స్టార్ హీరోలు, హీరోయిన్ల మహిళా బాడీగార్డులు... ‘‘పరిస్థితి ఇలాగే ఉంటే ఆకలితో చనిపోతాం’’

ఫొటో సోర్స్, FEHMIDA ANSARI
- రచయిత, మధుపాల్
- హోదా, బీబీసీ కోసం
బాలీవుడ్ సినీ స్టార్లు సినిమాల షూటింగ్‌లు, ఇతరత్రా కార్యక్రమాలకు వెళ్లినప్పుడు వారి వెంట బాడీగార్డులు, బౌన్సర్లు కనిపిస్తుంటారు.
సినీ స్టార్లకు జనం మరీ దగ్గరగా రాకుండా, వారిని ఏ ఇబ్బందీ పెట్టకుండా చూడటం వీరి పని.
సాధారణంగా ఈ పనిని మగవాళ్లే చేసేవారు. కానీ, కొన్నేళ్లుగా ఈ రంగంలో మహిళలకు కూడా అవకాశాలు దక్కుతూ వస్తున్నాయి. దీంతో బాడీగార్డులుగా, బౌన్సర్లుగా పనిచేసే మహిళల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
అయితే, కరోనావైరస్ సంక్షోభం వచ్చాక, ఈ రంగంలోకి వచ్చిన మహిళల కష్టాలు పెరిగాయి. షూటింగ్‌లు, కార్యక్రమాలు లేకపోవడంతో పని దొరక్క వాళ్లు ఇబ్బందుల పాలవుతున్నారు.

ఫొటో సోర్స్, FEHMIDA ANSARI
లాక్‌డౌన్ విధించినప్పటితో పోల్చితే, ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడింది. కార్యక్రమాలు పెద్దగా లేకపోయినప్పటికీ ఔట్‌డోర్ షూటింగ్‌లు మొదలయ్యాయి. పరిస్థితి మునుపటిలా లేదు కానీ, బాడీ గార్డులకు ఎంతో కొంత పని దొరుకుతోంది. మహిళా బాడీగార్డులకు మాత్రం అవకాశాలు అస్సలు రావడం లేదు.
ఫహ్మీదా అన్సారీ వయసు 42 ఏళ్లు. బాలీవుడ్ సినీ పరిశ్రమలో పనిచేస్తున్న ప్రముఖ బాడీగార్డుల్లో ఆమె కూడా ఒకరు.
‘‘పురుషులకు పని దొరుకుతోంది. మహిళా బాడీగార్డులకు మాత్రం అసలే రావడం లేదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, మేం జీవించడమే కష్టమైపోతుంది’’ అని ఫహ్మీదా బీబీసీతో అన్నారు.
17 ఏళ్లుగా తాను ఒంటరి తల్లిగా జీవిస్తున్నానని ఆమె చెప్పారు.
‘‘నా మాజీ భర్త మావైపు వెనక్కి తిరిగి చూసింది లేదు. కనీసం మా కూతురు ఎలా ఉందని కూడా అడగలేదు. నేను మళ్లీ పెళ్లి చేసుకోకూడదని, కూతురిని ఒంటరిగానే పెంచాలని నిర్ణయించుకున్నా. మా మిత్రుల్లో ఒకరు మహిళా బాడీగార్డుగా పనిచేస్తావా అని అడిగారు. చేస్తానని చెప్పా. అలా సినిమా సెట్ల వద్ద, సినీ స్టార్లకు గార్డుగా పని చేయడం మొదలుపెట్టా’’ అని ఆమె వివరించారు.
జీరో, సూపర్ 30, పద్మావత్, మర్దానీ, కలంక్ లాంటి చిత్రాల షూటింగ్‌లకు, యాడ్ ఫిల్మ్‌ల షూటింగ్‌లకు, జన్మదిన వేడుకలకు, సోనమ్ కపూర్ పెళ్లికి... ఇలా రకరకాల కార్యక్రమాలకు ఫహ్మీదా బాడీగార్డుగా పనిచేశారు.

ఫొటో సోర్స్, FEHMIDA ANSARI
‘కోపాన్ని మాపై చూపిస్తుంటారు’
మొదట్లో ఆడవాళ్లకు బాడీగార్డులుగా అవకాశం ఇచ్చేవారు కాదని.. నటుడు రోనిత్ రాయకు చెందిన ఎస్‌ఈ సెక్యూరిటీ అండ్ ప్రొడక్షన ఏజెన్సీ, ఆయన బంధువు దీపక్ సింగ్‌కు చెందిన డోమ్ సెక్యూరిటీ సంస్థ తమకు అవకాశాలు కల్పించడం మొదలుపెట్టాయని ఫహ్మీదా అన్నారు.
‘‘మమ్మల్ని నమ్మి, వాళ్లు అవకాశాలు ఇచ్చారు. కానీ, ఇప్పుడు మాకు ఇచ్చేందుకు వారి దగ్గర కూడా పనిలేదు. వారిని తప్పుపట్టే పరిస్థితి లేదు. సినీ నిర్మాణ సంస్థలే మమ్మల్ని పిలవడం లేదు’’ అని ఆమె చెప్పారు.
లాక్‌డౌన్ తర్వాత ఒక్క సంజయ్ లీలా భన్సాలీ నుంచి మాత్రమే తమకు పిలుపు వచ్చిందని ఫహ్మీదా అన్నారు.
‘‘ఆయన తప్ప మమ్మల్ని పిలిచినవారు ఎవరూ లేరు. పరిస్థితి ఇలాగే ఉంటే మేం ఆకలితో చనిపోతాం. ఈ వృత్తిలో ఉన్న ఇతర మహిళలు నాకు ఫోన్ చేసి, పని దొరకుతోందా అని ఆరా తీస్తున్నారు. పని ఇప్పించమని అడుగుతున్నారు’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, ZAREEN SHAIKH
ఫహ్మీదా తరహాలోనే జరీన్ రఫీక్ షేక్ కూడా కూడా బాలీవుడ్‌లో నాలుగేళ్లుగా బాడీగార్డ్‌గా పనిచేస్తున్నారు.
ఈ వృత్తిలో ఉండే కష్టసుఖాల గురించి ఆమె బీబీసీతో మాట్లాడారు.
‘‘ఈ సమయానికి పనికి రావాలని మాత్రమే చెబుతారు. పని ఎప్పుడు అయిపోతుందో ఎవరికీ తెలియదు. కొన్ని గంటలపాటు మేం నిలబడి ఉండాల్సి వస్తుంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జనం ఎక్కువగా ఉంటారు. నటీనటులను ఆ గుంపు మధ్య నుంచి సురక్షితంగా తీసుకువెళ్లడం మా పని. చాలా మంది మమ్మల్ని తోస్తుంటారు. కొన్ని సార్లు సినీ తారలు జనాలపై ఉన్న కోపాన్ని మాపై చూపిస్తుంటారు. కొందరు జనం బలవంతంగా సినీ స్టార్లతో ఫొటోలు దిగాలని ప్రయత్నిస్తుంటారు. వారిని కూడా మేం ఆపాలి’’ అని జరీన్ వివరించారు.
‘‘నాకు ఇద్దరు కూతుర్లు. వాళ్ల బాగోగులు నేనే చూస్తుంటాను. చివరగా ‘ఛపాక్’ సినిమా కోసం పనిచేశా. ఆ తర్వాత మార్చిలో లాక్‌డౌన్ వచ్చింది. అప్పటి నుంచి ఏడు నెలలు ఇంట్లోనే ఉపాధి లేకుండా కూర్చున్నా. ఇప్పుడు షూటింగ్‌లు మొదలయ్యాయి. కానీ, మహిళా బాడీగార్డులను పిలవడం లేదు. మా సంక్షేమం కోసం పనిచేసేందుకు సంఘాలు, సంస్థలు కూడా లేవు’’ అని జరీన్ అన్నారు.

ఫొటో సోర్స్, FEHMIDA ANSARI
సునీత నికల్జే మూడేళ్లుగా మహిళా బాడీగార్డ్‌గా పనిచేస్తున్నారు. భర్త తలకు గాయమై పని చేసే పరిస్థితుల్లో లేకపోవడంతో ఆమె ఈ వృత్తిలోకి వచ్చారు.
ఈ వృత్తి అంటే ఆమెకు చాలా ఇష్టం.
‘‘ఈ వృత్తి మాకు గౌరవాన్ని కల్పించింది. మా కుటుంబ సభ్యులు, బంధువులు కూడా నా విషయంలో గర్వపడుతూ ఉంటారు. ఇందులో డబ్బులు కూడా బాగానే వస్తాయి’’ అని సునీత చెప్పారు.
‘‘షూటింగ్‌లు జరిగేటప్పుడు మేం కాస్త కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. కొందరు జూనియర్ ఆర్టిస్టులు మొబైల్ ఫోన్లతో ఫొటోలు తీస్తుంటారు. అందుకే మేం అందరినీ నిశితంగా గమనిస్తుంటాం. ఫోన్లు వాడుతుంటే, వారి నుంచి లాక్కుంటాం. షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు ఏవైనా బయటకు వచ్చాయంటే, మేం పని సరిగ్గా చేయనట్లే’’ అని ఆమె అన్నారు.
‘‘ఈ కరోనావైరస్, లాక్‌డౌన్‌లు మా జీవితాల్ని కుదిపివేశాయి. సినీ నిర్మాణ సంస్థలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. పురుషులతో పోల్చితే మా సామర్థ్యం తక్కువ కాదు. కరోనావైరస్ అందరికీ సమానమే’’ అని సునీత అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చిదంబరం నటరాజ ఆలయం.. భూ అయస్కాంత క్షేత్రం నడిబొడ్డున ఉందా?
- జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు పెరిగాయా?
- తుపాన్లకు పేర్లను ఎవరు పెడతారు?
- ఎడారిలో అంతుచిక్కని లోహస్తంభం... అకస్మాత్తుగా ప్రత్యక్షం.. అదే తీరులో అదృశ్యం.. ఏలియన్స్ పనా?
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- కరోనావైరస్: కేరళలో దాచి పెట్టిన కోవిడ్ మరణాల గుట్టు రట్టు చేసిన వలంటీర్లు
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- టెడ్ గోయి: రెండు సార్లు... బికారి నుంచి బిలియనీర్‌గా ఎదిగిన డోనట్ కింగ్
- కన్యత్వాన్ని పునరుద్ధరిస్తామంటూ క్లినిక్‌ల అనైతిక వ్యాపారం
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- పంజాబ్ రైతుల మాదిరిగా.. వేరే రాష్ట్రాల రైతులు ఎందుకు ఆందోళనలు చెయ్యట్లేదు?
- OIC విదేశాంగ మంత్రుల సమావేశంలో కశ్మీర్ ప్రస్తావన పాకిస్తాన్ విజయమేనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








