2013లో దీనిపై అధ్యయనం చేసింది. 2019లో వారానికి 5 పనిదినాల ప్రతిపాదన చేసింది. అయితే, పనివేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్ణయించడంతో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చి అమలు కాలేదు.

ఫొటో సోర్స్, NAtional Informatics centre
కేంద్రంలో 35 ఏళ్లుగా..
గత 35 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 5 పని దినాలు పనిచేస్తున్నారు. 1985 జూన్ 3 నుంచి కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని సివిల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ విధానం అమలవుతోంది.
అంతకుముందు వారు వారానికి ఆరు రోజులు పనిచేసేవారు. ఈ విధానం వచ్చిన తరువాత వారానికి ఒక పని దినం తగ్గా రోజులో అదనంగా ఒక గంట పని వేళను పెంచారు.

ఇవి కూడా చదవండి:
- దిల్లీ హింస: సరిహద్దులు దాటి.. అల్లరి మూకను ఎదిరించి.. ఎన్నో ప్రాణాలు కాపాడిన పోలీస్ హీరో నీరజ్ జాదౌన్
- మిడతల దండు: పోరాటానికి మరిన్ని నిధులు కావాలన్న ఐరాస
- బాలాకోట్ దాడులు: మసూద్ అజర్ నియంత్రణలోని ఆ మదరసా వద్దకు నేటికీ ఎవరినీ అనుమతించరు
- అఫ్ఘానిస్తాన్: తాలిబాన్లతో చర్చలు జరిపిన మహిళ ఫాజియా కూఫీ కథ ఇదీ...
- కరోనావైరస్ ఎఫెక్ట్: పడిపోతున్న బీర్ల అమ్మకాలు... డెటాల్‌కు పెరుగుతున్న గిరాకీ
- ఇతనో దొంగ.. ఒక బీరువాను దొంగిలించాడు.. అది ఇతని జీవితాన్ని మార్చింది
- ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే కంపెనీ ఇదే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









