ఇజ్రాయెల్ - గాజా: ఈ యుద్ధంపై అంతర్జాతీయ చట్టాలు ఏమంటున్నాయి

అవసరమైనంత మేర బల ప్రయోగం చేసినప్పుడే దేశాలు తమ చర్యలను సమర్ధించుకోగలవు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, అవసరమైనంత మేర బల ప్రయోగం చేసినప్పుడే దేశాలు తమ చర్యలను సమర్ధించుకోగలవు
    • రచయిత, గుగ్లీల్మొ వెర్డిరేమ్
    • హోదా, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ స్టడీస్, కింగ్స్ కాలేజీ లండన్

రెండు దేశాలు ఘర్షణలకు దిగకుండా, సైనిక చర్యలు చేపట్టకుండా అంతర్జాతీయ చట్టాలు నియంత్రిస్తాయి.

అయితే, ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరాటంలో రెండు వర్గాలు చేపడుతున్న చర్యల చట్టబద్ధతపై అంతర్జాతీయ సమాజంలో చర్చ జరుగుతోంది.

స్వీయరక్షణ కోసం దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ వాదించవచ్చు.

స్వీయ రక్షణ హక్కు అంతర్జాతీయ చట్టంలో ఉన్న ప్రాథమిక సూత్రం అని ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆర్టికల్ 51 చెబుతోంది. ఇందులో ఉన్న అంశాలపై భిన్నాభిప్రాయాలున్నా సాయుధ దాడికి వ్యతిరేకంగా దేశాన్ని రక్షించుకోవడమనే సూత్రానికి మాత్రం ప్రపంచవ్యాప్త ఆమోదం ఉంది.

ఏదైనా దేశం స్వీయ రక్షణ చర్యలను చేపట్టే ముందు అందుకు దారి తీసిన అవతలి పక్షం ఆయుధ దాడి తీవ్రత ఏ స్థాయిలో ఉండాలనే అంశంపై భిన్న వాదనలున్నాయి.

ఆర్టికల్ 51ని అనుసరించి.. పౌరుల సాంఘిక జీవనానికి ఆటంకం కలిగించే రాకెట్ దాడులు ఆయుధ దాడి కిందకే వస్తాయని చాలా మంది అంతర్జాతీయ న్యాయవాదులు అంగీకరిస్తారు.

అయితే, పోరాటం చేస్తున్న రెండు వర్గాలలో దాడి చేసిందెవరు? రక్షించుకుంటున్నదెవరు అనే అంశంపై మాత్రం ఎవరికి వారు వాస్తవాలు చెప్పే పరిస్థితి ఉండదు. ఇజ్రాయెల్ - పాలస్తీనా విషయంలో కూడా విమర్శకులు రెండు రకాల వాదనలు చేస్తారు.

ముందుగా, స్వీయ రక్షణ అనే కవచం మరో దేశం పైనే అమలు పరిచేందుకు అందుబాటులో ఉంటుంది కానీ, గాజా లాంటి ప్రాంతం గురించి కాదని వాదిస్తారు. ముఖ్యంగా 2001లో సెప్టెంబరు 11న అమెరికాలో జరిగిన దాడుల తర్వాత ఈ స్వీయ రక్షణ నిర్వచనం తీవ్రతరమైంది. కానీ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ ప్రశ్నలకు స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.

ఇజ్రాయెల్‌కు గాజా పై ఉన్న అధికారం, నియంత్రణ దృష్ట్యా, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ కూడా గాజాను ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతం కిందే పరిగణిస్తుంది. అయితే, 2005లో గాజా నుంచి వైదొలగిన తర్వాత ఆ ప్రాంతం పై కాలు మోపలేదని అది తమ అధీనంలో లేదని ఇజ్రాయెల్ చెబుతుంది.

రాకెట్ దాడులు

ఫొటో సోర్స్, Reuters

స్వీయ రక్షణ హక్కు

అవసరమైన పరిస్థితుల్లో దేశాలు తమను తాము రక్షించుకునే హక్కును అంతర్జాతీయ చట్టం కల్పిస్తుంది.

కానీ, దానికి కూడా అవసరమైన మేర మాత్రమే బల ప్రయోగం చేయాలి అని చెబుతుంది.

చాలా మంది స్వీయ రక్షణ అంటే కంటికి కన్ను, రాకెట్‌కు రాకెట్, లేదా చావుకు చావు అని తప్పుగా అనుకుంటూ ఉంటారు. కానీ, ఇది సరైన అర్థం కాదు. ప్రతీకారం తీర్చుకోవడానికి బల ప్రయోగం చేసే విధానానికి అంతర్జాతీయ చట్టంలో స్థానం లేదు.

ఒక్కోసారి సమాధానం చెప్పడానికి భారీ స్థాయిలో సైనిక చర్య చేపట్టాల్సి వస్తుంది. కొన్ని సార్లు చాలా తక్కువ బల ప్రయోగంతోనే స్వీయ రక్షణ సాధ్యమవుతుంది.

పౌరుల పై, పౌర స్థావరాలపై దాడులు చేయడాన్ని అంతర్జాతీయ చట్టం నిషేధిస్తుంది.

ఫొటో సోర్స్, Reuters

సాయుధ పోరాటాల చట్టం

ఒకసారి పోరాటం మొదలైన తర్వాత ఇరు వర్గాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని అంతర్జాతీయ చట్టంలోని మరో విభాగం నియంత్రిస్తుంది.

దీనినే సాయుధ పోరాట చట్టం అంటారు. ఈ చట్టం సాయుధ పోరాటాలకు మాత్రమే వర్తిస్తుంది.

దేశాలు బలప్రయోగం చేయడానికి ప్రేరేపించిన కారణాలతో సంబంధం లేకుండా సాయుధ పోరాట చట్టం వర్తిస్తుంది.

"చట్టానికి లోబడి యుద్ధాన్ని ప్రారంభించిన దేశానికి ప్రత్యేక హక్కులు ఏమి ఉండవు. రెండు వర్గాలకు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి. లేదంటే, చట్టబద్ధంగా బలప్రయోగం మొదలు పెట్టిన దేశానికి పోరాట సమయంలో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది.

ఈ పోరాట సమయంలో పౌరుల రక్షణ, యుద్ధ ఖైదీలతో వ్యవహరించాల్సిన తీరు, ఆక్రమిత ప్రాంతాలకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలను సాయుధ పోరాట చట్టంలో ఉంటాయి.

ఈ నియమాలన్నీ మానవత్వం, సైనిక చర్యల ఆవశ్యకత, విలక్షణత, దామాషా అనే నాలుగు సిద్ధాంతాల సమతుల్యతపై ఆధారపడి ఉంటాయి.

మానవత్వం, సైనిక చర్యల ఆవశ్యకత

అనవసరమైన వేదన, క్రూరత్వాన్ని తప్పించడానికి మానవత్వం అనే సిద్ధాంతం అవసరం. దీనికి వ్యతిరేకంగా పని చేసేది సైనిక ఆవశ్యకత.

"సైనిక ఆవశ్యకత తలెత్తినప్పుడు ఆ దేశం అతి తక్కువ ఖర్చు, వనరులతో ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా శత్రువును లొంగదీసే లక్ష్యాన్ని సాధించేందుకు బలప్రయోగం చేయడానికి అనుమతిస్తుంది" అని బ్రిటిష్ సైనిక దళం లీగల్ మాన్యువల్ చెబుతోంది.

గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ప్రభావవంతమైనవి కాదని చెబుతున్నప్పటికీ, ఈ స్థాయిలో బలప్రయోగం చేయడం అవసరం లేదని కొందరు అంటున్నారు. కానీ, సైనిక ఆవశ్యకత కోణంలోంచి చూస్తే ఈ దాడులను తిప్పి కొట్టడానికి బల ప్రయోగం చేయడం తప్పదని సమర్థించుకోవచ్చు.

కేవలం చట్టం అనుమతిస్తుందనే కారణంతో ఏ చర్య అయినా రాజకీయ, నైతిక వ్యూహాత్మక కోణంలో తెలివైనది అనిపించుకోదు.

కొన్ని నిబంధనల ప్రకారం పౌరుల రక్షణ, ఆమోదయోగ్యమైన లక్ష్యాల ఎంపికను పట్టించుకోకుండా సైనిక చర్యలకు పాల్పడితే అవి సమర్థనీయంగా ఉండవు. దాని వల్ల కేవలం పగ తీర్చుకునేందుకే బాధ పెడుతున్నట్లుగా ఉంటుంది.

అమెరికా పౌర యుద్ధ సమయంలో అధ్యక్షుడు అబ్రహాం లింకన్ సాయుధ పోరాటానికి సంబంధించిన నియమాలను పొందుపరిచారు.

బాంబు దాడి

ఫొటో సోర్స్, Reuters

పౌరులు, పౌర ఆస్తులపై దాడుల నిషేధం

సాయుధ పోరాట చట్టంలో మరో ముఖ్యమైన అంశం సాధారణ పౌరులు, పోరాటంలో ఉన్నవారికి మధ్య తేడాను పాటించడం. పోరాటంలో ఉన్న రెండు వర్గాల వారు పోరాడేవారికి, పౌరులకు మధ్యనున్న వ్యత్యాసాన్ని ఎల్ల వేళలా గుర్తు పెట్టుకోవాలి.

పౌరులపైన, పౌర సంబంధిత ఆస్తులపైనా దాడులు చేయడం ఎప్పుడూ నిషేధమే. పోరాడేవారు, పోరాటంలో నేరుగా పాల్గొనే వారిపై సైనిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించే వారిపై దాడులు జరపవచ్చు.

పౌరులను భయపెట్టేందుకు హింసాత్మక బెదిరింపులకు దిగడాన్ని కూడా విలక్షణత సిద్ధాంతం నిషేధిస్తుంది.

ఉదాహరణకు దక్షిణ ఇజ్రాయెల్‌పై మిసైళ్ళ దాడి ఈ సిద్ధాంత ఉల్లంఘనగా చెప్పవచ్చు.

యుద్ధ ట్యాంక్

ఫొటో సోర్స్, EPA

సైనిక లక్ష్యం అంటే?

సైనిక చర్యలలో ఉపయోగించే సాధనసంపత్తి సైనిక లక్ష్యాల పరిధిలోకి వస్తుందని అంతర్జాతీయ చట్టం చెబుతోంది.

ఇజ్రాయెల్ రక్షణ సిబ్బంది ట్యాంకులు గాని హమాస్ రాకెట్ లాంచర్లు గాని ఈ విభాగంలోకి వస్తాయి. 1999లో కొసావో యుద్ధ సమయంలో సెర్బియా టీవీ స్టేషన్‌పై నాటో చేసిన బాంబు దాడి లాంటి వాటి వల్ల సమస్యలు వస్తాయి.

కానీ, మిలటరీ లక్ష్యాలైన రాకెట్ లాంచర్లు, ఆయుధ డిపోలు లాంటివి జనావాసాల్లో కానీ ప్రజల ఆస్తులకు సమీపంలో కానీ ఉన్నప్పుడు సమస్యలు ఎదురవుతాయి. జనసాంద్రత ఎక్కువగా ఉండే గాజాలో ప్రతి సైనిక లక్ష్యం ఇలాంటి సమస్యాత్మకమైనదే.

ఇలాంటి పరిస్థితుల్లోనే దామాషా సిద్ధాంతం పని చేస్తుంది. సాయుధ పోరాటం చట్టంలో దామాషా అర్థం వేరే విధంగా ఉంటుంది. పౌర జీవనానికి గాని, ఆస్తులకు గాని ముప్పు వాటిల్లినప్పుడు సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉంటుంది.

కొన్ని కేసులలో "ఒక సైనిక చర్య నుంచి చేకూరే లాభం కన్నా పౌర సమాజానికి కలిగే నష్టం ఎక్కువగా ఉంటే చట్టం పరిధిలోకి వచ్చే సైనిక లక్ష్యాలపైనా దాడి చేయకూడదు" అని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మాజీ న్యాయమూర్తి రోసాలిన్ హిగ్గిన్స్ ఒక తీర్పులో చెప్పారు.

పౌరులకు ఎక్కువ ముప్పు ఉందని గ్రహిస్తే దాడిని ఆపాల్సిన తక్షణ బాధ్యత దాడులు చేసేవారిపై ఉంది.

అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో సైనిక చర్యలు చేపట్టేటప్పుడు ఆ లక్ష్యాల స్వభావాన్ని పరిశీలించి తప్పులు జరగకుండా చూసుకోవాలి.

అయితే, ఈ నిబంధనలన్నీ పాటిస్తున్నట్లు బాంబు దాడులు చేసే ముందు స్థానికులను బయటకు రమ్మని హెచ్చరించి, లీఫ్‌లెట్లను విసిరినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే, ప్రాణాలను కాపాడటంలో ఈ విధానాలు అంత ఉపయోగకరమైనవి కాదని విమర్శకులు అంటారు.

ఇవన్నీ పాటించినా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తప్పవని విమర్శకులు అంటున్నారు.

హమాస్ కావాలనే సైనిక లక్ష్యాలు జనావాసాల్లో ఏర్పాటు చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి.

ఇదే నిజమైతే, ఇది సాయుధ పోరాట చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్లే. అలాంటప్పుడు, ఇది పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఉండటానికి ఇజ్రాయెల్ వహించాల్సిన బాధ్యతను ఏ మాత్రం తగ్గించదు.

ఈ సాయుధ పోరాట చట్టాన్ని వివరించే నిపుణులు అన్ని సైనిక దళాలలో ఉంటారు. వీరు లక్ష్యాలపై దాడి చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారు.

ఇది అంత తేలికైన పనేమీ కాదు.

మానవ హక్కులు

యుద్ధ సమయంలో మానవ హక్కుల చట్టం అమలులోనే ఉంటుందని అంతర్జాతీయ న్యాయస్థానం అనేకసార్లు చెప్పింది.

యుద్ధంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకే సాయుధ పోరాటం చట్టాన్ని రూపొందించారు. అయితే, ఇది నిజానికి ఎంతవరకు అమలు చేస్తున్నారనే విషయంలో స్పష్టత లేదు.

ఇజ్రాయెల్లో ఉన్న అరబ్ విలేజిలో జరిగిన ఘర్షణల విషయానికి వచ్చేసరికి సాయుధ పోరాట చట్టం అమలు కాలేదు.

ఇజ్రాయెల్ భద్రతా దళాలు, న్యాయ వ్యవస్థ అంతర్జాతీయ చట్టాన్ని అనుసరించి ప్రవర్తించాయా లేదా అనేది, మానవ హక్కుల చట్టాన్ని అమలు చేయడంపై ఆధారపడి ఉంటుంది.

తూర్పు జెరూసలెంలో నెలకొన్న పరిస్థితి మరింత సంక్లిష్టమైనది. ఇజ్రాయెల్ తూర్పు జెరూసలెం భూభాగంతో కలిసి ఉన్నప్పటికీ దానిని ఇప్పటికీ అంతర్జాతీయ న్యాయస్థానం సహా అందరూ పాలస్తీనా ఆక్రమిత ప్రాంతంగానే పరిగణిస్తారు. ఈ ప్రాంతంలో గోడ కడితే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని కూడా అంతర్జాతీయ న్యాయస్థానం 2004లో తన అభిప్రాయాన్ని తెలిపింది.

సాయుధ పోరాట చట్టం కేవలం యుద్ధంలో జరిగే భీభత్సాన్ని తగ్గించగలదు. యుద్ధానికి సంబంధించిన పుస్తకం లాంటిది ఒకటుంటే అందులో పొందుపరిచిన నియమాలన్నీ పాటిస్తూ యుద్ధం చేసినా కూడా అది చివరకు శాపంగానే మిగులుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)