థాంక్యూ సినిమా రివ్యూ: కృతజ్ఞత విలువ చెప్పేందుకు విఫలయత్నం చేసిన 'థాంక్యూ'!

ఫొటో సోర్స్, @SVC_official
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
కంటికి ఏపుగా ఎదిగిన చెట్టే కనిపిస్తుంది. కానీ.. ఆ చెట్టుకు మూలాధారమైన వ్రేళ్లు ఎవ్వరికీ కనిపించవు. ఆ విత్తనం వేసిన చేతులు, నీళ్లు పోసిన మనిషీ.. ఎవ్వరికీ జ్ఞప్తికి రావు. రావాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే.. ఆ చెట్టు మాత్రం తన మాలాల్ని మర్చిపోకూడదు. 'నా వల్లే నేను ఎదిగాను' అని విర్రవీగితే - ఏదో ఓరోజు కుప్పకూలిపోతుంది.
మనిషి కూడా అంతే. తన ప్రయాణానికి చేయూతనిచ్చిన వాళ్లెంతోమంది ఉంటారు. జీవితంలో ఓ స్థాయికి వచ్చిన తరవాత.. వాళ్లెవ్వరూ గుర్తుకు రాకపోతే, కృతజ్ఞత చూపించకపోతే, ఆ ప్రయాణానికీ ఆ విజయానికీ అర్థం లేనట్టే.
'థ్యాంక్యూ' అనే సినిమాకి సంబంధించిన మూల కథ.. సరిగ్గా ఇదే ఆలోచన దగ్గర మొదలైంది.
ఓ వ్యక్తి తన విజయానికి కారణం కేవలం తానొక్కడినే అనుకొనే స్థాయి నుంచి - తన జీవితంలో తనని వెనక్కి లాగిన వాళ్లకు సైతం 'థ్యాంక్యూ' చెప్పాలని బయల్దేరితే అదే `థ్యాంక్యూ`. నాగచైతన్య - విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మరి.. థ్యాంక్యూ చెప్పాలన్న ఆలోచన అన్ని వర్గాలనూ అలరించేలా, అందరూ అస్వాదించేలా ఉందా, లేదా? థ్యాంక్యూ చెప్పడం కోసం ఓ యువకుడు ఎలాంటి ప్రయత్నం చేశాడు? తెలుసుకొంటే...

ఫొటో సోర్స్, @SVC_official
అహంకారపు కొమ్ములు మొలుచుకొచ్చాయ్!
అభిరామ్ (నాగచైతన్య) ఆంధ్రప్రదేశ్‌లోని ఓ పల్లెటూరు నుంచి అమెరికాలో అడుగుపెట్టాడు. ఆ రోజున తన దగ్గర ఏం లేవు. ఏదోలా గెలవాలన్న ఆశ తప్ప. తొలి రోజుల్లో రావు (ప్రకాష్ రాజ్) ప్రియ (రాశీఖన్నా) తనకు చేదోడు వాదోడుగా ఉంటారు.
అభిరామ్‌లోని గుణగణాలు చూసి ప్రియ తనని ప్రేమిస్తుంది. అభి తయారు చేసే వైద్య యాప్ కోసం తాను కూడా కష్టపడుతుంది. క్రమంగా అభి సక్సెస్ అవుతాడు. తాను ఎంచుకొన్న రంగంలో నెంబర్‌వన్ అవుతాడు. బాగా సంపాదిస్తాడు.
అయితే 'నేను.. అంతా నా వల్లే' అనే అహంకారం మొలచుకొస్తుంది. తనకు సహాయం చేసిన రావుని కూడా మర్చిపోతాడు. తన ఎదుగుదలకు కారణమైన కంపెనీ ఉద్యోగుల్ని పనిలోంచి తీసేస్తాడు. అభిలో ఈ మార్పు ప్రియ జీర్ణించుకోలేకపోతుంది. తన అహాన్ని తట్టుకోలేకపోతుంది.
ఆఖరికి అభిలోని ఆత్మసాక్షి బయటకు వచ్చి `నీ ఎదుగుదలకు కారణం నువ్వు మాత్రమే కాదు.. చాలా మంది` అని ఒకొక్కరి గురించీ చెప్పడం మొదలెడుతుంది. చివరికి తన సక్సెస్‌కు కారణమైనవాళ్లకు థ్యాంక్స్ చెప్పడానికి ఇండియా బయల్దేరి వస్తాడు అభి.
ఇండియాకు వచ్చాక అభి ఎవరిని కలిశాడు? ఎవరికి థ్యాంక్స్ చెప్పాడు? ఈ ప్రయాణంలో తాను నేర్చుకొన్నది ఏమిటి? అనేది మిగిలిన కథ.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
విక్రమ్ మ్యాజిక్ ఎక్కడ?
ఓ విజేత... తన విజయానికి కారణమైన వాళ్లందరినీ కలుసుకోవాలనుకోవడం, వాళ్లకు థ్యాంక్స్ చెప్పాలనుకోవడం.. పేపర్ పై బలంగా కనిపించే పాయింటే. కానీ.. సినిమాకు ఆ పాయింట్ సరిపోదు. మ్యాజిక్ కావాలి. సీన్లు, ఎమోషన్లు, బలమైన పాత్రలూ రాసుకోవాలి.
విక్రమ్ కె.కుమార్‌కి ఇవన్నీ బాగా తెలుసు. తను స్క్రీన్ ప్లే స్పెషలిస్టు. 'మనం' అనే కన్‌ఫ్యూజన్ కథని.. ఎంత తెలివిగా మలిచాడో అందరికీ తెలిసిందే. బహుశా.. దిల్ రాజు కూడా అదే నమ్మి.. విక్రమ్‌కి 'థ్యాంక్యూ' బాధ్యత అప్పగించి ఉంటాడు. దురదృష్టం ఏమిటంటే.. `థ్యాంక్యూ`లో విక్రమ్ మ్యాజిక్ ఎక్కడా కనిపించలేదు. చాలా ఊహాజనితమైన స్క్రీన్ ప్లే ఇది.
పైగా 'నా ఆటోగ్రాఫ్', 'మహర్షి' లాంటి సినిమాలు.. కచ్చితంగా గుర్తొస్తాయి. ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా అలాంటిదే. అభి కథలో రెండు ఉప కథలున్నాయి. ఒకటి.. పారుది, మరోటి.. శర్వాది. ఈ రెండు కథలూ పేలవంగానే ఉన్నాయి. పారు కథలో లవ్ స్టోరీ చెప్పాలి. శర్వా కథలో.. లైఫ్ టర్నింగ్ పాయింట్ గురించి చెప్పాలి. ఇవి రెండూ చాలా రొటీన్ నేరేషన్‌తో సాగిపోయి.. చిరాకు తెప్పిస్తాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సరిగా ఉడకని ఉప కథలు...
పారు కథ కొంతలో కొంత బెటర్. పారు, అభి ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఈ విషయం పారు ఇంట్లో తెలిసిపోతుంది. దాంతో.. పారు తండ్రి (మిర్చి సంపత్) కట్టడి చేసే ప్రయత్నం చేస్తాడు. పారు, అభి ఇద్దరూ ఇంట్లోంచి లేచిపోదామనుకుంటారు.
అయితే.. తన కోసమే అభి తన గోల్‌ని వదిలేస్తాడన్న విషయం గ్రహించిన పారు 'నువ్వు జీవితంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కావొద్దు. నీ గోల్ ని వదలొద్దు.. నా కోసం నువ్వు నీ గోల్‌కి దూరం అయ్యావని నాకు అనిపించినప్పుడల్లా గిల్టీగా ఉంటుంది' అని తన ప్రేమని సైతం వదులుకొని, అభిని రైలెక్కిస్తుంది. నిజంగా ఇది ఎమోషన్స్‌ని టచ్ చేసే కథ. ఈ లవ్ స్టోరీలో ఎంతో కొంత మేటర్ ఉంది.
కానీ శర్వా ఎపిసోడ్‌లో అది కనిపించదు. అభి గోల్ హాకీ ప్లేయర్ కావడం. అందుకోసం తన ప్రేమని సైతం వదులుకొన్నాడు. లవ్ స్టోరీ ఫెయిల్ అవ్వడానికి కారణం అదే. అలాంటప్పుడు అస్సలు హాకీనే ఆడకుండా చేసిన శర్వా.. తన కెరీర్‌కి హెల్ప్ అయ్యాడని అభిరామ్ అనుకోవడంలో పాయింట్ లేదు.
`నువ్వు నా చేయి విరగ్గొట్టావు కాబట్టి.. హాకీ ప్లేయర్ కాలేకపోయా. హాకీ ఆడలేకపోయా కాబట్టి... అమెరికా వెళ్లి సెటిల్ అయ్యా` అని చెప్పడం ఏమిటి? తండ్రి కలని... నెరవేర్చలేకపోయానన్న గిల్ట్ అభిరామ్‌కి లేకపోవడం క్యారెక్టర్ పరంగా పెద్ద మైనస్.
ఫస్టాఫ్‌లో పారు కథ, సెకండాఫ్‌లో శర్వా కథ చెప్పారు ఇందులో. సెకండాఫ్ మొదలవ్వగానే, ఫస్టాఫ్‌లో పారుని మర్చిపోతాడు ప్రేక్షకుడు. సెకండాఫ్‌లో కథ ఎక్కడికో వెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఒకే టికెట్‌పై రెండు సినిమాలు చూసినట్టుంటుంది.
చిన్నీ అనే చెల్లాయిని (అవికాగోర్)ని తెచ్చి సిస్టర్ సెంటిమెండ్ యాడ్ చేయాలనుకొన్నా.. ఫలితం కనిపించలేదు. మహేష్ బాబు రిఫరెన్సులు కొన్ని ఈ సినిమాలో కనిపిస్తాయి. ఫేర్‌వెల్ పాట.. `హ్యాపీడేస్`లోని టైటిల్ సాంగ్‌ని గుర్తుకు తెస్తుంది.
అభిరామ్‌లోని ఆత్మసాక్షి బయటకు రావడం.. అది అభికి హితబోధ చేయడం.. ఇదంతా పాత సినిమాల ఫార్ములా. విక్రమ్ లాంటి జీనియస్ అదే రొటీన్ టెంప్లేట్‌ని ఎంచుకోవడం విచిత్రంగా అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, facebook/SriVenkateswaraCreations
అన్నిటా చైతూనే
చైతూని మూడు రకాల గెటప్పుల్లో ఆవిష్కరించిన సినిమా ఇది. కొమ్ములొచ్చిన అభి ఒకడైతే.. చిన్నప్పుడు పడవ పోటీల్లో కప్పు గెలిచిన అమాయకపు అభి మరొకడు. కాలేజీలో కాస్త రెబల్‌గా రెచ్చిపోయే మహేష్ ఫ్యాన్ అభి మరొకడు. మూడు చోట్లా.. మూడు వయసుల్లోనూ.. తన పాత్రకు తగిన నటన ప్రదర్శించాడు.
టీనేజ్‌లో పాత్ర కోసం చైతూ చాలా కష్టపడి ఉంటాడు. బాగా స్లిమ్ అయ్యాడు. ఎమోషన్ సీన్స్‌లో చైతూ నటన ఎప్పటిలానే బాగుంది. రాశీఖన్నాది చిన్న పాత్రే. కానీ కథలో కీలకం. అవికా గోర్ చెల్లెమ్మగా కనిపించింది. లక్ష్యం కంటే ప్రేమ గొప్పది కాదు.. అని చెప్పే పాత్రలో మాళవిక నాయర్ కనిపించింది.
ఈ మూడు పాత్రల్లో మాళవిక పాత్రే కాస్త బాగా రాసుకొన్నట్టు అనిపిస్తుంది. మిగిలిన పాత్రలన్నీ అతిథి పాత్రలే అనుకోవాలి.
పాటలేవీ గుర్తుండవు. దాదాపుగా అన్నీ మాంటేజ్ గీతాలే. డ్యూయెట్లు లేకపోవడం ఓ పెద్ద ప్లస్ పాయింట్. నేపథ్య సంగీతంలో తమన్ మార్క్ ఎక్కడా కనిపించలేదు. పి.సి శ్రీరామ్ స్థాయికి తగ్గట్టే ఫొటోగ్రఫీ మెరిసిపోయింది. మాటలు పెద్దగా గుర్తుపెట్టుకొనేంతగా లేవు. కట్టిపడేసే ప్రేమ కంటే.. నిన్ను స్వేచ్ఛగా ఎగరనిచ్చే ప్రేమే గొప్పది అనే మాట బాగుంది. పారు పాత్రని ఈ డైలాగ్‌తో కనెక్ట్ చేయడం ఇంకా బాగుంది.
పేపర్ పై చాలా ఉదాత్తంగా కనిపించే కథ ఇది. తెరపైకొచ్చేసరికి తేలిపోయింది. ఎమోషన్స్ లేక డీలా పడింది. దానికి కారణం.. సరైన సీన్లు రాసుకోలేకపోవడమే.
థ్యాంక్యూ చెప్పడం ఇద్దరికే పరిమితం చేయడం కూడా లోపమే. ఎందుకంటే జీవితంలో చాలామంది చాలా రకాలుగా సహాయం చేసి ఉంటారు. వాళ్లందరినీ వెదుక్కొంటూ వెళ్లి మరీ థ్యాంక్స్ చెబితే ఇంకా బాగుండేది.
మొత్తానికి.. ఆలోచన బాగున్నా - దాన్ని తెరపై తీసుకుని రావడంలో టీమ్ మొత్తం విఫలయత్నం చేసిన సినిమా 'థ్యాంక్యూ'. నాగచైతన్యని మూడు రకాల గెటప్పుల్లో చూసుకొని మురిసిపోవాలనుకొనే అక్కినేని అభిమానులు దిల్ రాజుకి 'థ్యాంక్యూ' చెబితే చెప్పి ఉండొచ్చు గాక - కానీ మిగిలిన వాళ్లందరికీ 'సారీ'.
ఇవి కూడా చదవండి:
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- హిందీ గడ్డపై దక్షిణాది మూవీలు బాక్సాఫీసులు బద్దలుకొడుతోంటే.. బాలీవుడ్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి?
- Rishi Sunak: భారత సంతతి వ్యక్తి రిషి సునాక్.. బ్రిటన్‌కు ప్రధాన మంత్రి అవుతారా?
- కారంచేడు దాడికి 37 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















