శ్రీలంక: సముద్రంలోకి విషం చిమ్మిన ఎక్స్‌ప్రెస్ పెర్ల్

శ్రీలంక తీరంలో ఎక్స్‌ప్రెస్ పెర్ల్ అనే నౌక అగ్ని ప్రమాదంలో చిక్కుకుని నీటిలో మునిగింది.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఎక్స్‌ప్రెస్ పెర్ల్
    • రచయిత, రంగ సిరిలాల్, ఆండ్రెస్ ఇల్మర్
    • హోదా, బీబీసీ న్యూస్

జూన్‌ నెల ఆరంభంలో శ్రీలంక తీరంలో ఎక్స్‌ప్రెస్ పెర్ల్ అనే కార్గోనౌక అగ్నిప్రమాదానికి గురైంది. ఈ షిప్‌లో భారీ ఎత్తున రసాయనాలున్నాయి. ఈ ప్రమాదం వల్ల శ్రీలంక సముద్ర తీరంపై కొన్ని దశాబ్దాలపాటు ప్రభావం చూపే పర్యావరణ ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు.

శ్రీలంక తీరంలో అగ్నిప్రమాదంలో చిక్కుకున్న నౌకకు మునిగి పోవడానికి కొన్ని రోజులు ముందు వరకు, అది విడుదల చేసిన దట్టమైన పొగలు కొన్ని మైళ్ల దూరం వరకు కనిపించాయి.

ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ పెర్ల్ నౌక సగం మేర సముద్రంలో మునిగిపోయింది. నౌకకు జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన మంటలు ఆరిపోయాయి. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైందని నిపుణులు అంటున్నారు.

ఈ నౌకలోని కంటైనర్‌లలో పెద్ద ఎత్తున రసాయన పదార్ధాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కెమికల్స్ సముద్రంలో కలిశాయి. వీటి కారణంగా పర్యావరణానికి, ముఖ్యంగా సముద్ర జీవులకు భారీ ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

దీనికి తోడు టన్నుల కొద్దీ ప్లాస్టిక్ పెల్లెట్లు తీరానికి కొట్టుకు వస్తున్నాయి. వీటితోపాటు మునిగిన నౌకలోని ఇంజిన్ ఆయిల్ నిల్వలు కూడా సముద్రంలోకి లీకవుతాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

పర్యావరణ సమస్యతోపాటు తాము తీవ్రంగా నష్టపోతామని స్థానిక మత్స్యకార వర్గాలు అంటున్నాయి. ''మేం చేపలు పట్టుకుని జీవిస్తుంటాం. రోజూ సముద్రంలోకి వెళ్లకపోతే మాకు జీవితమే లేదు'' అని స్థానిక మత్స్యకారుడు దినేశ్ రోడ్రిగో బీబీసీతో అన్నారు.

ఎక్స్‌ప్రెస్ పెర్ల్ నౌకలో 46 రకాల రసాయనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సముద్రం నుంచి కొట్టుకు వస్తున్న ప్లాస్టిక్ పెల్లెట్లు

భారీగా ప్లాస్టిక్ పెల్లెట్లు

ఈ నౌకలో తరలిస్తున్న ప్లాస్టిక్ పెల్లెట్లు సముద్రంలో కను చూపు మేర వరకు వ్యాపించాయి. నర్డుల్స్‌ గా కూడా పిలిచే ఈ పెల్లెట్లతో ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తారు.

''నౌకలో 46 రకాల రసాయనాలున్నాయి'' అని శ్రీలంకకు చెందిన పర్యావరణ ఉద్యమకారుడు హేమంత వితనాగె బీబీసీతో అన్నారు. ఆయన కొలంబోలోని సెంటర్ ఫర్ ఎన్విరాన్‌ మెంటల్ జస్టిస్ అనే సంస్థ వ్యవస్థాపకులు.

ఇప్పటి వరకు కనిపిస్తున్నది ప్లాస్టిక్ పెల్లెట్లేనని, మున్ముందు రసాయనాలతో సముద్ర జీవులు పెను ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయని హేమంత వితనాగె అన్నారు.

నెగొంబో తీరంలో ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, నెగొంబో తీరం నుంచి సేకరిస్తున్న ప్లాస్టిక్ పదార్ధాలు.

ప్లాస్టిక్ పెల్లెట్లు మింగి పొట్టలు ఉబ్బి చనిపోయిన చేపలు అనేకం శ్రీలంకలోని నెగొంబో తీరానికి కొట్టుకు వస్తున్నాయని వితనాగె చెప్పారు.

సముద్రంలోకి విడుదలైన పాస్లిక్ పెల్లెట్స్ భూమిలో కలిసి పోవడానికి 500 నుంచి 1000 సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే, ఈ పాస్టిక్ పెల్లెట్స్ ప్రమాదకరంగా కనిపిస్తున్నప్పటికీ, మనిషికి హాని చేయవని ఆస్ట్రేలియాకు చెందిన సముద్ర వాతావరణ నిపుణుడు బ్రిటా డెన్సి హార్డెస్టీ అన్నారు.

''ఈ పెల్లెట్స్‌ను చేపలు తింటాయి. కానీ అవి వాటి పేగుల్లోనే ఉండి పోతాయి. వాటిని మింగిన చేపలను తినడం ప్రమాదకరం అన్నది వాస్తవం కాదు'' అని ఆయన స్పష్టం చేశారు.

నౌక ప్రమాదం వల్ల తమ ఉపాధికి విఘాతం కలుగుతుందని స్థానిక మత్స్యకారులు అంటున్నారు.
ఫొటో క్యాప్షన్, నెగొంబో తీరంలోని మత్స్యకారులు

''మా కుటుంబం రోడ్డున పడుతుంది''

చేపలు తినడం వల్ల ప్రమాదం ఏమీ లేదని కొందరు నిపుణులు చెబుతున్నా, మత్స్యకారులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ ప్రమాదం కారణంగా తాము ఇక చేపలు పట్టడం సాధ్యం కాదేమోనని నెగెంబో ప్రాంతంలోని మత్స్యకారులు భయపడుతున్నారు.

''రసాయనాల వల్ల ఈ ప్రాంతమంతా కలుషితమవుతుందని, చేపల సంతానోత్పత్తి మీద ప్రభావం చూపుతుందని అంటున్నారు. అదే జరిగితే మాకు చావుకన్నా వేరే మార్గం లేదు'' అని టిలిన్ ఫెర్నాండో అనే మత్స్యకారుడు అన్నారు.

ఈ ప్రమాదం వల్ల ఏర్పడిన నష్టానికి సింగపూర్‌కు చెందిన ఆ నౌక యాజమాన్య సంస్థ నుంచి ఇన్సూరెన్స్ రూపంలో పరిహారం రాబట్టాలని శ్రీలంక ప్రభుత్వం భావిస్తుండగా, దాని ద్వారా వచ్చిన సొమ్మును తమ సంక్షేమానికి వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు.

'' ఒక్క మత్స్యకారులే కాదు, మా లాంటి అనేక పరిశ్రమలు దీని వల్ల దెబ్బతింటాయి. కొన్ని వేలమంది వాటి మీద ఆధారపడి జీవిస్తున్నారు'' అని డెన్సిల్ ఫెర్నాండో అనే మత్స్యకార సంఘం నాయకుడు వ్యాఖ్యానించారు.

చేపల్లో ఇప్పటికే ప్లాస్టిక్ పెల్లెట్స్ అవశేషాలు కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, చేపల మొప్పల్లో ఇరుక్కుపోతున్న ప్లాస్టిక్ పెల్లెట్స్

రసాయన కాలుష్యం

సముద్రపు నీటిలో కలుస్తున్న రసాయనాలో నైట్రిక్ యాసిడ్, సోడియం డయాక్సైడ్, కాపర్, లెడ్ లాంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు కూడా ఉన్నాయని హేమంత వితనాగె అన్నారు.

ఒక్కసారి ఈ రసాయనాలు లీకయ్యాయంటే, అవి సముద్ర జీవుల కడుపులోకి వెళ్లిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న చేపలు ముందుగా, పెద్ద చేపలు కాస్త ఆలస్యంగా ప్రమాదంలో చిక్కుకుంటాయని వితనాగె అన్నారు.

చనిపోయిన చేపలు, తాబేళ్లు, డాల్ఫిన్లు ఇప్పటికే ఒడ్డుకు కొట్టుకు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. ''ఇది ఒక విషనౌక. ఈ ప్రమాదం కారణంగా వెలువడ్డ రసాయనాలు కొన్ని సంవత్సరాలపాటు మనుషుల మీద ప్రభావం చూపిస్తాయి'' అన్నారు వితనాగె.

శ్రీలంక తీరంలో మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి అనేక వేల కుటుంబాలు జీవిస్తున్నాయి.
ఫొటో క్యాప్షన్, చేపల మార్కెట్‌లో చేపలు అమ్ముతునన శ్రీలంక మహిళ

శుభ్రం చేసే ప్రక్రియ

శ్రీలంక తీరంలో నౌకలు మునిగిపోయిన సంఘటనలు గతంలోనూ జరిగినప్పటికీ, ఈ తరహా ప్రమాదం పూర్తిగా కొత్తది. సమస్య తీవ్రతను తగ్గించడానికి అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాల్సిందిగా పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టిన నౌక యాజమాన్య సంస్థ, ఓ అంతర్జాతీయ సంస్థకు దీని బాధ్యతలు అప్పజెప్పింది.

అయితే, నౌక యాజమాన్య సంస్థ ఏ మేరకు ఈ షిప్ నుంచి రసాయనాలు విడుదల కాకుండా ప్రయత్నించగలదన్న దానిపై పర్యావరణ వేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతి పెద్ద ఇన్సూరెన్స్ కేస్‌గా భావిస్తున్న ఈ ఘటన ద్వారా వచ్చే భారీ పరిహారంతో పర్యావరణానికి మేలు చేసే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు.

శ్రీలంక ప్రభుత్వాన్ని, నౌక యాజమాన్య సంస్థను ప్రతివాదులుగా పేర్కొంటూ, ది సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ జస్టిస్ సంస్థ ఇప్పటికే కేసు కూడా వేసింది. అయితే అన్నింటికన్నా ముఖ్యమైనది అవగాహన కల్పించడమేనని ఆ సంస్థ ప్రతినిధులు వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)