జెరూసలెంలో ఘర్షణలు.. 163 మంది పాలస్తీనియన్లకు, ఆరుగురు ఇజ్రాయెల్ పోలీసులకు గాయాలు

ఫొటో సోర్స్, Reuters
జెరూసలెంలో పాలస్తీనియన్లకు, ఇజ్రాయెల్ పోలీసులకు మధ్య ఘర్షలు జరిగాయి. 163 మంది పాలస్తీనియన్లు, ఆరుగురు ఇజ్రాయెల్ పోలీసు అధికారులు గాయపడ్డారు. పాలస్తీనా వైద్యసిబ్బంది, ఇజ్రాయెల్ పోలీసులు ఈ విషయం తెలిపారు.
ఎక్కువ మంది అల్-అక్సా మసీదు వద్ద జరిగిన ఘర్షణల్లోనే గాయపడ్డారు. ఇక్కడ ఇజ్రాయెల్ పోలీసులు రబ్బరు తూటాలు పేల్చారు. గ్రనేడ్లు వేశారు. పాలస్తీనియన్లు రాళ్లు రువ్వారు. సీసాలు విసిరారు.
తూర్పు జెరూసలెంలోని షేక్ జరా జిల్లా తమదేనని యూదు సెటిలర్లు వాదిస్తున్నారు. అక్కడి నుంచి పాలస్తీనియన్ కుటుంబాలను ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ ప్రయత్నాల నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజా ఘర్షణలూ ఇందులో భాగమే.
జెరూసలెంలోని ఓల్డ్ సిటీలో అల్-అక్సా మసీదు కాంప్లెక్స్ ఉంది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఇది ఒకటి. ఇది యూదులకూ పవిత్ర స్థలమే. యూదులు దీనిని ‘టెంపుల్ మౌంట్’ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్, పాలస్తీనా వాసులకు మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుంటాయి.
రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా మే 7 రాత్రి వేల మంది ముస్లింలు ఇక్కడకు చేరుకున్నారు. సాయంత్రం ప్రార్థనల తర్వాత వేల మంది అల్లర్లకు పాల్పడ్డారని, వారిని అదుపు చేసి, సాధారణ స్థితిని నెలకొల్పేందుకే తాము బల ప్రయోగం చేశామని ఇజ్రాయెల్ పోలీసులు చెప్పారు.
పోలీసులు గ్రనేడ్లు విసరడాన్ని వెంటనే ఆపేయాలని, అలాగే యువత శాంతించాలని, సంయమనం పాటించాలని అల్-అక్సా మసీదు పెద్ద ఒకరు మసీదు లౌడ్ స్పీకర్లలో పిలుపు ఇచ్చారని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
'ద రెడ్ క్రెసెంట్’ ఒక ఫీల్డ్ ఆస్పత్రిని తెరిచి, క్షతగాత్రులకు చికిత్స అందిస్తోంది. గాయపడ్డ పాలస్తీనియన్లలో 88 మందికి రబ్బర్ పొరతో ఉన్న లోహపు బుల్లెట్లు తగిలాయని, వారిని ఆస్పత్రికి తరలించామని ద పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ ఎమర్జెన్సీ సర్వీస్ చెప్పింది. గాయాలపాలైన ఆరుగురు పోలీసు అధికారుల్లో కొందరికి వైద్యచికిత్స అవసరమని పోలీసులు తెలిపారు.
ఘర్షణల తర్వాత, ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నించాలని అంతర్జాతీయ సమాజం పిలుపునిచ్చింది.
ఉద్రిక్తతలు పెరగడంపై తాము చాలా ఆందోళన చెందుతున్నామని అమెరికా విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపన ప్రక్రియపై పనిచేసే ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సమన్వయకర్త టార్ వెన్నెస్లాండ్ ఈ ఘర్షణలపై స్పందించారు. శాంతి, సుస్థిరతలను కాపాడేందుకు జెరూసలెం ఓల్డ్ సిటీలోని పవిత్ర స్థలాల విషయంలో యథాతథ స్థితిని గౌరవించాలని అన్ని పక్షాలనూ కోరారు. పాలస్తీనియన్లను ఖాళీ చేయించే ప్రయత్నాలను ఇజ్రాయెల్ విరమించుకోవాలని ఐరాస కోరింది.
నిరసనకారులపై బల ప్రయోగం విషయంలో పూర్తి సంయమనం పాటించాలని సూచించింది. ఈ వివాదాస్పద స్థలంపై సుదీర్ఘకాలంగా కేసు నడుస్తోంది. ఇజ్రాయెల్ సుప్రీంకోర్టులో దీనిపై సోమవారం విచారణ జరుగనుంది.
1967 మిడిల్ ఈస్ట్ వార్ అప్పటి నుంచి తూర్పు జెరూసలెం ఇజ్రాయెల్ అధీనంలో ఉంది. ఈ నగరమంతా తమ రాజధానేనని ఇజ్రాయెల్ చెబుతోంది. అంతర్జాతీయ సమాజంలో అత్యధికులు దీనిని గుర్తించడం లేదు. తూర్పు జెరూసలెం తమ భవిష్యత్ రాజధాని అని పాలస్తీనియన్లు వాదిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








