రుయాలో 11 మంది మృతి: 5 నిమిషాలా, అరగంటా... ఆక్సిజన్ సరఫరా ఎంతసేపు నిలిచిపోయింది

ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉన్న రుయా ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఆక్సిజన్ అందక 11 మంది మరణించారు.
సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 5 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా కొంత తగ్గడం వల్ల కోవిడ్ చికిత్స పొందుతున్నవారిలో 11 మంది మరణించారని చిత్తూరు జిల్లా కలెక్టరు హరినారాయణన్ చెప్పారు.
అయితే, రోగుల బంధువులు మాత్రం సుమారు 30 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా చాలా తక్కువ స్థాయిలో జరిగిందని ఆరోపిస్తున్నారు.
ఆ తరువాత ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరించినా అప్పటికే నష్టం జరిగిపోయిందని, తమ వారు చనిపోయారని రోదిస్తున్నారు.
మరణాల సంఖ్య కూడా ఇంకా ఎక్కువే ఉంటుందని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ సిలిండర్లే కనుక లేకుంటే..
రుయా ఆసుపత్రిలో 11 మంది మరణించిన వార్డు పక్కనే 10 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ట్యాంక్ ఉంది.
అయితే, సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయింది.
అప్పటికి 150 మందికి పైగా రోగులు వెంటిలేటర్లపై ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.
సరఫరా తగ్గడంతో రోగులు ప్రాణవాయువు అందక గిలగిలా కొట్టుకోవడం ప్రారంభించారు.
అందుబాటులో ఉన్న బల్క్ సిలిండర్లతో కొందరికి ఆక్సిజన్ అందించారు.
సుమారు 30 నిమిషాల పాటు ఈ పరిస్థితి కొనసాగిందని.. కొందరు మరణించారని రోగులు చెబుతున్నారు.
30 నిమిషాల తరువాత తమిళనాడు నుంచి ఆక్సిజన్ రావడంతో ప్లాంటులో హుటాహుటాని ఆక్సిజన్ నింపి సరఫరా పునరుద్ధరించడంతో మిగతావారి ప్రాణాలు నిలిచాయని చెబుతున్నారు.
పెద్దసంఖ్యలో చేరుకున్న రోగుల బంధువులు
ఘటన సమాచారం తెలియగానే రోగులు బంధువులు పెద్దసంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు.
వైద్యులు, అధికారులపై ఆగ్రహించారు.
వారి నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు పోయాయంటూ ఆవేదన చెందారు.

ఫొటో సోర్స్, facebook/Districtcollectorchittore
కలెక్టర్ ఏమన్నారంటే..
''ఆక్సిజన్ కొరత లేదు. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక లోపం వల్ల ఇబ్బంది తలెత్తింది. సరైన సమయంలో స్పందించి ఇంకా చాలా ప్రాణాలు కాపాడాం. దాదాపు 30 మంది డాక్టర్లు ఐసీయూలో పనిచేస్తున్నారు. ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. 11 మంది రోగులు మరణించారు'' అని చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు.
ఘటనపై పూర్తి విచారణ చేపడతామని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, facebook/ysjagan
విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి
కాగా తిరుపతి రుయా ఆస్పత్రిలో ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. జరిగిన ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఘటనకు దారితీసిన కారణాలను గుర్తించి, మళ్లీ అలా జరగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఆక్సిజన్ సేకరణ, సరఫరాలపైనే కాకుండా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ వ్యవస్థల నిర్వహణపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.
‘అనంతపురం, కర్నూలు, హిందూపురంలో జరిగినా మేలుకోరా?’: విపక్షాలు
ఆక్సిజన్ అందక రోగులు చనిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బాదిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.అనంతపురం కర్నూలు, హిందూపురంల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ రోగులు ఆక్సిజన్ సరఫరా అందక ఇలాగే సంఘటనలు జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకోక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వీర్రాజు అన్నారు.
రుయా ఆసుపత్రి మరణాలు జగన్ ప్రభుత్వం చేసిన హత్యలేనని తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని ఈ ఘటన రుజువు చేసిందన్నారు.
‘‘రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని అందరూ చెబుతున్నారు. కర్నూలు, హిందూపురంల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ రోగులు ఆక్సిజన్ సరఫరా అందక చనిపోయారు. అయినప్పటికీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకోలేదు. ఇలాంటి విపత్కర సమయంలో విమర్శలు చేయకూడదని సంయమనం పాటిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా తక్షణమే పరిస్థితులను చక్కదిద్దాలి. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి విషాదకర ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలి’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సబ్బం హరి: అనకాపల్లి మాజీ ఎంపీ మృతి
- కరోనావైరస్: చైనాకు పాకిన ఇండియన్ వేరియంట్ B1617.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
- కోవిడ్: ‘మా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది చనిపోయారు.. ఏమీ చేయలేకపోయాను’.. ఐసీయూలో పనిచేసే ఓ నర్సు అనుభవాలు
- దీర్ఘకాలిక కోవిడ్: ‘రిపోర్టులన్నీ నార్మల్‌గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్‌లో టీకాల కొరతకు కారణమేంటి..
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








