హమాస్: శత్రువు తమపై ప్రయోగించిన మిసైళ్ల శకలాలతో రాకెట్లు తయారుచేసుకుంటున్న మిలిటెంట్ గ్రూప్ కథ

గాజాలో తయారైన ఆయుధాలకు ఇరాన్ నుంచి సాయం ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది.

ఫొటో సోర్స్, Reuters

ఇజ్రాయెల్, గాజాల మధ్య 11 రోజుల ఘర్షణ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొంచెం తగ్గుముఖం పట్టాయి.

ప్రస్తుతం నెలకొన్న శాంతియుత వాతావరణం కొనసాగేలా ప్రయత్నాలు సాగుతున్నాయి.

శనివారం ఈజిప్ట్ బృందం ఇజ్రాయెల్‌తో చర్చలు జరిపింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వచ్చే వారం ఈ ప్రాంతాన్ని పర్యటించే అవకాశం ఉంది.

గాజాను తమ ఆధీనంలో ఉంచుకున్న పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మాత్రం తాము విజయం సాధించామని చెబుతోంది. ఇజ్రాయెల్‌తో ఘర్షణ కారణంగా గాజా వైపు 250 మంది మరణించారు.

కాల్పుల విరమణ అనంతరం మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, హమాస్ సైనిక శక్తిని తమ వాయుసేన బాంబులతో నాశనం చేయగలిగిందని, ఇది 'అసాధారణ విజయం' అని అభివర్ణించారు. ''రాకెట్ల వర్షాన్ని మేం సహిస్తామని హమాస్ భావించడం వారి తప్పు'' అన్నారాయన.

మరోవైపు హమాస్ మాత్రం తామే విజయం సాధించామని, ఇలాంటి విజయాలు మున్ముందు మరిన్ని సాధించబోతున్నామని ప్రకటించుకుంది.

పాలస్తీనా గెరిల్లాలు కేవలం రాకెట్‌ల మీదనే ఆధారపడి ఇజ్రాయెల్‌తో ఘర్షణకు దిగాయి.

ఫొటో సోర్స్, Reuters

రాకెట్లను ఎలా తయారు చేశారు?

ఈ పోరాటంలో తామే విజయం సాధించామని ఇరుపక్షాలు ప్రకటించుకుంటున్నాయి. అయితే, ఇందులో ఆస్తి, ప్రాణ నష్టాలు మాత్రం గాజాకే ఎక్కువ.

ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ ఆ దేశానికి రక్షణ కవచంగా మారింది. ఇది హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్‌లను అడ్డుకోగలిగింది.

ఇజ్రాయెల్‌పై హమాస్ 4,000 పైగా రాకెట్లను పేల్చినట్లు తేలింది.

మరి, గాజా చుట్టూ ఉండే ఇజ్రాయెల్, ఈజిప్టు సరిహద్దులలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత, నిఘా ఉన్నప్పటికీ హమాస్‌కు ఇన్ని అత్యాధునిక ఆయుధాలు ఎలా వచ్చాయి ?

గాజాలోని పాలస్తీనా గ్రూపులు, ఇరాన్ టెక్నాలజీని ఉపయోగించి సాధారణ వస్తువులతోనే దేశీయంగా రాకెట్లు తయారు చేసుకున్నట్లు నిపుణుల నివేదికలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

ఈ ఆయుధాలను తయారు చేయడానికి పైపులు, కాంక్రీట్‌లాంటి కొన్ని వస్తువులు, పదార్థాలను ఉపయోగించారు. అంటే, హమాస్ తీవ్రవాదులు ఇలాంటి ఆయుధాలను పదేపదే తయారు చేసుకోగలరు. వారిని ఎవరూ అడ్డుకోలేరు.

2014లో ఇజ్రాయెల్‌తో ఘర్షణ తర్వాత హమాస్ వర్గాలు భారీ సంఖ్యలో ఇలాంటి ఆయుధాలను తయారు చేసుకోవడం ప్రారంభించాయి. రాకెట్ల నాణ్యత, సంఖ్య పెరిగింది.

చైనా నుంచి అందిన సాంకేతిక సహకారంతో హమాస్ డ్రోన్‌లను కూడా తయారు చేసుకున్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్‌‌పై ఆరోపణలు

''హమాస్ సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాం. వారి దగ్గర లాంగ్ రేంజ్ రాకెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇరాన్ వల్లనే వారికి చేరాయి'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక యూరోపియన్ అధికారి రాయిటర్స్‌తో అన్నారు.

హమాస్ ఇస్లామిక్ వర్గాలు తమపై 4,360 రాకెట్లను ప్రయోగించాయని, వీటిలో 680 రాకెట్లు గాజా ప్రాంతంలోనే పేలాయని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ ఉపయోగించిన రాకెట్లలో ఎక్కువ భాగం షార్ట్ రేంజ్ రాకెట్లని, దేశీయంగా తయారైన చవక రకం ఆయుధాలని నిపుణులు చెబుతున్నారు.

''వీటిని తయారు చేయడం చాలా సులభం. ఇనుప పైపులు, గొట్టాలను ఉపయోగిస్తారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వారు ఇజ్రాయెల్ వేసిన రాకెట్ల శకలాలను కూడా తమ రాకెట్ల తయారీకి ఉపయోగిస్తారు'' అని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డేనియల్ బెంజమిన్ వెల్లడించారు.

''చూడటానికి ఇవి ఇరాన్ ఆయుధాల్లాగే ఉంటాయి. కానీ, దేశీయంగా తయారు చేస్తారు.'' అని ఇజ్రాయెల్‌కు చెందిన రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ ఎఫ్రెమ్ సనేహ్ వాల్‌స్ట్రీట్ జర్నల్‌‌తో అన్నారు.

హమాస్‌కు ఇరాన్ పరోక్షంగా సాయం చేస్తుందని వాల్‌స్ట్రీట్ జర్నల్ రాసింది. డిజైన్‌లు ఇరాన్ నుంచి రాగా, హమాస్ వీటిని స్థానికంగా దొరికే పదార్ధాలు, వస్తువులతో తయారు చేసుకుంటుంది.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ ‌నెతన్యాహు కూడా ఇరాన్‌పై ఆరోపణలు చేశారు. ''ఇరాన్ మద్దతు లేకపోతే, ఈ సంస్థలన్నీ రెండు వారాల్లో కుప్ప కూలిపోతాయి'' అని ఆయన అన్నారు. ఇజ్రాయెల్‌పై పోరాటంలో పాలస్తీనాకు ఇరాన్ మద్దతిస్తోందని అల్‌జజీరా టెలివిజన్ ఒక కథనంలో పేర్కొంది.

ఇరాన్ సాయం లేకపోతే తీవ్రవాదుల గ్రూపులు రెండు వారాల్లో కుప్పకూలతాయని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్-హమాస్ సంబంధాలు

హమాస్‌తో సంబంధాల విషయంలో ఇరాన్ ఎన్నడూ దాపరికం ప్రదర్శించ లేదు. గత వారం ఇరాన్‌కు చెందిన ఎలైట్ కుర్ద్స్‌ ఫోర్స్‌ నాయకుడు జనరల్ ఇస్మాయిల్ ఖానీ, హమాస్‌ నాయకుడు ఇస్మాయిల్ హనియేకు మద్దతు పలుకుతూ అధికారిక టీవీ ఛానెల్‌లోనే మాట్లాడారు.

పాలస్తీనా గ్రూపులు తమ సైనిక శక్తిని పెంచుకోవడానికి స్థానికంగా తయారు చేసిన వస్తువులను మాత్రమే ఉపయోగిస్తాయి.

ఫైబర్ గ్లాస్ నుంచి డ్రోన్లు, ఇనుప పైపులతో రాకెట్లు, ఉప్పు, ఆముదంతో రాకెట్ ఇంధనాన్ని తయారు చేస్తున్నారని ఒక ఇజ్రాయెల్ సైనిక అధికారిని ఉటంకిస్తూ వాల్‌‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది.

ఇప్పటి వరకు హమాస్ కేవలం ప్రాథమిక శ్రేణి రాకెట్లను మాత్రమే తయారు చేసుకోగలదు. గైడెడ్ రాకెట్లను తయారు చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ అవసరం.

అయితే, ఇటీవల హమాస్ ఒక డ్రోన్‌ను కూడా తయారు చేసిందని, ఇందుకోసం వివిధ దేశాలకు చెందిన విడి భాగాలను ఉపయోగించిందని తేలింది. చైనాకు చెందిన ఇంజిన్, మరో సంస్థకు చెందిన జీపీఎస్ వ్యవస్థలు ఇందులో ఉన్నట్లు ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు.

అయితే, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ ముందు హమాస్ టెక్నాలజీ తేలిపోతుందని, వీరి సాంకేతిక పరిజ్ఞానం ఇరాన్ సాయం తీసుకుంటున్న హౌతీ తిరుగుబాటు దారుల టెక్నాలజీ మాదిరిగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈజిప్టు నుంచి ఆయుధాల రహస్య చేరవేత ఆగిపోవడంతో సొంతంగా రాకెట్లు తయారు చేసుకోవాలని హమాస్ నిర్ణయించింది.

ఫొటో సోర్స్, Getty Images

రాకెట్‌లు మాత్రమే ఆయుధాలు

పాలస్తీనా ఉగ్రవాద గ్రూపులు ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి కొన్నేళ్లుగా రాకెట్లను ఉపయోగిస్తున్నాయి. 2005 లో గాజా నుండి ఇజ్రాయెల్ వైదొలగడానికి ముందు, పాలస్తీనా పట్టణాల నుండి గాజాలోని ఇజ్రాయెల్ స్థావరాలపై మోర్టార్లు, రాకెట్లను పేల్చారు.

2003లో గాజాను ఇజ్రాయెల్ దిగ్బంధించి, వెస్ట్‌బ్యాంక్‌ను ఆక్రమించిన తర్వాత హమాస్‌కు ఒకే ఒక రాకెట్ అందుబాటులో ఉంది.

ఈజిప్టు సినాయ్ ద్వీపంలో తయారైన క్షిపణులను హమాస్ సంపాదించింది. ఈజిప్టు పాలకుడు మహ్మద్ మోర్సీని 2013లో ప్రజలు అధికారం నుంచి తొలగించే వరకు హమాస్‌కు సినాయ్ ద్వీపం నుంచి ఆయుధాలు అందాయి.

కానీ, ప్రస్తుత ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అధికారంలోకి వచ్చిన తర్వాత గాజా నుంచి ఈజిప్టులోకి ఉన్న సొరంగాలను మూసివేశారు. దీంతో ఆయుధాల రాక కూడా ఆగిపోయింది.

ఈజిప్టు నుంచి సహకారం ఆగిపోయిన తర్వాత, ఇరాన్ సాయంతో స్థానికంగానే ఆయుధాలు తయారు చేసుకోవాలని హమాస్ నిర్ణయించినట్లు ఓ ఇజ్రాయెల్ అధికారి వెల్లడించారని రాయిటర్స్ పేర్కొంది.

ఇందులో భాగంగా గాజా, ఇరాన్‌ల మధ్య కొందరు వ్యక్తులు పర్యటనలు కూడా చేసినట్లు ఆ అధికారి వెల్లడించారని రాయిటర్స్ తెలిపింది.

గాజాలో గెరిల్లాలు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల రాకెట్లు తయారు చేస్తున్నారని, వీటి బరువు సుమారు 100 కిలోలు ఉంటుందని, ఇవన్నీ ఇరాన్ సహాకారంతోనే తయారవుతున్నాయని ఇజ్రాయెల్, పాలస్తీన వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

గాజాలో రాకెట్ల తయారీకి హమాస్‌కు కనీసం మూడు భూగర్భ కర్మాగారాలు ఉన్నాయని ఇరాన్ భద్రతా అధికారి ఒకరు చెప్పారు.

ఇస్లామిక్ జిహాద్ నాయకుడు జైద్ ఎల్‌-నఖాలా తన చివరి రోజులలో తమ గ్రూప్ ఆయుధాల నాణ్యత గురించి వ్యాఖ్యానించారు.

''మేం చాలా చిన్న పాటి ఆయుధాలతోనే అమెరికాలాంటి దేశం అందించే అత్యాధునిక ఆయుధాలను ఎదుర్కొంటున్నాం. చిన్న చిన్నపైపులనే మా ఇంజినీర్లు ఆయుధాలుగా మార్చారు'' అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)