రంజాన్ పండుగ అన్ని ప్రాంతాల్లో ఒకే రోజు ఎందుకు మొదలవ్వదు

ఫొటో సోర్స్, PA Media
ప్రపంచవ్యాప్తంగా ఎందరో ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ పండుగను జరుపుకోనున్నారు. ముస్లింలకు ఈద్ అత్యంత పెద్ద పండుగ.
ఈద్ ఉల్ ఫితర్ అంటే?
రంజాన్ మాసం చివర్లో ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు. ఈ నెలంతా ముస్లింలు ఉపవాసాలు, ప్రార్థనలు చేస్తారు. ఈద్ ఉల్ ఫితర్ అంటే ఉపవాసాలను ముగించడం అని అర్థం.
నెలవంకను చూడటంతో ఈద్ మొదలవుతుంది.

ఫొటో సోర్స్, PA Media
ఈద్‌లో ఏం చేస్తారు?
ముస్లింలు మసీదుల్లో జరిగే ఈద్ ప్రార్థనలకు హాజరవుతారు.
పశ్చిమాసియా దేశాల్లో అయితే ఉదయం నిర్వహించే ఫజర్ ప్రార్థనల తర్వాత వీటిని నిర్వహిస్తారు.
మసీదుకు కొత్త బట్టలు ధరించి వెళ్లడం ఈ పండుగ సంప్రదాయం. ఖర్జూరం లాంటి ఏదైనా తియ్యనిది తిన్న తర్వాత తక్బీర్ అనే చిన్న ప్రార్థన చేస్తారు.
ఈద్ ప్రార్థనలు మొదలు కావడానికి ముందు పేదలకు దానధర్మాలు చేస్తారు. దీని కోసం జకాత్ అల్ ఫితర్ పేరుతో కొంత మొత్తాన్ని దానధర్మాల కోసం కేటాయిస్తారు.
కుటుంబం, స్నేహితులతో కలిసి విందు భోజనం చేస్తారు. బహుమతులు, డబ్బు పంచుకుంటారు.
చాలా దేశాల్లో ఈద్ ఉల్ ఫితర్ నాడు సెలవు ఉంటుంది.
లాక్‌డౌన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కోవిడ్ లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. బ్రిటన్‌లో మే 17 వరకు అమల్లో ఉన్న లాక్‌డౌన్ నిబంధనలను ఈద్ కోసం వీటిని సడలించే ప్రసక్తి లేదని ప్రభుత్వం చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
రంజాన్ అంటే ఏమిటి?
ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదో నెలకున్న అరబిక్ పేరే రంజాన్.
ఇస్లామిక్ నెలల్లోని పవిత్రమైన మాసాల్లో ఇది కూడా ఒకటిగా భావిస్తారు.
రంజాన్ పండుగను ఇస్లాం అయిదు సూత్రాల్లో ఒక్కటిగా గుర్తిస్తారు. వీటిని ముస్లింలు తప్పనిసరిగా ఆచరించాలని ఆ దేవుడిచ్చిన ఆదేశాలుగా ముస్లింలు భావిస్తారు.
మహమ్మద్ ప్రవక్త ఇస్లాం పవిత్ర గ్రంధం ఖురాన్‌లోని తొలి సూత్రాలను రంజాన్ నెలలోనే వెల్లడి చేసినట్లు ముస్లింలు విశ్వసిస్తారు. అందుకే ఈ నెలలో ఖురాన్ పఠనానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు.
ఈ నెలలో చేసే పూజలో ఉపవాసం కూడా భాగం. ఉపవాసం ద్వారా వారు దేవుడికి దగ్గరగా ఉన్నట్లు భావించి వారి ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని, స్వీయ క్రమశిక్షణను మెరుగు పరుచుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ నెలంతా ఏం చేస్తారు?
ఈ నెలంతా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి భోజనం ముగిస్తారు. దీనినే సుహుర్ లేదా సెహ్రి అంటారు.
సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం ముగిస్తారు. అప్పుడు చేసే విందునే ఇఫ్తార్ లేదా ఫితూర్ అంటారు.
ఈ సమయంలో ముస్లింలు దాన ధర్మాలు చేసేందుకు, దైవంతో తమ అనుబంధాన్ని బలపర్చుకోవడానికి ప్రయత్నిస్తారు.
దయ, సహనంతో ఉంటారు.
కొంత మంది మసీదులో రాత్రి పూట జరిగే తరావీహ్ ప్రార్థనలకు కూడా హాజరవుతారు.
ఈ ప్రార్ధనలు కేవలం రంజాన్ మాసంలోనే జరుగుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఏడాది రంజాన్ భిన్నంగా ఉండబోతోందా?
కోవిడ్ మహమ్మారి వ్యాపించిన తర్వాత ఇది రెండో రంజాన్. ఈ ఏడాది కూడా చాలా మంది తమ సంప్రదాయానికి కాస్త భిన్నంగా ఈ పండుగను జరుపుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
సాధారణంగా ఇఫ్తార్ విందును స్నేహితులు, బంధువులతో కలిసి తింటారు. అయితే, లాక్‌డౌన్ నిబంధనలు వీటికి ఆటంకం కలిగించాయి.
2020లో విధించిన నిబంధనల కన్నా ఈ ఏడాది నిబంధనలు కాస్త సడలించడంతో కుటుంబ సభ్యులు కలుసుకునే అవకాశం ఉంటుంది. బ్రిటన్‌లో కొన్ని రెస్టారెంట్లు కూడా బయట జరుపుకునే విందుకు భోజనాలను సరఫరా చేయడం మొదలుపెట్టాయి.
ప్రత్యక్షంగా కలుసుకుని అభినందనలు తెలుపుకోలేనివారు, ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఇఫ్తార్ వేడుకలకు, ఇస్లాం ప్రసంగాలకు హాజరు కావచ్చు.
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మసీదుల్లో ప్రార్థనలు చేసుకోవాలి. పూర్తి లాక్‌డౌన్ విధించిన ప్రాంతాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
రంజాన్, ఈద్ ప్రార్ధనలు ఎలా నిర్వహిస్తారు?
చంద్రమానం ప్రకారం 12 నెలల క్యాలెండర్‌ను ఇస్లామిక్ క్యాలెండర్ అనుసరిస్తుంది. ఇందులో తొమ్మిదో నెల రంజాన్. పదో నెల షవ్వల్ మొదట్లో ఈద్‌ను జరుపుకుంటారు.
నెలవంక దర్శనంతోనే ప్రతి నెలా మొదలవుతుంది. ఇది 29-30 రోజులుంటుంది.
గతంలో దీన్ని మామూలు కంటితోనే నేరుగా చూసి నిర్ణయించేవారు. అయితే, ఇటీవల కాలంలో దీన్ని గుర్తించేందుకు టెలీస్కోపులు, సాంకేతికతను వాడుతున్నారు.
ఇండొనేసియా నుంచి మొరాకో వరకు భౌగోళికంగా చాలా విస్తీర్ణంలో ముస్లిం దేశాలున్నాయి. అంటే నెలవంక ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో కనిపించే అవకాశం ఉంది.
"సంప్రదాయ పరంగా మక్కాలో నెలవంక కనిపించే సమయాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు" అని లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్‌లో సెంటర్ ఆఫ్ ఇస్లామిక్ స్టడీస్‌లో పని చేస్తున్న ప్రొఫెసర్ మహమ్మద్ అబ్దేల్ హలీం అన్నారు.
"కొన్నిసార్లు పశ్చిమాసియా దేశాలతో పాటు మరికొన్ని దేశాల్లో నెలవంకను వేర్వేరు రోజుల్లో చూసినట్లు చెబుతారు" అని ఆయన చెప్పారు.
పాశ్చాత్య క్యాలెండర్ కన్నా చంద్రమానాన్ని అనుసరించే ఇస్లామిక్ క్యాలెండర్ 10 రోజులు తక్కువ ఉంటుంది. అంటే, ప్రతి సంవత్సరం రంజాన్ 10 రోజులు ముందుగా వస్తుంది.

ఫొటో సోర్స్, Reuters
రంజాన్లో ఉపవాసం ఎవరుంటారు?
ఆరోగ్యవంతులు మాత్రమే ఉపవాసం ఉండాలి.
అనారోగ్యంతో బాధపడుతున్నవారు, పిల్లలు, గర్భిణులు, బాలింతలు, నెలసరిలో ఉన్నవారు ప్రయాణాలు చేసేవారు ఉపవాసం చేయనక్కరలేదు.
ఈద్ ఉల్ అదా అంటే ఏమిటి?
ఇస్లామిక్ క్యాలండర్‌లో ఈద్ ఉల్ ఫితర్ మాత్రమే పండగ కాదు. ఈద్ అల్ అదా పండగను ధుల్ హిజా మాసంలో జరుపుకుంటారు. ఈ నెలలోనే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు హజ్ యాత్ర కోసం మక్కా వెళ్తారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ వేరియంట్ 1000 రెట్లు స్పీడా... అందుకే ఏపీ ప్రజలంటే ఇతర రాష్ట్రాలు భయపడుతున్నాయా
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- సైనోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం.. ఇప్పటికే కోట్ల మందికి పంపిణీ
- కరోనా వైరస్: పిల్లల్లో సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్
- మహిళలు మితిమీరి వ్యాయామం చేస్తే సంతానోత్పత్తి సమస్యలు తప్పవా?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కుంభమేళాను మీడియా ఎలా చూపిస్తోంది... తబ్లీగీ జమాత్ విషయంలో ఏం చేసింది?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు... జాతి వివక్ష వారిని వెంటాడిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








