సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?

- రచయిత, యొలాండే నెల్, ఫిల్ మార్జోక్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
డబ్బు ఇచ్చి రోగులకు లైంగిక భాగస్వాములుగా నియమించే సరొగేట్ సెక్స్ థెరపీ చాలా దేశాల్లో వివాదాస్పదమవుతోంది.
అయితే, ఇజ్రాయెల్‌లో యుద్ధంలో తీవ్రంగా గాయపడి, సెక్సువల్ రీహాబిలిటేషన్ అవసరమైన సైనికులకు ప్రభుత్వ ఖర్చుతో ఈ చికిత్స అందిస్తున్నారు.
టెల్ అవీవ్‌లో ఇజ్రాయెల్ సెక్స్ థెరపిస్ట్ రోనిత్ అలోనీ గది మనం ఊహించినట్లే ఉంటుంది. అక్కడ రోగుల కోసం చిన్న కుర్చీ ఉంటుంది. గోడల మీద ఆడ, మగ జననేంద్రియాల గురించి వివరించే కొన్ని చిత్రాలు ఉంటాయి.
కానీ, ఆ పక్కనే వెలుగుతున్న కొవ్వొత్తులతో ఒక సోఫా బెడ్ కూడా ఉన్న గదిలో ఏం జరుగుతుందా అని మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. అలోనీ వద్దకు వచ్చే పేషెంట్లకు సెక్స్ ఆస్వాదించడం గురించి చెప్పటానికి కొందరు అక్కడికి వస్తారు. వారికి డబ్బు చెల్లిస్తారు.
ఇది హోటల్లా కనిపించదు, ఇది చాలావరకూ ఒక ఇల్లులా ఉంటుంది. అక్కడ ఆ గదిలో ఒక బెడ్, సీడీ ప్లేయర్, షవర్, గోడలమీద అందమైన కళాకృతులు ఉంటాయి.
"సరొగేట్ సెక్స్ థెరపీ అనేది ఎక్కువగా ఒక జంటకు ఇచ్చే థెరపీలా ఉంటుంది. ఎవరికైనా భాగస్వామి లేకపోతే మనం ఆ ప్రక్రియను పూర్తి చేయలేం. ఇక్కడకు వచ్చే ఆమె లేక అతడు ఎవరైనా మా రోగులతో కలిసి ఆ భాగస్వామి పాత్ర పోషించడానికే వస్తారు" అని అలోనీ చెప్పారు.

విమర్శకులు దీనిని వ్యభిచారంతో పోలుస్తున్నప్పటికీ, సెక్స్ సామర్థ్యం దెబ్బతినేలా తీవ్రంగా గాయపడిన సైనికులకు ఈ చికిత్స అందించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వమే ఖర్చులు భరిస్తోంది.
"తాము ఒకరిని సంతోషపెట్టగలమని, వేరే వారి నుంచి సంతోషాన్ని పొందగలమనే ఫీల్ వారికి కలగాలి.
వాళ్లు సెక్స్ ఆనందం కోసం రావడం లేదు, థెరపీ కోసం వస్తున్నారు. ఇది వ్యభిచారం లాంటిది కాదు" అని అలోనీ అన్నారు. ఆమె సెక్సువల్ రీహాబిలిటేషన్‌లో డాక్టరేట్ చేశారు.
మా థెరపీలో 85 శాతం సెషన్స్‌లో సాన్నిహిత్యం, స్పర్శ, ఇచ్చిపుచ్చుకోవడం, సంభాషించడం లాంటివి ఉంటాయి. ఒక వ్యక్తిగా మనం ఇంకొకరితో సంబంధం ఎలా ఏర్పరుచుకోవాలి అనేది నేర్చుకోవడమే ఈ ప్రక్రియ. మీకు ఒక లైంగిక సంబంధం ఏర్పరుచుకోగలిగే సామర్థ్యం రాగానే అది ముగుస్తుంది" అన్నారు.

రిజర్వ్ సైనికుడిగా పనిచేస్తూ దాదాపు 30 ఏళ్ల క్రితం ఒక పెద్ద ప్రమాదానికి గురైన వ్యక్తి (పేరు వెల్లడించవద్దని కోరాడు) కోసం ఇజ్రాయెల్ రక్షణ శాఖ మొదటిసారి సెక్స్ సరొగేట్ థెరపీకి అయ్యే ఖర్చులను చెల్లించింది.
చాలా ఎత్తు నుంచి పడడంతో అతడి నడుము కింది భాగం చచ్చుబడిపోయింది. దాంతో, ఆయన మునుపటిలా సెక్స్ చేయలేకపోయేవాడు.
ఆ సైనికుడికి అప్పటికే పెళ్లై, పిల్లలున్నారు. కానీ, సెక్స్ సమస్య గురించి డాక్టర్లు, థెరపిస్టులతో మాట్లాడ్డానికి ఆయన భార్య ఇబ్బందిపడ్డారు. దాంతో, అలోనీ నుంచి సాయం తీసుకోవాలని ఆమె భర్తను ప్రోత్సహించారు. ప్రతి సెషన్‌కు ముందూ, తర్వాత అలోనీ తనకు, తన సరొగేట్ సెక్స్ పార్టనర్‌కు ఏయే సూచనలు, ఫీడ్‌బాక్ ఇచ్చేవారో ఆయన వివరించారు.
"మీరు మళ్లీ మొదటి నుంచీ చేయండి, మీరు దీన్ని తాకుతున్నారు, మీరు అక్కడ తాకుతున్నారు" అంటూ ఆమె చివరికి నేను భావప్రాప్తి పొందే దశకు చేరేవరకూ ఒక్కొక్కటీ చేయిస్తూ వెళ్లారు" అని ఆయన చెప్పారు.
తన పునరావాసం కోసం ఇచ్చిన మిగతా ఖర్చుల్లాగే, ఆ సెక్స్ థెరపీకి కూడా ప్రభుత్వం చెల్లించడంలో తప్పేమీ లేదని ఆ సైనికుడు వాదించారు. ఆయనకు ఈ థెరపీలో మూడు నెలల ట్రీట్‌మెంట్ ప్రోగ్రాం కోసం 5,400 డాలర్లు (రూ.4 లక్షలు పైనే) ఖర్చు చేశారు.
"ఆ థెరపీ కోసం వెళ్లాలనేది నా జీవిత లక్ష్యమేమీ కాదు. నేను గాయపడ్డాను, నా జీవితంలో ప్రతిదీ తిరిగి పొందాలని నేను అనుకున్నాను" అని వీల్ చెయిర్లో కూచున్న ఆయన చెప్పారు.
"నాతో కలిసి ఆ థెరపీలో పాల్గొన్న సరొగేట్‌తో నేనేమీ ప్రేమలో పడలేదు. నేను పెళ్లైనవాడిని. ఈ చికిత్స నా లక్ష్యాన్ని అందుకోవడంలో టెక్నిక్‌ను ఎలా స్టడీ చేయాలి అనేది చెబుతుంది. నేను దాన్ని చాలా లాజికల్‌గా తీసుకున్నాను" అన్నారు.

రకరకాల వయసు, నేపథ్యం ఉన్న వారు అలోనీ క్లినిక్‌కు వస్తుంటారు.
వారిలో చాలా మంది ఆందోళన, దగ్గర కాలేకపోవడం లాంటి లైంగిక సమస్యలు ఎదుర్కుంటున్నారు. కొందరికి శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.
అలోనీ తన కెరీర్ ప్రారంభం నుంచి ఎక్కువగా వైకల్యం ఉన్న క్లైంట్స్ మీదే దృష్టిపెడుతున్నారు. ఆమె దగ్గరి బంధువుల్లో చాలా మందికి అలాంటి సమస్యలు ఉన్నాయి. పైలెట్ అయిన ఆమె తండ్రికి కూడా ఒక విమాన ప్రమాదంలో మెదడుకు గాయమైంది.
"వైకల్యాలను అధిగమించాలనుకునే వారికి నేను నా జీవితమంతా అండగా నిలిచాను. వాళ్లంతా చాలా బాగా కోలుకున్నారు. అందుకే నేను ఈ విధానంపై ఆశలు పెట్టుకున్నాను" అని అలోనీ చెప్పారు.
న్యూయార్కులో చదువుతున్న సమయంలో వైకల్యం ఉన్న వారితో పనిచేసే ఒక సరొగేట్‌ను ఆమె స్టడీ చేశారు.
1980ల్లో తిరిగి ఇజ్రాయెల్ వచ్చిన అలోనీ సెక్సువల్ సరొగేట్లను ఉపయోగించడానికి, గ్రామీణ ప్రాంతంలో ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ థెరపీ ప్రారంభించడానికి మతపెద్దల అనుమతి కూడా పొందారు.
యూదు మత పెద్దలు ఆమెకు ఒక నియమం విధించారు. పెళ్లైన పురుషులు లేదా మహిళలు మాత్రమే సరొగేట్లుగా పనిచేయవచ్చని సూచించారు. అప్పటి నుంచీ అలోనీ దానినే అనుసరిస్తున్నారు.
తర్వాత ఆమెకు ఇజ్రాయెల్ అధికారుల నుంచి కూడా అండ లభించింది. ఇప్పుడు అలోనీ క్లినిక్‌లో సరొగేట్ సెక్స్ థెరపీ తీసుకుంటున్న దాదాపు వెయ్యి మందిలో గాయపడిన సైనికులు పదుల సంఖ్యలో ఉంటున్నారు. మెదడు, వెన్నెముక గాయాలున్న వారు ఈ చికిత్స తీసుకుంటున్నారు. వారందరి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది.

ఇజ్రాయెల్‌లోని కుటుంబ సంస్కృతి, సైనికుల పట్ల దేశంలో ఉన్న వైఖరి కూడా తనకు అనుకూలంగా మారిందని అలోనీ భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో 18 ఏళ్ల వయసు నిండినవారికి సైనిక సేవల్లో పనిచేయాలని పిలుపువస్తుంది. మధ్య వయసు వచ్చేవరకూ వారు రిజర్వ్ సైనికులుగా కొనసాగుతారు.
ఇజ్రాయెల్ ఆవిర్భావం నుంచి మేం ఎప్పుడూ యుద్ధ పరిస్థితుల్లోనే ఉంటున్నాం. యుద్ధంలో గాయపడినా, చనిపోయినా వారి గురించి దేశంలో ప్రతి ఒక్కరికీ తెలిసుటుంది. వారికి సాయం అందించడానికి సానుకూలంగా ఉండాలనేది అందరికీ తెలుసు అన్నారు.

2006 లెబనాన్ యుద్ధంలో గాయపడిన 40 ఏళ్ల మాజీ రిజర్వ్ సైనికుడు డేవిడ్(పేరు మార్చాం) ప్రస్తుతం సెంట్రల్ ఇజ్రాయెల్‌లో ఉన్నారు. ఆయన ఏం మాట్లాడలేరు. తన సహాయకుడు చేతికి పెన్ ఇస్తే ఒక పేపరు మీద ఏం చెప్పాలో రాయగలిగే స్థితిలో మాత్రమే ఉన్నారు.
తన మిలిటరీ యూనిట్ మీద దాడి జరిగినపుడు, ఆయన కాలికి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన మూడు నెలలు ఆస్పత్రిలోనే ఉండిపోయారు.
ఆ సమయంలో అసలు బతుకుతాననే ఆశ లేదని ఆయన చెప్పారు. తనకు చికిత్స చేసిన వైద్యులు సరొగేట్ సెక్స్ థెరపీ గురించి సూచించిన తర్వాత తన పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు.
"సరొగేట్ థెరపీ మొదలుపెట్టినపుడు, నాకు ఆ థెరపీ వల్ల ఏం జరగదులే అనిపించేది. కానీ, తర్వాత అది నన్ను నేను ఒక అందమైన మగాడిని అనుకునేలా చేసింది. గాయపడిన తర్వాత మొదటిసారి అది నాకు బలాన్ని, జీవితంపై ఒక ఆశను అందించింది" అన్నారు డేవిడ్.
థెరపీ బయట సరొగేట్స్ రోగులను కాంటాక్ట్ చేయకూడదనే నియమం ఉంది.
కానీ డేవిడ్, అతడికి సరొగేట్‌గా పనిచేసిన సెరాఫినా అనే మహిళ సెషన్స్ పూర్తైన తర్వాత కూడా కలుసుకోడానికి డాక్టర్ అలోనీ క్లినిక్ ప్రత్యేక అనుమతి ఇచ్చింది.
ఈ థెరపీ ముగిసినప్పటి నుంచి డేవిడ్‌లో మార్పు కనిపించిందని, ఆయన తన భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి పెడుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

రోనిత్ అలోనీ క్లినిక్‌లో సెరాఫీనా గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. బాబ్డ్ హెయిర్ ఉండే ఆమె సన్నగా, అందంగా ఉంటారు.
ఆమె తన అనుభవాలపై ఇటీవల 'మోర్‌దాన్ ఎ సెక్స్ సరొగేట్' అనే ఒక పుస్తకం రాశారు.
టెల్ అవీవ్‌లో ఉన్న మిగతా సరొగేట్ భాగస్వాముల్లా, సెరాఫినాకు కూడా వేరే ఉద్యోగం చేస్తున్నారు. పరోపకారం కోసమే ఆ పని చేసేదాన్నని ఆమె చెప్పారు.
"వాళ్లందరూ ఎన్నో రహస్యాలను గుండెల్లో దాచి, మన చుట్టూనే తిరుగుతుంటారు. నేను వాళ్లకు నిజంగా సాయం చేయాలనుకున్నా. ఎందుకంటే నాకు ఆ సామర్థ్యం ఉందని తెలుసు. నేను వారితో అలా చేసినప్పుడు, థెరపీలో భాగంగా నా శరీరాన్ని తాకడం వల్ల నాకు ఏ సమస్యా రాలేదు" అన్నారు.
సెరాఫినా తనను తాను ఒక 'టూరిస్ట్ గైడ్'లా వర్ణిస్తారు. "ఒక ప్రయాణంలో క్లైంట్లను నాకు తెలిసిన దారిలో తీసుకెళ్లా అంతే" అన్నారు.
మరో సైనికుడి సహా, ఆమె దాదాపు 40 మంది క్లైంట్లతో పనిచేశారు. కానీ, డేవిడ్ గాయాల తీవ్రత తనకు ఒక సవాలుగా నిలిచాయని చెప్పారు.
ఇద్దరూ ప్రైవేటుగా సంభాషించడానికి వీలుగా ఆయనకు రాయడానికి ఎలా సహకరించాలో ఆమె ప్రత్యేకంగా నేర్చుకున్నారు.
"నేను చూసిన తీవ్రమైన కేసుల్లో డేవిడ్ ఒకరు. అది ఎడారిలో నడుస్తున్నట్లు ఉండేది. ఏ దిశలో వెళ్లాలో ఏమీ తెలిసేది కాదు" అన్నారు.
డేవిడ్ అసలు కదల్లేని పరిస్థితిలో ఉండడంతో, నేను చాలా చాలా క్రియేటివ్‌గా ఉండాల్సొచ్చింది. ఆయన తన శరీరాన్ని ఎలా కదిలించాలని అనుకుంటున్నారో, అలా ఆయన్ను కదిలించేదాన్ని. ఆయనకు తన శరీరం తెలుస్తోంది. కానీ దాన్ని కలిదించలేకపోయారు. నేను ఆమెకు ఏదీ చెప్పలేకపోయినా, నాకు ఏం కావాలో ఆమెకు తెలుసు అని ఆయన ఎప్పుడూ అనేవారు. అది నిజంగా ఒక ప్రశంస లాంటిదే" అంటారు సెరాఫినా.
సరొగేట్‌గా పనిచేస్తున్నప్పుడు సెరాఫినాకు బాయ్‌ఫ్రెండ్స్ కూడా ఉండేవారు. ఆమె చేసేపనిని వారు కూడా గౌరవించారు.
క్లైంట్స్ మరీ సన్నిహితం అయినప్పుడు వారికి గుడ్‌బై చెప్పడం అవసరమని, అయితే అది కష్టంగా ఉంటుందని ఆమె వివరించారు.
"అంటే, అది ఒక సెలవులో వెళ్లినట్టు ఉంటుంది. మనకు కొంత కాలం ఒక అందమైన బంధంలో ఉండే అవకాశం వస్తుంది. మనం దాన్ని స్వీకరించాలా, వదులుకోవాలా?" అని ప్రశ్నిస్తారు.
"అది ఎవరైనా ఒక సంతోషకరమైన బ్రేకప్ అవుతుంది. అది జరిగేది మంచి కారణంతోనే కదా. కొన్నిసార్లు నాకు ఏడుపు వచ్చింది. కానీ అదే సమయంలో సంతోషించాను కూడా. నా క్లైంట్స్‌లో ఎవరైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, పిల్లలు పుట్టారని, లేదా పెళ్లి చేసుకున్నారని తెలిస్తే, నేను వారిని అలా మార్చగలిగినందుకు ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేను" అన్నారు.

చీకటి పడింది. రోనిత్ అలోనీ ఇంకా తన క్లినిక్‌లోనే ఉన్నారు. యూరప్, దక్షిణ అమెరికా ఇంకా సుదూర ప్రాంతాల సెక్సాలజిస్టుల బృందాలకు ఆన్‌లైన్ పాఠాలు చెబుతున్నారు.
లైంగిక సమస్యలకు ఇచ్చే మామూలు సైకలాజికల్ థెరపీ కంటే సరోగసీ సెక్స్ థెరపీ చాలా ప్రభావవంతంగా పనిచేసినట్లు నిరూపించిన తన కేసుల గురించి, అధ్యయనాల గురించి ఆమె వారికి వివరిస్తున్నారు.
సరోగేట్స్‌తో పనిచేసిన థెరపిస్టులు తాము మళ్లీ అది చేస్తామని చెప్పడం ఆసక్తికరంగా ఉందని ఆమె చెప్పారు.
ఆధునిక సమాజం సెక్స్ పట్ల అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాయని అలోనీ భావిస్తున్నారు.
మనకు సెక్సువాలిటీ గురించి జోకులేయడం తెలుసు. జనాలను ఎలా అవమానించాలో తెలుసు. లైంగికంగా సంప్రదాయబద్ధంగా, చాలా కఠినంగా ఉండడం కూడా తెలుసు అన్నారు.
"సెక్స్ ఎప్పుడూ బాలెన్స్‌గా లేదు. మన జీవితంలో అది ఎప్పుడూ ఎలా పెనవేసుకుని ఉండాలో అలా లేదు. లైంగికత అనేది జీవితం. మేం ఈ థెరపీ ద్వారా ఆ జీవితాన్ని అందిస్తున్నాం. అది కూడా సహజంగా" అంటారు అలోనీ.
ఇవి కూడా చదవండి:
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








