ఇజ్రాయెల్, పాలస్తీనా: కొత్త హింసను ప్రేరేపిస్తున్న పాత గాయాలు

జెరూసలెంలో ఇజ్రాయెల్ పోలీసులను వేలెత్తి చూపిస్తున్న పాలస్తీనావాసి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జెరూసలెంలో ఇజ్రాయెల్ పోలీసులను వేలెత్తి చూపిస్తున్న పాలస్తీనావాసి
    • రచయిత, జెరేమి బోవెన్
    • హోదా, బీబీసీ మిడిల్ ఈస్ట్ ఎడిటర్

ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య ఇటీవల చెలరేగిన ఘర్షణలకు గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్యనున్న గొడవలను పరిష్కరించకుండా ఉంచడమే కారణం. గత కొన్నేళ్లుగా రగులుతున్న ఘర్షణలు ఇరు దేశాల ప్రజల మనస్సులో మానని గాయాల్లా ఉన్నాయి. అందుకే, పరస్పర ఘర్షణలు రాకెట్ దాడులు, వైమానిక దాడుల వరకూ వెళ్లాయి. ఎంతో మంది మరణానికి కారణమవుతున్నాయి.

అంతర్జాతీయ పత్రికలలో ఇక్కడి ఘర్షణల వార్తలు గత కొన్నేళ్ళగా కనిపించనంత మాత్రాన ఈ రెండు దేశాల మధ్య విభేదాలు సమసిపోయాయని అనుకోవడానికి వీల్లేదు. నిజానికి, ఇక్కడ సమస్యలేవీ మారలేదు. కొన్ని తరాల పాటు ఉన్న సమస్యలు, మరణాల వల్ల పేరుకుపోయిన ద్వేషం, అసహ్యం అలానే ఉన్నాయి.

జోర్డాన్ నదికి మధ్యధరా సముద్రానికి మధ్య ఉన్న ప్రాంతం పై ఆధిపత్యం సంపాదించడానికి యూదులు, అరబ్బులు ఒక శతాబ్దానికి పైగా పోరాడుతున్నారు. ఇజ్రాయెల్ 1948లో స్వాతంత్య్రం సంపాదించినప్పటి నుంచి పాలస్తీనాను అనేక సార్లు ఓడించాలని చూసింది. కానీ, అదెప్పుడూ గెలవలేకపోయింది.

ఒక వైపు గొడవలు కొనసాగుతుండగా ఏ ఒక్క దేశమూ సురక్షితంగా ఉండలేదు. ఇలాంటి అనిశ్చిత పరిస్థితి రెండు మూడేళ్లకోసారి తలెత్తుతూనే ఉంది. అలా జరిగినప్పుడల్లా తీవ్రమైన సంక్షోభం ఏర్పడుతుంది. గత 15 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్న తీరు చూస్తుంటే గాజాను ఇజ్రాయెల్ నుంచి వేరు చేసే ప్రాంతం దగ్గర ఘర్షణలు తరచుగా చెలరేగుతూనే ఉంటాయి.

వెస్ట్ బ్యాంక్‌లో ఆక్రమిత భూభాగంలో నిర్మించిన ఇజ్రాయెల్ సెటిల్మెంట్ పాలస్తీనాను ఆగ్రహానికి గురి చేస్తోంది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వెస్ట్ బ్యాంక్‌లో ఆక్రమిత భూభాగంలో నిర్మించిన ఇజ్రాయెల్ సెటిల్మెంట్ పాలస్తీనాను ఆగ్రహానికి గురి చేస్తోంది

జెరూసలెం పవిత్ర స్థలాల్లో చోటు చేసుకున్న ఘటనలు కూడా హింసను ప్రేరేపిస్తున్నాయని ఈ సారి తలెత్తిన ఘర్షణలు గుర్తు చేస్తున్నాయి.

క్రైస్తవులు,యూదులు, ముస్లింలకు ఈ నగరం పవిత్రత కేవలం మతపరమైన అంశం కాదు.

యూదులు, ముస్లింల పవిత్ర స్థలాలు వారికి జాతీయ చిహ్నాలు కూడా. భౌగోళికంగా అవి రాయి విసిరితే తగిలే దూరంలో ఉంటాయి.

ఇజ్రాయెల్ చెక్ పాయింట్ అవతల వైపు ఉన్న ది హోలీ సెపుల్కర్ చర్చిలో పాలెస్తీనా క్రైస్తవులు ప్రార్ధనలు నిర్వహిస్తారు.

తూర్పు జెరూసలెంలోని షేక్ జరా జిల్లా తమదేనని యూదు సెటిలర్లు వాదిస్తున్నారు. అక్కడి నుంచి పాలస్తీనియన్ కుటుంబాలను ఖాళీ చేయించేందుకు కూడా ఈ సారి బెదిరింపులు ఎదురయ్యాయి. ఓల్డ్ సిటీ గోడల అవతల పాలస్తీనా ప్రజలు నివాసం ఉంటారు. కానీ, వారుండే స్థలం, ఆస్తుల పై హక్కులు తమవని అంటూ యూదుల సమూహాలు ఇజ్రాయెల్ కోర్టుల్లో కేసులు కూడా వేశారు.

ఆ కొన్ని కుటుంబాల వారికి అది కేవలం ఒక ఘర్షణ కాదు. జెరూసలెంను యూదుల రాజ్యంగా చేయడమే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్ ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఆక్రమిత స్థలాల్లో యూదుల కోసం పెద్ద పెద్ద సమూహాలను నిర్మించి నగరాన్ని వలయంలా చుట్టేశారు. ఇటీవల కాలంలో పాలస్తీనా వాల్ సిటీ దగ్గర నివసించే సమూహాలలో ఉండే ప్రజలతో ప్రభుత్వాలు కలిసి ఇజ్రాయెలీ యూదుల సమస్యలు పరిష్కరించడానికి పని చేశాయి.

అయితే, రంజాన్ మాసంలో పాలెస్తానీయులపై ఇజ్రాయెల్ పోలీసులు చేయి చేసుకోవడంతో మొదలయిన గొడవలు అల్ అక్సా మసీదులో సిఎస్ గ్యాస్, గ్రెనేడ్ల ప్రయోగం చేయడం వరకు వెళ్ళింది. ఇది మక్కా, మదీనా తర్వాత ముస్లింలకు చాలా పవిత్ర స్థలం.

హమాస్ అల్ అక్సా మసీదు, షేక్ జరా ఆవరణ నుంచి సైన్యాన్ని తొలగించమని ఇజ్రాయెల్ కు అల్టిమేటం జారీ చేసి జెరూసలెం పై రాకెట్లు ప్రయోగం చేసింది.

ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణలు

ఫొటో సోర్స్, EPA

"గాజాలో ఉన్న తీవ్రవాద సంస్థలు ఎర్రని రేఖను దాటాయి. ఇజ్రాయెల్ దీనిని గట్టి బలంతో ఎదుర్కొంటుంది" అని అంటూ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ట్వీట్ చేశారు.

మరింకేదైనా ఘటనలు జరిగినా కూడా ఇదే పరిస్థితులకు దారి తీసి ఉండేవి. ఈ దేశాల మధ్య ఉద్రిక్తలు పరిష్కారం అయ్యే వరకు ఇక్కడ హింసాత్మక ఘటనలు చెలరేగుతూనే ఉంటాయి.

ఇరు దేశాల వారు శాంతియుతంగా జీవించేందుకు జెరూసలెంలో చివరిసారి ఆశావహ దృక్పథం కనిపించిన సమయం ఎప్పుడని నన్ను బీబీసీ ప్రెజెంటర్ అడిగారు. నేను జెరూసలెంలో 1995 - 2000 వరకు ఉన్నాను. ఆ తర్వాత చాలా సార్లు వెళ్లాను.

దీనికి సమాధానం వెతకడం కష్టం. 1990లలో ఆస్లో శాంతి ప్రక్రియ జరుగుతున్న సమయంలో చాలా కొంత సమయం పాటు ఆశ కనిపించింది.

రెండు వైపులా నాయకులు మాత్రం శాంతిని నెలకొల్పే బదులు తమ సొంత రాజకీయ లాభాల కోసం, వారి స్థానాలు నిలదొక్కుకునేందుకు పోరాటాలు చేసుకుంటున్నారు. ఈ సమస్యను మాత్రం ఎవరూ కొన్నేళ్లుగా పరిష్కరించడానికి చూడలేదు.

అయితే, ఇరు దేశాల ప్రజలకు ముందు సమాన హక్కులు, భద్రత అవసరమని కార్నెజి ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, యూఎస్ మిడిల్ ఈస్ట్ ప్రాజెక్ట్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి.

ఇజ్రాయెల్ అధీనంలో ఉన్న ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి పూర్తి సమానత్వం, ఓటు హక్కులు కల్పించడానికి అమెరికా సహకరించాలని ఈ నివేదిక సూచించింది. రెండు వేర్వేరు విధానాలను సమర్ధించకూడదని కోరింది.

కొత్తగా ఆలోచించడం మంచిదే. కానీ, పాత ఘటనలు, విభేదాలు, శతాబ్ధ కాలంగా రగుతులుతున్న పోరాటం మరోసారి భగ్గుమనడం వంటి ఘటనలతో అన్ని ఆలోచనలూ కొట్టుకుపోతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)