భారత వెబ్ సిరీస్‌లలో ఉత్తరప్రదేశ్ ఎందుకు హింసా రాజ్యంగా మారిపోయింది?

ఫొటో సోర్స్, Amazon Prime
- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
భారత సినీ దర్శకులు, నిర్మాతలు చెప్పే కథల పరిధిని విస్తరిస్తోంది. ఆన్‌లైన్‌లో సినిమాలు, సిరీస్‌లను ప్రదర్శిస్తున్న స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఈ వెసులుబాటును కల్పించాయి.
భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కేంద్రంగా అనేక పాపులర్ సినిమాలు, సిరీస్ రూపొందుతున్నాయి. అయితే.. యూపీ క్షేత్రంగా రూపొందుతున్న అలాంటి చిత్రాల్లో ముఠా పోరు, హింసాత్మక నేరాలు ప్రధాన కథావస్తువులుగా ఉంటున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గల సుసంపన్నమైన చరిత్ర, సంస్కృతి మరుగునపడిపోతున్నాయి.
ఇటీవలి సంవత్సరాల్లో ఉత్తర భారతదేశంలోని చిన్న పట్టణాలు నేపథ్యంగా నిర్మిస్తున్న స్మాల్ బడ్జెట్ సినిమాలు సక్సెస్ కావటంతో.. హిందీ సినిమా, టీవీ పరిశ్రమ అటువంటి కథలను మరిన్ని తయారు చేసేలా పురిగొల్పింది.
భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రం, అత్యధిక జనాభా గల ఉత్తరప్రదేశ్‌కు.. భారత రాజకీయ కల్పనల్లో భారీ స్థానముంది. కాబట్టి సినిమా, టీవీ కథలకు ఆ రాష్ట్రం ప్రధాన స్థానంగా మారటంలో ఆశ్చర్యం లేదు.
భారతీయ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలు, షోల విడుదలను ట్రాక్ చేసే 'సినిమా రేర్' అనే ట్విటర్ అకౌంట్.. సినీ, టీవీ రంగం కొత్త కథలు చెప్పటానికి ఇప్పుడిక యూపీలో మరే నగరమూ మిగలలేదని జోక్ చేయటాన్ని బట్టి యూపీ మీద ఈ రంగం ఎంతగా దృష్టి కేంద్రీకరించిందో అంచనా వేయొచ్చు.
ఉత్తరప్రదేశ్ కూడా.. తమ రాష్ట్రంలో సినిమాలు, షోల షూటింగ్‌కు ప్రోత్సహకాలు అందిస్తూ హిందీ సినీ నిర్మాతలను ఆకర్షిస్తోంది.
యూపీ నేపథ్యంగా నిర్మించిన మీర్జాపూర్, పాతాళ్ లోక్ వంటి పలు షోలు కుటుంబ కక్షలు, హింసాత్మక హంతకుల కథలు చెప్తూ ప్రశంసలందుకున్నాయి. కొన్ని అంతగా ఆకట్టుకోలేదు.
క్రైమ్ కథలు బాలీవుడ్‌కు కొత్తేమీ కాదు. ముంబై నేపథ్యంగా 1998లో విడుదలైన గ్యాంగస్టర్ డ్రామా 'సత్య' సినిమా.. బాలీవుడ్‌లో కొత్త వెల్లువకు నాంది పలికింది. ముంబై నగరపు చీకటి, హింసాత్మక పార్శ్వాలను ప్రేక్షకులను కట్టిపడేసేలా చూపించే డార్క్, గ్రిటీ సినిమాల వెల్లువ అది.

ఫొటో సోర్స్, Ram Gopal Varma
ఆ తర్వాతి కాలంలో ప్రజా బాహుళ్యపు కల్పనలో ముంబై అండర్‌వరల్డ్ పట్టు బలహీనపడినప్పటికీ.. కొత్త క్రైమ్ థ్రిల్లర్స్ వెల్లువలో 'సత్య' సినిమా ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది.
''హిందీ సినిమాను 'సత్య' చాలా రకాలుగా మార్చేసింది. అంతేకాదు.. ఆ సినిమా కోసం పనిచేసిన వారు, ఆ సినిమా సక్సెస్‌తో లబ్ధి పొందిన వాళ్లు ఆ తర్వాత హిందీ సినిమాను మార్చేశారు'' అని సినీ విమర్శకుడు ఉదయ్ భాటియా తన 'బులెట్స్ ఓవర్ బాంబే' పుస్తకంలో రాశారు.
అటువంటి వారిలో ప్రముఖ దర్శకులు అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వాజ్‌లు కూడా ఉన్నారు. వారిద్దరి స్వస్థలం ఉత్తరప్రదేశే. విశాల్ భరద్వాజ్ యూపీ నేపథ్యంగా పలు చిత్రాలు తీసి సక్సెస్ సాధించారు.
'సత్య' సినిమా ముందు వరకూ హిందీ సినిమాల్లో కథాక్రమం (ప్లాట్) మీద దృష్టి పెట్టలేదని దిల్లీ యూనివర్సిటీ అధ్యాపకురాలు, రచయిత, సినీ నిర్మాత అనుభ యాదవ్ పేర్కొన్నారు.
''హిందీ సినిమాలో కథాక్రమం ముఖ్యమవటంతో ఒక విభిన్నమైన రసజ్ఞత మొదలైంది. దానిని ఇప్పుడు వెబ్ సిరీస్ కొత్త స్థాయిలకు తీసుకెళుతున్నాయని నేను అనుకుంటున్నా'' అన్నారామె.
అయితే ఇందులో ఒక సమస్య ఉందని కొందరు విమర్శకులు ప్రస్తావిస్తున్నారు.
''సత్య' సినిమా ఒరిజినల్. దాని తర్వాతివన్నీ కొత్త ఒకే దానికి కాపీ లాగా కనిపిస్తాయి. కానీ కొత్త రూపకాలను, కొత్త నుడికారాలను ఇంకా చెప్పాలంటే కొత్త తిట్లను చూపిస్తాయి'' అని యూపీలోని షాహాబాద్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త మొహమ్మద్ సయీద్.
'సత్య' సక్సెస్‌తో రూపొందిన కొత్త ప్రక్రియ (జానర్) ప్రేక్షకుల్లో ఉద్వేగాన్ని ప్రేరేపించటానికి ఒక విధమైన 'మగతనం' మీద, హింసా ప్రయోగం మీద ఆధారపడిందని అనుభ యాదవ్ విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Junglee Pictures
ఉత్తరప్రదేశ్‌లో ప్రజా, భౌగోళిక సానుకూలతలే కాకుండా మరెన్నో విశేషాలున్నాయి. ఈ రాష్ట్రానికి సుదీర్ఘ కాలంగా 'గంగా-జముని తెహజీబ్' (గంగా - యమున సంగమం) అనే ఖ్యాతి ఉంది. హిందూ - ముస్లిం సంస్కృతుల సంలీనానికి కవితాత్మక వర్ణణ ఇది. హిందీ సాహిత్యం, భారతీయ సంప్రదాయ సంగీతం, నృత్యం, లలిత కళల్లో దిగ్గజాలకు పుట్టిల్లు.
ఈ సుసంప్నమైన సంక్లిష్టత ఈ రాష్ట్రం నేపథ్యంగా వస్తున్న ఇటీవలి సినిమాలు, వెబ్ సిరీస్‌లలో మృగ్యమవుతోంది.
''ఇది కవుల నేల. ఇది ఘాలిబ్ పుట్టిన చోటు. 1857 సిపాయి తిరుగుబాటు వంటి అతి పెద్ద చారిత్రక కథలున్న భూమి'' అంటారు అనుభ యాదవ్.
అలాగని ఈ రాష్ట్రంలో నేరాలనేవి లేవని కాదు. పోలీస్ ఎన్‌కౌంటర్లు, విద్వేష నేరాలు, మహిళలు, మైనారిటీల మీద హింస వార్తలతో యూపీ తరచుగా పతాక శీర్షికల్లో కనిపిస్తుంటుంది.
కానీ.. ఏటా వేల సంఖ్యలో నేరాలు నమోదయ్యే ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే.. ఉత్తరప్రదేశ్ మరింత హింసాత్మకంగా ఉంటుందనే భావనవైపు ప్రజా సాంస్కృతిక కల్పన మొగ్గుతుంది.
''ఇక్కడ ప్రజలకు ఎంతో చరిత్ర ఉంది. ఎంతో కళ ఉంది. ఎంతో హస్త నైపుణ్యం ఉంది. నృత్యం ఉంది. తుపాకులను మించి ఎంతో ఉంది'' అని స్క్రీన్‌రైటర్ జుహి చతుర్వేది 2020లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆ ఏడాది జుహి చతుర్వేది రచించిన కామెడీ డ్రామా 'గులాబో సితాబో'.. ఒక ఇంటి యజమానికి, అతడి ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తికి మధ్య ఓ వివాదాస్పద భవనం కోసం పెనుగులాటను చూపిస్తుంది. రచయిత ఈ కథకు తను పెరిగిన యూపీ రాజధాని లక్నోను స్థలంగా చేసుకున్నారు. ఆమె తన కథను ముందుకు నడిపించటానికి స్థానిక కళ అయిన బొమ్మలాటను ఉపయోగించుకున్నారు.

ఫొటో సోర్స్, Drishyam Films
ఇంకొన్ని తక్కువ బడ్జెట్ సినిమాలు కూడా.. ఒక్క బులెట్ కూడా పేల్చకుండా ఉత్తరప్రదేశ్‌లోని హాస్యభరిత కథలను, సూక్ష్మమైన కథలను చెప్పగలిగాయి. కామెడీ డ్రామా సుభ్ మంగళ్ జ్యాదా సావధాన్, బరేలీ కీ బర్ఫీ వంటి రొమాంటిక్ కామెడీలు అందులో కొన్ని.
''ఒక నగరానికి కానీ ఒక పర్యావరణానికి కానీ అనేక పార్శ్వాలుంటాయి. అందులో నేరం అనేది ఒక భాగమన్నది నిజమే. కానీ యూపీ విషయంలో కానీ, బీహార్ విషయంలో కానీ ఇంకా ఎన్నో గొప్ప అంశాలున్నాయి'' అంటారు జుహి చతుర్వేది.
రాష్ట్రానికి సంబంధించి పరిమితమైన అవగాహన ఉన్న వారు ఎవరైనా ఈ ప్రాంతపు నిర్మాణాన్ని, అల్లికను శోధించకుండానే.. ''అత్యధిక జనాభా గల రాష్ట్రం, చాలా మతఛాందస ప్రాంతం, తీవ్ర కుల విభజనలున్న ప్రాంతం'' అనే విస్తృత నానుడిని ఉపయోగించుకోవాలని భావించినపుడు సమస్య తలెత్తుతుందని అనుభ యాదవ్ పేర్కొన్నారు.
దీనికి తోడు.. కొత్తగా జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకు ఎక్కే యూపీ నేరాల కథలు జతకలిసి.. రాష్ట్ర ప్రజలను ''పరాయి''ని చేయటానికి దారితీస్తున్నాయని అనుభ యాదవ్, మొహమ్మద్ సయీద్ అంటారు.
దీని ప్రభావం జాతీయ చర్చలో రాష్ట్రాన్ని ఎలా చూస్తారనే దాని మీద చాలా విస్తృతంగా ఉంటాయని సయీద్ చెప్తారు.
ఇంతకుముందు దర్శకులు యూపీ నేపథ్యంగా హింసను విస్మరించకుండానే బహుళ పార్వ్శాలున్న కథలు చెప్పారు.
''భరద్వాజ్ తీసిన ఓంకార (ఒథెల్లోకు అనుకరణ) సినిమాలో హింస ఉంది. కానీ అదే ప్రధాన పాత్ర పోషించదు. అదే రసజ్ఞతగా మారిపోదు'' అని అనుభ యాదవ్ ఉటంకించారు. మాసాన్ వంటి స్వతంత్ర సినిమాలు రోజువారీ జీవితంలో మామూలుగా ఉండే హింసను పట్టిచూపాయి.

ఫొటో సోర్స్, Viacom 18 Pictures
ఒకనాటి అవిభజిత బీహార్ రాష్ట్రంలోని వసేపూర్ పట్టణం నేపథ్యంగా ఓ బొగ్గు మాఫియా గురించి 2012లో అనురాగ్ కశ్యప్ 'గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్' పేరుతో రెండు భాగాలుగా సినిమా తీసి విడుదల చేశారు. ఆ సినిమా తమ జీవితాలను తప్పుగా ప్రతిబింబించారంటూ ఆ ఊరి స్థానికులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు.
ఆ సినిమాలోని చిత్రీకరణ 'ప్రమాదకరమ'ని కూడా కొందరు ఆందోళన వ్యక్తంచేశారు. అయితే.. సినిమా కథకు ప్రధానంగా వాస్తవాలే ఆధారమని రచయిత వాదించారు.
ఇక కొత్త షోలలో చూపిస్తున్న హింస.. ఆ షోల కథల ప్రాంతంతో సంబంధం లేకుండా ఒక మూస పద్ధతిలోకి మారిపోయిందని అనుభ యాదవ్ అంటారు. నేపథ్యం ప్రాధాన్యత అంతకంతకూ తగ్గిపోతుండటంతో షో భాషలు, సరిహద్దులు దాటి వెళ్లటం సులభమవుతుందని ఆమె పేర్కొన్నారు.
సేక్రెడ్ గేమ్స్, ఆర్య వంటి మరింత నగరప్రాంత థ్రిల్లర్ల విషయంలో కూడా ఈ పరిస్థితిలో పెద్ద తేడా లేదు.
''సేక్రెడ్ గేమ్స్ షో నేపథ్యాన్ని యూపీకి మార్చితే.. అందులో ఏం మారుతుంది? హింస రసజ్ఞీకరణ అలాగే ఉంటుంది. మీర్జాపూర్ షోను గుజరాత్‌కు మార్చితే.. అందులో కూడా మారేదేమీ ఉండదు'' అని అనుభ యాదవ్ పేర్కొన్నారు.
అయితే యూపీలోని బెనారస్ (వారణాసి) నగరపు ఆత్మను పట్టిచూపే మాసాన్, ముక్తి భవన్ వంటి సినిమాల విషయంలో ఇలా ఉండదని.. ఆ సినిమాల నేపథ్యాన్ని వేరే చోటకు మార్చలేరని ఆమె చెప్తారు.
ప్రస్తుతం ఇలాంటి షోలు చాలా వరకూ.. ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించటానికి భారీ ప్రచారం, ప్రమోషన్ చేయగల, మార్కెటింగ్ బడ్జెట్లు గల స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు నిర్మిస్తున్నాయి.
''ఈ పరిస్థితులు మారితే.. ఇతర అంశాలూ మారతాయని నేను అనుకుంటున్నా'' అని అనుభ యాదవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- కళ్లు ఎందుకు అదురుతాయి? మీ ఆరోగ్యం గురించి మీ కళ్లు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి...
- అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే మార్గం ఇది
- మదర్స్ డే: తల్లి అయ్యేందుకు సరైన వయసు ఏది? నిపుణులు చెప్పిన సమాధానం ఇది
- దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతున్న మరో వైరస్, తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఏంటి?
- తాజ్ మహల్: ‘మూసి ఉన్న గదుల్లో దాగిఉన్న ఆ రహస్యాలు ఏంటంటే..’
- రాజపక్స సోదరులు: జనం దృష్టిలో యుద్ధ వీరులు అకస్మాత్తుగా విలన్లు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














