ఆంధ్రప్రదేశ్‌లో చెరకు ఫ్యాక్టరీలు రైతులకు బకాయిలు ఎందుకు చెల్లించట్లేదు? చక్కెర పండించే రైతుల జీవితాల్లో ‘తీపి’ ఎందుకు కరువైంది?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
"నా భార్య, ఆడపిల్లల నగలు తాకట్టు పెట్టి చెరకు పంటేశాను. 30 టన్నులు ఫ్యాక్టరీకి తోలాను. ఆరు నెలలు దాటింది. ఫ్యాక్టరీ పైసా బకాయి చెల్లించలేదు. వడ్డీలు పెరిగిపోతున్నాయి. అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు చెరకు పంటేసే బాగుపడ్డాను. ఇప్పుడు ఆ పంటే నన్నుఅప్పుల పాలు చేసింది. ఇక నేను చెరకు పంట వేయను" అని గోవిందరావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన దేశంలోనే మొదటి సహకార చక్కెర కర్మాగారమైన ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీకి చెరకును సరఫరా చేస్తారు.
ఒక వైపు చక్కెర కర్మాగారాల దగ్గర బకాయిలు చెల్లించడంటూ రైతులు ఆందోళన చేస్తుంటే, మరో వైపు చక్కెర కర్మాగారాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలోని ప్రైవేటు, సహకార చక్కెర కర్మాగారాలన్నింటి వద్దా కనిపిస్తున్నాయి. తీపిని పండించే చెరకు రైతు పరిస్థితి ఎందుకిలా అయ్యింది? చెరకు ఫ్యాక్టరీలు రైతులకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు?

ఫొటో సోర్స్, UGC
మొత్తం 29...సహకార రంగంలో 10...
రాష్ట్రంలో ప్రైవేటు, సహకార రంగంలో మొత్తం 29 చక్కెర కర్మాగారాలు ఉండేవి. అయితే 22 ఫ్యాక్టరీలు మూతబడ్డాయని, కేవలం ఏడు మాత్రమే నడుస్తున్నాయని కార్మిక సంఘం నాయకులు అంటున్నారు.
ప్రభుత్వం మాత్రం 18 చక్కెర కర్మాగారాలు పనిచేస్తున్నాయని చెప్తోంది.
22 ప్యాక్టరీలు మూతపడితే, ప్రభుత్వం మాత్రం మరమ్మత్తుల కోసం ప్యాక్టరీ గేట్లు ఓపెన్ చేసినా ఆ ప్యాక్టరీ పని చేస్తున్నట్లే అనుకుంటోందని రైతు సంఘాలు అంటున్నాయి.
అవి కూడా చెరకు సరఫరా చేసిన రైతులకు బకాయిలు చెల్లించకుండా ఏళ్లుగా ముప్పతిప్పలు పెడుతూ... వారిని చెరకు పంటకు దూరం చేస్తున్నాయని చెప్తున్నారు.
"గతంలో లక్షలాది ఎకరాల్లో చెరకును పండించే రైతు ఇప్పుడు చక్కెర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా...చెరకు పంటకు దూరమవ్వడంతో చెరకు పంట విస్తీర్ణం చాలా తగ్గిపోయింది.
యాజమాన్యాల నుంచి బకాయిలు రాకపోవడంతో రైతులు చెరకు పంట పండించడానికే ఆసక్తి చూపడం లేదు.
విశాఖ, విజయనగరం పరిధిలో ఉన్న గోవాడ, ఏటికొప్పాక, తాండవ షుగర్ ఫ్యాక్టరీల నుంచి రైతులకు దాదాపు రూ. 50 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. అలాగే విజయనగరంలోని బొబ్బిలి షుగర్ ప్యాక్టరీ రైతులకు రూ. 16 కోట్లు చెల్లించాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చెరకు రైతులకు రూ. 150 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాలని అంచనా.
1966 షుగర్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం రైతు ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన తొలి 15 రోజులకే బకాయి చెల్లించాలి. ఇప్పుడు దాదాపు 800 వందల రోజులైనా కూడా బకాయిలు చెల్లించలేదు.
"ఇలాంటి సమయాల్లోనే రెవెన్యూ రికవరీ యాక్ట్ (ఆర్‌ఆర్ యాక్ట్)ను అమలు చేసి యాజమాన్యాల ఆస్తులను అమ్మి బకాయిలు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిస్తోంది. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించమని రైతులు ఆందోళన చేస్తే లాఠీఛార్జి చేసి పోలీసులను ప్రయోగిస్తోంది. ఇదేనా రైతు ప్రభుత్వం? ప్రభుత్వం, చెరకు రైతుల మధ్య చక్కెర పాలసీని తీసుకొచ్చి రైతుకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలి" అని అఖిల భారత కార్మిక సంఘం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. అప్పలరాజు బీబీసీతో చెప్పారు.

దేశంలోనే తొలి చెక్కర ఫ్యాక్టరీకి మనుగడ సాధ్యమేనా?
దేశంలో సహకార రంగంలో ఏర్పాటైన తొలి చక్కెర కర్మాగారం ఏటికొప్పాక. అయితే దీని మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకమైంది. 70 మెట్రిక్ టన్నుల క్రషింగ్ (గానుగాడటం) కెపాసిటీతో ప్రారంభమైన ఏటికొప్పాక ఒక దశలో 2 లక్షల 89 టన్నుల క్రషింష్ చేసి రికార్డులు నెలకొల్పింది.
అయితే ప్రస్తుతం 30 టన్నులకే ఆ సామర్థ్యం పడిపోయింది. ఈ పరిస్థితి సహకార చక్కెర కర్మాగారాల పరిస్థితికి ఉదాహరణగా నిలుస్తోంది.
రైతులకు బకాయిలు చెల్లించలేకపోతున్న పరిస్థితుల్లో ఉన్న ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ ఈ ఏడాది క్రషింగ్ కూడా చేస్తుందనే నమ్మకం రైతుల్లో లేదు. దాంతో ఇక తాము చెరకు వేయలేమని అంటున్నారు రైతులు.
"మాకు రూ. 5 లక్షలు బకాయిలు ఫ్యాక్టరీ చెల్లించాలి. ఆరు నెలలుగా అడుగుతూనే ఉన్నాం. కానీ ఒక్క పైసా ఇవ్వలేదు. గతంలో ఎంతో వైభోగంగా కనిపించిన ఈ ఫ్యాక్టరీ ఇవాళ అనాధలా అయిపోయింది. ఈ ఫ్యాక్టరీ కారణంగానే మేం బాగుపడ్డామనే ఆలోచనతో మంచి రోజులు వస్తాయేమోనని ఎదురు చూస్తున్నాం. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు"అని ఏటికొప్పాక గ్రామానికి చెందిన చెరకు రైతు సత్యనారాయణ బీబీసీతో చెప్పారు.
"ముందు బకాయిలు తీరిస్తే...అప్పులు తీర్చుకుంటాం. ఏది ఏమైనా రోజుకు 500 ఎడ్లబళ్లు ఈ ప్యాక్టరీలోకి రాకపోకలు సాగించిన కళ్లతో...దిక్కుమొక్కులేని విధంగా ఫ్యాక్టరీని చూస్తే బాధేస్తుంది" అని అన్నారు.

రైతులే కాదు...కార్మికుల పరిస్థితి అదే...
ఒకవైపు చెరకు సరఫరా చేసిన రైతులు బకాయిలు రాక అప్పుల పాలైపోతున్నారు. అలాగే ఫ్యాక్టరీలో అతి తక్కువ వేతనాలకు పనిచేసే కార్మికులు సైతం జీతాలు లేక ఆర్థికంగా సతమతమైపోతున్నారు.
ఏటికొప్పాక కర్మాగారంలో 5 వేల నుంచి 8 వేల రూపాయల వరకు మాత్రమే జీతాలు ఇస్తున్నారు. అవి కూడా గత రెండేళ్లుగా ఇవ్వడం లేదని కార్మికులు చెబుతున్నారు.
"ఏటికొప్పాక సహకార చక్కెర కర్మాగారం రోజువారీ క్రషింగ్ సామర్థ్యం 1800 టన్నులు. సీజన్ మొత్తం పని చేస్తే 2.5 లక్షల టన్నులకు పైగానే క్రషింగ్ చేయవచ్చు. యంత్రాలు పాతవైపోవడంతో వాటి క్రషింగ్ సామర్థ్యం తగ్గిపోతోంది. పైగా ఎప్పటికప్పుడు సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. యంత్రాల సమస్యలతో క్రషింగ్ ఆలస్యం అవుతోంది. దీంతో చెరకు నుంచి పంచదార రికవరీ తగ్గిపోతుంది" అని ఏటికొప్పాక ప్యాక్టరీ క్రషింగ్ విభాగంలో పని చేస్తున్న కోటేశ్వరరావు బీబీసీతో చెప్పారు.
"యంత్రాలు బాగు చేయాలంటే ప్రస్తుతం సుమారు రూ. 5 కోట్ల వరకూ అవుతుంది. మాకు జీతాలు ఇచ్చి రెండేళ్లు అవుతోంది. అయితే ఈ ఫ్యాక్టరీ కూడా మూతపడిపోందనే వార్తలు వింటున్నాం. అది చాలా భయం కలిగిస్తోంది. ప్రైవేటు, సహకార రంగంలో పని చేస్తున్న దాదాపు అన్ని చక్కెర కర్మాగారాల పరిస్థితి, దానిని నమ్ముకున్న రైతులు, కార్మికుల పరిస్థితి ఇలాగే ఉంది" అని ఆయన అన్నారు.

చక్కెర కర్మాగారాలకు ఏమైంది?
రాష్ట్రంలో 2 లక్షల 50 వేల మంది చెరకు రైతులు ప్రత్యక్షంగాను 2 లక్షల మంది పరోక్షంగాను చెరకుపై ఆధారపడ్డరని అంచనా. ఒక్క విశాఖ జిల్లాలో నాలుగు సహకార చక్కెర కర్మాగారాలు పని చేయటం వలన జిల్లాలో 19500 హెక్టార్లలో చెరుకు సాగు జరిగేది. తాండవ, ఏటికొప్పాక, తుమ్మపాల (అనకాపల్లి) చక్కెర కర్మాగారాల్లో క్రషింగ్ జరగకపోవడం వలన 6500 ఎకరాల్లో మాత్రమే చెరుకు సాగు చేస్తున్నారని రైతు సంఘం నాయకులు అంటున్నారు.
ధర విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు ప్రైవేటుకు మేలు చేయగా, కష్టాల్లో ఉన్న సహకార ఫ్యాక్టరీలను మరింతగా నష్టాలోకి నెట్టేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు కర్రి అప్పారావు అన్నారు.
"సీఎం జగన్ పాదయాత్ర సమయలో ఏటికొప్పాక ఫ్యాక్టరీ గేటు వద్ద ఆగి సహకార ఫ్యాక్టరీలను ఆధునీకరిస్తామని, మూతబడ్డ వాటిని తెరిపిస్తామని రైతులకు చెప్పారు. కానీ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు దాటింది. ప్రభుత్వం ఇటువైపు కన్నెతి కూడా చూడటం లేదు.
అలాగే భీమసింగి సహకార చక్కెర కర్మాగారం క్రషింగ్ సామర్ధ్యం 1.60లక్షల టన్నులు నుంచి 60వేల టన్నులకు, 1.70 లక్షల టన్నుల క్రషింగ్ సామర్ధ్యం గల ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలు 80 వేల టన్నులకు, 5.70లక్షల టన్నుల క్రషింగ్ సామర్ధ్యం గల గోవాడ 4లక్షల టన్నులకు పడిపోయింది.
అనకాపల్లిలోని తుమ్మపాల అయితే గత ఆరు నెలలుగా మూతపడే ఉంది. ఇలా రాష్ట్రంలో సహకార ఫ్యాక్టరీల మనుగడ ప్రశ్నార్ధంగా మారింది" అని కర్రి అప్పారావు అన్నారు.
"సహకార ఫ్యాక్టరీలు నష్టాల బారిన పడేలా చేసి వందలాది ఎకరాల ఫ్యాక్టరీ స్థలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మార్గం ఏర్పాటు చేసుకుంటున్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోంది. రైతు బకాయిలను ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం" అని టీడీపీ అనకాపల్లి పార్లమెంటరీ నాయకుడు నాగ జగదీష్ తెలిపారు.

రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నారు
విశాఖలో ఏటికొప్పాక, తాండవ చక్కెర కర్మాగారాలు 2021-22 క్రషింగ్ సీజన్ నడుపుతాయా అనే అనుమానం ఉందని ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసే రైతులు అంటున్నారు. రైతు సంఘాలు కూడా అదే పరిస్థితి ఉందని అంటున్నాయి.
"ఇప్పటికే 2020-21 క్రషింగ్ సీజనుకు చెరకు సరఫరా చేసిన రైతులకు ఎనిమిదన్నర కోట్లు ఏటికొప్పాక యాజమాన్యం చెల్లించాలి. చెరకు సరఫరా చేసి 9 నెలలవుతున్నా ఏ ఒక్క రైతుకు నయా పైసా చెల్లింపులు జరగలేదు" అని రైతు సంఘం విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి లక్ష్మీనాయుడు అన్నారు.
"విజయనగరం, తాండవ, ఏటికొప్పాక వద్ద రైతుల, కార్మికుల అందోళనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. రైతు భరోసా ఇస్తున్నామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వాలు మిగతా విషయాలు పట్టించుకోకపోవడం వల్లే చెరకు రైతులకు ఈ దుస్థితి వచ్చింది" అని అన్నారు.
విజయనగరం జిల్లా భీమసింగి సహకార చక్కెర కర్మాగారంలో ఆధునీకరణ పేరుతో క్రషింగ్ జరగదని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ చెప్పారు.
"విజయనగరంలోని ఎన్‍సీఎస్ చక్కెర కర్మాగారం దాదాపు రూ.16.33 కోట్లు రైతులకు బకాయి ఉంది. రైతుల అందోళన తర్వాత ఫ్యాక్టరీలో నిల్వ ఉన్న పంచదారను వేలంపాట వేశారు. అందులో చెన్నైకు చెందిన షైన్ లాజిస్టిక్స్ కంపెనీ 11 కోట్ల 50 లక్షల నగదు చెల్లించి సొంతం చేసుకోగా, ఆ సొమ్మును రైతులకు చెల్లించి, మిగతా బకాయిలను ఫ్యాక్టరికీ ఉన్న భూములను అమ్మి తీరుస్తారు" అని చెప్పారు.
"కానీ ఈ ఏడాది క్రషింగ్ ఉంటుందా, లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు" అని లక్ష్మీనాయుడు తెలిపారు.

ఎన్నికలు నిర్వహించాలి
కేంద్ర ప్రభుత్వం రూ.2750ల ధరనే గిట్టుబాటు ధరగా ప్రకటించడంతో రైతులు చెరకు పంటకు దూరమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సలహా ధర ప్రకటించాలి. ఆధునీకరణకు షుగర్ డెవలప్ ఫండ్ నుంచి వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు కర్రి అప్పారావు కోరుతున్నారు.
"సహకార ఫ్యాక్టరీలకు పాలకమండలి ఎన్నికలు నిర్వహిస్తే షేర్‌హోల్డర్సే వాటి అభివృద్ధికి కృషి చేసే అవకాశం ఉంటుంది. ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లో ఉన్న చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. చెరుకు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయాయి. ట్రాక్టర్ అద్దెలు, పెట్రోలు, డీజిల్, ఎరువులు ధరలు పెరిగిపోయాయి. గతంలో కరువొచ్చి, వరదొచ్చి పంట పోతే రైతు తన రెక్కల కష్టం పోయిందనుకునే వాడు. కానీ ఈ రోజు అలాకాదు ఉన్న ఆస్తులు అన్ని పోతున్నాయి" అని కర్రి అప్పారావు అన్నారు.

50 ఏళ్లు దాటినవాళ్లే వ్యవసాయంలో ఉన్నారు
"చెరకు పంటైతే తుపాను, వరద, సంక్షోభాలు, కరువు ఇలాంటి పరిస్థితుల్లో కూడా కనీసం యాభై శాతం పంట రైతు చేతికు వస్తుంది. అందుకే రైతుకు ఈ పంటంటే ఎంతో ఇష్టం. దీనిని కూడా రైతు వదులుకునే విధంగా మన వ్యవసాయ విధానాలున్నాయి. గతంలో ఎకరానికి 40 టన్నులు తీసేవారు. ఈరోజు 20 టన్నులు దాటడం లేదు. ఇలా తయారైన వ్యవసాయ రంగంలోకి యువత రావడం లేదు, యాభై ఏళ్లు దాటిన వాళ్లే వ్యవసాయరంగంలో ఉన్నారు" అని కర్రి అప్పారావు చెప్పారు.
"వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం రైతు తన పొలంలో తానే కూలీ చేసుకుని ఒక ఎకరంలో చెరకు పంట వేస్తే కనీస పెట్టుబడి రూ. 2860 అవుతుంది. స్వామినాధన్ కమిషన్ సిపారసుల ప్రకారం రూ. 4800 ఇవ్వాలి.
"ప్రభుత్వం సహకార రంగంలో ఉన్నచెరకు ఫ్యాక్టరీలపై పెత్తనం చేయడం తప్ప దాని బాగోగులను పట్టించుకోవడం లేదు. ఏదైనా సీజన్ లో ఆదాయం వస్తే ప్రైవేటు ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఇతర వ్యాపారాల్లో ఆ సొమ్మును పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. నష్టాలు వస్తే, ఆ పేరుతో రైతులకు బకాయిలు కూడా చెల్లించడం లేదు. ఇతర దేశాల నుంచి పంచదారను అతి తక్కువ రేటుకు దిగుమతులు చేసుకోవడంతో, ఇక్కడ పండించే రైతులకు రేట్లు పెరగడంలేదు" అని అన్నారు.
10 ఏళ్ల క్రితం ఉన్న రేటే ఇప్పుడు ఉంది. కొరియా, క్యూబా ఇతర దేశాల్లో చెరకు ఉత్పత్తికి సబ్బిడీలు ఇవ్వడం వలను అక్కడ ఉత్పత్తి రేటు తక్కువగా ఉంటుంది. మన వద్ద కూడా ట్రాక్టర్లు, డిజిల్, పెట్రల్ పై సబ్బిడీలు ఇవ్వాలి. ప్యాక్టరీలను ఆధునీకరిస్తే మొలాసిస్, విద్యుత్, సోడా గ్యాస్ వంటి పది ఉపఉత్పత్తులు తయారు చేయవచ్చు. ఇది చక్కెర పరిశ్రమకి ఊతమిస్తుంది" అని కర్రి అప్పారావు చెప్పారు.

యాజమాన్యాలు ఏమంటున్నాయి?
గిట్టుబాటు ధర రాకపోవడం, ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడం, ఫ్యాక్టరీలు బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు చెరకు పంట నుంచి ఇతర పంటలవైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఫ్యాక్టరీల యాజమాన్యాలు రైతుల బకాయిలు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నాయా? వీటిలో నిజమెంత?
గత సీజన్‌లో రైతులకు బకాయిలు రూ.9 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరావు చెప్పారు. .
"ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఏడాది నుంచి జీతాలు చెల్లించలేకపోతున్నాం. ఈ బకాయిలు రూ.6 కోట్ల వరకు ఉన్నాయి. మూడేళ్ల నుంచి పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు సుమారు రూ.1.56 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ కలిపి రూ.17 కోట్లు చెల్లించాలి".
"యంత్రాల మరమ్మతులకు మరో ఐదు కోట్ల రూపాయలు అవసరం. నిధుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. మరోవైపు ఫ్యాక్టరీ పరిధిలో చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో వచ్చే సీజన్‌కు 30 వేల టన్నులకు మించి సరఫరా అయ్యే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏటా ఫ్యాక్టరీ నష్టాలను చూడాల్సి వస్తోంది" అని ఆయన అన్నారు.

బకాయిల చెల్లింపు, బ్రాండ్లతో భాగస్వామ్యం...
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు, సహకార రంగంలో 29 చక్కెర కర్మాగారాలు ఉండగా అందులో 18 మాత్రమే పనిచేస్తున్నాయని, ఇందులో సహకార రంగంలో 10 కర్మాగారాలకు గాను 4 మాత్రమే పని చేస్తున్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
విజయనగరం జిల్లాలో భీమసింగి, విశాఖలో గోవాడ, ఏటికొప్పాక, తాండవ సహకార కర్మాగారాలు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయని...అనకాపల్లి తుమ్మపాల, గుంటూరు జిల్లా జంపని, నెల్లూరు జిల్లా కోవూరు, కడప సమీపంలోని చెన్నూరు, చిత్తూరు శ్రీ వెంకటేశ్వరతో పాటు చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయని చెప్పారు.
"రైతుల బకాయిలు తీర్చడమే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు.
"చక్కెర కర్మాగాలకు ఉన్న రుణాలు, వాటి మనుగడపై కూడా చర్చ ఇటీవల ముఖ్యమంత్రి సమక్షంలో సమావేశం జరిగింది. ప్రస్తుతం నడుస్తున్న నాలుగు సహకార ఫ్యాక్టరీల ఆధునీకరణతో పాటు వచ్చే రెండు,మూడేళ్లలో ఫ్యాక్టరీలన్నింటినీ ఆధునిక పరిశ్రమలుగా మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు".
ఆల్కహాల్ తయారీకి ఉపయోగపడే మొలాసిస్ వంటి ఉప ఉత్పత్తులు చెరకు నుంచే వస్తాయి. వీటిపై దృష్టి సారిస్తున్నాం. అలాగే చెరకు, చెరకు ఉప ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామ్యం పంచుకునే విషయాన్ని ఆలోచిస్తున్నాం" అని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- 26/11 ముంబయి దాడులు: పాకిస్తాన్లో ఈ కేసు దర్యాప్తు ఎంతవరకూ వచ్చింది?
- క్రిప్టోకరెన్సీలో రూ.70 లక్షల పెట్టుబడులు, ఆత్మహత్య: ‘నేనిలా చేస్తానని కలలో కూడా ఊహించలేదు..’
- క్రిప్టోకరెన్సీ చట్టం గురించి ఎందుకింత గందరగోళం? కీలక ప్రశ్నలు... సమాధానాలు
- 1993 చిలకలూరుపేట బస్సు దహనం, 23 మంది మృతి.. దోషులకు ఉరిశిక్ష ఎందుకు రద్దు చేశారంటే..
- ఉద్దానం కిడ్నీ బాధితులు: ‘ఎంతకాలం రాసుంటే అంతకాలం బతుకుతా, అప్పులు చేసి చావడమెందుకు?’
- ఆందోళన రేకెత్తిస్తున్న అత్యంత ప్రమాదకరమైన కొత్త కరోనా వేరియంట్ B.1.1.529
- ‘పోలీసులకు తెలియకుండా అడుగు కూడా బయట పెట్టలేని పరిస్థితి ఉంది.. ’
- కడప జిల్లాలో వరదలు: ‘మా కళ్లెదుటే కొందరు కొట్టుకుపోయారు.. మా బంధువుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















