సూయజ్‌ కాలువ: ఎట్టకేలకు మొదలైన రాకపోకలు.. ఇప్పటి వరకు ఎప్పుడేం జరిగిందంటే

The Ever Given on the move

ఫొటో సోర్స్, Reuters

సూయజ్ కాలువలో అడ్డం తిరిగిన ఎవర్ గివెన్ నౌక దాదాపు వారం రోజుల తర్వాత ఎట్టకేలకు దారికొచ్చిందని ఈజిప్టు అధికారులు వెల్లడించారు. దీంతో రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి.

400 మీటర్ల పొడవున్న ఈ భారీ ఓడను ఎంతో ప్రయాసతో కాలువకు సమాంతరంగా తీసుకురాగలిగారు. కాలువకు సమాంతరంగా నౌక ఉన్నట్టు చూపుతున్న వీడియోను ఈజిప్టుకు చెందిన టీవీ ఛానల్ విడుదల చేసింది.

వారం రోజులుగా ఈజిప్ట్ వద్ద సూయజ్ కాలువలో ఇరుక్కుపోయి అంతర్జాతీయ నౌకావాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపిన ఈ నౌక పక్కకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాలువలో అడ్డంగా ఇరుక్కున్న ఈ భారీ నౌక వెనుక భాగానికి ఇనుప తాళ్లు కట్టి టగ్ బోట్లతో పక్కకు లాగారు.

ఇంతకు ముందు నౌక వెనుక భాగం, కాలువ ఒడ్డు నుంచి నాలుగు మీటర్ల దూరంలో ఉండగా, మొదట మీటర్ల దూరం జరిపారు. అనంతరం తదుపరి పరిశీలన కోసం ఈ ఓడను ప్రధాన కాలువ నుంచి పక్కకు తరలించారు.

ఈ కాలువ గుండా వెళ్లేందుకు ప్రస్తుతం 367 నౌకలు వేచి ఉన్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

సముద్రపు పోటు వచ్చినా....

ఈ నౌకను కదిలించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. సముద్రపు పోటు వచ్చినా, ఓడ ఏ మాత్రం దారికి రాలేదు. దీంతో దాన్ని కదిలించే ప్రయత్నాలు ఇంకా కొనసాగించారు.

ఈ ఓడ సూయజ్‌ కాలువలో ఇరుక్కుపోవడం వల్ల ఆ మార్గం గుండా వెళ్లాల్సిన కార్గో షిప్‌లు కొన్ని వెనక్కి తిరిగి ఆఫ్రికా మీదుగా ప్రయాణం ప్రారంభించాయి.

ఎవర్‌ గివెన్‌ నౌకను కదిలించడానికి 14 టగ్‌ బోట్లు నిరంతరాయంగా పని చేశాయి.

బలమైన గాలులు, అలల కారణంగా ఈ ఓడను కదిలించే పనులకు పదే పదే అంతరాయం కలిగినా ప్రయత్నాలు కొనసాగించారు.

వీడియో క్యాప్షన్, సూయజ్‌ కాలువ: భారీ నౌకను ఇలా దారికి తెచ్చారు

మార్చి 23 నుంచి ఎప్పుడు ఏం జరిగిందంటే..

ఎవర్‌ గివెన్‌ నౌక మార్చి 23న సూయజ్ కెనాల్‌లో కూరుకుపోయింది.

మంగళవారం(మార్చి 23) ఉదయం 7.40 నిమిషాలకు విపరీతమైన గాలుల కారణంగా ఇది అదుపుతప్పి కాలువకు అడ్డంగా నిలిచి పోయింది. షిప్‌ సూయజ్‌ కాలువకు అడ్డంగా నిలిచిపోవడంతో మిగిలిన పడవల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఈ నౌకను తిరిగి దారికి తెచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి.

బుధవారం 8 టగ్‌ బోట్లను రంగంలోకి దించి ఓడను కదిలించేందుకు ఈజిప్ట్‌ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు డచ్ కంపెనీ బోస్కాలిస్ రంగంలోకి దిగింది.

గురువారం నాటికి ఓడను దారికి తీసుకురాగలమని భావిస్తున్నట్లు దీని నిర్వహణ బాధ్యతలు చూస్తున్న 'బెర్న్‌హార్డ్‌ షల్ట్‌ షిప్‌మేనేజ్‌మెంట్‌' వెల్లడించింది. కానీ అది సాధ్యం కాలేదు.

ఎవర్ గివెన్ నౌక

ఫొటో సోర్స్, EPA

శుక్రవారం నాటికి పలు ఓడలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లిపోవడానికి ప్రయాణాలు ప్రారంభించాయి.

శనివారం నాటికి సముద్రపు పోటు వల్ల ఓడ కదలవచ్చని నిపుణులు భావించినా అది కూడా జరగలేదు.

ఈ ప్రమాదానికి వాతావరణమే కాకుండా మానవ తప్పిదం కూడా కారణమని సూయజ్‌ కెనాల్‌ అథారిటీ చైర్మన్‌ ఒసామా రాబీ అన్నారు.

ఆదివారం నాటికి ఓడను ఇరు వైపులా కేవలం 30 డిగ్రీల కోణంలో మాత్రమే కదిలించగలిగారు. ఆదివారం నాటికి 14 టగ్‌ బోట్లు ఈ ఓడను లాగే పనిలో ఉన్నాయి. అలాగే 300 పైగా కార్గో షిప్‌లు సూయజ్‌ కాలువ ద్వారా ప్రయాణించేందుకు వేచి చూస్తున్నాయి.

ఆదివారం సాయంత్రానికి కొంత పురోగతి రావడంతో సంతోషంతో టగ్‌ బోట్లు పెద్ద ఎత్తున హారన్లు కొడుతూ సంబరాలు చేసుకున్నట్లు సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ అయ్యాయి.

సోమవారం మొదట నౌక వెనుక భాగాన్ని కొంత దూరం లాగారు. అనంతరం శక్తిమంతమైన టగ్ బోట్ల సాయంతో ఈ భారీ నౌకను ప్రధాన కాలువ నుంచి పక్కకు తరలించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)