మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై ఎందుకు యూ-టర్న్‌ తీసుకుందంటే...

వ్యవసాయ చట్టాలు

ఫొటో సోర్స్, RAWPIXE

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అక్టోబర్ 20న బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో "కేంద్ర ప్రభుత్వం మాత్రమే వ్యవసాయ చట్టాన్ని పాటించాలి, దీనిని రైతులు అంగీకరించరు" అని అన్నారు. ఒక నెల తరువాత, ఆయన మాటలు నిజమయ్యాయి.

కొత్త వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ప్రకట వచ్చిన సందర్భమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పది రోజుల తర్వాత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

నవంబర్ 26నాటికి రైతుల ఆందోళనలకు ఏడాది పూర్తికానుంది. ఈ సందర్భంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతులు ప్రకటించారు.

వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం. ప్రకటన వెలువడటానికి ఒక్కరోజు ముందుగానే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల బాధ్యతలను అమిత్ షాకు అప్పగించారు.

కాగా, గురునానక్ జయంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

వ్యవసాయ చట్టాలు

ఫొటో సోర్స్, Getty Images

నిర్ణయం వెనుక పంజాబ్?

ఇప్పుడు ప్రకటన వెలువడటానికి పంజాబ్ కూడా ఒక కారణం.

''మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రెండూ కారణం. సహజంగానే ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికలు ఒక ప్రధాన కారణం. కానీ పంజాబ్‌ విషయంలో మరిన్ని కారణాలున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకుంటే బీజేపీకి ఈ రాష్ట్రం కూడా ముఖ్యమైంది'' అని ది హిందూ ఆంగ్ల దినపత్రికకు చెందిన జర్నలిస్ట్ నిస్తులా హెబ్బార్ అన్నారు.

"పంజాబ్ భారతదేశానికి సరిహద్దులో ఉన్న రాష్ట్రం. ఖలిస్తానీ గ్రూపులు అకస్మాత్తుగా చురుకుగా మారాయి. ఈ పరిస్థితిల్లో ఎన్నికలను ఈ గ్రూపులు వినియోగించుకునే అవకాశం ఉంది" అని పంజాబ్‌కు సంబంధించిన మరో కోణాన్ని నిస్తులా వివరించారు.

గతంలో బీజేపీ, అకాలీదళ్ కూటమిగా ఏర్పడినప్పుడు.. సిక్కులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అకాలీదళ్, బీజేపీతో జతకట్టి ఎన్నికల్లో పోరాడితే రాబోయే రోజుల్లో రాష్ట్ర, దేశ భద్రతకు ముప్పు ఉండదని రెండు పార్టీల అగ్రనేతలు లాల్ కృష్ణ అద్వానీ, ప్రకాష్ సింగ్ బాదల్ ఆలోచించారు. ఈ కారణంగానే, ఈ కూటమి చాలా సంవత్సరాలు కొనసాగింది.

"బీజేపీకి దీర్ఘకాలంగా పంజాబ్ చాలా ముఖ్యమైనది. 80ల నాటి పరిస్థితులు మళ్లీ అక్కడ ప్రారంభం కావాలని ఎవరూ కోరుకోరు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది."

అకాలీదళ్, బీజేపీలు చాలా కాలంగా మిత్రపక్షాలుగా కొనసాగాయి. కొత్త వ్యవసాయ చట్టం కారణంగా, అకాలీదళ్ గత సంవత్సరం బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలిగింది.

వ్యవసాయ చట్టాలు

ఫొటో సోర్స్, Getty Images

అయితే ఏడాది తర్వాత అకస్మాత్తుగా మోదీ ప్రభుత్వానికి పంజాబ్ ప్రజలు, తన పాత మిత్రపక్షం అకాలీదళ్ ఎందుకు గుర్తుకు వచ్చారు?

చండీగఢ్‌లోని రూరల్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఫర్ రీసెర్చ్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్‌ఎస్ గమాన్‌కి వ్యవసాయం, ఆర్థిక శాస్త్రం, పంజాబ్ రాజకీయాలపై మంచి పట్టు ఉంది. ఆయన మాట్లాడుతూ.. ''ఇప్పటికే చాలా ఆలస్యంగా, 700 మంది రైతులను బలితీసుకున్నాక ఈ నిర్ణయం వచ్చింది. మోదీ ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాన్ని స్వయంగా రద్దు చేయలేదు. రైతుల ఆగ్రహంతో, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నందున మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది"

''వ్యవసాయ చట్టాల రద్దుతో పంజాబ్‌లో బీజేపీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. అకాలీదల్‌తో పొత్తు ఉంటే కొంత రాజకీయంగా ప్రయోజనం ఉండేది. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌తో పొత్తుపెట్టుకున్నా బీజేపీకి కలిసిరాకపోవొచ్చు'' అని గమాన్‌ అన్నారు.

వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచిస్తే, బీజేపీతో పొత్తుపెట్టుకుంటానని కెప్టెన్ అమరీందర్ సింగ్ సంకేతాలు ఇవ్వడం గమనించదగ్గ విషయం. మోదీ సర్కార్ తాజా ప్రకటన తర్వాత, అందరికంటే ముందుగా తాను ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అమరీందర్ సింగ్ నుంచి స్పందనవచ్చింది.

అయితే, మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత అకాలీదళ్ మళ్లీ ఎన్డీయేలోకి చేరుతుందో లేదో చూడాలి.

"ఈ నిర్ణయం బీజేపీకి భారీగా ప్రయోజనం కలిగించకపోవచ్చు, కానీ పంజాబ్‌లో కాంగ్రెస్‌కు మాత్రం చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. అకాలీదళ్, కెప్టెన్ అమరీందర్ సింగ్, బీజేపీ ముగ్గురు కలిసి బరిలో దిగితే కాంగ్రెస్‌పైనే ఎక్కువ ప్రభావం పడుతుంది'' అని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్‌కి చెందిన ప్రొఫెసర్ సంజయ్ కుమార్ అన్నారు.

పంజాబ్‌లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే, 7-8 శాతం ఓట్లు వచ్చేవని, అదే అకాలీదళ్‌తో పొత్తుపెట్టుకుంటే 35 శాతం ఓట్లు వస్తాయని సీఎస్‌డీఎస్‌ అంచనా వేసింది.

వ్యవసాయ చట్టాలు

ఫొటో సోర్స్, AFP

మోదీ ప్రభుత్వం ఏ నిర్ణయాలకు ముందుగా తలవంచింది?

మోదీ ప్రభుత్వం తన నిర్ణయాలను వెన్కకు తీసుకోదని చెప్పుకుంటుంటారు. అయితే గతంలో కూడా ఈ ప్రభుత్వం తన నిర్ణయాలను వెనక్కి తీసుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి.

గతంలో వ్యవసాయానికి సంబంధించిన భూసేకరణ చట్టంపై కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అప్పుడు పార్లమెంటులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని 'సూట్-బూట్‌ కీ సర్కార్' అంటూ విమర్శించారు.

జీఎస్టీ అమలు ద్వారా రాష్ట్రాలకు వచ్చే లోటుకు పరిహారం చెల్లించడంపై కేంద్ర ప్రభుత్వం తన మునుపటి వైఖరిని మార్చుకుంది.

ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో చాలా చోట్ల నిరాశాజనక ఫలితాలు రావడంతో మోదీ సర్కార్‌ వెనక్కి తగ్గి పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించింది.

రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నవారు 'ఉప ఎన్నికల్లో ఓటమి' బీజేపీకి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

ఎన్నికల్లో ఓటమికి, తమ నిర్ణయాలే కారణమని బీజేపీ పునరాలోచనలో పడటమో లేక రాజీపడడమో జరుగుతుంది.

మొత్తం 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ విఫలమైంది. అలాగే 42 లోక్‌సభ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఇక ఈ నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో కనుక ఫలితాలు తారుమారైతే, ఆ ప్రభావం 2024లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పడుతుంది. ఈ మూడు రాష్ట్రాలు మొత్తం 170 లోక్‌ సభ స్థానాలను కలిగి ఉన్నాయి.

బీజేపీ నిర్ణయాల వెనక ఈ గణాంకాల ప్రభావం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

వ్యవసాయ చట్టాలు

ఫొటో సోర్స్, AJAY AGGARWAL/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోణం

"ఉత్తరప్రదేశ్‌ను అనేక ప్రాంతాలుగా విభజించి, బీజేపీలో అమిత్ షాకు పశ్చిమ ఉత్తరప్రదేశ్ బాధ్యతను అప్పగించిన ఒకరోజు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ బీజేపీకి ఎంత ముఖ్యమైనదో దీన్నిబట్టి స్పష్టంగా అర్థం అవుతుంది" అని సీనియర్ జర్నలిస్టు సునీతా ఆరోన్ పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో 100 సీట్లపై రైతుల ఉద్యమ ప్రభావం చూపుతుందని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. అదే సమయంలో, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని చెరకు రైతుల సమస్యలు కూడా పార్టీపైన ప్రభావం చూపించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

రైతు ఉద్యమం ఎన్నికలపై ఎంతమేర ప్రభావం చూపుతుందనే దానిపై బీజేపీకి ఇప్పటికే సమాచారం అంది ఉంటుందని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్నిబట్టి తెలుస్తోంది.

"ఆర్‌ఎల్‌డి అధ్యక్షులు జయంత్ చౌదరికి పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో కూడా మంచి మద్దతు లభిస్తోంది. దీంతో ఆర్‌ఎల్‌డి పొత్తు పెట్టుకుంటే సమాజ్‌వాదీ పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉంది" అని సునీతా ఆరోన్ చెప్పారు.

అయితే సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌ఎల్‌డీల పొత్తుపై ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు.

మోదీ ప్రకటన తర్వాత వీరి నిర్ణయం ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది.

వ్యవసాయ చట్టాలు

ఈ నిర్ణయం వల్ల ఉత్తరప్రదేశ్‌లోఏం లాభం

సీఎస్‌డీస్‌ డేటా ప్రకారం.. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కుల సమీకరణాలను పరిశీలిస్తే దాదాపు అక్కడ ముస్లింలు 32 శాతం, దళితులు 18 శాతం, జాట్‌లు 12 శాతం, ఓబీసీలు 30 శాతం ఉన్నారు. దీనితో పాటు ఈ ప్రాంతంలో దాదాపు 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.

వీరిలో బీజేపీ ముస్లింలను తమ ఓటు బ్యాంకుగా ఎప్పుడూ పరిగణించదు. దళితులు, ఓబీసీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు బీజేపీ ఇప్పటికే అనేక సదస్సులు నిర్వహించింది. ఇటీవల ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ దళితుల ఇంట్లో టీ తాగుతూ చేసిన ప్రకటన కూడా వార్తల్లో నిలిచింది.

ఇప్పుడు వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించుకున్నందున, ఆగ్రహంతో ఉన్న జాట్‌ల ఓట్లు కూడా బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. ఇది బీజేపీకి మంచి పరిణామం.

అయితే, పార్లమెంట్‌లో చట్టాన్ని రద్దు చేసిన తర్వాతే తమ ఆందోళనలను విరమిస్తామని బీకేయూ నేత రాకేష్ తికైత్ ప్రకటించారు.

"ఈ నిర్ణయంతో ఎన్నికల ముందు వీధుల్లో ఆందోళనలు ఉండవు. దీంతో బీజేపీకి కొంత ప్రయోజనం ఉంటుంది. రైతుల కోపం కాస్త తగ్గుతుంది. రైతులకు చెరకు ధర, యూరియా, ఎరువుల ధరలు పెరగడం, కరెంటు ధరలు పెరగడం, పెట్రోలు, డీజిల్ ధరలు వంటి ఇతర అనేక సమస్యలు కూడా ఉన్నాయి'' అని పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కి చెందిన జర్నలిస్ట్ హర్వీర్ సింగ్ తెలిపారు.

వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం తర్వాత కూడా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి వచ్చే సీట్లు గతంలోకంటే తక్కువగా ఉండవచ్చని ఆయన అన్నారు.

"ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. బీజేపీకి సొంత కార్యకర్తల బలం ఉంది. ఈ రద్దు నిర్ణయం ప్రస్తుతం బీజేపీకి కొంతమేర కలిసొచ్చేలా కనిపిస్తోంది. ముందుగా బీజేపీ పూర్వాంచల్‌పై దృష్టి పెట్టింది. తద్వారా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన నష్టాన్ని అక్కడి నుంచి భర్తీ చేయగలదు. ఇప్పుడు ఇంటింటికీ వెళ్లి రైతులను బీజేపీ తమవైపు తిప్పుకోగలదో లేదో వేచిచూడాలి" అని సునీతా ఆరోన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)