ఆమిర్‌ఖాన్: లగాన్ సినిమా కథ చెప్పినప్పుడు చెత్తగా ఉందని ఎందుకన్నారు

ఫొటో సోర్స్, LUCY NICHOLSON/gettyimages
- రచయిత, మధు పాల్
- హోదా, బీబీసీ కోసం
అత్యుత్తమ బాలీవుడ్ సినిమాల్లో ఆశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన ‘‘లగాన్’’ ఒకటి. దీనిలో ఆమిర్ ఖాన్ పాత్ర ‘‘భువన్’’ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది.
ఈ సినిమా విడుదలై నేటికి 20ఏళ్లు అవుతోంది.
లగాన్ కథతో ఆశుతోష్ గోవారికర్ వచ్చుండకపోతే, ఆమిర్ నిర్మాతగా ఎప్పటికీ మారుండేవారు కాదేమో. ఈ విషయం చాలా కొద్దిమందికే తెలుసు.
లగాన్ కథను మొదట ఆశుతోష్ చెప్పినప్పుడు.. ఇది చాలా చెత్తగా ఉందని ఆమిర్ చెప్పారట. అంతేకాదు దీనిపై పనిచేసేందుకు ఆయన నిరాకరించారు కూడా.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆస్కార్‌కు కూడా నామినేట్ అయ్యింది. అయితే, ఆస్కార్ అవార్డు రాలేదు.

ఫొటో సోర్స్, ARKO DATTA/gettyimages
‘‘మూడు నెలలు వృథా?’’
లగాన్ సినిమాకు 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీబీసీతో మాట్లాడారు ఆమిర్.
ఈ సినిమా తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు.
‘‘ఆశుతోష్ మొదటిసారి ఆ కథ చెప్పినప్పుడు నాకు చాలా చెత్తగా అనిపించింది. ఆయన రెండు నిమిషాల్లో కథ పూర్తిచేశారు. ఒక గ్రామం ఉంటుంది. అక్కడ వర్షాలు పడటంలేదు. దీంతో గ్రామస్థులు ఇంటి అద్దె కట్టలేకపోతుంటారు. అయితే, అద్దె మాఫీ చేయడానికి ఒక బెట్ కడతారు. క్రికెట్‌లో తాము గెలిస్తే అద్దెను మాఫీ చేయాలని కోరతారు అని కథను ముగించారు.
ఆ కథ విన్న వెంటనే చెత్తగా అనిపించింది. 1893లో అద్దె మాఫీ చేయడానికి క్రికెట్ ఆడటమా? అసలు ఏంటిది? నాకు అర్థం కావడంలేదు అని ఆశుతోష్‌తో అన్నాను’’
‘‘నీవి గత రెండు సినిమాలు సరిగా ఆడలేదు. నువ్వు మంచి సినిమాలు తీయాలని చెప్పాను. నా మాటలు విన్న తర్వాత ఆశుతోష్ అసంతృప్తికి గురయ్యారు. ఆ తర్వాత మూడు నెలలు కనబడలేదు’’
‘‘మూడు నెలల తర్వాత మళ్లీ ఆశుతోష్ ఫోన్ చేశారు. ఓ కథను మీకు చెప్పాలి అన్నారు. సరే చెప్పు అన్నాను. ఇలా కాదు.. మిమ్మల్ని కలిసి చెబుతా అన్నారు. వెంటనే అదే క్రికెట్ కథా? అని అడిగాను. కానీ ఆశుతోష్ ఏమీ మాట్లాడలేదు. నేను అదే కథ అయితే వినను అని చెప్పాను. ఆ చెత్త కథపై ఎందుకు మూడు నెలలు వృథా చేశావు అన్నాను. కానీ, మీరు కథ వినాలి అంటూ ఆశుతోష్ పట్టుపట్టారు’’ అని ఆమిర్ చెప్పారు.

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/gettyimages
చాలా మంది చేయం అన్నారు..
‘‘ఆశుతోష్ స్నేహితుడు అవ్వడం వల్లే ఆ కథ వినడానికి ఒప్పుకున్నాను’’ అని ఆమిర్ చెప్పారు.
‘‘ఈ సారి పూర్తి వివరాలతో కథ చెప్పారు. అది వినగానే అద్భుతంగా అనిపించింది. కథ వింటున్నప్పుడు నవ్వు వచ్చింది. కొన్నిసార్లు ఏడ్చాను కూడా. అయితే ఈ కథ తెరకెక్కించాలంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఎవరు దీన్ని తీస్తారు? అని అడిగాను. ఎందుకంటే నేను నటుణ్ని. నిర్మాతను కాదు. ఆశుతోష్ తీసిన బాజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను తీసేందుకు ఎవరు ముందుకువస్తారు. మొదట నిర్మాతను పట్టుకురా. అప్పుడే నేను సినిమా చేస్తాను అని ఆశుతోష్‌తో అన్నాను. నేను ఈ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పు.. అప్పుడు నిర్మాతలు ఎవరైనా ముందుకు రావొచ్చు అన్నాను’’
‘‘ఒకవేళ వేరే ఎవరైనా హీరోలకు ఈ కథ నచ్చి, డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉంటే ఆలోచించొద్దు. నా కోసం ఎదురుచూడొద్దు అన్నాను’’
‘‘నా మాటలు విన్న తర్వాత ఈ కథను చాలా మంది నటులు, నిర్మాతలకు ఆశుతోష్ చెప్పారు.
అయితే ఎవరికీ ఈ కథ సరిగా తలకెక్కలేదు. నాకు ఏదైనా కథ నచ్చితే, ఆ తర్వాత ఏం జరిగిందో కనుక్కుంటుంటా. అలానే ఈ సినిమా ఎంతవరకు వచ్చిందని అడిగేవాణ్ని. అలా ఈ సినిమా కథను నేను మూడుసార్లు విన్నాను. ప్రతిసారీ ఆశుతోష్‌ను మెచ్చుకునేవాణ్ని. కానీ, సినిమాపై డబ్బులు పెట్టడానికి ధైర్యం సరిపోయేది కాదు. ఒకసారి ఆలోచించడం మొదలుపెట్టాను. అసలు నేనెందుకు భయపడుతున్నాను అనుకున్నాను. నిర్మాతలైన గురుదత్, శాంతారామ్, ఆసిఫ్, విమల్ రాయ్‌లు ముందుకు రాకపోతే ఏం? నేను డబ్బులు పెట్టకూడదా? అనిపించింది’’
‘‘ఆ కథలో హీరోలా ధైర్యంగా ముందుకు వెళ్దామని అనుకున్నాను. అతడి జీవితంలో కష్టాలున్నాయి. అయినా అతడు విజయం సాధించాడు. అక్కడి నుంచే స్ఫూర్తి పొందాను. నేను ఈ సినిమాలో నటించాలి అనుకుంటే, నేనే డబ్బులు పెట్టాలి అని నిశ్చయించుకున్నాను’’

ఫొటో సోర్స్, STR/gettyimages
‘‘నిర్మాత కావాలని ఎప్పుడూ అనుకోలేదు’’
ఆమిర్ ఖాన్ తండ్రి తాహిర్ హుస్సేన్ రచయిత, నిర్మాత. నిర్మాతగా తాహిర్ పడిన కష్టాలను ఆమిర్ దగ్గరుండి చూశారు.
‘‘మా నాన్న శ్రమను దగ్గరుండి చూసిన తర్వాత, నేను నిర్మాత ఎప్పుడూ అవ్వకూడదని అనుకున్నాను’’ అని ఆయన చెప్పారు.
‘‘కానీ ఈ సినిమాలో హీరో అవ్వాలి అనుకుంటే, దీన్ని కచ్చితంగా నేనే నిర్మించాలని అర్థమైంది. వెంటనే ఈ కథను మా అమ్మకు, నాన్నకు, నా మొదటి భార్య రీనాలకు చెప్పాను. ఇలా నేను ఎప్పుడూ చేయలేదు. కథ వినగానే వారికి బాగా నచ్చింది. ఇది ఖరీదైన సినిమా అని వారికి కూడా అర్థమైంది. అయితే కథ బాగుంటే, కచ్చితంగా సినిమా చేయాల్సిందేనని నాన్న అన్నారు’’
ఈ సినిమాకు ఓకే చెప్పడానికి మొత్తంగా ఆమిర్ రెండేళ్లు తీసుకున్నారు.
‘‘లగాన్ ఒక మరచిపోలేని ప్రయాణం లాంటిది. షూటింగ్ కోసం మేం ఆరు నెలలు కచ్‌లో గడిపాం. మేం మొత్తంగా 300 మంది వెళ్లాం. అందరమూ ఒకే భవనంలో ఉండేవాళ్లం. తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచేవాళ్లం. ఆ తర్వాత బస్ ఎక్కి షూటింగ్ జరిగే ప్రాంతానికి వెళ్లేవాళ్లం. ఒకరోజు బస్‌లో ఒకరు గాయత్రి మంత్రం చదవడం మొదలుపెట్టారు. అది అందరికీ నచ్చింది. ఆ తర్వాత రోజూ 45 నిమిషాలపాటు బస్సులో ఆ మంత్రం వినేవాళ్లం. మేమే కాదు.. మాతో ఉన్న ఇంగ్లిష్ వాళ్లు కూడా ఆ మంత్రం చెప్పేవాళ్లు’’

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/gettyimages
అవార్డులను సీనియస్‌గా తీసుకోను..
అవార్డు ఫంక్షన్లకు ఆమిర్ ఎక్కువగా హాజరుకారు. దీనిపై ఆమిర్ స్పందించారు.
‘‘నేను అవార్డులను సీరియస్‌గా తీసుకోను. అది ఆస్కార్ అయినా ఆయ్యుండొచ్చు. దీనికి కారణం ఏమిటంటే, ఒక్కొక్కరికి ఒక్కో సినిమా నచ్చుతుంది. కొందరికి లగాన్ నచ్చుతుంది. మరికొందరికి దంగల్.. ఇంకొందరికి 3ఇడియట్స్. సినిమాలను ఒకదాన్ని మరొకదానితో పోల్చిచూడటం చాలా కష్టం’’
‘‘ఇవేమీ స్పోర్ట్స్ కాదు. వంద మీటర్ల రేసులో ముందు వచ్చేవారు విజయం సాధించడానికి. స్పోర్ట్స్‌లో ఒక క్లారిటీ ఉంటుంది. సినిమాలపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది’’
‘‘మనం అవార్డులను సీరియస్‌గా తీసుకోకూడదు. కానీ ఆ కార్యక్రమాలను సెలబ్రేట్ చేసుకోవాలి. అందరి సినిమాలనూ ప్రశంసించాలి’’
‘‘అయినా, అవార్డుల కార్యక్రమాలకు నేను పూర్తిగా వెళ్లను అనడంలో నిజంలేదు. నాకు దీననాత్ మంగేష్కర్, గొల్లపూడి అవార్డులు వచ్చాయి. వీటిని తీసుకోవడానికి నేను నేరుగా వెళ్లాను. నేను ఆస్కార్‌కు వెళ్తాను. ఎందుకంటే మన సినిమాలను అక్కడ మార్కెటింగ్ చేసుకోవచ్చు’’
లగాన్ సినిమా బ్రిటిష్ రాజ్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో ఒక యువ రైతుగా ఆమిర్ కనిపిస్తారు.
ఆమిర్‌తోపాటు గ్రేసీ సింగ్, రఘువీర్ యాదవ్, రేచల్ షెల్లీ, కుల్‌భూషణ్ ఖర్బందా, యశ్‌పాల్ సింగ్, రాజేంద్ర గుప్తా, సుహాసిని ములయ్ తదితరులు ఈ సినిమాలో నటించారు.
ఇవి కూడా చదవండి:
- సంచయిత, అశోక్ గజపతి రాజు: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి విషయంలో ఇన్ని వివాదాలు ఎందుకు?
- గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు ఎందుకు కుప్పకూలాయి.. కంపెనీ ఏం చెబుతోంది..
- ‘వేధింపులు భరించలేకపోతున్నాం, ఈ ఇల్లు అమ్మేస్తాం’ అని ఒక కులం వాళ్లు ఎందుకు పోస్టర్లు అంటించారు?
- ద గేట్స్ ఆఫ్ హెల్: ఎడారిలో అగ్ని బిలం.. దశాబ్దాలుగా మండుతూనే ఉంది
- బెంజమిన్ నెతన్యాహు: ఈ ఇజ్రాయెల్ రాజకీయ మాంత్రికుడు ప్రపంచానికి ఎలా గుర్తుండి పోతారు
- మిజోరాం: 38 మంది భార్యలు.. 89 మంది పిల్లలు.. ‘ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబ పెద్ద’ ఇకలేరు
- పాకిస్తాన్లో మహిళల లోదుస్తులు అమ్మడం ఎందుకంత కష్టం?
- ప్రధాని పదవి నుంచి తప్పుకున్న బెంజమిన్ నెతన్యాహూ, ఇజ్రాయెల్ కొత్త ప్రధాని నాఫ్తాలి బెన్నెట్
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ
- ఉత్తరాఖండ్ జల ప్రళయం: ''సొరంగంలో 7 గంటలు ప్రాణాలను అరచేత పెట్టుకుని గడిపాం''
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








