చైనా రాకెట్ భూమ్మీదకు దూసుకొచ్చింది... ముక్కలు ముక్కలై హిందూ మహాసముద్రంలో పడిపోయింది

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, జోనాథన్ అమోస్
- హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి
అదుపు తప్పి భూమివైపు దూసుకొచ్చిన తమ రాకెట్ శకలాలు హిందూ మహాసముద్రంలో పడిపోయాయని చైనా చెప్పింది.
"భూవాతావరణంలోకి ప్రవేశించగానే రాకెట్‌లో చాలా భాగం నాశనమైంది. దాని భాగాలు 72.47° తూర్పుగా, 2.65° ఉత్తరంగా పడ్డాయి" అని చైనా ప్రబుత్వ మీడియా చెప్పింది.
ఇది కూలిపోయిన ఈ ప్రాంతం మాల్దీవులకు పశ్చిమంగా ఉంది. లాంగ్ మార్చ్-5B వాహనం కిందకు పడిపోవడాన్ని అమెరికా, యూరప్ ట్రాకింగ్ సైట్స్ పర్యవేక్షించాయి.
ఈ రాకెట్ భాగాలు చైనా కాలమానం ప్రకారం ఉదయం 10.24 (భారత కాలమానం ఉదయం 8 గంటలు)కు తిరిగి భూవాతారణంలోకి ప్రవేశించాయని చైనా ప్రభుత్వ మీడియా చెప్పింది.
"చైనా లాంగ్ మార్చ్-5B అరేబియా ద్వీపకల్పంపై తిరిగి, భూవాతావరణంలోకి ప్రవేశించిందని ధ్రువీకరించవచ్చు. భూమిపై, లేదా నీళ్లపై ఈ శకలాల ప్రభావం ఉంటుందా అనేది మాకు తెలీదు" అని అమెరికా స్పేస్ కమాండ్ ఒక ప్రకటనలో చెప్పింది.
ఈ రాకెట్ భూమిపై పడక ముందు అది జనావాసాలపై పడుతుందేమోనని చాలామంది భయపడ్డారు.
"చైనా నిర్లక్ష్యం వల్లే రాకెట్ తన కక్ష్య నుంచి పడిపోయింది" అని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అన్నారు.
అయితే, భూమి ఎక్కువగా మహాసముద్రాలతో నిండి ఉండడం, చాలా ప్రాంతంలో జనావాసాలు లేకపోవడంతో చాలా చిన్నవిగా ఉండే అంతరిక్ష శకలాలు ఎవరికైనా తగిలే అవకాశాలు చాలా తక్కువని అంతరిక్ష నిపుణులు అంచనా వేశారు.
ఇది శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయం భూవాతావరణంలోకి ప్రవేశించవచ్చని అంతరిక్ష వ్యర్థాల నిపుణులు ముందే అంచనా వేశారు..
ఇంత పెద్ద రాకెట్ భాగాన్ని నియంత్రణ లేకుండా వాతావరణంలోకి ప్రవేశించేలా తాము నిర్లక్ష్యం చేశామని వస్తున్న ఆరోపణలపై చైనా మండిపడింది.
పాశ్చాత్య మీడియా దీన్ని పెద్దది చేసి చెబుతోందని, చైనా ప్రభుత్వ మీడియా ఆరోపించింది. అది ఎక్కడో అంతర్జాతీయ జలాల్లో కూలిపోతుందని అంచనా వేసింది.
అసలు ఏం జరిగింది...
చైనా తాను కొత్తగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రంలోకి గత నెలలో ‘లాంగ్ మార్చ్ 5 బి’ వాహనం ద్వారా తొలి మాడ్యూల్ ప్రయోగించింది.
అయితే, ఆ భారీ రాకెట్ శకలాలు అదుపు తప్పి భూమి పైకి పడ్డాయి.
ఒక నిర్దేశిత దిశ లేకుండా అంతరిక్షంలో ప్రయాణించిన 18 టన్నుల బరువు గల ఈ మాడ్యూల్ చాలా పెద్దది.
ఇది ప్రయాణిస్తున్న మార్గాన్ని పర్యవేక్షిస్తున్నట్లు అమెరికా గురువారం తెలిపింది. అయితే, ఇప్పట్లో దానిని పేల్చివేసే ప్రణాళిక ఏమీ లేదని చెప్పింది.
ఈ మాడ్యూల్‌ను భూమి ఉపరితలం నుంచి 160/375 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలిప్టికల్ కక్ష్యలోకి ఏప్రిల్ 29న పంపించారు.
కానీ, దీనిని పంపించినప్పటి నుంచి అది క్రమంగా దిగువకు వస్తోంది.
ఈ వెహికల్ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు చాలా వరకు భస్మమైపోతుంది.
ఒక్కోసారి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగే ఖనిజాలు, ఇతర పదార్థాలు భూవాతావరణంలోకి వచ్చిన తరువాత కూడా భస్మం కాకుండా ఉంటాయి.

ఆఫ్రికాలో నిరుడు ఇలాంటి రాకెట్ భాగం ఒకటి భూమిపై పడింది.
ఈ శకలాలతో ఏదైనా హాని జరిగితే తగిన చర్యలు తీసుకునేందుకు చైనా స్పేస్ మానిటరింగ్ నెట్‌వర్క్ పర్యవేక్షిస్తున్నట్లు ఏరో స్పేస్ నిపుణులు సాంగ్ ఝాంగ్ పింగ్ చెప్పినట్లు ది గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
"అయితే, ఇదంతా చైనా నిర్లక్ష్య ధోరణిని తెలియచేస్తోంది" అని హార్వర్డ్ స్మిత్ సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రో ఫిజిక్స్ అమెరికాకు చెందిన జోనాథన్ మాక్ డోవెల్ అన్నారు.

"ఈ రాకెట్ ప్రయోగం చేయడం ఇది రెండో సారి. గతంలో రాకెట్ ప్రయోగం జరిగినప్పుడు ఆ రాకెట్ శకలాలు ఐవరీకోస్ట్‌లో పడ్డాయి.
అది కూడా ఇప్పుడు ప్రయోగించిన రాకెట్‌ను పోలి ఉంటుంది,
"1979లో అమెరికా అంతరిక్ష కేంద్రం స్కై ల్యాబ్ శకలాలు పశ్చిమ ఆస్ట్రేలియాలో కూలాయి. ఆ తరువాత భారీ అంతరిక్ష వస్తువులను ఎలాంటి నియంత్రణ లేకుండా భూమి పైకి పడేలా వదిలేయడం ఐవరీ కోస్ట్ ఘటన, ప్రస్తుత ఘటనల్లోనే జరిగింది" అని ఆయన అన్నారు.
ఈ అంతరిక్ష వ్యర్ధాల బాధ్యత చాలా దేశాలపై ఉన్నప్పటికీ ప్రధాన బాధ్యత అమెరికా, రష్యాలపై ఉందని యూకేలోని సౌత్ ఆంప్టన్ యూనివర్సిటీ స్పేస్ సైంటిస్ట్ హ్యూ లెవీస్ అన్నారు.
అయితే, ఆధునిక కాలంలో అంతరిక్ష మిషన్ పూర్తి కాగానే రాకెట్ దశలవారీగా కక్ష్యల నుంచి వైదొలిగేలా చేస్తున్నారు.
సాధారణంగా ఇవి ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, దక్షిణ అమెరికాకు మధ్యలోనున్న సౌత్ పసిఫిక్ దగ్గర్లో ఉన్న సముద్రంలో పడిపోతాయి.
1500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం రాకెట్ వ్యర్థాలకు, పని చేయని శాటిలైట్లకు శ్మశానంగా పేరు పొందింది.
ఇక్కడ సముద్రంలో సుమారు 260 అంతరిక్ష మిషన్ల వ్యర్థాలు కూలిపోయి ఉంటాయని భావిస్తున్నారు.
అదనపు రిపోర్టింగ్: ఆండ్రియాస్ ఇల్మర్
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- కరోనావైరస్: భారతదేశంలో 3 లక్షలు దాటిన రోజువారీ కోవిడ్ కేసులు... యూపీలో ఒకే రోజు 34 వేల మందికి వైరస్
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- తైవాన్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








