వ్యాక్సీన్ టూరిజం: కోవిడ్ టీకా కోసం ఇతర దేశాలకు తరలి వెళ్తున్న జనం

ఫొటో సోర్స్, ENNO LENZE
- రచయిత, పాబ్లో ఉచోవా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇది ఏప్రిల్ మూడో వారంలో జరిగింది. మాస్కోలో ఉన్న ఒక పర్యటకుల బృందం తర్వాత ఏం చేయాలో ప్లాన్స్ వేస్తోంది. వాళ్లు నగరంలో ఏ ప్రాధాన్యం లేని ఒక ప్రాంతం గురించి మాట్లాడుకున్నారు.
ఆ పర్యటకుల బృందం తర్వాత ఒక ప్రైవేట్ మెడికల్ క్లినిక్‌కు వెళ్లబోతోంది. వాళ్లు మాస్కోలోని పర్యటక స్థలాలను చూడ్డం కంటే ఎక్కువగా, ప్రపంచమంతా చర్చించుకుంటున్న రష్యా వ్యాక్సిన్ 'స్పుత్నిక్-వి' వేయించుకోవాలని అనుకుంటున్నారు.
పర్యటకుల ఆ బృందంలో ఎక్కువ మంది జర్మనీ నుంచి వచ్చినవారే ఉన్నారు. స్వదేశంలో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతుండడంతో వాళ్లంతా నైరాశ్యంతో ఉన్నారు.
జర్మనీ నుంచి మాస్కో వచ్చిన ఆ పర్యటకుల్లో ఇనోలాంజ్ ఒకరు. బెర్లిన్‌కు చెందిన ఆయన బీబీసీతో మాట్లాడారు.
"జర్మనీలో రాబోయే రోజుల్లో నేను వ్యాక్సీన్ వేసుకోగలనని ఏ ఆశలూ లేవు. నా వంతు ఎప్పుడు రావచ్చని నేను, మా డాక్టరును అడిగితే, ఆయన అక్టోబర్ లేదా నవంబరులో అన్నాడు. అది కూడా నా మొదటి డోసు కోసం" అన్నారు.
రష్యాలో 'స్పుత్నిక్ వి. టీకాను ప్రతి ఒక్కరికీ ఫ్రీగా వేస్తున్నారు. అయితే, ఇక్కడికి వచ్చే పర్యటకులు తమ మెడికల్ అపాయింట్‌మెంట్ కోసం 240 డాలర్ల నుంచి 265 డాలర్లు చెల్లించాల్సి వస్తోంది.
నార్వేలోని 'వరల్డ్ విజిటర్' అనే ట్రావెల్ అండ్ టూర్ కంపెనీ ఈ వ్యాక్సినేషన్ ట్రిప్స్ ఏర్పాటుచేస్తోంది. దీని నిర్వాహకులు పర్యటకుల ప్రతి అవసరాన్నీ చూసుకుంటున్నారు. అంటే, వారు వెళ్లే మెడికల్ క్లినిక్ నుంచి వాక్సినేషన్ అపాయింట్‌మెంట్స్, వాళ్ల రాకపోకలు, వసతి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA
ఈ ట్రావెల్ కంపెనీ వ్యాక్సీన్ రెండు డోసులు వేసుకోడాని వీలుగా రెండు సార్లు రాకపోకలు, ఉండడానికి ఒక ప్యాకేజ్ ఆఫర్ చేస్తోంది. పర్యటకుల్లో ఎవరైనా రెండో డోసు వరకూ రష్యాలోనే ఉండాలనుకుంటే, దానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది.
రష్యా వచ్చే పర్యటకులు రాపిడ్ కోవిడ్ టెస్ట్‌లో నెగటివ్ వచ్చినట్టు సర్టిఫికెట్ చూపించాలి. ఆ టెస్ట్ రిపోర్ట్ 72 గంటలకంటే ముందుది అయ్యుండకూడదు. ఇతర దేశాల నుంచి వచ్చే వారు క్వారంటీన్‌లో ఉండాలని రష్యాలో ఎలాంటి నిబంధనలేవీ లేవు.
ట్రావెల్ అండ్ టూర్ కంపెనీ యజమానుల్లో అల్బర్ట్ సిగల్ ఒకరు. ఆయన బీబీసీతో మాట్లాడారు.
"43 మంది పర్యాటకుల మొదటి బృందం ఏప్రిల్ 16న రష్యా చేరుకుంది. ఆ తర్వాత మాకు 600కు పైగా బుకింగ్స్ వచ్చాయి" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిబంధనల గందరగోళం
ఇనోలాంజ్ 'బెర్లిన్ స్టోరీ' మ్యూజియం డైరెక్టర్. ఆయన అప్పుడప్పుడు ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతానికి వెళ్తుంటారు. అక్కడ కరోనా వ్యాప్తి కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ శరణార్థుల కోసం ఆయన సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు.
అయితే, మానవతా సాయం అందించేవారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని జర్మనీ నిర్ణయించింది. కానీ, వాలంటీర్‌గా పనిచేస్తున్నాను కాబట్టి, తనకు కోవిడ్ టీకా వేయలేదని ఇనోలాంజ్ చెప్పారు.
ఇనోలాంజ్ మాస్కోకు వ్యాక్సీన్ టూర్ టికెట్ బుక్ చేసుకునే సమయానికి, 70 ఏళ్ల ఆయన తండ్రికి కూడా ప్రభుత్వం టీకా వేయలేదు.
"జర్మనీలో వ్యాక్సినేషన్ ప్రాధాన్య జాబితా గురించి ఎలాంటి సమస్యా లేదు. కానీ ఆ జాబితా వల్ల టీకాలు వేసే ప్రక్రియ ఊహించలేనంత మందకొడిగా సాగుతుంది" అన్నారు.
అయితే వ్యాక్సీన్ ఇవ్వడంలో ఇలాంటి అసమానతలపై ప్రపంచవ్యాప్తంగా ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ ఎవరి దగ్గర డబ్బుంటే, వాళ్లు వేరే ఎక్కడికైనా, ఏ దేశమైనా వెళ్లి టీకా వేయించుకునే ఆప్షన్లు కూడా ఉన్నాయి.
అలా వ్యాక్సీన్ వేస్తున్న దేశాల్లో సెర్బియా, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మాల్దీవులు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
మాల్దీవులు కూడా పర్యాటకులకు ట్రావెల్ ప్యాకేజీలు అందించడానికి ప్రయత్నిస్తోంది. అందులో యాత్రికులకు 'త్రీవీ' అంటే "విజిట్, వ్యాక్సినేషన్, వెకేషన్" అందిస్తున్నారు. మాల్దీవులకు రండి, వ్యాక్సీన్ వేసుకోండి, సెలవులు ఆనందంగా గడపండి అని ప్రచారం చేస్తున్నారు.
మాల్దీవుల పర్యటన మంత్రిత్వ శాఖ తమ ప్యాకేజీ గురించి బీబీసికి పంపిన ఒక ఈమెయిల్లో వివరించింది.
"కోవిడ్ వల్ల ప్రపంచం అంతా మూతపడి ఉన్నప్పుడు 'త్రీవీ' కాంపైన్ చేయాలనే మాల్దీవుల నిర్ణయం సింబాలిక్‌గా పర్యటకులకు ప్రశంసలు అందించడం లాంటిదే. అంటే వాళ్లు ఇక్కడ నుంచి తిరిగి ఇంటికి స్వదేశానికి వ్యాక్సిన్ సర్టిఫికెట్ తెచ్చుకున్నాం అని చెప్పుకోవచ్చు" అని తెలిపింది.
"మా ద్వీపం భౌగోళికంగా దూరంగా ఉండడం అనేది మా అదృష్టం. మా రిసార్టుల్లో మంచి స్టాండర్డ్ కోవిడ్ ప్రొటోకాల్స్ అమలు చేస్తున్నాం" అని చెప్పింది.
సెర్బియా ఇటీవలి వరకూ తమ దేశంలో మిగిలిపోయిన అదనపు టీకా డోసులను విదేశీయులకు ఇస్తూ వచ్చింది. కానీ, వ్యాక్సినేషన్‌లో దేశ జనాభాకు ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం దానిపై నిషేధం విధించింది.
మరోవైపు, అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూయార్క్‌లో ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు లేకుండా భారీగా ఉంటున్న ప్రవాసుల్లో కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రయత్నించేవారి సంఖ్య హఠాత్తుగా పెరిగింది.
వీరిలో కెనెడా, లాటిన్ అమెరికా నుంచి వచ్చిన వారు ఉన్నారు. వాళ్లు అక్కడి వ్యాక్సినేషన్, క్వారంటీన్ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దాని గురించి వివాదం కూడా రేగుతోంది.

ఫొటో సోర్స్, Reuters
ఫ్లోరిడాలో చాలా మంది సంపన్న అమెరికన్లు, విదేశీయులు ఉంటారు. అక్కడ 65 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇస్తున్నారు. వాళ్లు ఎక్కడివారు అనేది పట్టించుకోవడం లేదు.
మయామీలో కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకున్న తర్వాత సంతోషంగా, నిశ్చింతగా ఉన్నానని మెక్సికోకు చెందిన 73 ఏళ్ల టీవీ ప్రజెంటర్ జువాన్ జోస్ ఒరిగెల్ ట్విటర్‌లోని తన 13 లక్షల ఫాలోవర్స్‌కు చెప్పారు.
జనవరిలో ఆ ట్వీట్ చేసిన ఆయన " థాంక్యూ అమెరికా, నా దేశం నాకు ఈ భద్రత అందించలేదు.. ఎంత బాధాకరమైన విషయం" అన్నారు.
ఆయన టీకా వేసుకున్న సమయానికి జువాన్ జోస్ ఒరిగెల్ స్వదేశం మెక్సికోలో మెడికల్ స్టాఫ్, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌క కూడా కరోనా వ్యాక్సిన్ వేయడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
నైతికత గురించి ప్రశ్నలు
కానీ, వ్యాక్సీన్ టూరిజంపై వెళ్తున్న వారి గురించి సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించిన 'గ్లోబ్ ట్రెండర్' అనే సంస్థ మొట్టమొదట 'వ్యాక్సీన్ వీఐపీ' అనే మాట లేవనెత్తింది. "ఈ 'వ్యాక్సీన్ వీఐపీ' అనే ఈ కొత్త జాతి వ్యాక్సిన్ క్యూలలో అందరికంటే ముందున్న చోటును కొనాలనుకుంటోంది" అని చెప్పింది
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సీన్ పంపిణీలో అసమానతలు కనిపిస్తుండడంతో వ్యాక్సీన్ టూరిజం ట్రెండ్‌లో నైతికత ఎక్కడుందనే గ్లోబ్‌ట్రెండర్ ప్రశ్నలు లేవనెత్తింది.
జనవరిలో లండన్‌లోని 'నైట్స్‌బ్రిడ్జ్ సర్కిల్' అనే ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ దుబయిలో లగ్జరీ వ్యాక్సీన్ హాలీడే ట్రిప్ ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది.
40 వేల పౌండ్లకు ఈ ట్రిప్ బుక్ చేస్తున్నారు. అంటే భారత కరెన్సీలో దీని విలువ రూ.41 లక్షల కంటే ఎక్కువే.
కానీ, ఈ సేవలను కంపెనీ ట్రావెల్, లైఫ్‌స్టైల్ సర్వీస్ కోసం 25 వేల పౌండ్లు చెల్లించిన నైట్‌బ్రిడ్జ్ సర్కిల్ సభ్యులకు మాత్రమే ప్రత్యేకంగా రిజర్వ్ చేశారు.

ఫొటో సోర్స్, EPA
నైతికంగా ఏమాత్రం తప్పు కాదు
ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి విస్తరిస్తుండడంతో కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ఆరోగ్య సిబ్బందికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
డబ్ల్యుహెచ్ఓ గైడ్‌లైన్స్ ప్రకారం ఆ తర్వాత వృద్ధులు, కరోనా వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉన్న వారికి టీకా వేయడంలో ప్రాధాన్యం ఇవ్వాలి.
అత్యవసర సేవలకు సంబంధించి అంటే ప్రయాణాలు చేయాల్సిన వారిని కూడా ఈ ప్రాధాన్య జాబితాలో చేర్చవచ్చని అందులో చెప్పారు.
దానితోపాటు ప్రాంతీయ స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నప్పుడు, తగినన్ని టీకాలు సరఫరా చేసేలా ఏర్పాట్లు కూడా చేసుకోవాలని డబ్ల్యుహెచ్ఓ చెప్పింది.
అయితే, పర్యటకులకు ఏయే దేశాలు టీకా ఆఫర్ చేస్తున్నాయో, ఆ దేశాల్లో టీకా సరఫరాకు సంబంధించి సమస్యలు ఉన్నట్టు తమకు అనిపించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది.
"తమ దేశంలో వ్యాక్సీన్ వేల డోసులను విదేశీయులకు ఆఫర్ చేయకపోయుంటే, అవి పాడైపోయేవి" అని సెర్బియా ప్రధానమంత్రి ఎనా బర్నాబిక్ చెప్పారు. ఆ దేశంలో చాలా మందికి వ్యాక్సీన్ వేసుకోవడం ఇప్పటికీ సందేహాలున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
మాల్దీవుల్లో సగానికి పైగా జనాభాకు కోవిడ్ వ్యాక్సీన్ మొదటి డోసు వేశారు. పర్యటక రంగానికి చెందిన 99 శాతం మందికి టీకా వేయడం పూర్తైంది.
మరోవైపు రష్యాలో వీలైనంత ఎక్కువ మందికి స్పుత్నిక్ వి టీకాలు వేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రష్యాలో కేవలం 8 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రష్యా తయారుచేసిన వ్యాక్సీన్‌ను ప్రపంచంలో 60కి పైగా దేశాల్లో వేస్తున్నారు.
"ఇందులో నైతికంగా ఎలాంటి తప్పూ లేదు. ఎందుకంటే, రష్యాలో స్పుత్నిక్ టీకా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంది. మేం ఈ టూర్ల ద్వారా ఎవరినీ మోసం చేయడం లేదు" మాస్కోకు టూర్ సర్వీసులు ఏర్పాటుచేస్తున్నఅల్బర్ట్ సిగల్ అన్నారు.
"వ్యాక్సీన్ ట్రిప్ ఖర్చు భరించగలిగే జర్మన్లకు, ఇది ఒక విధంగా వ్యాక్సినేషన్ వరుసలో ఒక అడుగు ముందుకు వేయడం లాంటిదే" అని ట్రావెల్ కంపెనీ 'వరల్డ్ విజిటర్' వెబ్‌సైట్‌లో చెప్పారు.
వ్యాక్సిన్ ట్రిప్ తమ వ్యాపారానికి సంజీవని లాంటిదని ఆల్బర్ట్ సిగల్ చెప్పారు. మహమ్మారి వల్ల మొదటి నుంచీ మందకొడిగా ఉన్న వ్యాపారంలో ఇప్పుడు ఒక ఆశ కలుగుతోందని అన్నారు.
"గత ఏడాది మా పని పూర్తిగా ఆగిపోయింది. అందుకే ఇప్పుడు మా ముందు రెండు దారులు ఉన్నాయి. చేతులు ముడుచుకుని కూర్చోవాడం, లేదంటే వ్యాక్సీన్ ట్రిప్స్ ఏర్పాటు చేయడం. ఇలా, మేం ప్రతి నెలా 1800 మందికి సమయానికి ముందే టీకా వేసుకోడానికి సాయం చేస్తున్నాం. ఈ మహమ్మారి సమయంలో అది చాలా పెద్ద విషయం, కానీ అది మాకు లాభాలు కూడా తెచ్చిపెడుతోంది" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- కరోనా వైరస్: పిల్లల్లో సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్
- మహిళలు మితిమీరి వ్యాయామం చేస్తే సంతానోత్పత్తి సమస్యలు తప్పవా?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కుంభమేళాను మీడియా ఎలా చూపిస్తోంది... తబ్లీగీ జమాత్ విషయంలో ఏం చేసింది?
- అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా-బ్రిటన్ సేనలు ఏం సాధించాయి?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు... జాతి వివక్ష వారిని వెంటాడిందా?
- జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి పెను విషాదాన్ని మిగిల్చింది
- తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న సిలికాన్ వాలీ సీఈఓ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








