ఇజ్రాయెల్ - గాజా: హమాస్‌ నేతల నివాసాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు

గాజాలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు సృష్టించిన విధ్వంసం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గాజాలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు సృష్టించిన విధ్వంసం

ఇజ్రాయెల్ గాజా మధ్య జరుగుతున్న పోరు పదో రోజుకు చేరింది. ఈ పోరులో హమాస్ కమాండర్ల నివాసాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

హమాస్ మిలటరీ చీఫ్ మొహమ్మద్ డీఫ్‌ను హతమార్చేందుకు చాలా సార్లు ప్రయత్నించినట్లు ఇజ్రాయెల్ చెప్పింది. ఒక అపార్ట్‌మెంట్‌పై చేసిన దాడిలో రాత్రి ఇద్దరు మిలిటెంట్లు మరణించినట్లు తెలిపింది.

బుధవారం ఉదయం కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్ల దాడి కొనసాగడంతో పాటు సైరన్ శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి.

మరో వైపు ఈ దాడులను ఆపాలనే ప్రయత్నాలు తెర వెనుక చోటు చేసుకుంటున్నప్పటికీ, అవేమీ ముందుకు కదిలినట్లు లేవు.

ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహించి ఏర్పాటు చేసిన ఒప్పందం కొన్ని రోజుల్లో అమలులోకి రానున్నట్లు సమాచారం అందుతోందని బీబీసీ ప్రతినిధి యోలాండే నెల్ చెప్పారు. అయితే, ఈ కథనాలను అంతలోనే ఖండించారు.

"మేమిక్కడ స్టాప్ వాచ్ పెట్టుకుని నిలబడలేదు. మేము ఈ దాడుల లక్ష్యాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాం" అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం అన్నారు.

మధ్యవర్తులు ప్రయత్నాలు తీవ్రంగానే కొనసాగుతున్నాయి, కానీ హింస ఆగాలంటే పాలస్తీనా డిమాండ్లకు అంగీకరించాలని హమాస్ నాయకుడు ఒకరు చెప్పారు.

ఇజ్రాయెల్ తొమ్మిది రోజుల పాటు హమాస్‌పై జరిపిన బాంబు దాడులు ఆ మిలిటెంట్ సంస్థను గట్టి దెబ్బతీశాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.

మరోవైపు మంగళవారం పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలో జరిపిన రాకెట్ దాడుల్లో ఇద్దరు విదేశీ వ్యవసాయ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. వెస్ట్‌బ్యాంక్‌లోని రమల్లా సమీపంలో ముగ్గురు పాలస్తీనా నిరసనకారులు ఇజ్రాయెల్ పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.

ఈ హింసకు ముగింపు పలికేందుకు జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు కొంతమేర ఫలించాయి.

కాల్పుల విరమణ కోరుతూ ఈజిప్ట్, జోర్డాన్‌ల సమన్వయంతో ఫ్రాన్స్ ఐరాస భద్రతా మండలిలో ముసాయిదా తీర్మానాన్ని పెట్టింది.

మంగళవారం ఉదయం సహాయ సామగ్రి తీసుకెళ్లే వాహనాల కోసం ఇజ్రాయెల్ కొద్దిసేపు గాజా సరిహద్దును తెరిచింది. అయితే, గాజా వైపు నుంచి మోర్టార్లు, రాకెట్ల దాడి కొనసాగడంతో మళ్లీ ఆ సరిహద్దును మూసివేసింది.

బెంజిమన్ నెతన్యాహు

ఫొటో సోర్స్, Mikhail Svetlov/gettyimages

నెతన్యాహు ఏం చెప్పారు?

గాజాను ఏలుతున్న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ గట్టి ఎదురుదెబ్బలు తగిలాయని.. అక్కడ శాంతి నెలకొనే వరకు తమ ఆపరేషన్ కొనసాగుతుందని నెతన్యాహు చెప్పారు.

కాగా గాజాలో 100 మంది మహిళలు, చిన్నారులు సహా 215 మంది ఇప్పటి వరకు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.

గాజాలో చనిపోయినవారిలో 150 మందికిపైగా మిలిటెంట్లు ఉన్నారని ఇజ్రాయెల్ మంగళవారం చెప్పింది. అయితే, తమ ఫైటర్స్ ఎంతమంది మరణించారన్నది హమాస్ ఇంతవరకు ప్రకటించలేదు.

సంక్షోభం మొదలయ్యే సమయానికి గాజాలోని రెండు మిలిటెంట్ గ్రూపుల వద్ద సుమారు 12 వేల రాకెట్లు, మోర్టార్లు ఉండేవని.. మంగళవారం మధ్యాహ్నం వరకు అందులో సుమారు 3,300 ఇజ్రాయెల్‌పై ప్రయోగించారని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి వెల్లడించారు.

అయితే, అందులో 400 నుంచి 500 వరకు రాకెట్లు, మోర్టార్లు ఇజ్రాయెల్ వరకు రాకుండా గాజాలోనే పడిపోయాయని.. అవి గాజాలో తీవ్ర ప్రాణ నష్టాన్ని కలిగించాయని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)