కలర్ ఫోటో: ఫోకస్ తగ్గి బ్లర్ అయినా మూసకు భిన్నమైన సినిమా - రివ్యూ

కలర్ ఫోటో

ఫొటో సోర్స్, Geeta arts

    • రచయిత, జీఎస్ రామ్మోహన్
    • హోదా, ఎడిటర్, బీబీసీ తెలుగు

కలర్ ఫొటో రొటీన్ సినిమా కాదు. ఒక సామాజిక వివక్షారూపాన్ని కాన్సెప్ట్‌గా తీసుకున్న సినిమా. సుమోలు, గ్రాఫిక్స్, ఫారిన్ లొకేషన్లు, నార్త్ ఇండియన్ హీరోయిన్లు, వగైరాలు లేని సినిమా.

వ్యాపారపరంగా చూస్తే నలురుగు కొత్తవాళ్లను పెట్టుకుని బుద్ధిగా ఈ చిన్న బడ్జెట్లో తీస్తే తలకు బొప్పి తగలకుండా బయటపడొచ్చు అని కూడా ఆలోచించి తీసిన సినిమా కావచ్చు.

ఏమైతేనేం, సినిమా అయితే మూసకు భిన్నమైనది. ఆ మేరకు అది ఫ్రెష్ బ్రీత్. ప్రయోగాలను ప్రోత్సహించకపోతే మనకు నిలువనీరే దిక్కవుతుంది.

కాకపోతే ఆ సబ్జెక్టును చెప్పడానికి కాస్త ఎమోషన్ పండించడానికి చాలామంది మాదిరే ప్రేమ, కాలేజ్ లైఫ్ ఎంచుకున్నారు.

సీతాకోక చిలుక మాదిరి బావను(హీరోయిన్ అన్న) విలన్‌గా పెట్టారు. సినిమాలో చాలా చోట్ల సీతాకోక చిలుక ప్రభావం కనిపిస్తుంది.

దాన్ని దాచుకునే ప్రయత్నమేమీ చెయ్యలేదు. అదొక్కటే కాదు, మరో చరిత్ర, ప్రేమసాగరం, ప్రేమిస్తే, శివ ఇత్యాది అనేక సినిమాలు మెదులుతాయి కొన్ని సీన్లలో.

సినిమాలో పాటలెందుకు ఉన్నాయో అవి లేకపోతే వచ్చే లోటు ఏమిటో తెలీదు.

పైన రంగును చూపిస్తూ అంతర్లీనంగా కుల వివక్షను కూడా కలిపినట్టు అనిపిస్తుంది. అది అక్కడక్కడా సజెస్టివ్‌గా చూపిస్తారు.

ఇక ఆర్థిక అంతరాన్ని అయితే చాలా స్పష్టంగానే చూపించారు. హీరోను ఎంత సినిమాటిక్ పేదరికంతో చూపించాలో అంతా చూపించారు. కులం వర్ణం కంటే సంక్లిష్టమైన సమస్య.

వ్యక్తులుగా రంగు వివక్ష, న్యూనత విస్తృతమైనవే కానీ సమూహాల పరంగా చూసినపుడు రంగు కంటే కులమే జటిలమైనది. తీవ్రమైనది.

రెండు వివక్షలు కలిసిన చోట విలన్ కులం చూపించి పిల్లనివ్వను అని కాకుండా అతను నల్లగున్నాడు కాబట్టి వీల్లేదు అని క్రూరత్వం చూపించడంలో లాజిక్ కనిపించదు.

అలాగే పెళ్లి లాంటి విషయాల్లో రంగు కంటే ప్రధానంగా పనిచేసేది ఆర్థిక అంతరం. రంగు మీద ఎంత మోజు, పట్టింపు ఉన్నా అదే కులం వాడయ్యి ఉంటే కాస్త డబ్బు కూడా ఉంటే కాళ్లు విరగ్గొట్టేంత క్రూరత్వం విలన్‌కు రాదు.

కలర్ ఫోటో

ఫొటో సోర్స్, AHA

కులం మరింత క్రూర వాస్తవం. ఆర్థికం సరేసరి. మన సమాజంలో రంగు వివక్షా రూపాలు వేరే. అదే హైలైట్ చేయదల్చుకుంటే అంత షార్ప్ ఆర్థిక అంతరమూ సామాజిక అంతరమూ చూపించాల్సిన అవసరం లేదు. అసలు సినిమా కథను పాతికేళ్ల వెనక్కు తీసికెళ్లాల్సిన అవసరమే లేదు.

అన్నింటిని కలిపేయడం వల్ల సినిమాలో కాస్త ఫోకస్ దెబ్బతింది. విలన్‌ను ఎదిరించే క్రమంలో ఆయనకు మీ మొహం అద్దంలో చూసుకో అని అదే సేమ్ వివక్షాపూరితమైన భాష ఉపయోగించడం సీన్ పరంగా కరెక్టే కావచ్చేమో కానీ సినిమా ఉద్దేశాన్ని దెబ్బకొట్టింది.

మొత్తంగానే సినిమాలో ఫోకస్ లేదు. సుభాషితం లాగానో ఏదో ధర్మోపన్యాసం ఇస్తున్నట్టుగానో చెప్పమని కాదు. ఎదురీతను ఎంచుకున్న వారు కళాత్మకతను చాటాలి.

చిన్న సినిమా, చిన్న బడ్జెట్ అనేవి సమర్థనకు పనికిరావు. మలయాళీలు చేయగలుగుతున్న పని తెలుగువారెందుకు చేయలేకపోతున్నారు? ఒక అంశాన్ని ఎంత కళాత్మకంగా చెప్పారన్న దగ్గరే కదా నైపుణ్యం బయటపడేది. అక్కడ వెలితి ఉంది. మొత్తంగానే సీన్లు శకలాలు శకలాలుగా కనిపిస్తాయి తప్పితే భావధార తగ్గినట్టు అనిపిస్తుంది. సరిగా ఉడికీఉడకని ఆహారం మాదిరి అనిపిస్తుంది. ఇంకాస్త ఎఫర్ట్ అవసరం.

కొంచెం వాస్తవికత, మరి కొంచెం నాటకీయత.. అట్లా నడుస్తుంది బండి. చివర్లో హీరోను చంపేసి చొక్కాకు దండేసి బోల్డంత కరుణ రసాన్ని పిండే ప్రయత్నం చేశారు డైరెక్టరు.

ఇతర సీన్లలో ఫర్వాలేదనిపించిన హీరోయిన్ ఇక్కడ జీవించేసింది. నార్త్ ఇండియా నుంచి వచ్చి ప్రతి రొటీన్ సినిమాలో మెరిసే చాలామంది హీరోయిన్లు ఆ సీన్‌ను ఆ మాత్రం చేయలేరు.

కలర్ ఫోటో

ఫొటో సోర్స్, Aha

సుహాస్ గురించి కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. ఇప్పటివరకూ చిన్న చిన్న పాత్రల్లోనే మెరిసినా తనదంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడతను. అండర్ టోన్ నటనతోనే కాదు, తన టోన్‌తోనే పడేసే నటుడతను. ఇందులో బాగానే చేశాడు.

సీనియర్ నటుడు సునీల్ విలనిజాన్ని పండించడానికి చాలా ఎఫర్ట్ పెట్టాడని తెలుస్తుంది. కానీ డైలాగ్ డెలివరీ దెబ్బ కొట్టేసింది.

ఇందులో అతని డైలాగ్ డెలివరీ అస్సలు బాలేదు. అతనొక్కడే కాదు, చాలా పాత్రలు కృతకంగా పట్టిపట్టి మాట్లాడుతుంటాయి.

కొన్ని టీవీ సీరియళ్లలో చూస్తుంటాం అలా. చిన్న సినిమా లేదా లో బడ్జెట్ సినిమా లేదా ప్రయోగాత్మక సినిమా లేదా సందేశాత్మక సినిమా, ఏ పేరుతో నైనా పిలుచుకోండి. ఈ సినిమాల్లో తరచుగా కనిపించే సమస్య ఇది.

తెలుగు మీద ప్రేమ ఉన్నవాళ్లకైతే చెవుల్లో సీసం పోసినట్టుగా ఉంటుంది. సుహాస్, హర్ష తప్ప మిగిలిన ప్రధాన పాత్రల్లో చాలామంది తెలుగును కాలుకు కాలు, కీలుకు కీలు విరిచేస్తూ ఉంటారు.

అనవసరమైన చోట నొక్కకుండా సాగతీయకుండా పదాలను విరవకుండా తెలుగును తెలుగులాగా హాయిగా మాట్లాడే నటులకు తెలుగు గడ్డ మీద అంత కొరత ఉందా!!

మంచి ఆలోచనతో సినిమా తీయడం మంచి విషయమే. వర్ణ వివక్ష ఎక్కడో ఉందని మాట్లాడుకుంటూ ఉంటాం కానీ మన చీకటిని చూడడానికి అంతగా ఇష్టపడం.

అన్యాయం, అక్రమం, వివక్ష, అణిచివేత, న్యూనత అక్కడెక్కడో ఉంటాయని మనమూ, మన కులమూ, మన మతమూ, మన రంగూ అంత అన్యాయమైనవి కావని అనుకోవడంలో సుఖం ఉంటుంది.

చాలామంది ఆ సుఖాన్ని కోరుకుంటారు. దాన్ని సవాల్ చేయకుండా సమాజంలో సమానత్వం రాదు. మావవ సంబంధాల్లో సున్నితత్వమూ రాదు. జెండర్ మాదిరే ప్రత్యక్షంగా కనిపిస్తూ నిరంతరం వెన్నాడే వివక్షా రూపం రంగు. ఇతర వివక్షా రూపాలకంటే ఇది భిన్నమైనది.

ఆధిపత్యపు చూపులతోనే గుచ్చగలిగిన వివక్ష అది. ఆ రకంగా ఈ సినిమా ప్రయత్నం మంచిదే కానీ ఇంకాస్త కళాత్మకంగా ఇంకాస్త ఫోకస్డ్‌గా చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)