తలైవి సినిమా రివ్యూ: ఒక అసంపూర్ణ బయోపిక్‌

తలైవి సినిమా రివ్యూ కంగనా రనౌత్

ఫొటో సోర్స్, facebook/ZeeStudios

    • రచయిత, తోట భావనారాయణ, సీనియర్ జర్నలిస్ట్
    • హోదా, బీబీసీ కోసం

తలైవి అంటే తెలుగులో నాయకురాలు అని అర్థం. తమిళులు జయలలితను పురట్బి తలైవి (విప్లవనాయకి)గా పిలుచుకుంటారు.

అమ్మ అంటే వాళ్ళకు జయలలితే. తమిళనాడుకే పరిమితం చేయాల్సిన నాయకురాలు కాదు. అందుకే ఆమె బయోపిక్‌ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని తమిళ, తెలుగు, హిందీ భాషలలో విడుదల చేశారు. ఆమె జీవితమంతా ఎన్నో ఆటుపోట్లు, జయాపజయాలు, విమర్శలు, ఆరోపణలు. అంతా వివాదాస్పదమైన ఘట్టాలు ఉండటం వల్లనే జయలలిత బయోపిక్‌ అనగానే చాలా అంచనాలుంటాయి.

సినిమా జీవితం, రాజకీయాల్లో ప్రవేశం, ముఖ్యమంత్రి కావటం, అవినీతి ఆరోపణలతో జైలుకెళ్ళటం, ఓడినా మళ్ళీ గెలవటం, చివరికి ఆమె మరణం మీద కూడా అనుమానపు మేఘాలు కమ్ముకోవటం వల్లనే ఇంత ఆసక్తి.

గతంలో తమిళనాడు రాజకీయాల మీద ఇరువర్‌ (తెలుగులో ఇద్దరు పేరుతో డబ్‌ అయింది) అనే సినిమా వచ్చింది. అయితే అప్పట్లో రెండు ప్రధాన పాత్రలు (కరుణానిధి, జయలలిత) బ్రతికే ఉండటం వలన ఆ పాత్రల చిత్రణ చాలా పొడిపొడిగా సాగింది. పూర్తిగా ఫిక్షన్‌ లాగా కూడా చూపించకుండా జనాన్ని అయోమయంలోకి నెట్టారు. తమిళనాడులోనే అంతంత మాత్రంగా నడిచిన సినిమా తెలుగులో ఘోరంగా దెబ్బతిన్నది. కానీ ఇప్పుడు ఇది జయలలిత జీవితానికి సంబంధించినది కాబట్టి ఎక్కువమంది కనెక్ట్‌ అయ్యే అవకాశముందని భావించిన నిర్మాతలు ఈ సాహసానికి ఒడిగట్టారు.

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలైన జయపై అధికారపక్షం సభ్యులు జరిపినదాడి, ఆమె మహాభారతంలో ద్రౌపది పరాభవాన్ని గుర్తు చేస్తూ, మళ్ళీ ముఖ్యమంత్రిగానే శాసన సభలో అడుగుపెడతానని ప్రతిజ్ఞ చేయటంతో సినిమా మొదలవుతుంది. చివర్లో మళ్ళీ అదే సీన్‌ వరకు తెచ్చి, పాలనలో ఆమె డమ్మీగా ఉంటారనుకునే వారికి హెచ్చరికతో ముగించారు.

తలైవి సినిమా రివ్యూ కంగనా రనౌత్

ఫొటో సోర్స్, facebook/vibrimedia

ఇందులో ప్రధానంగా జయలలిత ఒక నటిగా మారిన వైనం, ఎమ్జీఆర్‌ (కథలో ఎంజేఆర్‌‌గా పేరు మార్పు)కు దగ్గరైన తీరు, ఆయనతో ఆమె సంబంధం, ఎలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఎందుకు పార్టీలోనూ ఆమెకు సహకారం దొరకలేదు. ఒక మహిళగా ఆమెను చిన్న చూపు చూడటం లాంటి విషయాలకు కాస్త నాటకీయత జోడించి బాగానే చూపారు. సినిమా కాబట్టి ఆ మాత్రం నాటకీయత అర్ధం చేసుకోవచ్చు.

ఒక సూపర్‌ స్టార్‌ తనకున్న ప్రజాదరణను ఓట్లుగా మలుచుకొని ముఖ్యమంత్రి కావటానికీ, అర నిక్కర్లతో డాన్స్‌ చేసిన నటిగా ఉన్న ముద్రను జనం మనసులలోనుంచి తుడిచేసి నాయకురాలిగా మెప్పించి ముఖ్యమంత్రి కావటానికీ చాలా తేడా ఉంది.

పురుషాధిక్య సమాజంలో ఆ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుతూ నాయకురాలిగా ఎదిగిన తీరును తలైవిలో చూచాయిగా మాత్రమే చూపించారని చెప్పాలి. జయ పాత్రలో కంగనా రనౌత్‌ బాగానే నటించగలిగారు. చాలాచోట్ల భావాలు పలికించడంలో విజయవంతమైనట్టు ఒప్పుకోవాల్సిందే. సినిమా మొత్తం ఆమె చుట్టూ తిరగటం వలన కంగనా రనౌత్‌‌కు సహజంగానే ఈ పాత్ర పేరు తెచ్చిపెడుతుంది. కానీ ఈ సినిమాకు ఆమె వల్ల వచ్చే పేరుకంటే ఆమెకు ఈ సినిమా తెచ్చిపెట్టే పేరే ఎక్కువ.

తలైవి సినిమా రివ్యూ అరవింద్ స్వామి

ఫొటో సోర్స్, facebook/vibrimedia

ఎమ్జీఆర్‌ పాత్రలో అరవింద్‌ స్వామి నటన చాలా బాగుంది. సినిమా మొత్తంలో ఎక్కువ ఓట్లు పడేది అరవింద్‌ స్వామి నటనకే. తమిళ ప్రేక్షకులకు సైతం జయ పాత్ర కంటే ఈ పాత్రే బాగా నచ్చుతుంది. ఆనాటి ఎమ్జీఆర్‌‌ను మళ్ళీ గుర్తు చేసి అచ్చుగుద్దినట్టు ఆయనను అనుకరించటం బాగుంది. రాజకీయ నాయకుడిగా కరుణానిధితో విభేదాలవంటివి ఎక్కువ చూపించలేకపోవటానికి కారణం సినిమా మొదటి సగం జయ, ఎమ్జీఆర్‌ మధ్య ప్రేమాయణానికే వెచ్చించాల్సి రావటం. తన సంబంధం గురించి ఎప్పుడూ నేరుగా చెప్పని జయలలిత "ఎమ్జీఆర్‌‌ను ప్రేమించని వాళ్ళెవరుంటారు?’’ అనటం తమిళనాట బాగా ప్రచారం పొందిన డైలాగ్‌. అందుకే మరచిపోకుండా వాడుకున్నారు.

"ఎమ్జీఆర్‌ కంటే నేను ఎందులోనూ తక్కువ కాదు. నాకూ ఒక ఆర్‌ఎం వీరప్పన్‌ ఉంటే నేనూ రాజకీయాల్లో క్లిక్కయ్యేవాడిని" అని ఒకప్పుడు శివాజీ గణేశన్‌ స్వయంగా ఆవేదనతో చెప్పుకున్నారంటే ఆర్‌ఎం వీరప్పన్‌ ప్రాధాన్యం అర్ధమవుతుంది. ఎమ్జీఆర్‌ మేనేజర్‌‌గా మొదలై నిర్మాతగా ఎమ్జీఆర్‌ ఇమేజ్‌ పెంచే ఎన్నో చిత్రాలు నిర్మించి, ఆ తరువాతఅభిమాన సంఘాలన్నీటినీ ఏకం చేసి ఎమ్జీఆర్‌ రాజకీయంగా బలోపేతం కావటానికి కృషి చేసినవాడు ఆర్‌ఎంవీ. ఎమ్జీఆర్‌ చనిపోయాక ఆయన భార్య జానకి వైపు నిలబడినా, ఆ తరువాత జయతో కలసిన పార్టీలో ఆమె తరువాత స్థానంలో చేరారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర నిడివి ఎక్కువే. నిజానికి ఆర్‌ఎంవీ పాత్రకు సముద్రఖని ప్రాణం పోశాడు.

కరుణానిధి పాత్రలో నటించిన నాజర్‌ ఆ పాత్రకు న్యాయం చేశారు. జయలలితపట్ల ఆయనకున్న అభిప్రాయాన్ని ఆయన చూపుల్లో కనబరచిన తీరు అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఆయనే స్వయంగా డబ్బింగ్‌ చెప్పటం వలన ఉచ్చారణ దోషాలు ఎక్కువగా వినపడతాయి.

తలైవి సినిమా రివ్యూ కంగనా రనౌత్

ఫొటో సోర్స్, facebook/vibrimedia

పాత్రల చిత్రీకరణలో ఎక్కడ ఏ వివాదం వస్తుందోనన్న భయంతో ఎక్కడికక్కడ అతి జాగ్రత్తలు తీసుకున్న విషయం కూడా కనబడుతుంది. శశికళ పాత్రను నామమాత్రంగా చూపటం ఒక పెద్ద లోపం. నిజం చెప్పాలంటే ఒక బయోపిక్‌‌కు సరిపడినంత విషయం శశికళ పాత్రకుంది. ఒక వీడియో సంస్థ నడిపే వ్యక్తిగా పరిచయమయ్యాక ‘అక్కా..’ అంటూ పక్కన నిలబడటం తప్ప ఎలాంటి ప్రాధాన్యమూ ఆపాదించలేదు. 1989-91 మధ్య కాలంలో జరిగిన పరిణామాలను కుదించటం వలన గందరగోళం కనిపిస్తుంది. పార్టీకీ, ప్రభుత్వానికీ ఉండే తేడా తెలియకుండా బాధ్యతలు అప్పగించటం, నియామకాలవంటివి ప్రేక్షకులను అయోమయంలో పడేస్తాయి.

మొత్తంగా చూస్తే ఇదొక మసాలా బయోపిక్‌‌లా అనిపిస్తుందే తప్ప నిజమైన జయలలిత కేరక్టర్‌‌ను ఆవిష్కరించే ప్రయత్నంలో విజయం సాధించలేకపోయారు. ఆమె ఎలా ముఖ్యమంత్రి అయ్యారు అనే విషయం వరకే ప్రాధాన్యమిచ్చారు తప్ప ఆమె పాలన గురించి గాని, ఆ తరువాత వచ్చిన ఆరోపణలు, కోర్టు కేసులు, జైలు జీవితం, మరణం లాంటి విషయాల జోలికి వెళ్లలేదు. జయలలిత ఎదుగుదలను చూపటం ద్వారా ఆమెనుంచి స్ఫూర్తిపొందాలని భావించే వారికోసమే ఈ సినిమా తీసినట్టు నిర్మాతలు చెప్పుకుంటే అభ్యంతరం ఉండనక్కర్లేదు. కానీ ప్రేక్షకుల దృష్టిలో మాత్రం ఇదొక అసంపూర్ణ బయోపిక్‌.

నిర్మాతలు: విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌, బృందా ప్రసాద్‌

దర్శకుడు: ఏఎల్‌ విజయ్‌

నటీనటులు: కంగన రనౌత్‌, అరవింద్‌ స్వామి, రాధా రవి, సముద్ర ఖని, మధుబాల. భాగ్య శ్రీ తదితరులు

కథ: విజయేంద్ర ప్రసాద్‌

సినిమాటోగ్రఫర్‌: విశాల్‌ విట్టల్‌

సంగీతం: జీవి ప్రకాశ్‌ కుమార్‌

ఎడిటింగ్‌: ఆంటోనీ, భల్లు సలూజ

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)