చైనా: 330 అడుగుల ఎత్తున గాజు వంతెనకు వేలాడిన సందర్శకుడు.. కాపాడిన అగ్నిమాపక సిబ్బంది

గాజు వంతెన విరిగిపోవడంతో వేలాడుతున్న వ్యక్తి

ఫొటో సోర్స్, XINHUA/WEIBO

ఫొటో క్యాప్షన్, గాజు వంతెన విరిగిపోవడంతో వేలాడుతున్న వ్యక్తి

చైనాలోని పియాన్ పర్వతం వద్ద ఓ ఎత్తయిన గాజు వంతెన నుంచి వేలాడుతున్న వ్యక్తిని రక్షించారు.

ఒక్కసారిగా గట్టిగా గాలి వీయడంతో వంతెనపై ఉన్న గ్లాస్ ప్యానెల్స్ దెబ్బతినడంతో దానిపై నడుస్తున్న వ్యక్తి కిందకు జారి వేలాడుతూ ఉండిపోయారు.

చైనాలోని ఈశాన్య ప్రాంతంలో పియాన్ పర్వతం వద్ద ఉన్న 100 మీటర్ల ఎత్తయిన బ్రిడ్జ్ (సుమారు 330 అడుగులు)ను శుక్రవారం ఆ వ్యక్తి సందర్శిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

గంటకు 150 కిలో మీటర్ల వేగంతో వీస్తున్న గాలి ధాటికి వంతెన మీదున్న గాజు ఫ్లోర్ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది.

చైనాలో సుమారు 2,300 గాజు వంతెనలు, నడక మార్గాలు, స్లైడ్‌లు ఉన్నాయని భావిస్తున్నారు.

టూరిజంను ప్రోత్సహించేందుకు, పర్యటకులను ఆకర్షించేందుకు ఈ గాజు వంతెనలను కట్టారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో ఆ వ్యక్తి వంతెన మధ్యలో వేలాడుతూ కనిపిస్తున్నారు.

ఈ గాజు వంతెన లాంగ్‌జింగ్ నగర ప్రాంతంలో ఉంది.

వంతెనపై వేలాడుతున్న వ్యక్తిని కాపాడడానికి అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.

అక్కడే ఉన్న ఆన్-సైట్ సిబ్బంది సహాయంతో ఆ వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారని జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

వెంటనే ఆయన్ను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ఆరోగ్యం స్థిరంగా ఉందని ఆ ఆస్పత్రి తెలిపింది.

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మూసివేశారు. సంఘటనపై దర్యాప్తు జరిపేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారని లాంగ్‌కింగ్ సిటీ వీబో పేజీ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)