సిరివెన్నెల సీతారామశాస్త్రి: ప్రేమ, విరహం, భక్తి, రక్తి, విప్లవం, వినోదం అన్నీ తెలిసిన కలం

సిరివెన్నెలకు సత్కారం

ఫొటో సోర్స్, RajaChembolu

    • రచయిత, ఆలమూరు సౌమ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"తెల్లారింది లెగండో.. కొక్కోరోకో, మంచాలింక దిగండో.. కొక్కోరోకో..పాములాటి రాతిరి పడగదించి పోయింది, భయం నేదు భయం నేదు నిదర ముసుగు తీయండి" అంటూ పల్లెపదాలతో చెప్పినా,

"ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రుల పైన, జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన.." అంటూ సమాసభూయిష్టంగా చెప్పినా అందమైన సూర్యోదయం కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది.

అదే సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రత్యేకత. ఆయన రాసిన పాటలు ఎన్నో సూపర్ హిట్లు అయ్యాయి.

"మాట ఎక్కడ మూగబోతుందో పాట అక్కడ మొదలవుతుంది" అని సీతారామశాస్త్రి అనేక సందర్భాల్లో చెప్పారు.

జీవితంలో ఎదురయ్యే చాలా సందర్భాలకు ఆయన పాటలు రాశారనడం అతిశయోక్తి కాదు.

మంచి పదాలతో, అర్థవంతమైన పాట వినగానే ఇది సిరివెన్నెల రాసిందే అయ్యుంటుంది అనుకోవడం పరిపాటి.

మనం మామూలుగా రోజూ మాట్లాడుకునే ఇంగ్లిష్, హిందీ పదాలు కలిపి, పక్కవాళ్లతో మాట్లాడుతున్నట్టు అనిపించే పాటల ప్రయోగాలూ చేశారు.

“ఒరే ఆంజనేలు.. తెగ ఆయసపడిపోకు చాలు..కరెంటూ రెంటూ ఎట్సెట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువ ఐతే కన్నీళ్ళు..” (అమృతం సీరియల్ టైటిల్ పాట)

“సరేలే ఊరుకో పరేషానెందుకో, చలేసే ఊరిలో జనాలె ఉండరా, ఎడారి దారిలో ఒయాసిస్సుండదా..” (లిటిల్ సోల్జర్స్ 1996)

“వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు, వచ్చింది సినిమా ఛాన్సు ఇంక వేసెయ్యి మరో డోసు.." (మనీ 1993)

ఇవన్నీ ఆయన చేసిన తమాషా ప్రయోగాలు.

కుటుంబసభ్యులతో సిరివెన్నెల

ఫొటో సోర్స్, RajaChembolu

ఫొటో క్యాప్షన్, కుటుంబసభ్యులతో సిరివెన్నెల

‘పాట పాడి వినిపిస్తాను’

"నాకు పాట చదవడం రాదు. రాస్తున్నప్పుడు దాన్ని ఏదో ఒక బాణీలో పాడుకుంటూ ఉంటాను. సంగీత దర్శకులకు చెబుతున్నప్పుడు కూడా నాకు తోచిన బాణీలో పాడి వినిపిస్తాను" అని సీతారామశాస్త్రి స్వరాభిషేకం కార్యక్రమంలో చెప్పారు.

1988లో వచ్చిన కళ్లు సినిమాకు పాట రాసినప్పుడు, దాన్ని ఆ చిత్ర సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తనకు తోచిన బాణీలో పాడి వినిపించారాయన.

అది వినగానే "ఈ పాట మీరు పాడితేనే బావుంటుంది" అన్నారు బాలసుబ్రహ్మణ్యం.

అలా తొలిసారి నేపథ్య గాయకుడి అవతారం ఎత్తారు సీతారామశాస్త్రి.

“తెల్లారింది లెగండో కొక్కోరోకో” పాటను స్వయంగా రాసి, పాడారు.

కళ్లు సినిమా సారాంశం మొత్తం వచ్చేలా ఆ పాట రాశానని ఆయన చెప్పారు.

ఆ తరువాత 1993లో వచ్చిన గాయం సినిమాలో "నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని" పాటను తెరపై ఆయన పాడుతున్నట్లుగా కనిపిస్తారు. ఈ పాటను బాలసుబ్రహ్మణ్యం పాడారు.

సిరివెన్నెలకు సత్కారం

ఫొటో సోర్స్, RajaChembolu

ఆదిభిక్షువువాడినేది కోరేది...

1986లో వచ్చిన సిరివెన్నెల సినిమాకు పాటలు రాయడంతో తెలుగు సినీ గేయ రచయితగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు సీతారామశాస్త్రి.

ఆ సినిమానే తన ఇంటిపేరుగా మలచుకున్నారాయన.

సిరివెన్నెల పాటలు అనగానే అందరికీ "విధాత తలపున ప్రభవించినది" పాట గుర్తొస్తుంది. కాస్త కఠినమైన పదాలతో, అర్థాలు తెలుసుకునేందుకు డిక్షనరీ వాడాల్సిన పరిస్థితి కల్పిస్తూ నాదఝరిలా సాగిపోతుంది ఆ పాట.

కానీ, అదే సినిమాలోని "ఆదిభిక్షువువాడినేది కోరేది" పాట అలతి అలతి పదాలతో లోతైన భావంతో సాగుతుంది.

తన మనసులో కోరికను శివుడికి చెప్పమని హీరోయిన్, హీరోతో అన్న సందర్భంలో ఆదిభిక్షువువాడినేది కోరేది, బూడిదిచ్చేవానినేది అడిగేది" అంటూ నిందాస్తుతిలో రాసిన పాట ఇది.

ఆదిభిక్షువు అంటే ఈ ప్రపంచంలోనే తొలి భిక్షువు.. బిచ్చం ఎత్తుకునేవాడిని ఏం కోరుకోమంటారు. అడిగినా బూడిద మాత్రమే ఇచ్చేవాడిని ఏమి అడగమంటారు అంటూ విరుద్ధమైన భావాలను పక్కనపక్కనే చేర్చి రాసిన ప్రయోగం ఈ పాట.

తీయగా పాడే కోకిలేమో నలుపు రంగు, భయంకరంగా గర్జించే మేఘాలకు మెరుపుల హొయలు.. పైపై మెరుగులు చూసి భ్రమపడవద్దని చెబుతున్నట్టు.

తేనెలొలికే పూవులకు మూడే రోజులు ఆయుష్షు, బండరాయికి చిరాయువు.. బతికున్నది మూడు రోజులైనా పూవులా గుబాళించాలని, రాయిలా ఎన్నాళ్లు బతికితే ఏం ప్రయోజనమని అర్థం.

"ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు" అంటూ నిదాస్తుతిలో సాగుతుంది.

సిరివెన్నెల

ఫొటో సోర్స్, Sirivennelaofficial/twitter

స్వర్ణకమలం (1988)లో శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ పాటను గమనిస్తే.. రెండు వ్యతిరేక భావనల మధ్య జరిగే సంఘర్షణ అది.

భరతనాట్యం నేర్చుకోమని, సంప్రదాయలు పాటించడమే ధర్మమని హీరో, హీరోయిన్‌కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు.

సంప్రదాయాలు, చట్టుబండలు నాకక్కర్లేదని, స్వేచ్ఛగా విహంగలా ఆకాశంలోకి ఎగరాలన్నదే నా కోరిక అని హీరోయిన్ జవాబిస్తుంది.

ఈ గేయ రచనలో సీతారామశాస్త్రి డెవిల్స్ అడ్వకేట్ పాత్ర పోషించారని చెప్పవచ్చు.

ఆయన ఇంటర్వ్యూలు వింటే సనాతనధర్మం, సంప్రదాయాలపై విశ్వాసం ఉన్న వ్యక్తి అని బోధపడుతుంది.

తాను నమ్మిన విశ్వాసాలను వ్యతిరేకిస్తూ పాట రాయడం అంత సులువేం కాదు.

హీరో వాదనకు దీటుగా హీరోయిన్ వాదన కూడా బలంగా ఉండాలి. భావంలోనే కాక వాడే పదాల్లో కూడా ఇద్దరి ఆలోచనల్లో భేదం స్పష్టంగా కనిపించాలి.

అలాగే, హీరోయిన్ ఆలోచనలు తప్పు అనిపించకూడదు.

తన కెరీర్‌లో ఈ పాట రాయడానికి పట్టినంత సమయం ఇంకే పాటకూ పట్టలేదని ఆయన పలుమార్లు చెప్పారు.

తిరోగామి భావాలతో పాటలు రాశారన్న విమర్శలూ ఉన్నాయి.

ఫొటో సోర్స్, SIRIVENNELASITHARAMASHASTRY/FB

ఫొటో క్యాప్షన్, తిరోగామి భావాలతో పాటలు రాశారన్న విమర్శలూ ఉన్నాయి.

"దృశ్యాన్ని వివరించి, పాట రాయమన్నారు విశ్వనాథగారు. దీనికి ఎంత టైమైనా తీసుకో, నువ్వు పాట ఎప్పుడిస్తే అప్పుడు ఆ దృశ్యాలు తీస్తాను అని ఆయన నాతో చెప్పారు. వారం రోజులు కష్టపడిన తరువాత ఓరోజు రాత్రి ఓ పల్లవి వచ్చింది. ఆ పల్లవి చూసి నేనే చాలా మురిసిపోయాను. వెంటనే విశ్వనాథగారికి వినిపించాను. అది వినగానే ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఇప్పుడు అమ్మాయి పల్లవి రాయి అన్నారు. అప్పుడు నాకర్థమైపోయింది నా పీకకు ఉరితాడు వేసుకున్నానని. మొదటి పల్లవి రాగానే ఆనందపడిపోవడం పొరపాటు అని. ఇద్దరి భావాలను బ్యాలన్స్ చేస్తూ రాయాలి. భాష దగ్గర నాకు పెద్ద సమస్య వచ్చింది. హీరో కళాకారుడు, హృదయానికి సంబంధించిన భాష రాయాలి. ఈ అమ్మాయికి ప్రాపంచిక విషయాలపై మక్కువ. పంచేంద్రియాలకు కనిపించే భాష వాడాలి. పదిహేను రోజుల పాటు రాత్రి, పగలు ఆలోచించాను. తిండి తిప్పలు లేవు..ఎలా రాయాలి, ఎలా రాయలి అని తపించిపోయాను. పదిహేను రోజుల తరువాత ఆ అమ్మాయి పల్లవి తట్టింది. వెంటనే పాట అంతా వచ్చేసింది" అంటూ సీతారామశాస్త్రి విశ్వనాథామృతం కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.

సిరివెన్నెల

ఫొటో సోర్స్, SIRIVENNELA OFFICIAL/TWITTER

ఒరే ఆంజనేలు.. తెగ ఆయసపడిపోకు చాలు

"అయ్యోలు అమ్మోలు ఇంతేనా బ్రతుకు హు హు హు.. ఆహాలు ఓహోలు ఉంటాయి వెతుకు హ హ హ" అంటూ గమ్మత్తుగా మొదలవుతుంది అమృతం సీరియల్ టైటిల్ సాంగ్.

తెలుగు రాష్ట్రాల్లో అమృతం సీరియల్ ఇష్టపడనివారు అరుదే.

కొన్ని సంవత్సరాల పాటు టీవీలో ప్రసారమైన ఈ సీరియల్‌ను ఇప్పటికీ యూట్యూబ్‌లో వేల మంది వీక్షిస్తున్నారని ఈ సీరియల్ రచయిత గుణ్ణం గంగరాజు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

అమృతం సీరియల్‌లో కథ అంటూ ఏమీ ఉండదు, పాత్రల మధ్య నడిచే హాస్య సన్నివేశాలే తప్ప.

ఒక ప్రత్యేకమైన కథాంశం లేకుండా సాగే ఈ సీరియల్‌కు టైటిల్ సాంగ్ రాశారు సీతారామశాస్త్రి.

మధ్యతరగతి జీవితాల కష్టాలను తేలికపరిచి.. ఈ భవసాగరన్ని సులువుగా దాటేయగలం, గాబరపడుకు అని భుజం మీద చేయి చెప్పినట్టు ఉంటుంది ఇందులో సాహిత్యం.

సినిమా పాటలంత పాపులారిటీ సంపాదించుకుంది ఈ పాట.

"వార్తల్లో హెడ్లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు, అయోడిన్‌తో ఐపోయే గాయాలే మనకు గండాలు".. మనకొచ్చే కష్టాలు చిన్న చిన్నవేలే, పోతాయి. అయ్యో, అమ్మో మాత్రమే కాదు ఆహా ఓహో కూడా ఉంటాయి, జీవితాన్ని ఆనందించు అని చెప్తుందీ పాట.

"అది సరదా పాటలా అనిపించే ఒక ఓదార్పు పాట. కష్టాల కడలిలో కొట్టుకుపోతున్నాం అని దిగులు పడే ప్రతీ మనిషికి అదో సుతిమెత్తని మందలిపు. మనసుని ఉత్తేజపరచే ఒక స్పూర్తిదాయక జ్ఞానబోధ" అని అమృతం ఫేం హర్ష వర్ధన్ బీబీసీతో చెప్పారు.

సిరివెన్నెల

ఫొటో సోర్స్, Raja Chembolu

మనసున ఉన్నది చెప్పాలనున్నది

సీతారామశాస్త్రి రాసిన పాటల్లో ఎక్కువ భాగం ప్రేమ పాటలకే దక్కింది.

ఒక అమ్మయి తన మనసులోని భావాలను ప్రేమించే అబ్బాయికి చెప్పలేని సందర్భాల్లో.. "మనసున ఉన్నది చెప్పాలనున్నది" (ప్రియమైన నీకు 2001) అనో.. "తెలుసునా తెలుసునా మనసుకే తొలి కదలిక" (సొంతం 2002) అంటూ సీతారామశాస్త్రి పాటలను ఆశ్రయించాల్సిందే.

"నీ అల్లర్లు అందం నీ అలకల్లు అందం, నన్ను కవ్వించి నవ్వించె నీ నేస్తమే మంచి గంధం" (తారక రాముడు 1997), జాబిలమ్మ నీకు అంత కోమా, జాజిపూల మీద జాలి చూపుమా (పెళ్లి 1997) అంటూ ప్రేయసీ ప్రియుల అలకలు తీర్చే పాటలు ఎన్నో.

తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో (క్రిమినల్ 1995), కన్నుల్లో నీ రూపమే (నిన్నే పెళ్లాడతా 1996), నువ్వు నువ్వు నువ్వే నువ్వు (ఖడ్గం 2002) లాంటి ఎన్నో పాటలను సీతారామశాస్త్రి అందించారు.

తెలుగు సినిమా పాటలకు సాహిత్య గౌరవం కల్పించాలని సీతారామశాస్త్రి అనేక సందర్భాల్లో చెప్పారు

ఫొటో సోర్స్, VICE PRESIDENT OF INDIA/FB

ఫొటో క్యాప్షన్, తెలుగు సినిమా పాటలకు సాహిత్య గౌరవం కల్పించాలని సీతారామశాస్త్రి అనేక సందర్భాల్లో చెప్పారు

ఐటం సాంగ్స్

రాసే ముందు ప్రతీ పాటలోకి పరకాయప్రవేశం చేస్తానని, క్లబ్ డాన్సర్‌కు పాట రాసినా, ఆ క్లబ్ డాన్సర్ నేనే అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తానని సీతారామశాస్త్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

"రాసేటప్పుడు నాకున్న పరిమితులకు లోబడి, నా స్థాయి ఏమిటో గుర్తుతెచ్చుకుంటాను. నా స్థాయి అంటే నా భార్య, పిల్లలు, చెల్లెలు, కూతుర్లు, కొడుకులు..వీళ్లంతా ఆ పాట వినగలగాలి. ఆ పాటతో తమ అనుభవాలను కంపేర్ చేసుకోగలగాలి. అంతే తప్ప కొన్ని పాటలను అంటరాని పాటలుగా రాసి పక్కనపడేసి, ఇవి మీరు వినేవి కావు అనకూడదు. ఇలాంటి కొన్ని నిబద్ధతలతో పాటలు రాశాను. "

"ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ, ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి" అంటూ అంతం (1992) సినిమాలో సిల్క్ స్మితపై చిత్రీకరించిన ఐటం సాంగ్ సాహిత్యం కూడా హాయిగా అందరూ పాడుకోగలిగేలా సాగుతుంది.

అలాగే, రక్షణ (1993)లో తెలంగాణ యాసలో సాగే ఐటం సాంగ్ "నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను ఆడనో చెప్పలేను యాడనో చెప్పలేను రా" ఇదే తరహాలో సాగుతుంది.

అల్లరి మొగుడు (1992)లో రమ్యకృష్ణపై పాటను చిత్రీకరించిన విధానం, మధ్యలో వచ్చే శబ్దాలు ఐటం సాంగ్ లాగ అనిపించినా, సీతారామశాస్త్రి ఆ పాటను యోగా మీద పాటగా మలిచారు.

"బంచిక్ బంచిక్ చెయ్యి బాగా.. ఒంటికి యోగా మంచిదేగా, లేజీగా ఒళ్లు పెంచుకోక.. నాజూగ్గా ఉండు తీగలాగ" అంటూ ఆ పాట రూపు మార్చేశారు.

చిరంజీవితో సిరివెన్నెల సీతారామశాస్త్రి

ఫొటో సోర్స్, CHIRANJEEVI/TWITTER

మనిషిని తట్టి లేపే ఎన్నో పాటలు రాసినప్పటికీ, తిరోగామి భావాలతో కూడా చాలా పాటలు రాశారాని కొందరు విమర్శిస్తారు.

"అపురూపమైనదమ్మ ఆడజన్మ.. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా" (పవిత్ర బంధం 1996)

"విద్యలున్నా విత్తమున్నా ఒద్దికెరుగని వనితలు, ఒడ్డుదాటే ఉప్పెనల్లే ముప్పుకారా ముదితలు.. పెద్దలను మన్నించే పద్దతే వద్దంటే, మానము మర్యాదా ఆగునా ఆ ఇంట" (ఆడదే ఆధారం 1988)..

అంటూ సంప్రదాయ భావాలను ఉటంకిస్తూ, మహిళల గౌరవాన్ని తగ్గించేలా పాటలు రాశారనే విమర్శలూ ఉన్నాయి.

సీతారామశాస్త్రి సుమారు మూడువేల పాటలు రాశారు.

ఫొటో సోర్స్, SIRIVENNELASITHARAMASASTRY/FB

ఫొటో క్యాప్షన్, సీతారామశాస్త్రి సుమారు మూడువేల పాటలు రాశారు.

‘సీతారామశాస్త్రి గారంటే నాకు భయం'

మర్యాద రామన్న (2010) సినిమా ఆడియో ఫంక్షన్‌లో రాజమౌళి మాట్లాడుతూ సీతారామశాస్త్రి గారంటే నాకు భయం అంటూ చెప్పుకొచ్చారు.

"ఎప్పుడైనా పాట రాయించుకోవడానికి ఇంటికెళితే, ఈ కథ ఎందుకిలా ఉంది అని తిడతారని చెప్పి భయపడి ఎప్పుడూ వెళ్లను. కానీ, ఈ సినిమాలో ఇది ఆయన తప్ప ఎవరూ రాయలేని పాట. హీరో సునీల్ భయపడి పారిపోతుంటే ఒక ఎమోషనల్ సాంగ్ కావాలి. అలాంటి పాట ఆయనే రాయగలరు. అందుకే ధైర్యం చేసి ఆయన్ను అడిగాను."

ఈ సినిమాలో "పరుగులు తియ్ పరుగులుతీయ్ బిరబిర" పాట రాశారాయన.

సిరివెన్నెల

ఫొటో సోర్స్, Twitter/poojahegde

‘పిల్లలను గురువులుగా భావిస్తాను’

పిల్లల కళ్ల ద్వారా వర్తమానం చూడాలంటారు సీతారామశాస్త్రి.

"నా ముందు తరం నాకు గురువు. అన్నీ పుస్తకాల్లో ఉండవు. పుస్తకాల్లో ఉన్నవి నిన్నటి గురించి చెప్తాయి. రేపటి గురించి చెప్పవు. వర్తమానంలో ఉన్న పిల్లలే రేపటి గురించి మాట్లాడతారు. వాళ్ల దగ్గర నుంచి నేర్చుకోవాలి" అంటారాయన.

ఆయన్ను గురువుగా భావించే శిష్యులను, వర్థమాన గేయ రచయితలను బాగా ప్రోత్సహిస్తారని చెబుతారు.

"నన్ను గురువుగా కంటే మీ గురిగా పెట్టుకోండి. నాలాగే రాయాలి అని ఎప్పుడూ అనుకోవద్దు. నాలాగే రాయడానికి నేనున్నాగా. నాకంటే గొప్పగా రాయాలని కోరుకోండి. దానికి తగ్గ శ్రమ చేయండి. అప్పుడే నాకు సంతోషం. మీకు తెలియని కొత్త భావాలేమీ రాయలేదు నేనెప్పుడూ. మీలోని నిద్రిస్తున్న భావాలని తట్టి లేపే ప్రయత్నం చేశానంతే. అక్షరాన్నెప్పుడూ సంస్కారపు అంచులని దాటనివ్వకండి అని చెప్పేవారు ఆయన" అంటూ సీతారామశాస్త్రితో దాదాపు 21 ఏళ్లుగా అనుబంధం ఉన్న వర్థమాన సినీ గేయ రచయిత శతఘ్ని బీబీసీతో చెప్పారు.

సుమారు 20 ఏళ్ల క్రితం ఆయన రాసిన "బోటనీ పాఠముంది.. మేటనీ ఆట ఉంది" (శివ 1989) పాట యువతను ఎంత ఉర్రుతలూగించిందో, ఇటీవల రాసిన "సామజవరగమనా.. నిను చూసి ఆగగలనా" (అల వైకుంఠపురంలో 2020) పాట కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంది.

రాజమౌళి ఆర్ఆర్ఆర్‌కు చివరి పాట రాశారని చెబుతున్నారు.

సుమారు 3000 పాటలు రాసి, సింగిల్ కార్డ్ లిరిసిస్ట్‌గా ఎన్నో సినిమాలకు పనిచేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి "తెలుగు సినిమా పాటలకు సాహిత్య గౌరవం కల్పించాలని" అనేక సందర్భాల్లో చెప్పారు. ఆయన పాటలు రాసినంత కాలం ఆ దిశగా కృషి చేస్తూ వచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)