జై భీమ్: IMDb రేటింగులో గాడ్‌ఫాదర్‌ను అధిగమించిన భారతీయ సినిమా

దళితుల అణచివేతను ప్రశ్నించిన జైభీమ్ చిత్రం

ఫొటో సోర్స్, Amazon prime video

ఫొటో క్యాప్షన్, దళితుల అణచివేతను ప్రశ్నించిన జైభీమ్ చిత్రం
    • రచయిత, అసీమ్ ఛబ్రా
    • హోదా, బీబీసీ కోసం

తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన జై భీమ్ సినిమా ఐఎండీబీ రేటింగులో 'షాషాంక్ రిడంప్షన్', 'ది గాడ్‌ఫాదర్' లాంటి క్లాసిక్ చిత్రాలను అధిగమించింది.

హిందూ కుల వ్యవస్థలో అట్టడుగున ఉండే దళితులపై జరిగే అకృత్యాలను బలంగా చూపించిన సినిమా 'జై భీమ్' అంటూ రాస్తున్నారు ఫిల్మ్ జర్నలిస్ట్ అసీం ఛబ్రా.

సినిమా ప్రారంభంలోనే, జైలు బయట పోలీసు అధికారులు ఖైదీలను కులం ఆధారంగా విడదీయడం చూపిస్తారు.

అగ్రకులానికి చెందిన ఖైదీలను విడిచిపెడుతూ, దళితులు లేదా ఆదివాసీ వర్గాలకు చెందినవారిని ఓ పక్కన నిల్చోబెట్టి, వారిపై తిరిగి తప్పుడు కేసులు బనాయిస్తారు.

ఇది చాలా కలవరపెట్టే దృశ్యం. వేరుగా నిల్చున్నవాళ్లకు తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో కొంతవరకు తెలుసు. భయంతో, దీనంగా నిల్చున్నవాళ్లను చూస్తే ఇది తరచూ జరిగే విషయమేనని స్పష్టమవుతుంది.

భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న పట్టణాల్లో దళితుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో తెలిపే సన్నివేశాలివి.

అడ్వకేట్ చంద్రు పాత్రలో సూర్య

ఫొటో సోర్స్, Amazon prime video

ఫొటో క్యాప్షన్, అడ్వకేట్ చంద్రు పాత్రలో సూర్య

భారతదేశ జనాభాలో 20 శాతం దళితులు ఉన్నారు. ఎన్ని కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ వారు వివక్ష, హింసలను ఎదుర్కుంటూనే ఉన్నారు.

భారత రాజ్యాంగ రూపశిల్పి, దళిత సంస్కరణవాది, దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత తొలి న్యాయశాఖ మంత్రిగా వ్యవహరించిన బీఆర్ అంబేడ్కర్ అనుచరులు ఎలుగెత్తి చాటే నినాదమే 'జై భీమ్'.

తమిళ నటుడు సూర్య నిర్మాణ సారథ్యంలో, టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిజ జీవిత సంఘటనల సమాహారం.

పోలీసులు తన భర్తపై అన్యాయంగా కేసు మోపి అరెస్ట్ చేశారని, తరువాత ఆయన జైలు నుంచి పారిపోయినట్లు చెబుతున్నారంటూ గర్భవతిగా ఉన్న ఒక ఆదివాసీ మహిళ కేసు వేయడంతో, లాయరు చంద్రు (సూర్య) ఆమె తరుపున న్యాయం కోసం పోరాడతారు. ఇదీ జై భీమ్ కథ.

సార్పట్ట పరంపరై

ఫొటో సోర్స్, Amazon prime video

ఫొటో క్యాప్షన్, మహమ్మద్ అలీ స్ఫూర్తితో తీసిన సార్పట్ట పరంపరై చిత్రం బాక్సింగ్‌లో దళితుల పరిస్థితి ఎలా ఉంటుంద చూపించింది.

కొత్త పుంతలు తొక్కుతున్న తమిళ సినిమా

ఇటీవల కాలంలో తమిళ సినిమాలు దిశ, గమనం మార్చుకుంటున్నాయి. అట్టడుగు వర్గాల వారిపై జరుగుతున్న హింస, అణచివేతల గురించి నిక్కచ్చిగా చెబుతున్నాయి. జై భీమ్ సినిమా కూడా ఆ కోవకు చెందినదే.

"1991లో అంబేడ్కర్ శత జయంతి ఉత్సవాలతో ప్రారంభమై గత 30 ఏళ్లుగా తమిళనాడులో దళిత ఉద్యమం ఊపందుకుంది" అని సినీ చరిత్రకారుడు, రచయిత ఎస్ తియోడర్ భాస్కరన్ అన్నారు.

"మరుగున పడిపోయిన 20వ శతాబ్దపు దళిత సిద్ధాంతకర్తలను, వారి సిద్ధాంతాలను మళ్లీ పైకి తీసుకువస్తున్నారు. అనేకమంది దళిత రచయితలు తమ రచనల ద్వారా పెరియార్ (సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త), అంబేడ్కర్ ఆలోచనలను ప్రచారం చేస్తున్నారు. గత దశాబ్దంలో కొంతమంది రచయితలు సినిమాల్లోకి వచ్చారు. అయితే, వాళ్లు తీసిన చిత్రల్లో కూడా పాటలు, ఫైట్లు, మెలోడ్రామాలు ఉంటున్నాయి."

వీడియో క్యాప్షన్, సూర్య జై భీమ్ : కొన్ని కలలు, కన్నీళ్లు - వీక్లీషో విత్ జీఎస్‌

తమిళంలోనే కాకుండా ఇతర భారతీయ భాషల్లో కూడా ఇటీవల దళిత కథలు చోటు సంపాదిస్తున్నాయి.

అన్హే గోర్‌హే దా దాన్ (పంజాబీ), మసాన్ (హిందీ), ఫాండ్రీ, సైరత్ (మరాఠీ) సినిమాల్లో కూడా దళిత జీవితాలను చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

ఈ మరాఠీ చిత్రాలకు దర్శకత్వం వహించిన నాగరాజ్ మంజులే స్వయంగా దళితుడు.

ఫాండ్రీ సినిమాలో పందులు కాసే కుటుంబంలోని కుర్రాడు, అగ్రకులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పెడతాడు.

సైరత్ ఒక కులాంతర ప్రేమ కథ. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది.

ఇదే కోవకు చెందిన తమిళ సినిమా 'కూళంగళ్' ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా 2022లో జరిగే ఆస్కార్ అవార్డుల కోసం భారతదేశం నుంచి అధికారికంగా ఎంట్రీ ఇవ్వనుంది.

ప్రస్తుతం తమిళ సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. చాలా సినిమాల్లో తమ హక్కుల కోసం పోరాడే దళిత కథానాయకులు కనిపిస్తున్నారు. చట్టప్రకారం వారికి న్యాయం జరగనప్పుడు నేరుగా ఫైట్లు చేస్తున్నారు.

కాలా చిత్రంలో రజనీకాంత్

ఫొటో సోర్స్, WUNDERBAR FILMS

ఫొటో క్యాప్షన్, కాలా చిత్రంలో రజనీకాంత్

'మా నిజమైన కథలను తెరకెక్కించాలనుకున్నాను'

దళిత కథలను తెరకెక్కిస్తున్న తమిళ దర్శకుల్లో ప్రముఖంగా చెప్పుకోవలసినవారు వెట్రిమారన్ (విసారణై 2015, అసురన్ 2019), మారి సెల్వరాజ్ (పరియేరుం పెరుమాళ్ 2018, కర్ణన్ 2021), పా రంజిత్ (మద్రాస్ 2015, కబాలి 2016, కాలా 2018, సారపట్టా పరంబరై 2021).

దళిత హీరోతో కథలను రూపొందించే ఒరవడికి శ్రీకారం చుట్టినవారు సెల్వరాజ్, రంజిత్.

"సినిమాల్లో దళిత పాత్రలను చిత్రీకరించే విధానం బాధాకరం. వాటిని సృష్టిస్తారు లేదా కథల్లో ఆ పాత్రలు చేర్చడాన్ని విప్లవాత్మకంగా పరిగణిస్తారు" అని పా రంజిత్ 2020లో ది వైర్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

"ఈ నేపథ్యంలో, మా నిజమైన కథలను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాను. నా సంస్కృతి నిండా వివక్ష, హింసలే ఉన్నాయి. అదే చూపించాలనుకున్నాను... ఈరోజు దర్శకులు మరింత స్పృహతో దళిత పాత్రలను సృష్టిస్తున్నారు."

పా రంజిత్‌ను తమిళ సినిమా స్పైక్ లీ అని పిలుస్తారు.

మారి సెల్వరాజ్ మొదటి సినిమా 'పరియేరుం పెరుమాళ్‌'ను రంజిత్ నిర్మించారు.

ఈ సినిమా ప్రారంభంలోనే "కులం, మతం మానవత్వానికి వ్యతిరేకం" అనే కార్డు పడుతుంది.

ఈ కథలో హీరో దళితుడు. బాగా చదువుకుని అంబేడ్కర్‌లా లాయరు కావాలని కలలు కంటాడు.

ఇదే సినిమాలో "పోరాడడా" అనే పాట ఉంటుంది. ఇది 1983లో ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన సినిమాలోని పాట. ఇళయరాజా కూడా దళితుడే అన్నది తెలిసిన విషయమే.

ఈ పాట సాహిత్యం ఇలా సాగుతుంది.. "మేం నీ సింహాసనాన్ని చేజిక్కించుకుంటాం.. విజయం కోసం మేం పడే తపన ప్రపంచానికి తెలుస్తుంది.. మా వెలుగు ఈ ప్రపంచమంతా విస్తరిస్తుంది.. మేం శ్రామికులం, పోరాడతాం."

సెల్వరాజ్ సినిమా 'కర్ణన్‌'లో కూడా ఈ పాట నేపథ్య గేయంగా వినిపిస్తుంది.

ఇప్పుడు ఇది దళిత గీతంగా ప్రసిద్ధి పొందింది.

సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్దతుతో పా రంజిత్ సినిమాలు బాక్సాఫీస్ హిట్లు అయ్యాయి.

రంజిత్ చెప్పిన కథలు బాగా నచ్చడంతో కబాలి, కాలా సినిమాల్లో రజనీకాంత్ హీరోగా నటించారు.

రంజిత్ తాజా చిత్రం సారపట్టా పరంబరైలో.. చెన్నై ప్రాంతంలో దళిత వర్గాల్లో పరంపరగా వస్తున్న బాక్సింగ్ సంస్కృతిని తెరకెక్కించారు.

మహ్మద్ అలీ బాక్సింగ్ నైపుణ్యం, యాక్టివిజం (వియత్నాం యుద్ధం, అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఆయన గొంతెత్తిన తీరు) ఈ దళిత కమ్యూనిటీకి ప్రేరణ.

రజనీకాంత్ కబాలీ సినిమా విడుదల సమయంలో అభిమానులు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, రజనీకాంత్ కబాలీ సినిమా విడుదల సమయంలో అభిమానులు

దళిత సినిమాలు కూడా పాత పంథానే అనుసరిస్తున్నాయి'

అయితే, తమిళ చిత్రసీమలో దళిత పాత్రల ప్రాతినిధ్యానికి అందుతున్న ప్రశంసలన్నీ అర్హమైనవి కావని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ సినిమాలు కొత్త పోకడలను సృష్టించలేదని 'మాదతి: ఆన్ అన్‌ఫైరీ టెయిల్ ' (2019) సినిమా డైరెక్టర్ లీనా మనిమేఖలై అభిప్రాయపడ్దారు.

బహిష్కరణకు గురైన ఓ దళిత యువతి కథే మాదతి.

"ప్రస్తుతం వస్తున్న దళిత సినిమాలన్నీ కూడా పాత పంథానే అనుసరిస్తున్నాయి.. సుప్రీం హీరో, ధృడమైన మగాడు, ఏదైనా చేయగలిగేవాడు, ప్రపంచాన్ని కాపాడే సత్తా ఉన్నవాడు.. ఇలాంటి కథనాలే ఉంటున్నాయి" అని మనిమేఖలై ఆరోపించారు.

జై భీమ్ చిత్రంలో లిజోమోల్ జోస్

ఫొటో సోర్స్, Amazon prime video

ఫొటో క్యాప్షన్, జై భీమ్ చిత్రంలో లిజోమోల్ జోస్

"వీటిల్లో కూడా మహిళలు సపొర్టింగ్ పాత్రలే చేస్తున్నారు. భర్త లేదా ప్రేమికుడికి ఆసరాగా ఉన్నట్లుగానే చిత్రీకరిస్తున్నారు. అలాగే, గొడ్డళ్లు, కొడవళ్లు, తుపాకులతో ఫైట్ చేసి, తరతరాల వివక్ష నుంచి వారిని కాపాడే హీరో కోసం అణగారిన వర్గాలు ఎదురుచూడడం.. ఇవే కథలు."

ఏది ఏమైనప్పటికీ, ప్రేక్షకులు కొత్త తరహా సినిమాలను ఆదరిస్తున్నారన్నది స్పష్టమవుతోంది.

జై భీమ్ సినిమా థియేటర్‌లో విడుదల కాలేదు కాబట్టి అది ఎంత పెద్ద హిట్టో చెప్పడానికి బాక్సాఫీసు నంబర్లు లేవు.

కానీ, ఐఎంబీడీలో ప్రేక్షకులు 9.6 రేటింగుతో ఈ సినిమానi అగ్రస్థానంలో నిలబెట్టారు.

(ఈ కథనానికి సుధా జీ తిలక్ సహాయం అందించారు.)

అసీమ్ ఛబ్రా ఫ్రీలాన్స్ సినిమా, పుస్తక రచయిత. ఇటీవలే 'ఇర్ఫాన్ ఖాన్: ది మ్యాన్, ది డ్రీమర్, ది స్టార్' పుస్తకం రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)