టక్ జగదీష్ సినిమా రివ్యూ: నాని సినిమా నేచురల్‌గా ఉందా?

టక్ జగదీష్ సినిమా రివ్యూ: నాని

ఫొటో సోర్స్, facebook/PrimeVideoIN

    • రచయిత, సుజాత వేల్పూరి
    • హోదా, బీబీసీ కోసం

కొంతమంది నటుల మీద వాళ్ళు చేసిన సినిమాల వల్ల మనకు తెలీకుండానే అంచనాలు ఏర్పరచుకుంటాం. మంచి సినిమాలు చేసే కొద్దీ ఆ అంచనాలు పెరుగుతూ పోతాయి.

అలాంటి అంచనాలు తెలుగు ప్రేక్షకులకు నాని మీద ఏర్పడి, పెరుగుతూ పోయాయి. అలా మొదలైంది, పిల్ల జమీందార్, నిన్ను కోరి, జంటిల్‌మేన్, జెర్సీ లాంటి డిఫరెంట్ సినిమాలు చేస్తూ నాచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నాని, "కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, అనుబంధాలు" గురించి ప్రేక్షకులకు సందేశం ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్టున్నాడు.

టక్ జగదీష్‌గా అవతరించాడు.

కథ: కోస్తా ప్రాంతంలో భూదేవి పురంలో పెద్ద మనిషి ఆదిశేషు (నాజర్) కి ముగ్గురు ఆడపిల్లలూ, ఇద్దరు కొడుకులూ.

ఆడపిల్లలు ముగ్గురూ మొదటి భార్య పిల్లలు. మగ పిల్లలు (నానీ, జగపతి బాబు) రెండో భార్య పిల్లలు. (ఎవరు ఎవరెవరి పిల్లలో ప్రేక్షకులు కనుకునే సరికి సినిమా సగం గడిచిపోతుంది)

ఆ వూళ్ళో ఆధిపత్యం కోసం పోటీ పడే మరో ప్రతినాయకుడు, వాడి తమ్ముడు.

జగదీష్ మేనకోడలు చంద్రకి జగదీష్ అంటే చాలా ఇష్టం. కానీ వూళ్ళో వీఆర్వోగా పని చేస్తున్న వరలక్ష్మి (రీతూ వర్మ)ని జగదీష్ ప్రేమిస్తాడు.

కొద్ది రోజులకు ఆరోగ్య సమస్యలతో ఆదిశేషు కన్ను మూస్తాడు.

జగదీష్ చదువుకోడానికి పట్నం వెళ్ళిన సందర్భంలో చంద్రని ప్రతినాయకుడి తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తాడు జగపతి బాబు.

నాని తిరిగి వచ్చే సరికి వూళ్ళో పరిస్థితులన్నీ తారుమారు అవుతాయి. జగపతి బాబు ప్రతినాయకుడితో చెయ్యి కలిపి జెడ్పీటీసీ అతడికి వదిలేసి, ఆదిశేషు ఇంతకు ముందు పేదలకు పంచిన భూములన్నీ వెనక్కి లాక్కునే ప్రయత్నాల్లో ఉంటాడు.

ఆస్తిలో ఎవరికీ భాగం లేదని ఆడపిల్లని ఇంట్లోంచి పంపేస్తాడు. అందరూ విడిపోతారు.

అక్కడి ఎమ్మార్వో జగపతి బాబుకి అనుకూలంగా ఉంటాడు.

నాని ఆ అవినీతి అధికారి మీద పైఅధికారులకు ఫిర్యాదు చేసి సస్పెండ్ అయ్యేలా చేస్తాడు. అంతటితో ఆగకుండా, తర్వాతి సీన్‌లో ఏకంగా ఎమ్మార్వో అయి వాళ్ల వూరికే పొస్టింగ్ వేయించుకుని వస్తాడు.

చివరికి ఏమైంది? నాని అందరినీ కలిపాడా? జగపతి బాబుకి బుద్ధి వచ్చిందా? ప్రతినాయకుడేమయ్యాడు? అనేవి తెలుసుకోడానికి ప్రైమ్ తెర మీద చూడాల్సిందే.

టక్ జగదీష్ సినిమా రివ్యూ: నాని

ఫొటో సోర్స్, facebook/PrimeVideoIN

హీరోకి టక్ జగదీష్ అనే పేరెందుకు వచ్చిందో అనే విషయం నుంచీ, వూళ్ళో తమ భూమి సమస్యలు తీర్చుకోడానికి అప్పటికప్పుడు హీరో ఎమ్మార్వో అయి రావడం వరకూ బోలెడన్ని అసంబద్ధతలు సినిమా నిండా.

చిన్నప్పుడు ఎవరో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ టక్ చేసుకోవడం చూసి మన హీరో అలా టక్ చేసుకుని తిరుగుతుంటాడు. ఇదే టైటైల్ జస్టిఫికేషన్.

మేనకోడలు వివాహ జీవితం సరిగా లేదని గ్రహించిన నాని, మేనకోడలు ఇంటి పైన ఒక బల్బు బిగించి, సమస్య వస్తే ఆ లైట్ వేయమని ఒక స్విచ్ ఇచ్చి వెళ్లడం చాలా హాస్యాస్పదం. రోజూ వచ్చి చూసెళతాడట, ఏదైనా సమస్య వచ్చిందో లేదో అని. ఎమ్మార్వో కదా, వేరే వూరికి పని మీద వెళ్లాల్సి వస్తే? లేదా ఆ పిల్లకు సమస్య వచ్చిన రోజు ఆ బల్బు మాడి పోతే? ఒక్కోళ్ళు రెండేసి సెల్‌ఫోన్లు వాడుతున్న రోజుల్లో డాబా మీద బల్బు బిగించడమేంటీ?

వూర్లో ఒక ఇంట్లో పొలం గొడవ తీర్చడానికి వాళ్ళింటికి స్వయంగా వెళ్ళే ఎమ్మార్వో ఒక వేట కత్తిని చొక్కాలో దాచి పెట్టి తీసుకెళ్ళి, దాని సాయంతో సమస్యను పరిష్కరించడం వింతల్లోకెల్లా వింత.

సినిమాకి ప్లస్ పాయింట్ నాని.

కుటుంబాన్ని పోగొట్టుకోకూడదని, ఆ బంధాల కోసం తాపత్రయపడే కొడుకుగా, తమ్ముడిగా నాని నటన తారాస్తాయిలో ఉంది. దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోడానికి ప్రయత్నించడంలో నాని ఎప్పుడూ బాగా నటిస్తాడు.

జగపతి బాబు నటన కూడా బాగుంది. హీరోయిన్ కేవలం ఆ పాత్ర కోసమే. మిగతా వాళ్ల గురించి చెప్పుకోడానికేమీ లేదు.

బాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా, ఇతర టెక్నికల్స్ బాగున్నాయి.

కుటుంబమంతా కలిసి చూడవలసిన అనుబంధాల సినిమా నిండా నరుకుళ్ళు, రక్త ధారలు మరీ ఈ స్థాయిలో లేకుండా కాస్త తగ్గిస్తే బాగుండేదని తప్పకుండా అనిపిస్తుంది.

తర్కం వెదక్కుండా ఫక్తు కమషియల్ సినిమా తీసుకున్న సినిమాటిక్ లిబర్టీగా అన్ని సన్నివేశాలనూ అంగీకరిస్తూ పోతే సరే, లేదంటే విసుగు పుట్టించింది చాలా చోట్ల.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)