ఇజ్రాయెల్-గాజా: హమాస్ మిలిటెంట్ల మృతి, ప్రతీకార దాడులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్

హమాస్ రాకెట్ల దాడి

ఫొటో సోర్స్, Reuters

వైమానిక దాడుల్లో గాజాలోని తమ సీనియర్ కమాండర్లు చనిపోవడం, ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై పదుల సంఖ్యలో రాకెట్లు ప్రయోగించారు.

దక్షిణ ఇజ్రాయెల్‌లో చాలా ప్రాంతాలను అవి తాకాయని, సీరాట్‌లో ఒక చిన్నారి మృతికి కారణమయ్యాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

సోమవారం నుంచి ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య ఘర్షణ తీవ్రమవడంతో "ఇది పూర్తి స్థాయి యుద్ధంలా మారేలా ఉంది" అని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

సోమవారం నుంచి ఇప్పటివరకూ గాజాలో 14 మంది చిన్నారులు సహా 65 మంది చనిపోయారు.

తూర్పు జెరూసలెంలో ముస్లింలు, యూదుల పవిత్ర స్థలం గురించి ఇజ్రాయెలీలు-పాలస్తీనియన్ల మధ్య కొన్ని వారాలుగా నెలకొన్న ఉద్రిక్తతలు తర్వాత ఘర్షణలుగా మారాయి.

బుధవారం సాయంత్రం పోలీసులు 374 మందిని అరెస్ట్ చేయడంతో ఇజ్రాయెల్‌లో యూదులు, అరబ్‌లు కలిసి నివసించే ప్రాంతాల్లో మరింత హింస చెలరేగింది.

ఈ హింసలో 36 మంది పోలీసులు గాయపడినట్లు ఇజ్రాయెల్ పోలీసులు చెప్పారు..

గాజాలోని ఒక భవనం నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న తల్లీకొడుకులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గాజాలోని ఒక భవనం నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న తల్లీకొడుకులు

ఇజ్రాయెల్‌లోని కొన్ని పట్టణాలు, నగరాల్లో కొన్ని యూదు, అరబ్ గ్రూపులు హింసకు పాల్పడ్డాయని కూడా స్థానిక మీడియా రిపోర్ట్‌ చేసింది.

ఏకర్ నగరంలో అరబ్ గుంపు చేతిలో ఒక యూదు వ్యక్తి గాయపడ్డాడని, బాట్ యామ్‌లో ఒక యూదు రైట్-వింగ్ గుంపు కార్లో వెళ్తున్న ఒక అరబ్‌ను బయటకు లాగి కొట్టిందని కథనాలు ప్రసారం చేశాయి.

దేశంలో అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసులకు సాయంగా సైన్యాన్ని పంపాలని ఆలోచిస్తున్నట్లు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం రాత్రి చెప్పారు.

ఇటీవల జరిగిన దాడులను 'అరాచకత్వం'గా నెతన్యాహు వర్ణించారు.

యూదు, అరబ్ గుంపులు పరస్పరం దాడులు చేసుకోవడాన్ని ఎవరూ సమర్థించరని ఆయన ఒక వీడియో ప్రకటనలో అన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ చెప్పింది.

రాకెట్ల నుంచి నగరాలు, పట్టణాలను కాపాడే లక్ష్యంతో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ యాంటీ మిసైల్ సిస్టమ్ రూపొందించింది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రాకెట్ల నుంచి నగరాలు, పట్టణాలను కాపాడే లక్ష్యంతో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ యాంటీ మిసైల్ సిస్టమ్ రూపొందించింది

పాలస్తీనా మిలిటెంట్లు సోమవారం రాత్రి నుంచి రాకెట్లు ప్రయోగిస్తున్నారు. అవి తమ భూభాగాల్లో పడడంతో ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది.

ఇప్పటివరకూ రెండు వైపులా కొన్ని వందల రాకెట్ దాడులు, వైమానిక దాడులు జరిగాయి.

ఈ ఘర్షణలు మొదలైనప్పటి నుంచి గాజాలో 65 మంది చనిపోయారని, 360 మందికి పైగా గాయపడ్డారని హమాస్ తరఫున పనిచేస్తున్న వైద్య సిబ్బంది చెప్పారు.

"బయటి శత్రువులు, లోపలి అల్లరి మూకల నుంచి ఇజ్రాయెల్‌ను కాపాడుకోడానికి మా ప్రభుత్వం అన్ని శక్తులూ ఉపయోగిస్తోంది" అని నెతన్యాహు చెప్పారు.

కానీ, ఇజ్రాయెల్ సైనిక దాడులను ఖండిస్తూ పాలస్తీనా అధికారులు ఒక ట్వీట్ చేశారు. "ఇప్పటికే ముట్టడికి గురైన 20 లక్షల మందిని ఇవి మరింత బాధపెడుతున్నాయి" అన్నారు.

గాజా

ఫొటో సోర్స్, YOUSSEF MASSOUD

13 అంతస్తుల భవనం నేలమట్టం

గాజాలో ఇజ్రాయెల్ సైన్యానికి, పాలస్తీనా మిలిటెంట్లకు మధ్య బాంబులు, క్షిపణుల దాడులు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో, ఇది పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమిస్తుందేమోనని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.

పాలస్తీనా మిలిటెంట్లు 1,000కి పైగా రాకెట్ దాడులు చేశారని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇజ్రాయెల్ కూడా వైమానిక దళాలతో వందల సంఖ్యలో బాంబు దాడులు చేసింది. మంగళ, బుధవారాల్లో ఆ దాడులకు గాజాలో రెండు భారీ భవనాలు నేలమట్టమయ్యాయి.

సోమవారం నుంచి జరుగుతున్న దాడుల్ల 53 మంది పాలస్తీనియన్లు, ఆరుగురు ఇజ్రాయిలీలు చనిపోయారు. వీరిలో 14 మంది పాలస్తీనా చిన్నారులు కూడా ఉన్నారు.

"ఈ దారుణమైన దాడులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి" అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్టెరెస్ అన్నారు.

గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు

ఫొటో సోర్స్, Reuters

కొనసాగుతున్న పరస్పర దాడులు

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజా స్ట్రిప్‌లోని ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో, టెల్ అవీవ్ నగరంపై 130 క్షిపణులు ప్రయోగించామని పాలస్తీనా మిలిటెంట్లు చెప్పారు.

స్థానికులను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించిన గంటన్నర తర్వాత వైమానిక దళం 13 అంతస్తుల ఆ భవనాన్ని కూల్చేసిందని రాయిటర్స్ చెప్పింది.

మిలిటెంట్లు జరిపిన రాకెడ్ దాడులకు స్పందనగానే, తాము గాజాలో మిలిటెంట్లను టార్గెట్ చేశామని ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది.

వీడియో క్యాప్షన్, ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు: పెరుగుతున్న హింస మరో యుద్ధానికి దారి తీస్తుందా?

మిలిటెంట్లు ఇప్పటికే వందలాది రాకెట్లను జెరూసలెం, ఇజ్రాయెల్‌లోని మిగతా ప్రాంతాలపైకి ప్రయోగించారు.

2017 తర్వాత జెరూసలెంలో అత్యంత దారుణ హింసాత్మక దాడులు జరుగుతున్నాయి.

"జెరూసలెం మీద మొదటిసారి రాకెట్లు ప్రయోగించిన హమాస్ మిలిటెంట్లు హద్దు మీరారు" అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంతకు ముందు అన్నారు.

అల్-అక్స్ మసీదును కాపాడుకోడానికే పోరాడుతున్నామని గాజాను తమ అధీనంలో ఉంచుకున్న హమాస్ మిలిటెంట్లు చెబుతున్నారు.

జెరూసలెంలో హింస

ఫొటో సోర్స్, EPA

శాంతి కోరుతున్న అంతర్జాతీయ సమాజం

ఇజ్రాయెల్, పాలస్తీనాలు శాంతిని పునరుద్ధరించాలని ప్రపంచ దేశాలు మరోసారి విన్నవించాయి.

ఇజ్రాయెల్, పాలస్తీనా వీలైనంత త్వరగా ఉద్రిక్తతలకు తెరదించాలని అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ కోరాయి.

పాలస్తీనా మిలిటెంట్లు సోమవారం రాత్రి జెరూసలెంపై కొన్ని రాకెట్లు ప్రయోగించడంతో అక్కడ హింస చెలరేగింది.

ఇజ్రాయెల్ సైన్యం దీనికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌లోని చాలా మిలిటెంట్ స్థావరాలపై వైమానిక దాడులు జరిపింది.

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పిల్లలు సహా కనీసం 20 మంది చనిపోయారని గాజాలోని పాలస్తీనా వైద్య సిబ్బంది చెప్పారు.

మరోవైపు, వైమానిక దాడులు జరిపినప్పుడు గాజా స్ట్రిప్‌లో మిలిటెంట్ సంస్థ హమాస్‌కు నేతృత్వం వహిస్తున్న కనీసం ముగ్గురు చనిపోయినట్లు ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది.

జెరూసలెంలోని అల్-అక్సా మసీదు సమీపంలో ఇజ్రాయెల్ భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణలో వందలాది పాలస్తీనియన్లు గాయపడడంతో, దాడులు చేస్తామని హమాస్ సోమవారం బెదిరించింది.

అల్ అక్సా మసీదులో ప్రవేశంపై ఆంక్షలు విధించారు

ఫొటో సోర్స్, EPA

హమాస్ సంస్థ దాడులపై మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు "హమాస్ హద్దులు మీరుతోంది, ఇజ్రాయెల్ దీనికి తగిన జవాబు చెబుతుంది" అన్నారు.

గత కొన్ని రోజులుగా జెరూసలెం దారుణమైన హింసను చూసింది. జెరూసలెంలో ఇంతకు ముందు కూడా హింసాత్మక ఘటనలు జరిగాయి.

కానీ, గత సంవత్సరాల్లో జరిగిన హింసతో పోలిస్తే, గత కొన్ని రోజులుగా ఇక్కడ జరిగిన హింస దారుణంగా ఉంది.

జెరూసలెంలోని అల్-అక్సా మసీదులోకి వెళ్లకుండా తమపై ఆంక్షలు విధించడంతో పాలస్తీనియన్లు ఆగ్రహంతో ఉన్నారు.

ఈ మసీదు యూదుల ఆలయమైన టెంపుల్ మౌంట్ దగ్గరే ఉంటుంది. దానిని యూదుల ప్రముఖ ధార్మిక స్థలంగా భావిస్తారు.

జెరూసలెం, వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకూ 700 మందికి పైగా పాలస్తీనా వాసులు గాయపడ్డారని మానవతా గ్రూప్ 'ద పాలస్తీనీ రెడ్ క్రెసెంట్' చెప్పింది.

జెరూసలెంలో హింస

ఫొటో సోర్స్, Reuters

మరోవైపు, హమాస్ తమ రాకెట్ దాడులను వెంటనే ఆపాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ అన్నారు. అక్కడ శాంతిని పునరుద్ధరించేలా అన్ని పక్షాలూ అడుగు వేయాలని సూచించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా జెరూసలెంలో కొనసాగే హింసపై ఆందోళన వ్యక్తం చేశారు.

"రాకెట్ దాడులు వెంటనే ఆగాలి. దానితోపాటూ వారు పౌరులు లక్ష్యంగా జరుగుతున్న దాడులను కూడా ఆపాలి" అని బ్రిటన్ విదేశాంగ మంత్రి డామినిక్ రాబ్ ట్వీట్ చేశారు.

"వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్, తూర్పు జెరూసలెంలో తీవ్రమవుతున్న హింసను వెంటనే అడ్డుకోవాల్సిన అవసరం ఉంది" అని ఈయూ విదేశీ వ్యవహారాల ప్రతినిధి జోసెఫ్ బొరెల్ అన్నారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా జెరూసలెంలో జరుగుతున్న హింసపై సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటుచేసింది. .

ఇజ్రాయెల్ ఫ్లాగ్ మార్చ్

ఫొటో సోర్స్, Reuters

సోమవారం జరిగే 'జెరూసలెం డే' రోజున జరిగే ఫ్లాగ్ మార్చ్ సమయంలో నగరంలో మరింత హింస చెలరేగవచ్చని ముందే అంచనా వేశారు.

ఇజ్రాయెల్ 1967లో తూర్పు జెరూసలెంను స్వాధీనం చేసుకోవడానికి గుర్తుగా 'జెరూసలెం డే' జరుపుకుంటారు.

ఆరోజున యూదు యువకులు జెరూసలెంలో ముస్లింలున్న ప్రాంతాల్లో నుంచి ఒక మార్చ్ చేస్తారు. తమను రెచ్చగొట్టడానికే ఆ ఫ్లాగ్ మార్చ్ చేస్తారని నగరంలోని చాలామంది పాలస్తీనియన్లు భావిస్తున్నారు.

ఇంతకు ముందు జెరూసలెంలో నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించడంపై అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తోసిపుచ్చారు.

యూదులు తమదిగా చెబుతున్న ప్రాంతాల్లోనే ఆ నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు.

తమను ఆయా ప్రాంతాల నుంచి వెళ్లగొడతారేమోనని పాలస్తీనియన్లు భయపడుతుండడంతో అక్కడ అశాంతి చెలరేగింది.

అల్ అక్సా మసీదులో ప్రవేశంపై ఆంక్షలు విధించారు

ఫొటో సోర్స్, EPA

అసలు వివాదం ఎందుకు

1967లో మధ్యప్రాచ్యం యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ తూర్పు జెరూసలెంను తమ అధీనంలోకి తెచ్చుకుంది. మొత్తం నగరాన్ని తమ రాజధానిగా భావించింది.

అయితే అంతర్జాతీయ సమాజం దానిని అంగీకరించడం లేదు. పాలస్తీనా... తూర్పు జెరూసలెంను భవిష్యత్తులో ఒక స్వతంత్ర దేశానికి రాజధానిగా చూస్తోంది.

గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ భూభాగం తమదే అంటున్న యూదులు పాలస్తీనియన్లను అక్కడి నుంచి తరిమికొట్టడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అంతకంతకూ వివాదం రాజుకుంటోంది.

2016 అక్టోబర్‌లో ఒక వివాదిత తీర్మానాన్ని ఆమోదించిన ఐక్యరాజ్యసమితి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ జెరూసలెంలోని చారిత్రక అల్-అక్సా మసీదుపై యూదులకు ఎలాంటి హక్కు లేదని చెప్పింది.

"అల్-అక్సా మసీదుపై ముస్లింలకు హక్కు ఉంది. యూదులకు దానితో ఎలాంటి చారిత్రక సంబంధం లేదు" అని ఆ తీర్మానంలో చెప్పారు.

మరోవైపు యూదులు దానిని టెంపుల్ మౌంట్‌ అని చెబుతున్నారు. దానిని యూదులకు అత్యంత ముఖ్యమైన మతపరమైన స్థలంగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)