Movie: హిందీ గడ్డపై దక్షిణాది మూవీలు బాక్సాఫీసులు బద్దలుకొడుతోంటే.. బాలీవుడ్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి?

ఫొటో సోర్స్, DVV ENTERTAINMENT
- రచయిత, నిఖిల్ ఇనాందార్
- హోదా, బీబీసీ బిజినెస్ కరెస్పాండెంట్, ముంబై
బాలీవుడ్, ప్రతీ ఏడాది నిర్మించే చిత్రాల పరంగా చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా పరిశ్రమ. కరోనా మహమ్మారితో రెండేళ్లు కుదేలైన తర్వాత ఇంకా పూర్వవైభవాన్ని అందుకోలేకపోతోంది. గత వైభవం కోసం కష్టపడుతోంది.
సినీ అభిమానులు, కరోనాతో రెండేళ్లు థియేటర్లకు దూరమయ్యారు. కరోనా సద్దుమణిగాక ప్రేక్షకులతో సినిమా హాళ్లు నిండుతాయనే అంచనాలు తలకిందులయ్యాయి.
తమ డబ్బును ఎలా ఖర్చు చేయాలనేదానిపై ప్రేక్షకులు తెలివిగా ఆలోచిస్తుండటంతో బాలీవుడ్ మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయింది.
2022 తొలి అర్ధభాగంలో విడుదలైన 20 సినిమాల్లో 15 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయని ట్రేడ్ గణాంకాలు చెబుతున్నాయి.
ఇందులో దేశంలో అగ్రనటులుగా గుర్తింపు ఉన్న రణ్‌వీర్ సింగ్ నటించిన 83, జయేశ్‌భాయ్ జోర్దార్... అక్షయ్ కుమార్ సినిమాలు సామ్రట్ పృథ్వీరాజ్, బచ్చన్ పాండే... కంగనా రనౌత్ నటించిన ధాకడ్ సినిమాలు ఉన్నాయి.
''ఈ సినిమాలతో దాదాపు 90-100 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. శాటిలైట్, డిజిటల్ హక్కులు లేకపోతే దీన్నుంచి కోలుకోవడం మరింత కష్టమై ఉండేది. ఈ నష్టాల కారణంగా ఈ ఏడాది సినిమాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం 450 మిలియన్ డాలర్లకు దాటదు'' అని ట్రేడ్ ఎక్స్‌పర్ట్ జోగిందర్ తుతేజా అన్నారు.
2019లో బాక్సాఫీస్ వద్ద హిందీ సినిమాలు సుమారు 550 మిలియన్ డాలర్లను వసూలు చేయగా, ఈసారి 100 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, YASH RAJ FILMS
బాక్సాఫీస్‌కు ఇబ్బందికరంగా మారిన అంశం ఏంటి?
బాలీవుడ్ పేలవ ప్రదర్శనకు, బలహీనమైన కంటెంట్ ఒక కారణం కావొచ్చు.
''సూపర్ స్టార్లుగా పేరున్న నటులకు ఉండే అభిమానగణం కారణంగా గతంలో కంటెంట్ బలహీనంగా ఉన్నప్పటికీ బాలీవుడ్ చిత్రాలు మంచి కలెక్షన్లు రాబట్టాయి. కాలక్రమేణా ఈ అంశం మారిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇప్పడు సినిమా కంటెంట్‌కే అధికంగా ప్రాధాన్యం ఇస్తున్నారు'' అని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చెప్పింది.
కానీ, నిర్మాతలను కలవరపెడుతోన్న అంశం ఏంటంటే, కరోనాకు ముందు బాక్సాఫీస్ వద్ద మెరుగ్గా ఆడిన సాధారణ బడ్జెట్, కంటెంట్-హెవీ సినిమాలు ఇప్పుడు గొప్పగా ఆడట్లేదు.
''ప్రేక్షకులు ఇప్పుడు మంచి కంటెంట్‌తో పాటు భారీ స్థాయి ఉండే సినిమాలను డిమాండ్ చేస్తున్నారు'' అని భూషణ్ కుమార్ అన్నారు. దేశంలోని ప్రముఖ మూవీ స్టూడియోల్లో ఒకటైన టి-సిరీస్ (ముంబై)ను భూషణ్ కుమార్ నడిపిస్తున్నారు.
టి-సిరీస్ సంస్థ నిర్మించిన హారర్ కామెడీ 'భూల్ భులయ్యా-2' సినిమా, 2022లో అత్యధికంగా ఆర్జించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయినప్పటికీ, తాజా వరుస పరాజయాలను చూస్తుంటే ఏ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు? దేన్ని ఆదరించరు? అనేదానిపై నిర్మాతల్లో పెద్ద గందరగోళం నెలకొందని భూషణ్ కుమార్ అన్నారు.
మారుతోన్న ప్రేక్షకుల అభిరుచితో మూవీ మేకర్స్ తంటాలు పడుతుంటే... మరోవైపు థియేటర్లు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ అంటూ ప్రేక్షకుల విడిపోతున్నారు. దీంతో సినిమాను ఆడించడం ఎప్పుడూ లేనంత విచిత్రంగా మారింది.
దీనికి తోడు కోవిడ్ కారణంగా షూటింగ్‌లు ఆలస్యం, రద్దు కావడం, ప్రొటోకాల్స్ వల్ల సినిమా బడ్జెట్ సగటున 10-15 శాతం పెరిగిందని భూషణ్ కుమార్ చెప్పారు.
ఖర్చులు పెరగడంతో టిక్కెట్ల ధరలు కూడా అధికం అయ్యాయి. థియేటర్లకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. కరోనా సమయంలో చాలా థియేటర్లు శాశ్వతంగా మూతపడ్డాయి.
బంధుప్రీతి, మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో సినిమాలను బహిష్కరించడం, బాలీవుడ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారాలు నిర్వహించడం వంటివి కూడా పరిశ్రమ పనితీరును దెబ్బతీశాయని ఎంకే గ్లోబల్ అభిప్రాయపడింది.

ఫొటో సోర్స్, T-SERIES
బాక్సాఫీస్ వద్ద రాణిస్తోన్న దక్షిణాది సినిమాలు
ఇక్కడ దక్షిణాది సినిమాల గురించి చెప్పుకోవాలి. సాధారణంగా దక్షిణాదిలో నిర్మించే సినిమాలన్నీ వారి ప్రాంతాల్లోనే బాగా ఆడతాయి. కానీ, హిందీలోకి డబ్ అయిన ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్: చాప్టర్ 2 వంటి దక్షిణాది సినిమాలు ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కలెక్షన్ల పరంగా కూడా బాలీవుడ్ నటులు నటించిన సినిమాలను మించిపోయాయి.
దక్షిణాది బ్లాక్ బస్టర్లలో ఉండే భారీ సెట్లు, మంచి పాటలు, స్లో మోషన్ సీక్వెన్సులు... హిందీ చిత్రాల్లో ఉండట్లేదని నిపుణులు అంటున్నారు.
''ఒకవేళ నేను థియేటర్‌కు వెళ్తే.. ఒక అద్భుతమైన సినిమాను, మంచి అనుభవాన్ని కోరుకుంటా. కరోనా సమయంలో చాలా మంది ప్రజలు హిందీయేతర, దక్షిణాది చిత్రాలకు అలవాటుపడ్డారు. ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చొని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలు చూస్తున్నప్పుడు ఒక సమయం తర్వాత చూడటానికి హిందీ సినిమాలు అన్నీ అయిపోతాయి'' అని సినీ విమర్శకురాలు సుచరిత త్యాగి అన్నారు.
బాలీవుడ్ అదృష్టాన్ని మార్చేందుకు దక్షిణాదిపై ఆధారపడటం తగదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
వాటి ప్రధాన మార్కెట్లను దాటేలా ప్రాంతీయ సినిమాల ప్రదర్శన ఉండటం అప్పుడప్పుడు జరుగుతుందని ఎంకే గ్లోబల్ నివేదిక పేర్కొంది.

ఫొటో సోర్స్, VIACOM 18 STUDIOS
తర్వాత ఏంటి?
ఈ ఏడాది ద్వితీయార్ధంలో తన అదృష్టాన్ని మార్చుకునేందుకు బాలీవుడ్ ఇప్పుడు అత్యధిక అంచనాలు ఉన్న అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్ధా, రణ్‌బీర్ కపూర్ నటించిన యాక్షన్ డ్రామా 'షంషేరా' సినిమాల వైపు చూస్తోంది.
మొదటి అర్ధభాగం కంటే ఇప్పుడు ఎక్కువ సినిమాలు విడుదలకు వరుసలో ఉన్నందున... బాక్సాఫీస్ కలెక్షన్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
అయితే, ప్రేక్షకులు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు అలవాటు పడటం సినిమా వ్యాపారంపై నిస్సందేహంగా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంగీకరిస్తున్నారు.
''సాధారణ కంటెంట్ ఉన్న సినిమాలు చూడటానికి ప్రేక్షకులు, థియేటర్లకు వెళ్లే బదులుగా అవి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి వచ్చేంత వరకు ఎదురు చూసే సందర్భాలు కూడా ఉంటాయి'' అని ఎంకే గ్లోబల్ నివేదిక తెలిపింది.
సినిమా విడుదలలో ఎదురయ్యే సమస్యలను తప్పించుకునేందుకు నేరుగా ఓటీటీలో విడుదల అయ్యే సినిమాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.
''మీరు థియేటర్‌లో సినిమా చూసేందుకు 20-30 డాలర్లు ఖర్చుపెడుతున్నప్పుడు, పెట్టిన ప్రతీ పైసాకు సరిపోయే అనుభవాన్ని పొందాలనుకుంటారు. ఒక ఏడాది కాలానికి స్ట్రీమింగ్ సర్వీస్ సభ్యత్వాన్ని తీసుకుంటే దాని కోసం వెచ్చించిన దానికన్నా ఎక్కువ వినోదాన్ని పొందుతారు. అలాంటప్పుడు ప్రజలు, దీన్ని ఎందుకు వదులుకుంటారు? రోజురోజుకీ స్ట్రీమింగ్ సర్వీసుల సభ్యత్వాలు పెరుగుతాయి'' అని త్యాగి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- ‘ప్రభుత్వ కార్యక్రమంలో హిందూమత పూజలు ఎందుకు చేయిస్తున్నారు? పూజారి ఉంటే.. ఫాదర్, ఇమామ్ ఎక్కడ?’ - భూమి పూజను ఆపించిన డీఎంకే ఎంపీ
- జెన్నిఫర్ లోపెజ్, బెన్ ఆఫ్లెక్: 2003లో నిశ్చితార్థం చేసుకున్న హాలీవుడ్ జంట.. 19 ఏళ్ల తర్వాత పెళ్లి
- UFO: అంతుచిక్కని ఫ్లయింగ్ సాసర్ల రహస్యం ఏంటి? ఒకప్పుడు అమెరికాను ఊపేసిన ఈ ‘ఏలియన్ స్పేష్ షిప్‌లు’ ఇప్పుడు ఏమయ్యాయి?
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












