సబ్బం హరి: అనకాపల్లి మాజీ ఎంపీ మృతి

సబ్బం హరి

ఫొటో సోర్స్, Sabbam hari/facebook

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

మాజీ ఎంపీ సబ్బం హరి(69) మృతిచెందారు. విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు(03.05.2021) మధ్యాహ్నం మరణించారు.

ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడడంతో చికిత్స తీసుకుంటున్నారు. కొద్దిరోజులుగా ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు.

విశాఖ మేయర్‌గా, అనకాపల్లి ఎంపీగా పనిచేసిన ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

సబ్బం హరి రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితమైన పేరు. వివిధ న్యూస్ ఛానల్స్‌లో జరిగే రాజకీయ అంశాల డిబేట్లలో తరచూ పాల్గొనేవారు.

మంచి మాటకారిగా పేరున్న సబ్బం హరి విశాఖ నగర పాలక సంస్థకు మేయరుగా, అనకాపల్లి ఎంపీగా పని చేశారు.

సబ్బం హరి

ఫొటో సోర్స్, facebook/sabbam hari

అనకాపల్లిలో అల్లు అరవింద్‌పై విజయం

1995లో విశాఖ మేయరుగా సబ్బంహరి పని చేశారు. పదవీ కాలం ముగిసిన తరువాత 2000 నుంచి కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉన్నారు.

అనంతరం మళ్లీ 2009 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

అప్పుడు సబ్బం హరికి ప్రత్యర్థిగా ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అల్లు అరవింద్‌ బరిలో నిలిచారు.

వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని

వైఎస్‌ రాజశేఖరరెడ్డిని వీరాభిమానిగా సబ్బం హరికి పేరు. వైఎస్‌ మరణానంతరం ఆయన కుమారుడు జగన్‌కు మద్దతుగా నిలిచారు.

కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే వైఎస్ జగన్ ఓదార్పు యాత్రకు సబ్బం హరి మద్ధతు పలికారు.

సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో సొంత పార్టీపైన (కాంగ్రెస్) లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అదే సమయంలో వైఎస్ జగన్‌కు, సబ్బంహరికి మధ్య కూడా దూరం పెరిగిందని చెబుతారు. దీంతో అటు కాంగ్రెస్, ఇటు వైసీసీకి దూరమయ్యారు.

సబ్బం హరి

ఫొటో సోర్స్, facebook/sabbam hari

నామినేషన్ వాపస్...

అనకాపల్లి ఎంపీగా పదవి కాలం ముగిసినతర్వాత...ఆ సమయంలో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో తొలుత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పా టు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ తరపున విశాఖ ఎంపీగా నామినేషన్ వేశారు.

జై సమైక్యాంధ్ర పార్టీ విధివిధానాలు రూపకల్పన చేయడం, కొన్ని సమావేశాల్లో కూడా పాల్గొన్నారు.

అయితే చివరి నిముషంలో తాను వేసిన నామినేషన్ ఉపసంహరించుకుని...టీడీపీ, బీజెపీ కూటమి అభ్యర్థిగా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న హరిబాబుకి మద్ధతు తెలిపారు.

ఆ ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా వైఎస్ విజయమ్మ ఉన్నారు.

2019 ఎన్నికల్లో భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అప్పటీ నుంచి ఇప్పటీ వరకు వైఎస్ జగన్ ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తూ మీడియాలో కనిపిస్తుండేవారు.

సబ్బం హరి

ఫొటో సోర్స్, facebook/sabbam hari

హుందాగా క్షమాపణలు

గత ఏడాది అక్టోబర్ లో మాజీ ఎంపి సబ్బం హరి ఇంటి కాంపౌండ్ వాల్‌ను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ జీవీఎంసీ అధికారులు కూల్చేశారు. ఆ సమయంలో తనకు నోటీసులు ఇవ్వకుండా అధికారులు దౌర్జన్యం చేస్తున్నారంటూ సబ్బం హరి అక్కడున్న అధికారులపై పరుష పదాలను వాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

"నోటీసులు ఇవ్వకుండా, నేను చెప్తున్నది వినకుండా అధికారులు నా ఇంటి కౌంపౌండ్ వాల్ ని పడగొట్టారు. ఆ సమయంలో విపరీతమైన కోపం వచ్చింది. ఆ ఆవేశంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. బూతులు తిట్టినందుకు మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. కోపంలో తిట్టానే కానీ ఉద్దేశపూర్వకంగా తిట్టలేదు. అంతా నన్ను క్షమించండి." అంటూ సబ్బంహరి వివరణ ఇస్తూ క్షమాపణ కోరారు.

ఫెయిల్యూర్ బిజినెస్ మ్యాన్...సక్సెస్ ఫుల్ పొలిటిషియన్

విశాఖ జిల్లాలోని 1952లో తగరపువలస సమీపంలోని చిట్టివలసలో సబ్బం హరి జన్మించారు.

విశాఖలోని ఏవీఎన్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు.

గ్రాడ్యుయేషన్ తర్వాత విశాఖ నగరంలో బియ్యం వ్యాపారం ప్రారంభించారు.

అది నష్టాలు రావడంతో ట్రాన్స్ పోర్టు వ్యాపారంలోకి దిగారు. అక్కడ కలిసి రాలేదు. దాంతో కొద్దికాలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అందులో కూడా ఆర్థిక నష్టాలే మిగిలాయి.

సబ్బంహరి మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీని అభిమానించేవారు. పార్టీలో పని చేయకపోయినా...1985 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండంటూ తన ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు కట్టి...పోస్టర్లు కట్టడమే కాకుండా రాజీవ్ గాంధీ భారీ కటౌట్ ను కూడా పెట్టారు. ఆ విధంగా కాంగ్రెస్ నాయకులు దృష్టిలో పడ్డారు. ఆ తర్వాత కాంగ్రెస్ పెద్దలు సబ్బంహరిని పార్టీలోకి ఆహ్వానించి ముందుకు నగర కాంగ్రెస్ సెక్రటరీగా, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా నియమించారు. అలా రాజకీయాల్లో ప్రవేశించిన సబ్బం హరి 1995లో విశాఖ మేయరుగా, 2009లో అనకాపల్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పని చేశారు.

హరి బీకాం... లక్ష్మీ బీఏ

సబ్బం హరిది ప్రేమ వివాహం. ఏవీఎన్ కళాశాలలో సబ్బం డిగ్రీ చదువుతున్న సమయంలో...అదే కళాశాలలో బీఏ చదువుతున్న లక్ష్మిని ప్రేమించారు.

ముందు స్నేహంగా మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా...అది పెళ్లిగా కూడా మారింది. 1970లో వీరి వివాహం జరిగింది.

వీరికి ముగ్గురు పిల్లలు. అవని, అర్చన, వెంకట్‌. కుమారుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ గా పని చేస్తున్నారు.

సబ్బం హరి కుటుంబంలో ఆయన తప్ప మరేవరు రాజకీయల్లోకి రాలేదు. అసలు సబ్బం హరి పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాలే పెద్దగా ఎవరికి తెలియదు. రాజకీయాలకు చాలా దూరంగా ఉంచారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

చంద్రబాబు సంతాపం

రాజకీయాలలో ఆద్యంతం విలువలకు కట్టుబడి ఉన్న సబ్బం హరి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)