పుష్ప: తగ్గేదే లే.. అంటూ బాలీవుడ్‌కు పోటీ ఇస్తున్న దక్షిణాది సినిమా

ఫొటో సోర్స్, Twitter/iamRashmika
- రచయిత, పరాగ్ ఛాపేకర్
- హోదా, బీబీసీ కోసం
ఒకప్పుడు హిందీ వాళ్లకి 'మద్రాసు సినిమాలు' అంటే రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి నటించినవి మాత్రమే. కొంతవరకు నాగార్జున, వెంకటేశ్ కూడా పరిచయమే. నేడు ఉత్తర భారతదేశంలోని పల్లెటూళ్లల్లో కూడా ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి దక్షిణాది హీరోల పేర్లు మారుమోగిపోతున్నాయి.
ధనుష్, అజిత్, విజయ్ దేవరకొండ, చియాన్ విక్రమ్, కిచ్చా సుదీప్, పవన్ కళ్యాణ్, నాగ చైతన్య, రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, సూర్య, సమంత, రష్మిక మందన్న.. ఇలా ఎవరి పేరు చెప్పినా ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, బెంగాల్ నుంచి మధ్యప్రదేశ్, గుజరాత్ వరకు అందరూ గుర్తుపడతారు. వాళ్ల సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి.
హిందీ చిత్రసీమలో దక్షిణాది హీరోయిన్ల హవా వైజయంతీ మాల కాలం నుంచీ మొదలైంది. హేమామాలిని, జయప్రద, శ్రీదేవి, మీనాక్షి శేషాద్రి నుంచి నేడు శృతిహాసన్ వరకు బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగినవారే.
వాళ్లంతా హిందీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నవారు. కానీ, ఇప్పుడు సీను మారిపోయింది. దక్షిణాది తారలు తమ సొంత చిత్రాలతోనే బాలీవుడ్‌లో మెరుపులు మెరిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, TWITTER/PUSHPAMOVIE
పూర్తి వినోదాత్మక చిత్రాలు, ప్రేక్షకుల నాడి పట్టుకోగలగడం, అన్నింటికన్నా ముఖ్యంగా గత 20 ఏళ్ల నుంచీ ఆలోచన, ముందుచూపుతో అమలుచేస్తున్న వ్యూహాలు ఈరోజు బాలీవుడ్‌కు సవాలు విసురుతున్నాయి.
పూర్వం అశ్వమేధయాగం చేసిన తరువాత రాజులు తమ యాగాశ్వాన్ని విడిచిపెట్టేవారు. ఆ గుర్రం ఆగిన చోట, యుద్ధానికి కాలుదువ్వి ఆ ప్రాంతాన్ని కైసవం చేసుకునేవారు.
అదే తరహాలో, బాలీవుడ్ కోటను స్వాధీనం చేసుకునేందుకు దక్షిణాది చిత్రాలు తమ అశ్వమేధయాగపు గుర్రాన్ని పరిగెత్తిస్తున్నాయి. దక్షిణ భారత సినీ సైన్యం బాలీవుడ్‌ను పాలించాలనే కలను సాకారం చేసుకోవడానికి అతిసమీపంలో ఉంది.
అయితే ఇదంతా పుష్ప సాధించిన విజయం వల్లే అనుకుంటే పొరపాటే.
బాలీవుడ్ నటీనటుల సహాయంతో ప్రేక్షకులకు చేరువయ్యే వ్యూహం
సౌత్ సినిమాలు తమ వ్యూహంలో భాగంగా బాలీవుడ్ ప్రేక్షకులకు ఎర వేసే ప్రయత్నం చేశాయి. పెద్ద పెద్ద హిందీ స్టార్లకు తమ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు కల్పించడం మొదలుపెట్టాయి. ఈ వ్యవహారం రోబోలో ఐశ్వర్య రాయ్ నుంచి రాబోయే ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆలియా భట్, అజయ్ దేవగన్ వరకు చేరుకుంది. అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్లూ దక్షిణాది చిత్రాల్లో తళుక్కుమన్నారు. ఈ ట్రెండ్ కొనసాగుతుంది కూడా.
హిందీ నటులను తమ చిత్రాల్లో పెట్టుకోవడం ద్వారా వాళ్లు ఎన్నో ఏళ్లు కష్టపడి సాధించిన మార్కెట్‌ను సులువుగా చేజిక్కించుకోగలుగుతున్నారు. ఈ కిటుకు సౌత్ సినిమా వాళ్లకు తెలిసిపోయింది. ఇక్కడ కూడా వీళ్ల తంత్రం చిన్నదేం కాదు.
"బాలీవుడు నటులను మా ఇండస్ట్రీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోంది. కానీ, దక్షిణాది తారల స్టార్‌డం ఎంత పెద్దదంటే ఇక్కడి ప్రేక్షకులు బయటివాళ్లని జీర్ణించుకోలేకపోతున్నారు" అని పుష్ప హీరో అల్లు అర్జున్ అన్నారు.
ఈ వ్యూహం గత 15-20 ఏళ్లుగా కొనసాగుతోంది. ఇదే వ్యూహాన్ని గతంలో బాలీవుడ్ పాటించింది. దక్షిణాది హీరోయిన్లను తమ చిత్రాల్లో తీసుకుని సౌత్ మార్కెట్‌ను పట్టుకుంది. శ్రీదేవి, జయప్రద లాంటి వాళ్ల వల్ల హిందీ సినిమాలు దక్షిణాది వారికి చేరువయ్యాయి.
మొదట్లో సౌత్ సినిమాల్లో హిందీ క్యారెక్టర్ ఆర్టిస్టులను ఎక్కువగా తీసుకునేవారు. రాహుల్ దేవ్, సోనూ సూద్, చుంకీ పాండే, వినీత్ కుమార్, మురళీ శర్మ తరచుగా సౌత్ డబ్బింగ్ సినిమాల్లో కనిపించేవారు.
దక్షిణ భారత సినీ నిర్మాతలు, అక్కడి పెద్ద పెద్ద కంపెనీలు కూడా రెండు దశాబ్దాల క్రితమే తమ డబ్బింగ్ సినిమాలను టీవీల్లో ప్రమోట్ చేయడం మొదలుపెట్టాయి. నేడు, హిందీ ఛానెళ్లలో ఈ డబ్బింగ్ చిత్రాలు బాగానే సందడి చేస్తున్నాయి.
ఒకప్పుడు దక్షిణాది సినిమాల టీవీ హక్కులు లక్ష నుంచి లక్షన్నర రూపాయలకు వరకూ ఉండేవి. ఛానెళ్ల ఖాళీ సమయాన్ని నింపడానికి అవి ఉపయోగపడేవి. ఇప్పుడు కోట్లలో డీల్స్ జరుగుతున్నాయి.
దక్షిణ రాష్ట్రాలు ప్రయోగించిన పదునైన అస్త్రం ఈ "డబ్బింగ్ మార్కెట్". అది సరిగా తగలాల్సిన చోట తగిలింది.

ఫొటో సోర్స్, TWITTER/BINGED
'దక్షిణాది చిత్రాల వల్ల బాలీవుడ్‌కు ముప్పు'
ప్రముఖ చిత్రనిర్మాత మెహుల్ కుమార్ మాట్లాడుతూ, "ఇలా ఇంతకు ముందెన్నడూ జరగలేదు. ఇది కచ్చితంగా బాలీవుడ్‌కు హెచ్చరిక లాంటిది. వాళ్ల డబ్బింగ్ మూవీ ఫార్ములా హిట్ అయింది" అన్నారు. దీనికి కారణాలను కూడా ఆయన వివరించారు.
"బాలీవుడ్ 100 శాతం ప్రమాదంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ కంటెంట్ పక్కకు వెళ్లిపోయింది. పెద్ద స్టార్ దొరికితే చాలు, సినిమా తీసేద్దాం అనుకుంటున్నారు. పెద్ద స్టార్ల జోక్యం ఎక్కువైపోయింది. తనకు నచ్చినట్టు సినిమా తీసే అవకాశం దర్శకుడికి లభించట్లేదు. ఈరోజు పుష్ప సినిమా 10వ వారం నడుస్తోంది. నేనిక్కడ పేర్లు చెప్పదలుచుకోలేదు. కానీ, ఒక పెద్ద కంపెనీ ముందు పాటలు కొనేస్తుంది. తరువాత, దర్శకుడిని పిలిచి నా దగ్గర ఈ 10-12 పాటలు ఉన్నాయి. వీటిల్లో ఏది బావుంటే అవి తీసుకో అని చెప్తుంది. ఇదేమిటి? బాలీవుడ్‌లో కంటెంట్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదని సౌత్ వాళ్లకు ముందే తెలుసు కాబట్టి ప్రేక్షకుల అభిరుచి బట్టి కథ, పాటలపై దృష్టి పెట్టారు. మేం కంటెంటే అందించలేకపోతున్నాం" అని మెహుల్ కుమార్ అన్నారు.
సౌత్ డబ్బింగ్ సినిమాల ప్రభావం ఎంతుందంటే, ఒకప్పుడు కొరియన్, హాలీవుడ్ చిత్రాలను హిందీలో రీమేక్ చేసేవారు.. ఇప్పుడు రీమేకులకు తమిళం, తెలుగు మలయాళ సినిమాలపై ఎక్కువ ఆధారపడుతున్నారు.
ఇందులో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌లు ఒక అడుగు ముందే ఉన్నారు. సౌత్ సినిమా రీమేక్ "రౌడీ రాథోడ్"తో అక్షయ్ కుమార్ కెరీర్ మలుపు తిరిగిందనే చెప్పవచ్చు. బాలీవుడ్‌పై రీమేక్ సినిమాల ప్రభావం కచ్చితంగా ఉంది. అందుకే పుష్ప 14 రోజుల్లో రూ. 234 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్ల దగ్గర జనాలు తగ్గట్లేదు.
అంతకుముందు 'మాస్టర్' సినిమా 209.60 కోట్లు, 'వకీల్ సాహబ్' 119.90 కోట్లు, 'అఖండ' 103 కోట్లు, 'అన్నాతే' 102.50 కోట్లు, 'ఉప్పెన' 93.30 కోట్లు, 'డాక్టర్' 81.60 కోట్లు రాబట్టాయి.

ఫొటో సోర్స్, UNVIERSAL PR
బాహుబలితో ఆరంభం..
భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తీసిన బాహుబలి (రెండు భాగాలూ) సినిమా హిందీ బెల్ట్‌లో రాజ్యమేలిందని చెప్పడానికి సందేహించక్కర్లేదు. కంటెంట్ పరంగానే కాకుండా, ఈ సినిమా 'లార్జర్ దేన్ లైఫ్' గా తయారైంది. ఇక, కట్టప్ప మామ ఉండనే ఉన్నాడు.
'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ' ఈ ప్రశ్న షోలే సినిమా డైలాగులాగ అజరామరంగా నిలిచిపోతుంది.
దేశవ్యాప్తంగా సినిమా వ్యాపారంపై దృష్టి పెట్టే ట్రేడ్ ఎక్స్‌పర్ట్ అతుల్ మోహన్, బాలీవుడ్‌లో దక్షిణాది సినిమాలు జోరందుకోవడానికి గల కారణాలను విశ్లేషించారు.
"10-15 ఏళ్ల ముందు సౌత్ డబ్బింగ్ సినిమాలు టీవిల్లో రావడం ప్రారంభంచినప్పుడే దీనంతటికీ పునాది పడింది. టీవీలు ప్రేక్షకులకు ఉచితంగా వినోదాన్ని పంచిపెట్టాయి. మరోవైపు బాలీవుడ్ వాళ్లు రియలిస్టిక్ సినిమాల మీద దృష్టి పెట్టడం ప్రారంభించారు. మల్టీప్లెక్సులు, నగరవాసులపై ఎక్కువ దృష్టి సారించారు. దక్షిణాది వాళ్లకు యూట్యూబ్ ఒక పెద్ద ఆయుధం. సౌత్ కంటెంట్‌కు వ్యూయర్షిప్ కోట్లలో ఉంది. టీవీ ఛానెళ్లల్లో వాటి టీఆర్‌పీ బాగా పెరిగింది. అర్జున్, మహేష్ బాబు, విజయ్, అజిత్ మొదలైనవారు పాపులర్ అయ్యారు. మేం క్లాస్ సినిమాలపై దృష్టి పెడితే, వాళ్లు మాస్ సినిమాలపై దృష్టి పెట్టారు. సింగిల్ స్క్రీన్ జనాలు కోరుకునేది అదే. ఆపై బాహుబలి ఈ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.
తెలుగు ఒక్కటే తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజలూ చూస్తారు. అక్కడే వాళ్లకి 100 కోట్లు వసూలు అవుతాయి. మావాళ్లకు దేశం నలుమూలల నుంచీ వంద కోట్లు రావడం కష్టమే. నిష్పత్తి ప్రకారం చూస్తే, సౌత్ కంటే 20 రెట్లు ఎక్కువగా బాలీవుడ్ బిజినెస్ జరగాలి.
సౌత్ వాళ్లు తమను తాను అప్‌గ్రేడ్ చేసుకుంటుంటే, మేం డీగ్రేడ్ అవుతున్నాం. ఇంటెలిజెంట్ కంటెంట్ కావాలంటే మలయాళం సినిమాలు చూడండి. మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే తెలుగు, తమిళం సినిమాలు చూడండి. వాళ్ల ఒరిజినల్ సినిమాలను సల్మాన్, అక్షయ్ లాంటి వాళ్లు రీమేక్ చేస్తున్నారు. మేం క్లాసిక్, ఆర్ట్ తరహా చిత్రాలను మాత్రమే రూపొందిస్తున్నాం. బాహుబలి లాంటి సినిమా బాలీవుడ్‌లో ఎప్పుడూ రాలేదు. ఆ సినిమా కట్టలు తెంచుకుని మరీ హిందీ బెల్ట్‌ను ఆక్రమించుకుందని చెప్పవచ్చు. ఇది ఒక్కరోజులో జరిగింది కాదు. పదేళ్ల పాటు నెమ్మది నెమ్మదిగా సాగింది. మాకు తెలియనే లేదు" అని అతుల్ అన్నారు.
'నార్త్-సౌత్ సినిమాల మధ్య అంతరం మూసుకుపోయింది'
"బాలీవుడ్‌కి ఇది కష్టకాలం. మల్టీస్టారర్ మసాలా మాత్రమే పని చేస్తుందని వారికి అర్థమైంది. అందుకే అలాంటి సినిమాలే తీస్తున్నారు. వచ్చే రెండు మూడేళ్లల్లో వీటి ఫలితాలు కనిపిస్తాయి. బాలీవుడ్ తారలు తమను తాము ఓవర్ ఎక్స్‌పోజ్ చేసుకున్నారు. వాళ్లు కొంచం వాళ్లు రిజర్వ్‌డ్‌గా ఉండాలి. అప్పుడే దక్షిణాది తారల్లాగ స్టార్‌డమ్ వస్తుంది" అని అతుల్ మోహన్ అభిప్రాయపడ్డారు.
ఒకప్పుడు బాలీవుడ్‌కు బాలీవుడ్ నుంచే పోటీ వచ్చేదని, ఇప్పుడు హాలీవుడ్, తమిళం, తెలుగు, ఓటీటీ కంటెంట్ నుంచి కూడా పోటీ వస్తోందని సినీ విశ్లేషకుడు కోమల్ నహతా అన్నారు.
"ఈ పోటీ ఎంత పెరిగిపోయిందంటే బాలీవుడ్ చాలా కష్టపడాల్సి వస్తోంది. కొత్తదనం కావాలి. ఏదో ఒకటి తీసేసి, ప్రేక్షకుల కోసం కొంచం మసాలా జోడిస్తామంటే కుదరదు. సగటు సరుకులకు ఇప్పుడు జాగా తగ్గింది. తాహతుకు మించి శ్రమించాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌తో సమీకరణాలన్నీమారిపోయాయి. ఇకపై బాలీవుడ్ ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఇప్పుడు దక్షిణ నదికి గేట్లు తెరుచుకున్నాయి. వరద రావడం ఖాయం. ఇప్పటికే తమ ప్రాంతాలలో, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న దక్షిణాది తారలు హిందీ బెల్ట్ ప్రేక్షకుల హృదయాలను శాసించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేక్షులూ తయారుగా ఉన్నారు. చాలా సినిమాలు పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఇప్పుడు సినిమాల్లో ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా పోయింది. భారతీయ సినిమా ఒక్కటే ఉంది. అది అలాగే కొనసాగుతుంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- రష్యా-యుక్రెయిన్ సంక్షోభం: భారత వైఖరిపై ఇంత చర్చ ఎందుకు
- డీఫిబ్రిలేషన్ ఇచ్చి ఉంటే మంత్రి గౌతమ్ రెడ్డి ప్రాణాలు కాపాడగలిగేవారా?
- బ్రిటన్ను భయపెట్టిన భారత మేజిక్ మహారాజు
- యుక్రెయిన్ సంక్షోభ సమయంలో ఇమ్రాన్‌ఖాన్ రష్యా ఎందుకు వెళ్లారు, భారత్‌పై చూపే ప్రభావమేమిటి?
- కర్ణాటక: బజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసు.. పోలీసులు ఏం చెబుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













