మేజర్ మూవీ రివ్యూ: దేశభక్తి పొంగింది, ఎమోషన్ పండింది

ఫొటో సోర్స్, facebook/SeshAdivi
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
దేశభక్తిని మించిన కమర్షియల్ అంశం మరొకటి ఉంటుందా? దానికి మించిన ఎమోషనల్ ఫార్ములా కనిపిస్తుందా?కొందరికి మాస్ ఇష్టం. ఇంకొందరికి క్లాస్ ఇష్టం. రొమాంటిక్ చిత్రాలు, ప్రేమకథలు, యాక్షన్ సినిమాలు.. ఇలా ఒకొక్కరికీ ఒక్కో జోనర్ నచ్చుతుంది. వీళ్లందరిలోనూ కామన్ గా కనిపించే అంశం.. దేశభక్తి.
సరిగ్గా తీయాలే కానీ, ఇంతకు మించిన కమర్షియల్ పాయింట్ ఉండదు. అయితే అలాంటి ప్రయత్నాలు తెలుగులో అడపాదడపానే కనిపిస్తున్నాయి.
దేశాన్ని కుదిపేసే ఓ ఘటన జరిగినప్పుడో, దేశం మొత్తం... తల తిప్పి చూడగలిగే వ్యక్తులు కనిపించినప్పుడో.. దేశంపై ప్రేమ పొంగుకొస్తుంది.
అలాంటిదే 26\11 ముంబయి దాడులు. దేశమంతా ఉలిక్కిపడేలా చేసిన రక్తపు మరక అది. ఈ దేశ భద్రతాదళాల పనితీరుని నిలదీసిన ఘటన అది.
నిజమే.. 26\11 ఘటనలో భద్రతా వైఫల్యం ఉంది. కానీ... ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలకూ వెనుకంజ వేయని ధీరత్వం మన జవాన్లకు, పోలీసులకు ఉందని ఘనంగా చాటిచెప్పిన సందర్భమూ అదే.
మరోవైపు భారతదేశం వైపు చూడాలలంటే ఉగ్రవాదులకు చెమట పట్టేలా చేసిన అనుభవం కూడా ఇదే. ముంబయిపై ఉగ్రమూకల దాడితో ఎంతోమంది కొత్త హీరోల కథలు ఈ దేశానికి తెలిశాయి.
అందులో `మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్` ఒకరు. ముంబయి దాడుల్లో... దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్ సందీప్ ఉన్నికృష్ణన్. ఆయన కథే ఇప్పుడు `మేజర్` పేరుతో వచ్చింది.

ఫొటో సోర్స్, AdiviSesh
ఈ మేజర్ మనలాంటివాడే..
ఈ సినిమాలో.. చిన్నప్పుడే సైన్యంలో చేరాలన్న లక్ష్యం ఉన్నికృష్ణన్(అడవిశేష్)ది. అయితే అమ్మానాన్న (రేవతి, ప్రకాష్‌రాజ్) అందుకు అంగీకరించరు. అయినా సరే, సైన్యంలో చేరుతాడు.
చిన్నప్పటి నుంచీ సందీప్ భావాలు చాలా ఉన్నతంగా కనిపిస్తుంటాయి. ఆర్మీలో చేరాక అవి మరింత దృఢమవుతాయి.
సైన్యం అంటే అన్నింటినీ వదులుకోవాలి. ఆఖరికి కట్టుకున్న భార్యను కూడా. ప్రేమించి పెళ్లి చేసుకొన్న నేహా (సాయి మంజ్రేకర్)ని కూడా నిర్లక్ష్యం చేయాల్సివస్తుంది. అది ప్రేమలేక కాదు.. ఉద్యోగ ధర్మం వల్ల. చివరికి ఇంట్లో గొడవలు పెరిగి విడాకుల వరకు వెళ్తాయి. కానీ.. ఆ సమయంలోనూ దేశం కోసం పోరాడడానికే నిర్ణయించుకొంటాడు మేజర్.
ముంబయిలో ఉగ్రవాదుల చొరబడి హోటల్ తాజ్‌ని అడ్డాగా చేసుకొని, అక్కడున్న టూరిస్టులను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నప్పుడు వాళ్లను ఎదుర్కోవడానికి తాజ్‌లో అడుగుపెడతాడు మేజర్.
అక్కడ మేజర్ పోరాటం ఎలా సాగింది? చివరికి ఏమైందన్నదే అసలు కథ.ఇది తెలిసిన కథే. ముంబయి అటాక్‌పై ఇప్పటి వరకూ చాలా సినిమాలొచ్చాయి. అవి చూసినవారికి అసలు ముంబయిలో ఏం జరిగిందన్నదానిపై ఓ అవగాహన వచ్చేస్తుంది. 26\11 సినిమాలో రాంగోపాల్ వర్మ ముంబయి దాడిని కళ్లకు కట్టినట్టు చూపించాడు.
ఇక్కడ దర్శకుడు ఎంచుకొన్న కథా నేపథ్యం కూడా అదే. కాకపోతే.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితమే ఈకథ చెప్పడానికి సూత్రంలా మారింది.
26\11 ఘటనలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ ఈ కథ మాత్రం
ఒక్క హీరోకే పరిమితమైంది. అతని బాల్యం, ప్రేమకథ, అమ్మానాన్నలతో అనుబంధం.. ఇవన్నీ చూస్తే మేజర్ కూడా మనలాంటి వాడే అనిపిస్తుంది.
ఆ పాత్రపై ప్రేమని, మమకారాన్ని ప్రేక్షకుల్లో కలగడానికి ఆయా సన్నివేశాల్ని ఆలంబనగా చేసుకొన్నాడు దర్శకుడు.
సందీప్ జీవితంలోని ప్రతీ కీలక సందర్భాన్నీ తెరపై చూపించడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది.
ఆ సన్నివేశాలు సాగదీసినట్టు, అనవసరమేమో.. అనిపించినా -ఇది సందీప్ బయోగ్రఫీ కాబట్టి అవన్నీ చెప్పాల్సిన అవసరం దర్శకుడికి ఉంది.
పతాక సన్నివేశాల్లో ఎమోషన్ కలగడానికి ఆయా సన్నివేశాలు బాగా ఉపయోగపడ్డాయి కూడా.
ఎలా చనిపోయాడన్నది ఎలా బతికాడన్నదే ముఖ్యం
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అనగానే, ముంబయిపై దాడి గుర్తొస్తుంది. కానీ, దానికిముందు మేజర్‌కంటూ ఓ జీవితం ఉంది. అందుకే పతాక సన్నివేశాల్లో `నా కొడుకు ఎలా చనిపోయాడన్నది గుర్తుకు రాకూడదు... ఎలా బతికాడన్నదే గుర్తుకు రావాలి` అని ప్రకాష్‌రాజ్‌తో ఓ డైలాగు రూపంలో చెప్పించారు.
మేజర్ ఎలా బతికాడు? అన్నది ఈ కథలో సింహభాగాన్ని ఆక్రమిస్తుంది. చిన్నప్పుడు జైల్లో ఓ ఖైదీ దగ్గరకు వెళ్లి... `ఈ తప్పు ఎందుకు చేశావ్..? ఆకలేసిందా?` అని అమాయకంగా అడిగినప్పుడు.. ఓ ఉద్వేగం చోటు చేసుకుంటుంది.
అలాంటి ఉద్వేగం ఉన్నికృష్ణన్ జీవితంలోని ప్రతి సందర్భంలోనూ కనిపిస్తుంది. కుక్క అరుస్తున్నప్పుడు చెల్లాయికి అడ్డుగా నిలబడినప్పుడు, ఎదురింట్లో గొడవ జరుగుతున్నప్పుడు దాన్ని అడ్డుకున్నప్పుడు, ట్రైనింగ్ లో.. తోటి సోల్జర్‌కి చేయి అందించినప్పుడు... ముఖ్యంగా.. `వారిద్దరి కోసం ఎంతమంది సైనికుల ప్రాణాలు పణంగా పెట్టాలి` అని.. ఆర్మీ ఆఫీసర్ అడినప్పుడు, `నేనొక్కడిని చాలు` అంటూ ధైర్యంగా బరిలోకి దిగినప్పుడు.. ఇలా ప్రతీ చోటా.. సందీప్ పాత్రని ఆకాశమంత ఎత్తులో చూపించే ప్రయత్నం చేశాడు.
నిజంగా... ఓ బయోపిక్‌ని పక్కా కమర్షియల్ మీటర్‌లో తీసిన సినిమాలా అనిపిస్తుంది. ఎందుకంటే... కమర్షియల్ సినిమాలో కనిపించే ఎలివేషన్లు.. మేజర్‌లో అడుగడుగునా ఉంటాయి.

ఫొటో సోర్స్, AdiviSesh
ద్వితీయార్థం.. ఉద్వేగభరితం
తాజ్ హోటల్‌లో ఉగ్రవాదుల అరాచకాలను, ఆ రక్తపాతాన్ని సందీప్ ఉన్నికృష్ణన్ ఎలా ఎదుర్కొన్నాడన్న విషయాన్ని ద్వితీయార్థంలో చూపించారు.
ద్వితీయార్థం దాదాపు 70 నిమిషాల పాటు సాగితే.. అందులో 50 నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్లే ఉంటాయి. అవన్నీ చాలా సహజంగా, అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించారు.
యాక్షన్ కొరియోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మధ్యమధ్యలో ఎమోషన్ మూమెంట్స్‌ని ఎక్కడా వదల్లేదు. స్విమ్మింగ్ పూల్ సీన్‌లో నరాలు ఉప్పొంగుతాయి.
మరోవైపు, ఓ పసిపాపని కాపాడడానికి శోభిత ధూళిపాళ చేసే యత్నాలు కూడా థ్రిల్లింగ్ గా సాగుతాయి.
అమ్మా, నాన్నల ఎమోషన్, భార్య కన్నీటి గాథ.. ఇవన్నీ బిట్లు బిట్లుగా చూపిస్తూ.... అన్ని వైపుల నుంచీ స్క్రీన్ ప్లేని చాలా బిగుతుగా రాసుకొన్నారు.
ప్రాణాలను పణంగా పెట్టి, శత్రు సంహారం చేసిన పతాక ఘట్టాల్ని రోమాంచితంగా తెరకెక్కించారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే... పతాక సన్నివేశాల్లో ప్రకాష్ రాజ్ చెప్పిన మాటలు.. మరింత ఉద్వేగభరితంగా సాగతాయి. `నా కొడుకుని నా భుజాలపై ఎక్కించుకొని ఈ ప్రపంచాన్ని చూపిద్దామనుకొన్నా. కానీ వాడే తన భుజాలపై ఎక్కించుకొని ఈ ప్రపంచాన్ని మాకు చూపించాడు` అన్నప్పుడు... ప్రతీ ఒక్కరి కళ్లల్లో నీళ్లు గిర్రున తిరుగుతాయి. అప్పటి వరకూ సాగిన సినిమా ఒక ఎత్తు అయితే... చివరి పది నిమిషాలూ మరో ఎత్తుగా కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, GMBEntertainment
ఓ అమ్మ త్యాగం.. ఓ భార్య బాధ
బోర్డర్ లో సేవ చేసి, ప్రాణాలు అర్పించినవాళ్లంతా ఈ దేశానికి ముద్దు బిడ్డలే. వాళ్ల త్యాగాల్ని కొనియాడాల్సిందే. కానీ... వాళ్లంతా సేవ చేయడానికి బోర్డర్ వరకూ వచ్చారంటే.. వాటి వెనుక కనీ పెంచిన తల్లి, కట్టుకొన్న భార్యల త్యాగాలూ ఉంటాయన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.
దేశం కోసం ప్రాణాలు వదిలిన వాళ్లని అందరూ గౌరవిస్తారు. సెల్యూట్ చేస్తారు. కానీ.. ఆ బిడ్డ మనింటి బిడ్డ అవ్వాలని ఎవరూ అనుకోరు. నా భర్త నాకు మాత్రమే హీరో అయితే చాలనుకుంటుంది భార్య. `నన్ను కాపాడుకోవడానికి నా పక్కన ఉంటే చాలనుకుంటుంది`. ఈ కథలో అమ్మగా రేవతి, భార్యగా సాయీ మంజ్రేకర్ పాత్రల ద్వారా దర్శకుడు ఇదే చెప్పాలనుకొన్నాడు.
వాళ్ల త్యాగాల్నీ గుర్తించమనే సందేశం ఇచ్చాడు. ఓ తల్లిగా, భార్యగా వాళ్ల వైపు నుంచి ఆలోచించమన్నాడు. అది ఈ కథలో అంతర్లీనంగా చెప్పాలనుకొన్న బలమైన పాయింట్. అది.. ప్రేక్షకులకూ చేరిందనే అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరికి వారే... సూపర్
నటీనటులలో ఎవరికీ వంక పెట్టలేం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో ఒదిగిపోయాడు అడవి శేష్. నిజ జీవితంలోనూ సందీప్, అడవిశేష్ మధ్య పోలికలు కనిపిస్తాయి. కాబట్టి... ప్రేక్షకులు అడవి శేష్‌తో ఈజీగా కనెక్ట్ అయిపోతారు.
యాక్షన్ దృశ్యాల్లో పర్‌ఫెక్ట్ గా ఇమిడిపోయాడు. ఎమోషన్ సీన్లు చాలా క్యాజువల్ గా చేసుకొంటూ వెళ్లిపోయాడు.
రేవతి, ప్రకాష్ రాజ్ లాంటి అనుభవజ్ఞులు ఉండడం ఆయా పాత్రలకు వరంగా మారింది. చాలా చిన్న డైలాగులతో, తమకంటూ దొరికిన చిన్న స్పేస్‌లోనే బరువైన భావోద్వేగాల్ని పండించగలిగారు.
సాయి మంజ్రేకర్ అందంగా కనిపించింది. నటనకు స్కోప్ ఉన్న సన్నివేశాలు ఎదురైనప్పుడు కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా తన పాత్రని చాలా ఈజ్‌తో చేసుకుంటూ వెళ్లిపోయింది.సాంకేతికంగా ఈ సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. ముఖ్యంగా ఎడిటింగ్ బాగుంది. ఎమోషన్ ని పీక్స్‌లోకి తీసుకెళ్లాల్సివచ్చినప్పుడు ఆ సీన్లని కుదించి, కత్తిరించి, ఓ చోట చేర్చిన వైనం బాగుంది.
ఫొటోగ్రఫీ నీట్‌గా ఉంది. నేపథ్య సంగీతంతో తెలియని బలం వచ్చింది. పాటలు కథలో కలిసిపోయాయి. అబ్బూరి రవి సంభాషణలు హృద్యంగా ఉన్నాయి. బలమైన ఎమోషన్ పండిచాల్సినచోట తక్కువ మాటల్లోనే తన పని పూర్తి చేశాడు రచయిత.సినిమాల వల్ల దేశ భక్తి పెరక్కపోవొచ్చు. అది కృత్రిమమైన స్పందనే కావొచ్చు. కానీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి వాళ్ల జీవితాలు సినిమాలతో ఆగిపోవు. ఆ కథలు మనసులో ముద్రించుకుపోతాయి.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర కొరియాలో కోవిడ్ మిస్టరీ, అసలు ఏం జరుగుతోంది
- టర్కీ దేశం పేరును ‘తుర్కియా’గా ఎందుకు మార్చారు?
- టీటీడీ: తిరుమలలో పూర్తిస్థాయి ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి.. భక్తులు, వ్యాపారులు ఏమంటున్నారు?
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. లోక్‌సభలో బిల్లు పెట్టిన రోజు ఏం జరిగింది? ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో సుష్మా స్వరాజ్ పాత్ర ఏంటి?
- కాలి బొటనవేలు రూ. 30 లక్షలు - జింబాబ్వే పేదలు వేళ్లను అమ్ముకుంటున్నారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













