బెంజమిన్ నెతన్యాహు: ఈ ఇజ్రాయెల్ రాజకీయ మాంత్రికుడు ప్రపంచానికి ఎలా గుర్తుండి పోతారు

బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు.

ఫొటో సోర్స్, Amir Levy/gettyimages

ఫొటో క్యాప్షన్, బెంజమిన్ నెతన్యాహు
    • రచయిత, బీబీసీ మానిటరింగ్
    • హోదా, వార్తల రిపోర్టింగ్, విశ్లేషణ

బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన గత 12 ఏళ్లుగా ఈ పదవిలో ఉన్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా ఎక్కువ ఓట్లు రావడంతో ఆయన తన పదవిని వీడాల్సి వచ్చింది.

జూన్ 13న కొత్త సంకీర్ణ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. మితవాద జాతీయవాద నేత నాఫ్టాలీ బెనెట్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టారు.

నెతన్యాహు సుదీర్ఘ కాలంపాటు ఇజ్రాయెల్‌కు ప్రధానిగా ఉన్నారు. ఆయన అయిదు సార్లు ఈ పదవికి ఎన్నికయ్యారు. మొదటిసారి 1996 నుంచి 1999 వరకు, ఆ తర్వాత 2009 నుంచి 2021 వరకు ఆయన ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.

ఇజ్రాయెల్‌లో గత మూడు ఎన్నికల్లో స్పష్టమైన ప్రజా తీర్పు రాకపోయినా ఆయన ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు.

అధికారంలో కొనసాగడానికి తన ప్రత్యర్థి బెన్నీ గాంట్జ్‌ను తన ముఖ్య సేనాధిపతిగా నియమించుకున్నారు. అయితే ఆయన పదవీకాలం చాలా తక్కువగా ఉంది.

నెతన్యాహును ఒక బలమైన రాజకీయవేత్తగా, పొలిటికల్ సర్వైవర్‌గా భావిస్తారు. ఆయన ఇజ్రాయెల్ రాజకీయ మాంత్రికుడుగా కూడా పాపులర్ అయ్యారు.

నెతన్యాహు ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడే ఆయనపై అవినీతి కేసుల్లో విచారణలు జరిగాయి. అయినా ఆయన తన పీఠాన్ని వీడలేదు.

బెంజమిన్ నెతన్యాహుకు రాజకీయ చాతుర్యం గల నేతగా పేరుంది.

ఫొటో సోర్స్, NurPhoto/gettyimages

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్‌లో అత్యధిక కాలం నాయకుడిగా పని చేసిన రికార్డు నెతన్యాహు పేరు మీద ఉంది.

కొత్త ప్రభుత్వం

నెతన్యాహు పాలనకు గుర్తింపుగా మారిన ‘‘పోలరైజేషన్’’ పాలనా శైలికి ముగింపు పలకాలని అనుకుంటున్నట్టు ఇజ్రాయెల్ కొత్త ప్రధాని నాఫ్తాలీ బెనెట్ చెప్పారు.

ఈ సంకీర్ణ ప్రభుత్వంలో నాఫ్తాలీ బెనెట్ పార్టీ (యామినా పార్టీ)కి కేవలం ఆరుగురు ఎంపీలే ఉన్నారు. కానీ కూటమి ఆయన్ను తమ నేతగా ఎన్నుకుంది.

ప్రధానమంత్రి పదవిని షేర్ చేసుకుందామని బెంజమిన్ నెతన్యాహు, విపక్ష నేత యేర్ లాపిడ్ ల నుంచి నాఫ్తాలీకి ఆఫర్ వచ్చింది. చివరకు భావజాలాల విషయంలో ఇద్దరి మధ్య చాలా దూరం ఉన్నప్పటికీ మధ్యేవాది అయిన యేర్ లాపిడ్‌తో కలిసి వెళ్లాలని మితవాద నాఫ్తాలీ నిర్ణయించుకున్నారు.

రెండు పార్టీల ఒప్పందం ప్రకారం నాఫ్తాలీ 2023 సెప్టెంబర్ వరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత మరో రెండేళ్లపాటు లాపిడ్ దేశ ప్రధాని పగ్గాలు అందుకుంటారు.

మరోవైపు ఈ కొత్త కూటమి వల్ల ముప్పు ఉందని బెంజమిన్ నెతన్యాహు చాలాకాలం నుంచి చెబుతూ వస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలను ఈ శతాబ్దపు అతిపెద్ద కుట్రగా వర్ణిస్తూ ఆయన చాలాసార్లు ట్వీట్ కూడా చేశారు.

ఈ కూటమి వల్ల ఇజ్రాయెల్ భద్రత, భవిష్యత్తు ప్రమాదంలో పడతాయని ఆయన హెచ్చరించారు.

తన ప్రత్యర్థులపై ఆరోపణలు గుప్పించిన నెతన్యాహు కొత్త ప్రభుత్వాన్ని ప్రమాదకరమైన వామపక్ష ప్రభుత్వంగా వర్ణించారు. కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దించుతానని ఆయన శపథం చేశారు.

ఇజ్రాయెల్‌లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

ఫొటో సోర్స్, NurPhoto/gettyimages

ఫొటో క్యాప్షన్, గత 12 సంవత్సరాలుగా నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని పదవిలో ఉన్నారు.

నెతన్యాహు – ఒక పరిచయం

71 ఏళ్ల నెతన్యాహు ఇజ్రాయెల్‌లో అత్యంత సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న నేతగా నిలిచారు. ఇజ్రాయెల్ రాజకీయాల్లో ఆయన హవా నడిచింది. కొంతమంది మద్దతుదారులు ఆయన్ను కింగ్ బీబీ అని కూడా పిలుచుకుంటారు.

నెతన్యాహు టెల్-అవీవ్‌లో జన్మించారు. ఆ తర్వాత ఆయన చాలా ఏళ్లపాటు అమెరికాలో గడిపారు. యువకుడిగా ఆయన అక్కడే తన చదువు పూర్తి చేశారు. ఒక కమాండో యూనిట్‌లో తన సేవలు కూడా అందించారు.

ఆయన సోదరుడు జొనాథన్‌ను నేషనల్ హీరోగా భావిస్తారు. 1976లో యుగాండాలోని ఎంతెబేలో హైజాక్ అయిన ఒక విమానం నుంచి ఇజ్రాయెల్ బందీల రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ఆయన చనిపోయారు.

నెతన్యాహు ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలరు. ఆయన ఉచ్ఛారణలో అమెరికన్ ఇంగ్లిష్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రత్యేకతతోనే ఇజ్రాయెల్-అమెరికా అంశాలను ఆయన మెరుగ్గా అమెరికా టీవీ చానళ్లలో చూపించగలుగుతున్నారు.

1984లో ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారిగా నెతన్యాహు పని చేశారు. అంతకు ముందు వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో మిషన్ డిప్యూటీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1988లో రైట్ వింగ్ లికుడ్ పార్టీ సభ్యుడుగా ఇజ్రాయెల్ పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు.

అమెరికాతో సన్నిహిత సంబంధాలు నెరపడంలో ట్రంప్ నెహన్యాహుకు సహకరించారు.

ఫొటో సోర్స్, Getty Images

లికుడ్ పార్టీ అధ్యక్షుడు కావడానికి ముందు డిప్యూటీ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. 1993లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌తో ఓస్లో ఒప్పందం జరిగినప్పుడు ఆయన విపక్షానికి నేతృత్వం వహించారు.

నెతన్యాహు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఇజ్రాయెల్లో ఆయన హింసను రెచ్చగొట్టారని ఆయన ప్రత్యర్థులు విమర్శించారు.

ఆ ఒప్పందాన్ని వ్యతిరేకించిన ఒక యూదు తీవ్రవాది 1995లో ప్రధాన మంత్రి ఇత్జాక్ రాబిన్‌ను హత్య చేశాడు. రాబిన్ హత్య తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయ్యారు.

ఓస్లో ఒప్పందంలోని కొన్ని పాయింట్ల గురించి మళ్లీ చర్చించిన నెతన్యాహు ఒక ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం వెస్ట్ నగరం హబ్రోన్‌లో 80 శాతం భాగాన్ని పాలస్తీనా పాలకులకు అప్పగించారు. దానితోపాటూ ఆ ప్రాంతం నుంచి వెనక్కు వెళ్లడానికి అంగీకరించారు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి.

ఇజ్రాయెల్ లో లికుడ్ పార్టీ నాయకత్వం వహించిన ఆయన తొలి రోజుల్లో హింసను రెచ్చగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఫొటో సోర్స్, GALI TIBBON/gettyimages

రాజకీయ పదవులు

1999లో జరిగిన ఎన్నికలో నెతన్యాహు ఓడిపోయారు. ఆయనను ఓడించిన లేబర్ పార్టీ నేత ఎహూద్ బరాక్ ఐఈడీఎఫ్‌లో మాజీ కమాండర్‌గా పని చేశారు. ఈ ఓటమి తర్వాత నెతన్యాహు లికుడ్ పార్టీ నేతగా రాజీనామా చేశారు. 2001లో ప్రధానిగా ఎన్నికైన ఎరియల్ షరాన్‌కు వారసుడిగా నిలిచారు.

షరాన్ ప్రభుత్వ హయాంలో నెతన్యాహు విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఆర్థికమంత్రిగా కూడా పనిచేశారు. కానీ తర్వాత గాజా స్ట్రిప్ నుంచి సైనికులు, అక్కడ ఉంటున్న ఇజ్రాయెలీలను తిరిగి రప్పించడాన్ని వ్యతిరేకించిన ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఆ తర్వాత ఆయన మళ్లీ లికుడ్ పార్టీ వైపు వెళ్లారు. పార్టీని చేతుల్లోకి తీసుకున్నారు. 2009లో రెండోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.

2009లో ఆయన పాలస్తీనియన్లతో శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ స్థావరాల నిర్మాణంపై పది నెలల తాత్కాలిక నిషేధం విధించడానికి కూడా అంగీకరించారు.

ఇజ్రాయెల్‌తోపాటూ పాలస్తీనా దేశానికి షరతులతో కూడిన అంగీకారాన్ని బహిరంగంగా తెలియజేశారు. అయితే 2010లో అవన్నీ విఫలమయ్యాయి.

ఆ తర్వాత 2015లో సరిగ్గా ఎన్నికలకు ముందు పాలస్తీనా దేశానికి కట్టుబడి ఉంటాననే తన మాటను పక్కన పెట్టిన ఆయన, తను ప్రధానిగా ఎన్నికైతే పాలస్తీనా దేశ ఆవిర్భావం ఉండదని ప్రకటించారు.

పాలస్తీనా దేశ ఆవిర్భావానికి నెతన్యాహు ఒకసారి అంగీకరించి తర్వాత కుదరదని మాట మార్చారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ట్రంప్ తో నెతన్యాహు

అమెరికాతో సంబంధాలు

పాలస్తీనా అంశంపై అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో నెతన్యాహుకు సంబంధాలు బెడిసికొట్టాయి. వారి మధ్య ఇరాన్ గురించి కూడా అభిప్రాయబేధాలు ఉండేవి.

2015లో ఆయన కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించినపుడు ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందాన్ని విమర్శించారు. దానిని చాలా చెత్త డీల్‌గా వర్ణించారు. ఇది ఇరాన్ అణ్వాయుధాలు పొందడానికి వీలు కల్పిస్తుందని అన్నారు.

కానీ ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో ఆయన సంబంధాలు మెరుగ్గా నిలిచాయి. డోనల్డ్ ట్రంప్ విధానాల వల్ల నెతన్యాహు, ఆయన మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ సమయంలో ఆయనకు రాజకీయ, దౌత్య ప్రయోజనాలు కూడా లభించాయి.

వారి విధానాలు, సాన్నిహిత్యం వల్ల జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా, ఆక్రమిత గోలన్ హైట్స్ మీద ఇజ్రాయెల్ సౌర్వభౌమాధికారానికి గుర్తింపు లభించింది. దానితోపాటూ ఎన్నో రాజకీయ ప్రయోజనాలు లభించాయి.

ఈ సాన్నిహిత్యం వల్లే 2020లో ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య శాంతి కోసం ట్రంప్ చేసిన ప్రతిపాదనను నెతన్యాహు స్వాగతించారు.

ఇరాన్‌తో చేసుకున్న అణు ఒప్పందం నుంచి తప్పుకోవాలని, ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలు విధించాలనే ట్రంప్ ప్రభుత్వం నిర్ణయాలపై నెతన్యాహు ప్రశంసలు కురిపించారు.

అదే ఏడాది ట్రంప్ ప్రభుత్వం ఇజ్రాయెల్, యూఏఈ, బహ్రెయిన్ మధ్య మధ్వవర్తిత్వం చేసింది. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ ప్రయత్నాల దిశగా ఒక పెద్ద విజయం అని నెతన్యాహు దానిని అభివర్ణించారు. తర్వాత మొరాకో, సూడాన్ గురించి ఇలాంటి ఒప్పందాలే చేసుకున్నారు.

ఎరియల్ షరాన్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు.

ఫొటో సోర్స్, EPA

అవినీతి ఆరోపణలు

నెతన్యాహుపై సుదీర్ఘకాలంగా అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఒక సుదీర్ఘ దర్యాప్తు ప్రక్రియ తర్వాత 2019 నవంబర్‌లో ఆయనపై లంచం తీసుకోవడం, మోసం, రిగ్గింగ్‌కు సంబంధించి మూడు వేరు వేరు కేసుల్లో అభియోగాలు మోపారు.

ఖరీదైన బహుమతులు తీసుకున్నారని, తనకు అనుకూలంగా కవరేజీ ఇచ్చిన మీడియాకు ఫేవర్ చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

అయితే నెతన్యాహు తనపై వచ్చిన ప్రతి ఆరోపణనూ తోసిపుచ్చూతూ వచ్చారు. తనపై మోపిన అభియోగాలు రాజకీయ ప్రేరేపితమని అన్నారు. తనను గద్దె దించాలనే ప్రత్యర్థులు అలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు.

2020 మేలో ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు మొదలైంది. అధికారంలో ఉన్నప్పుడే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మొట్టమొదటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు.

2015లో ఎన్నికలకు ముందు పాలస్తీనా దేశానికి కట్టుబడి ఉంటాననే తన మాటను పక్కన పెట్టి , తాను ప్రధానిగా ఎన్నికైతే పాలస్తీనా దేశ ఆవిర్భావం ఉండదని ప్రకటించారు.

ఫొటో సోర్స్, Reuters

నెతన్యాహుపై ఆరోపణలు, ఆయన సమాధానం

శాంతి చర్చలను తిరిగి ప్రారంభించాలనే ఒబామా ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా నెతన్యాహు 2009లో చేసిన ఒక ప్రసంగంలో పాలస్తీనా దేశానికి షరతులతో అంగీకరించారు.

సైనికులను తగ్గిస్తామని గ్యారంటీ లభిస్తే, ఇజ్రాయెల్‌కు అవసరమైన విధంగా భద్రతా ఏర్పాట్లు లభిస్తే, పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌ను ఒక యూదు దేశంగా అంగీకరిస్తే, భవిష్యత్తులో శాంతి ఒప్పందం ప్రకారం మేం ఒక పరిష్కారం చేసుకోడానికి సిద్ధంగా ఉంటాం అన్నారు.

అయితే 2015లో సరిగ్గా ఎన్నికలకు ముందు ఆయన తన మాట నుంచి వెనకడుగు వేశారు.

2019లో తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై మాట్లాడిన నెతన్యాహు.. కుట్రపూరితంగా జరుగుతున్న దర్యాప్తు ప్రక్రియ ద్వారా ఒక ప్రధానిని గద్దె దించడానికి ప్రయత్నాలను మనం స్పష్టంగా చూస్తున్నాం అన్నారు. అబద్ధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వను అన్నారు.

మన అందరి భద్రత, భవిష్యత్తు బాధ్యత కోసం దేశానికి నేతృత్వం వహించడం కొనసాగిస్తాను. ఈ అబద్ధపు దర్యాప్తు ప్రక్రియతో ఎలాంటి వాస్తవాలూ వెతకడం లేదు. నా వెంట పడడమే వారి లక్ష్యం అన్నారు.

2009లో బెంజమిన్ నెతన్యాహు రెండోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.

ఫొటో సోర్స్, ABIR SULTAN/gettyimages

నెతన్యాహు గురించి మిగతావారు ఏమంటారు

నెతన్యాహు ప్రధాని పదవి వీడడంపై హారెట్జ్ పత్రిక రాజకీయ విశ్లేషకులు యోసీ వర్తర్ మాట్లాడారు.

“ఈరోజు సాయంత్రం ప్రమాణం చేయబోయే ప్రభుత్వం పూర్తిగా నెతన్యాహు పనులు, వైఫల్యాలు, ఆయన అహంకారం, వంచన ఫలితమే. నెతన్యాహు మాత్రమే ఇలా విరుద్ధ మిలిటెంట్ సంస్థలను ఒకే లక్ష్యం కోసం ఒక్కటయ్యేలా చేయగలరు. ఆయన నిష్క్రమణ తర్వాత మనం కోల్పోయిన సాధారణ స్థితిని, రాజకీయ స్థిరత్వం మళ్లీ ఏర్పడవచ్చు. మనం ఒక దారుణమైన దశ నుంచి బయటపడవచ్చు” అన్నారు.

కొత్త సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాని అయిన అతి జాతీయతావాది నాఫ్తాలీ బెనెట్ కూటమితో ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత నెతన్యాహు గురించి ఒక ప్రకటన చేశారు.

“వదిలేయండి, దేశాన్ని ముందుకెళ్లనివ్వండి. ప్రభుత్వం ఏర్పడడానికి అనుకూలంగా ఓటు వేయడానికి ప్రజలకు అనుమతి ఉంది. మీ వెనుక ఒక బంజరు భూమిని వదిలి వెళ్లకండి. ఘోర వాతావరణానికి బదులు, మీ పదవీకాలంలో మీరు చేసిన మెరుగైన పనులను దేశ ప్రజలు గుర్తుంచుకోవాలని అనుకుంటున్నారు” అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)