గుజరాత్ నిజంగా శాకాహార రాష్ట్రమా? ప్రధాన నగరాల్లో రోడ్ల పక్కన నాన్ వెజ్ స్టాల్స్‌ ఎందుకు మూసేస్తున్నారు?

గుజరాత్‌

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, తేజస్ వైద్య
    • హోదా, బీబీసీ గుజరాతీ

గుజరాత్‌లోని బీజేపీ పాలిత ప్రాంతాలైన వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్, జునాగఢ్ మున్సిపాలిటీ కార్పొరేషన్‌లు ప్రధాన రహదారుల పక్కనే గుడ్లు, నాన్ వెజ్ వంటకాల విక్రయాలకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం వివాదాస్పదమైంది.

మాంసాహార వంటకాలను బహిరంగంగా విక్రయించడం వల్ల ప్రజల మతపరమైన మనోభావాలు దెబ్బతింటాయని ఈ మున్సిపల్ కార్పొరేషన్ల నిర్ణయాన్ని కొందరు బీజేపీ నేతలు సమర్థిస్తున్నారు.

అయితే స్థానిక మీడియా నివేదికల ప్రకారం, వడోదర మున్సిపల్ కార్పొరేషన్ 24 గంటల్లోనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. నగర వీధుల్లో గుడ్డు, నాన్ వెజ్ వంటకాల అమ్మకాలను ప్రస్తుతానికి ఆపేది లేదని ప్రకటించింది.

వీడియో క్యాప్షన్, కరాచీలో చార్మినార్ దగ్గర దోశ పాయింట్.. మసాలా దోశ రూ.300, చికెన్/కీమా దోశ రూ.400

కొన్ని మున్సిపాలిటీలు నోటిఫికేషన్‌లు జారీ చేయకుండా మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. స్థానిక సంస్థలు తీసుకున్న అన్ని నిర్ణయాలు వారి వ్యక్తిగతమైనవని, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సిఆర్ పాటిల్ చెప్పారు.

"నేను రాజ్‌కోట్, జామ్‌నగర్‌లోని స్థానిక పరిపాలన అధికారులతో మాట్లాడాను. వీధుల నుండి మాంసాహార బండ్లను తొలగించవద్దని వారిని కోరాను. అది ఆయా నేతల వ్యక్తిగత అభిప్రాయం. ఈ నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయబోం. రాష్ట్ర బీజేపీకి ఈ నిర్ణయంతో ఎలాంటి సంబంధం లేదు"

వివాదం చెలరేగిన తర్వాత గుజరాత్‌ రెవెన్యూ మంత్రి రాజేంద్ర త్రివేది మీడియాతో మాట్లాడుతూ.. ఫుట్‌పాత్‌పై వాహనాలను నిలిపే హక్కు ఎవరికీ లేదు, ఫుట్‌పాత్ పాదచారులకు మాత్రమే.

''ఫుట్‌పాత్‌లపై ఎలాంటి ఆక్రమణలు చేయకూడదని, రోడ్డు పక్కనున్న వాహనాల్లో ఎలాంటి ఆహారపదార్థాలు విక్రయిస్తున్నా, వాటిని ఫుట్‌పాత్‌లపై నుంచి తొలగించాలి'' అని రాజేంద్ర త్రివేది అన్నారు.

ఫుట్‌పాత్‌ల నుండి వాహనాలను తొలగించాలని తీసుకున్న నిర్ణయంపై మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లను ఆయన అభినందించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

వివాదం చెలరేగిన తర్వాత, వడోదర డిప్యూటీ మేయర్ నందా జోషి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. "బహిరంగ ప్రదేశాలలో నాన్ వెజ్ వంటకాలు వండడం వల్ల మహిళలు, పిల్లలు కంటి మంటతో బాధపడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మేయర్ సరైన పరిశుభ్రతతో ఆహారాన్ని కవర్ చేసే పద్ధతిని ప్రారంభించడానికి వార్డు కార్యాలయాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు" అని నందా జోషి పేర్కొన్నారు.

రాజ్‌కోట్‌లోని ఫూల్‌చాబ్ చౌక్‌లో గుడ్డు వంటకాలు విక్రయిస్తున్న వాహనాలను తొలగించారు.

వాహనాలను తొలగించిన తర్వాత.. రాజ్‌కోట్ డిప్యూటీ కమిషనర్ ఏఆర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఇలాంటి వాహనాలు రోడ్డుపై నిలిపి ఉంచడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వాహనాల వల్ల ట్రాఫిక్‌ సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆయన చెప్పారు.

హబీబ్ గని మేనల్లుడి బండిని కూడా అధికారులు తొలగించారు. బండిని తొలగించిన చోటే, నాలుగు లేదా ఐదు దశాబ్దాలుగా అక్కడి ప్రజలు వ్యాపారం చేస్తున్నారు" అని హబీబ్ గని బీబీసీతో అన్నారు.

''నాన్ వెజ్ ఫుడ్ అవసరం లేదు. జంతువులను చంపకూడదు. శాకాహారం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది'' అని నవంబర్ 5న మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పేర్కొన్నారు.

రాజ్‌కోట్‌లోని స్వామినారాయణ ఆలయంలో దీపావళి ఉత్సవాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

గుజరాత్‌

ఫొటో సోర్స్, Getty Images

'శాకాహార' గుజరాత్‌

మద్యపాన నిషేధం, మాంసాహారం అనే రెండు అంశాలు గుజరాత్‌లో నిత్యం చర్చనీయాంశమవుతున్నాయి. 'శాకాహార' గుజరాత్‌ నినాదం ప్రసిద్ది చెందింది.

డాక్టర్ పుష్పేష్ పంత్‌తో సహా ఆహార నిపుణులు, వైష్ణవ, జైన మతాల ప్రభావం కారణంగా గుజరాత్‌ని స్వాభావికంగా అహింసావాద రాష్ట్రంగా భావిస్తారు.

అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

గుజరాత్‌లో నాన్ వెజ్ ఫుడ్ ఎవరు తింటారు?

కులాలు, మతాలలానే ఆహారాన్ని కూడా రాజకీయాలకు ఉపయోగిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ లేదా మతపరమైన ఫోరమ్ నాయకులు ఆహారాన్ని వ్యతిరేకించినప్పుడు లేదా సమర్థించినప్పుడు, దాని వెనుక ఉన్న రాజకీయాలను సామాన్య ప్రజలు అర్థం చేసుకోవడం కష్టం.

"భారతదేశం ఎప్పుడూ శాకాహార దేశం కాదు. భారతదేశంలో శాకాహారం హిందూ సంప్రదాయం వల్ల కాదు, జైన సంప్రదాయం వల్ల ప్రాచుర్యం పొందింది'' అని జర్నలిస్ట్ వీర్ సంఘ్వీ అన్నారు.

గుజరాత్‌లో, పర్యూషన్ పండుగ సందర్భంగా జైనులు కబేళాలను మూసి ఉంచాలని పట్టుబట్టారు.

నాన్-వెజ్ ఫుడ్

ఫొటో సోర్స్, AFP

గుజరాత్‌లో ఓబీసీ కింద 147 కులాలు ఉన్నాయి. సంచార, డీ-నోటిఫైడ్ తెగల కోసం చాలా కాలంగా పనిచేస్తున్న మిట్టల్ పటేల్ బీబీసీ గుజరాతీతో మాట్లాడుతూ.. "70 శాతం సంచార, డీ-నోటిఫైడ్ తెగలకు నాన్-వెజ్ ఫుడ్ తినే అలవాటు ఉంది. వీరిలో ఠాకోర్, నాట్, బజానియా, ఛారా, వాడి, సరనియా వంటి తెగలు ఉన్నాయి"

నాన్ వెజ్ తినేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, జైన, వైష్ణవ సంప్రదాయాల విస్తృత ప్రభావం కారణంగా గుజరాత్ శాకాహార రాష్ట్రంగా గుర్తింపు పొందింది.

సామాజిక శాస్త్రవేత్త గౌరంగ్ జానీ బీబీసీ గుజరాతీతో మాట్లాడుతూ.. "జైన్ సంప్రదాయం గుజరాత్‌లో నిరంతరం పాలనతో ముడిపడి ఉన్నందున అది మరింత ప్రభావం చూపింది" అని అన్నారు.

"గుజరాత్ రాజులు జైనమతానికి ఆశ్రయం కల్పించారు. అందుకే పాలనపై జైనమతం ప్రభావం ఎక్కువగా ఉంటుంది" అని తెలిపారు.

"జైనులే కాకుండా వైష్ణవుల ప్రభావం కూడా పాలనపై ఉంది. ఈ రెండు వర్గాలు చాలా చిన్నవే, కానీ రాజకీయాలు, వ్యాపారంపై వీరికి మంచి పట్టు ఉంది. అందుకే శాకాహారులు విద్య, సంస్కృతి లేదా సాహిత్యంలో ప్రముఖంగా కనిపిస్తారు"

గుజరాత్

గుజరాత్ సముద్ర ఆహారానికి ప్రధాన కేంద్రం

దేశంలోనే అత్యంత పొడవైన తీరప్రాంతం గుజరాత్‌లో ఉంది. గుజరాత్ కూడా సముద్ర ఆహారానికి ప్రధాన కేంద్రం.

గుజరాత్‌లో చాలా ఏళ్లుగా పార్సీలు, ఆదివాసీలు, క్షత్రియులు, సముద్రయానం చేసేవారి ఆహారంలో మాంసాహారం ప్రధానమైనది. వారి కొత్త మాంసాహార వంటకాలు కూడా ప్రాచుర్యం పొందాయి.

"కోస్తా తీరం వెంబడి నివసించే ప్రజలు దశాబ్దాలుగా సముద్రపు ఆహారాన్ని తింటున్నారు. కానీ విదేశాలలో వ్యాపారం చేసే వ్యాపారులు బనియాలు, జైనులు. ఈ వ్యాపారులు తీరం వెంబడి నివసించే ప్రజల జీవనశైలి గురించి ఎప్పుడూ మాట్లాడలేదు" అని గౌరంగ్ జానీ చెప్పారు.

"గుజరాత్‌లోని గిరిజన ప్రాంతం అంబాజీ నుండి అహ్వా వరకు విస్తరించి ఉంది. ఆ గిరిజనులు కూడా శాకాహారులు కాదు"

"గుజరాత్ ముఖ చిత్రంలో అగ్రభాగం వ్యాపార వ్యక్తులదే ఉంటుంది. సమాజంలోని ఉన్నతవర్గాలు గిరిజన లేదా తీర ప్రాంతాల ప్రజల గురించి ఎన్నడూ మాట్లాడలేదు" అని ఆయన తెలిపారు.

గత 200 ఏళ్లలో గుజరాత్‌లో సామాజిక, రాజకీయ రంగాల్లో స్వామినారాయణ వర్గం విస్తరించిందని ఆయన అన్నారు.

గుజరాతీ థాలీలో నాన్ వెజ్ ఫుడ్?

స్వాతంత్ర్యానికి ముందు దేశంలో అనేక రాచరిక సంస్థానాలు ఉండేవి. వాటిలో చాలా వరకు గుజరాత్, కతియావార్‌లో ఉన్నాయి.

స్వాతంత్ర్యానికి ముందు వేట చట్టవిరుద్ధం కాదు. అప్పట్లో గుజరాత్‌లోని రాజకుటుంబాల వంటశాలలలో వేటాడిన జంతువు మాంసంతో నాన్‌వెజ్ వంటకాలు వండేవారు.

గుజరాత్‌లో సీఫుడ్‌తో కూడా పచ్చళ్లు తయారు చేస్తారు.

ఇరాన్ నుంచి వచ్చి గుజరాత్‌లో స్థిరపడిన పార్సీలు గోష్ట్, కబాబ్ వంటి సంప్రదాయ వంటకాలను ఇక్కడ పరిచయం చేశారు.

ధన్సక్ అనే ప్రసిద్ధ పార్సీ వంటకం పప్పు, కూరగాయలతో మాంసాన్ని కలిపి తయారు చేస్తారు.

పార్సీలు సముద్ర మార్గం ద్వారా గుజరాత్‌కు వచ్చి తీర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కాబట్టి, చేపలకు వారి ఆహారంలో ప్రత్యేక స్థానం ఉంది. పార్సీ వంటకాలలో 'పత్రాని చేప' ఒక ప్రత్యేక వంటకం.

"దేశంలోని ఉత్తమ మాంసాహార వంటకాలు గుజరాతీకి చెందినవే. అవి గుజరాత్‌లోని ఖోజా, మెమన్ మొదలైన ముస్లింలు తయారు చేసినవి" అని వీర్ సంఘ్వీ ట్వీట్‌ చేశారు.

"ఉన్నత వర్గాల ప్రభావంతో శాకాహారమైన గుజరాతీ థాలీ ప్రసిద్ధి చెందింది" అని గౌరంగ్ జానీ అన్నారు.

"గుజరాతీ థాలీలో కూడా నాన్ వెజ్ ఫుడ్ ఉంది. కానీ దాని గురించి ఎక్కడా ప్రస్తావించరు. గుజరాతీ ఛానెళ్ల వంటల కార్యక్రమాల్లో కూడా వాటిని ఎప్పుడూ చూపించలేదు" అని అన్నారు.

శాకాహారం, మాంసాహారం

ఫొటో సోర్స్, iStock

శాకాహారం, మాంసాహారం, రాజకీయాలు

వెజ్, నాన్ వెజ్ ఫుడ్ విషయంలో హిందుత్వ రాజకీయాలు ఆడుతున్నారని హబీబ్ గని అభిప్రాయపడ్డారు.

2022లో ఎన్నికలు ఉన్నందున మా వాహనాలను తొలగిస్తున్నారని తెలిపారు.

గాంధీజీ వైష్ణవ కుటుంబంలో జన్మించారు. ఆయన శాకాహారాన్ని మాత్రమే తీసుకునేవారు. దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో కూడా శాకాహారానికి మాత్రమే పరిమితమయ్యారు. ఆయన పత్రికలలో ఒకదాని పేరు 'వెజిటేరియన్'.

గాంధీజీ శాకాహారానికి గట్టి మద్దతుదారుగా ఉండేవారు. కాబట్టి మాంసం-చేపలు-గుడ్లు తినడం మానేసి శాకాహారం వైపు మొగ్గు చూపాలని సమాజంలోని ఒక వర్గం నమ్ముతోంది.

"గాంధీజీ శాకాహారాన్ని ప్రోత్సహించారు. కానీ ఆయన నాన్ వెజ్ తినేవారిని ఎప్పుడూ విమర్శించలేదు" అని గౌరంగ్ జానీ అన్నారు.

"హిందుత్వంతో కొత్త తరాన్ని నాన్ వెజ్ ఫుడ్ అంశం వైపు మళ్లించడమే రాజకీయాల్లో క్రియాశీలక మతవాద శక్తుల లక్ష్యం"

"ఆ ప్రక్రియలో గుజరాతీ సంస్కృతి కంటే హిందుత్వ అంశం చాలా ముఖ్యమైనది. కశ్మీర్, బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో, బ్రాహ్మణులు నాన్-వెజ్ ఫుడ్ తింటారు. కానీ ఎవరూ అభ్యంతరం చెప్పరు" అని గౌరంగ్ జానీ అన్నారు.

రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 2014లో బేసిక్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌కు సంబంధించి ప్రాథమిక సర్వే ఫలితాలను ప్రచురించింది. గుజరాత్‌లో 61.80 శాతం మంది శాకాహారులు, 39.05 శాతం మంది మాంసాహారులు అని పేర్కొంది. అంటే రాష్ట్రంలో ప్రతి ఐదుగురిలో ఇద్దరు మాంసాహారులు అని అర్థం చేసుకోవొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)