పాపికొండలు: గోదావరిలో ఏడాదిన్నర తర్వాత మొదలవుతున్న బోటింగ్... కొత్తగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

పాపికొండలు

ఫొటో సోర్స్, SBR Rao

    • రచయిత, శంకర్ వి
    • హోదా, బీబీసీ కోసం

సెప్టెంబర్ 15, 2019. ఓవైపు గోదావరికి వరద ఉద్ధృతి. ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రభుత్వం వైపు నుంచి కూడా కొన్ని ఆంక్షలున్నాయి. అయినప్పటికీ రాయల్ వశిష్ట బోటు బయలుదేరింది. సుమారు 100 మంది యాత్రికులు, సిబ్బంది బోటులో ఉన్నారు.

ఉదయం 11గం.ల సమయంలో గండిపోశమ్మ గుడి వద్ద బయలుదేరిన బోటు మధ్యలో దేవీపట్నం పోలీస్ స్టేషన్ వద్ద అనుమతి తీసుకుని ముందుకెళ్లింది. ఆ తర్వాత కొద్ది సేపటికే మధ్యాహ్నం 1.30 సమయంలో దేవీపట్నం పోలీస్ స్టేషన్‌కి వచ్చిన సమాచారంతో అంతా ఉలిక్కిపడ్డారు.

సరిగ్గా కచ్చులూరు మందం వద్ద వరద ఉద్ధృతిని అంచనా వేయకుండా బోటు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన క్రమంలో ప్రమాదానికి గురయ్యింది. బోటులో ఉన్న వారిలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిలో అత్యధికులను స్థానిక కచ్చులూరు ప్రాంతానికి చెందిన గిరిజన యువకులు కాపాడారు.

సాహసోపేతంగా నదిలో ప్రమాదాన్ని గ్రహించి నీటిలోకి దూకి అనేకమందిని ఒడ్డుకి చేర్చగలిగారు. చివరకు బోటు సరంగు సహా పర్యాటకుల ప్రాణాలు నీటిపాలయ్యాయి. అందులో కొందరి మృతదేహాలు కూడా లభించలేదు.

పాపికొండలు

ఫొటో సోర్స్, SBR Rao

గోదావరిలో ప్రయాణాలు నిలిపివేసిన ప్రభుత్వం

ఈ ఘటనతో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా తొలుత గోదావరిలో ప్రయాణించే బోట్లు మొత్తం నిలిపివేసింది. అనేక చోట్ల ఉభయ గోదావరి జిల్లాల మధ్య తిరిగే పంట్లు కూడా కొన్నాళ్లు నిలిచిపోయాయి. ఇక పర్యాటక బోట్లు అయితే 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకూ తిరగలేదు. మధ్యలో వరద సహాయక చర్యల్లో కొన్ని బోట్లను ప్రభుత్వం వినియోగించుకోవడం మినహా అనేక బోట్లు కనీసం కదపలేదు కూడా.

ఒక్క ప్రమాదం కారణంగా మొత్తం బోటింగ్ నిలిపివేయడం పట్ల బోట్ల యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తామని, తమకు మళ్లీ పర్యాటకానికి అనుమతినివ్వాలని ప్రభుత్వానికి విన్నవించారు.

అయితే ప్రభుత్వం తరుపున ప్రమాణాల కోసం వివిధ బృందాల పరిశీలన తర్వాత కరోనా ముంచుకురావడంతో పర్యాటకం పూర్తిగా నిలిచిపోయింది. ఆ తర్వాత గత ఏడాది సెప్టెంబర్ నుంచి వివిధ పర్యాటక స్థలాల్లో అనుమతులు ఇచ్చినా పాపికొండల్లో బోటింగ్‌కి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదు.

పాపికొండలు

ఫొటో సోర్స్, SBR Rao

నాలుగు శాఖలకు పర్యవేక్షణ బాధ్యత, అదనంగా వాచ్ టవర్లు

ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో బోటింగ్ విషయంలో పరిశీలన చేసేందుకు అనుగుణంగా నిబంధనలను కట్టుదిట్టం చేశారు. కాకినాడ పోర్ట్ అధికారులకు బోట్ల ప్రామాణికతను పరిశీలించి, అనుమతినిచ్చే అధికారం అప్పగించారు. దాంతో పాటుగా గోదావరి పొడవునా పలు చోట్ల వాచ్ టవర్లు ఏర్పాటు చేశారు.

ఇకపై గోదావరి బోటింగ్ పటిష్టంగా ఉంటుందని ఏపీ టూరిజం అధికారులు చెబుతున్నారు. ఏపీ టూరిజం కార్పోరేషన్ అధికారి పి రమేష్ బీబీసీతో మాట్లాడుతూ.. ''గోదావరిలో పర్యాటక బోట్లన్నీ పరిశీలించాం. అన్ని రకాల సదుపాయాలున్న వాటికి అనుమతినిచ్చాం. గతంలో ప్రమాదాలను గమనంలో ఉంచుకుని సరంగులకు ప్రత్యేక శిక్షణనిచ్చాం. పర్యాటకులకు పూర్తి భరోసా కల్పించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వాచ్ టవర్ల ద్వారా ఎప్పటికప్పుడు బోట్ల పరిస్థితిని సమన్వయం చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. తద్వారా నదీ ప్రయాణాల సందర్భంగా ఏర్పడే చిన్న చిన్న సమస్యలను అధిగమించేందుకు అనుగుణంగా సిద్ధం అయ్యాం''అని ఆయన వివరించారు.

పాపికొండలు

ఫొటో సోర్స్, SBR Rao

బోటింగ్ కోసం ఎదురుచూస్తున్నాం..

గడిచిన రెండు దశాబ్దాలుగా గోదావరిలో పర్యాటక బోట్ల రాకపోకలు బాగా విస్తరించాయి. సుమారుగా 100కి పైగా బోట్లు భద్రాచలం దిగువన వీఆర్ పురం మండలం నుంచి పాపికొండల వరకూ వస్తాయి. ఇక రాజమహేంద్రవరం వైపు నుంచి పోశమ్మ గండి, పోలవరం నుంచి కూడా బోట్లు బయలుదేరి పాపికొండల వరకూ వెళతాయి.

అటూ ఇటూ బయలుదేరే ఈ బోట్లపై ఆధారపడి అనేక మంది ఉపాధి పొందుతున్నారు. పర్యాటకులయితే పాపికొండల్లో విహారం ద్వారా ఎంతో ఆనందాన్ని పొందుతుంటారు.

అయితే ఏడాదిన్నరకు పైగా బోట్లన్నీ నిలిచిపోవడంతో చాలా మంది ప్రకృతిలో విహరించే అవకాశం కోల్పోయారని రాజమహేంద్రవరానికి చెందిన సీహెచ్ స్వామినాయుడు అన్నారు.

పాపికొండలు

ఫొటో సోర్స్, SBR Rao

''గోదావరిలో ప్రమాదం జరగడానికి అనేక కారణాలున్నాయి. రెవెన్యూ, పోలీస్ అధికారులు వరదల సమయంలో, బోటు బయలుదేరుతున్న సమయంలో చూసీ చూడనట్టు ఉండడం అసలు కారణం. అలాంటి వాటిని సరిదిద్దకుండా మొత్తం బోటింగ్ నిలిపివేయడం వల్ల చాలామంది రెండేళ్లుగా పాపికొండల యాత్రకు వెళ్లే అవకాశం కోల్పోయారు. ఏటా సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ వారాంతాలలో వేల మంది టూరిస్టులు వచ్చేవారు. అనుబంధంగా పలు వ్యాపారాలు సాగేవి. ఇక ఇప్పుడు మళ్లీ అనుమతిస్తున్న సమయంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. బోటు యజమానులు అన్ని జాగ్రత్తలు పాటించేలా చూడాలి. పర్యాటకులకు సమస్యలు ఉత్పన్నం కాకుండా తనిఖీలు విస్తృతంగా జరగాలి''అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

పాపికొండలు

ఫొటో సోర్స్, SBR Rao

కరోనా పెరుగుతుంటే ఎలా బోటు ఎక్కిస్తారు

దేశమంతా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సమయంలో గోదావరిలో విహార యాత్రకు అనుమతినివ్వడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూనవరానికి చెందిన ఎం ప్రసాద్ బీబీసీతో మాట్లాడారు.

''కరోనా తగ్గిన కాలంలో కూడా డిసెంబర్ నుంచి ఎందుకు బోట్లు నడపడానికి అనుమతినివ్వలేదు. అన్ని చోట్లా టూరిస్టులను అనుమతించి కేవలం పాపికొండల్లోనే ఎందుకు ఆపేశారు. ఇప్పుడు అనేక చోట్ల లాక్‌డౌన్ వార్తలు వస్తుంటే మళ్లీ ఎలా అనుమతిస్తారు. పైగా బోటులో వంద మంది ఉదయం నుంచి సాయంత్రం వరకూ కలిసే ఉంటారు. కలిసే తింటారు. కాబట్టి భౌతిక దూరం సహా అనేక జాగ్రత్తలకు అవకాశం తక్కువ. అయినప్పటికీ మళ్లీ కరోనా పెరుగుతున్న సమయంలో బోటింగ్ ప్రారంభించడం వెనుక కారణాలు అర్థం కావడం లేదు. పైగా బోట్లు తిరుగుతున్నాయంటే ఎక్కువ మంది దూర ప్రాంతాల వాళ్లు కూడా వస్తారు. ఎవరి పరిస్తితి ఏమిటన్నది తెలియదు. అంతేగాకుండా ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం చాలా తక్కువగా ఉంటుంది. బోట్లు తిరగానికి కూడా కొన్ని చోట్ల లోతు చాలా తక్కువ. అయినా ప్రభుత్వం ఎలా బోట్లు అనుమతిస్తుందో వారికే తెలియాలి''అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

పాపికొండలు

ఫొటో సోర్స్, SBR Rao

కరోనా జాగ్రత్తలతోనే ...

పాపికొండల పర్యాటకానికి ఈ నెల 15 నుంచి పర్యాటకుల్ని అనుమతించనున్నారు. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో నడిపే హరిత ఏసీ లగ్జరీ బోటుకు మాత్రమే ప్రస్తుతం పూర్తిస్థాయి అనుమతులు వచ్చాయి. ఆ తర్వాత క్రమంలో మిగిలిన ప్రైవేటు బోటులకు కూడా అనుమతినిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

గతంలో పర్యాటకం నిలిచిపోయే సమయానికి రాజమహేంద్రవరం నుంచి 23 ఏసీ లగ్జరీ బోట్లు, 5 లాంచీలు నడిచేవి. అలాగే భద్రాచలం వైపు నుంచి 32 లాంచీలు, 4 ఏసీ లగ్జరీ బోట్లు రాకపోకలు సాగించేవి. ప్రస్తుతం మాత్రం ప్రైవేటు బోట్లకు అనుమతి లేకపోవడంతో పూర్తిగా కరోనా జాగ్రత్తలతోనే పర్యాటకులను అనుమతిస్తామని ఏపీ టూరిజం అధికారులు చెబుతున్నారు.

పాపికొండలు

ఫొటో సోర్స్, SBR Rao

''కరోనా పరిస్థితులకు అనుగుణంగా అన్ని టూరిస్టు కేంద్రాల్లోనూ తీసుకుంటున్న జాగ్రత్తలు పాపికొండల్లో కూడా వర్తిస్తాయి. పర్యాటకులను పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే అనుమతినిస్తాము. సానిటేషన్, మాస్క్ సహా భౌతికదూరం పాటించేలా చూస్తాం. ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా యాత్ర సాగుతుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వ బోట్లు ద్వారా ప్రారంభించే పర్యాటక యాత్ర సజావుగా సాగితే.. ప్రైవేటు వారికి కూడా అవకాశం ఇచ్చే ఆలోచన ఉంది'' అని ఏపీ టూరిజం అధికారి రమేష్ బీబీసీకి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)