"ఆ రాకెట్ మా ఇంటి మీదే పడేది".. ఇజ్రాయెల్‌లో భయంభయంగా తెలంగాణ వాసుల జీవితం

ఫొటో సోర్స్, PRASAD ELLE
- రచయిత, కమలేష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"మాకు ప్రాణాలు కాపాడుకోడానికి 15 నుంచి 30 సెకన్ల టైం దొరుకుతుంది. రాకెట్ దాడి జరిగిందనే సైరన్ మోగగానే, మనం ఎంత పనిలో ఉన్నా, అన్నీ వదులుకుని షెల్టర్‌లోకి వెళ్లిపోవాలి"
ఇజ్రాయెల్‌లోని అష్క్‌లోన్‌లో కేర్ గివర్‌గా పనిచేస్తున్న ప్రసాద్ ఏలె భయంభయంగా ఈ మాట చెప్పారు.
ప్రసాద్ తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాకు చెందినవారు. ఆయన 13 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ వచ్చారు. అప్పటి నుంచి కేర్ గివర్ అంటే రోగుల బాగోగులు చూసుకునే పని చేస్తున్నారు.
ప్రసాద్‌కు ఇటీవల హమాస్ రాకెట్ దాడుల్లో చనిపోయిన సౌమ్యా సంతోష్ కూడా తెలుసు. రాకెట్ దాడి జరిగిన వెంటనే తనను తాను కాపాడుకోలేకపోవడంతో ఆమె చనిపోయారని చెప్పారు.
"సౌమ్య ఇల్లు మా ఇంటికి 50 మీటర్ల దూరంలో ఉంది. కాస్త అటూఇటూ అయ్యుంటే, ఆ రాకెట్ మా ఇంటిమీదే పడుండేది. గత ఏడాది కూడా మా ఇంటికి కాస్త దూరంలో ఒక రాకెట్ పడింది. ఐరన్ డోమ్ సిస్టమ్ వల్ల మా ప్రాణాలు కాపాడుకున్నాం" అన్నారు ప్రసాద్.
కేరళకు చెందిన సౌమ్యా సంతోష్ కూడా అష్క్‌లోన్‌లోనే కేర్ గివర్‌గా పనిచేసేవారు. గాజా నుంచి వచ్చిన ఒక రాకెట్ సౌమ్యా సంతోష్ ప్రాణాలు తీసింది.
ఘర్షణలు ఇంకా కొనసాగుతుండడంతో ప్రసాద్ కూడా ఇప్పుడు భయం భయంగా గడుపుతున్నారు.
పాలస్తీనా మిలిటెంట్లు, ఇజ్రాయెల్ మధ్య దాదాపు గత రెండు వారాలుగా ఘర్షణ కొనసాగుతోంది.
హమాస్ మిలిటెంట్లు గాజా నుంచి ఇజ్రాయెల్ మీదకు రాకెట్లు ప్రయోగిస్తున్నారు. ఇజ్రాయెల్ కూడా గాజాపై సైనిక చర్యలు చేపడుతోంది. ఈ ఘర్షణలో ఇప్పటివరకూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.
అష్క్‌లోన్ గాజాకు దాదాపు 43 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో అక్కడ రాకెట్ దాడుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. వాటి నుంచి తప్పించుకోడానికి స్థానికులకు పెద్దగా సమయం కూడా ఉండదు.
గాజాకు అత్యంత సమీప ప్రాంతాల్లోని ప్రజలకు షెల్టర్(సేఫ్టీ రూమ్)లోకి చేరుకోడానికి 15 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది.

ఫొటో సోర్స్, Reuters
రాత్రంతా సైరన్ మోగుతూనే ఉంది
ఇజ్రాయెల్ మీద రాకెట్ దాడులు జరిగినప్పుడు అధికారులు సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేస్తారు. పౌరులు వెంటనే ఇంట్లో భూగర్భంలో నిర్మించిన షెల్టర్‌లోకి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అక్కడ ఉండేవారికి రాకెట్ వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు.
ఇజ్రాయెల్‌లో దాదాపు ప్రతి ఇంట్లో సేఫ్టీ షెల్టర్లు ఉంటాయి. కానీ కొన్ని పురాతన ఇళ్లలో అవి లేవు. సౌమ్యా సంతోష్ పనిచేస్తున్న ఇంట్లో కూడా ఇలాంటి సేఫ్టీ షెల్టర్ లేదు. కొన్ని ప్రాంతాల్లో పబ్లిక్ షెల్టర్లు కూడా ఉంటాయి. అక్కడ ఒకేసారి చాలామంది వెళ్లి ఉండచ్చు.
"12న రాత్రి మేం నిద్రపోలేదు. మాటిమాటికీ సైరన్ మోగుతూనే ఉంది. ఆగకుండా ఫైరింగ్ జరుగుతూనే ఉంది. నేను, మా వాళ్లను తీసుకుని చాలాసార్లు షెల్టర్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు అలర్ట్‌లు తక్కువగా వస్తున్నాయి" అని ప్రసాద్ చెప్పారు.
ప్రసాద్ లాగే ఎంతోమంది భారతీయులు ఇజ్రాయెల్‌లో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, RAVI SOMA
గాల్లోనే పేలిపోయే రాకెట్లను చూశాం
తెలంగాణ నుంచి ఇజ్రాయెల్ వచ్చిన వారందరూ కలిసి 'ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్' కూడా ఏర్పాటు చేసుకున్నారు. రవి సోమ ఈ సంఘానికి అధ్యక్షుడుగా ఉన్నారు.
రవి సోమ నిజామాబాద్ జిల్లాకు చెందినవారు. ఆయన కుటుంబంలో తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆయన 14 ఏళ్ల నుంచి టెల్‌అవీవ్‌లో కేర్ గివర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయన బీబీసీతో మాట్లాడారు.
"మాకు ఇక్కడ రాకెట్ల సమస్య లేదు. కానీ, అష్క్‌లోన్ లాంటి ప్రాంతాల్లో ఏడాదంతా రాకెట్లు పడుతూనే ఉంటాయి. రోజూ అలర్ట్ సైరన్ మోగుతూనే ఉంటుంది. కానీ, గత కొన్ని వారాలుగా అది చాలా పెరిగింది. టెల్‌అవీవ్‌లో ఇంతకు ముందు అలా ఉండేది కాదు. కానీ, ఇప్పుడు ఇక్కడ కూడా రాకెట్లు పడుతున్నాయి" అన్నారు.
"సైరన్ మోగగానే మేం రెండు నిమిషాల్లోపే సేఫ్టీ రూంలోకి వెళ్లాల్సుంటుంది. అక్కడకు వెళ్లిన తర్వాత మాకు ఏ ప్రమాదం ఉండదు" అన్నారు రవి.
తెలంగాణకు నుంచి వచ్చిన దాదాపు 800 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాదాపు 8 వేల మంది తెలుగువారు ఇజ్రాయెల్‌లో ఉంటున్నారని రవి సోమ చెప్పారు.
మహేశ్వర్ గౌడ్ కూడా తెలంగాణకు చెందినవారే. ఆయన టెల్‌అవీవ్‌లోని రమాదగన్ ప్రాంతంలో ఉంటారు. ఆరేళ్ల నుంచి అక్కడే ఉంటున్న మహేశ్వర్ ఒక సూపర్ మార్కెట్‌లో ఫ్లోర్ మెషిన్ నడుపుతారు.
"కొన్నిరోజుల క్రితం వరకూ మేం రోజుకు 50 సార్లు సేఫ్టీ రూంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. మేం భయం భయంగా గడిపేవాళ్లం. ఒకరికొకరం పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకునేవాళ్లం. మేం రాకెట్లు గాల్లోనే పేలిపోవడం కూడా చూస్తుంటాం. అవే కింద పడితే వేల మంది చనిపోతారు" అన్నారు మహేశ్వర్..
ప్రస్తుతం ఇజ్రాయెల్‌లోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. అక్కడ జనం ప్రతి రోజూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
అయితే, ఇజ్రాయెల్ వాతావరణం తమకు నచ్చిందని అక్కడికి వెళ్లిన భారతీయులు చెబుతున్నారు.
భారత్ నుంచి ఇజ్రాయెల్ వెళ్లినవారు ఎక్కువగా కేర్ గివర్ పని చేస్తున్నారు. ఇక్కడ ఐటీ నిపుణులు, హాస్పిటాలిటీ రంగంలో పనిచేసేవారు కూడా ఉన్నారు. వీరిలో చాలా మంది మెయింటెనన్స్ పనులు చేస్తుంటారు.

ఫొటో సోర్స్, Reuters
జీతం అక్కడికంటే మూడు రెట్లు ఎక్కువ
ఇజ్రాయెల్లో మొత్తం 12,500 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 11,500 మంది కేర్ గివర్స్‌గా పనిచేస్తున్నారు. మిగతా వారిలో వజ్రాల వ్యాపారులు, ఐటీ నిపుణులు, విద్యార్థులు ఉన్నారు.
ఇజ్రాయెల్‌లో జర్నలిస్టుగా ఉన్న హరేంద్ర మిశ్రా అక్కడి భారతీయుల పరిస్థితుల గురించి చెప్పారు.
"ఇజ్రాయెల్లో రెండు రకాల భారతీయులు ఉన్నారు. మొదటి రకం ఉద్యోగాల కోసం ఇక్కడికి వస్తారు. వారికి ఇజ్రాయెల్ పౌరసత్వం లభించదు. మిగతావారు భారతీయ యూదులు. వారికి ఇజ్రాయెల్ పౌరసత్వం లభిస్తుంది. వారంతా ఇజ్రాయెల్‌లోనే స్థిరపడ్డారు.
ఇక్కడికి వచ్చేవారిలో ఎక్కువ మంది కేర్ గివర్స్‌గానే పనిచేస్తున్నారు. దానికి కారణం ఏంటో కూడా హరేంద్ర మిశ్రా చెప్పారు.
"దానికి మూడు కారణాలున్నాయి. ఇక్కడ కేర్ గివర్లకు ఇచ్చే వేతనం.. భారత్‌లో, గల్ఫ్ దేశాల్లో ఇచ్చేదానికంటే ఎక్కువగా ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో పనిచేసి ఇక్కడకు వచ్చినవారు, అక్కడికి ఇక్కడికి వేతనంలో మూడు రెట్లు తేడా ఉందని చెప్పారు. అంతే కాదు, ఇక్కడ నియమాలు, సౌకర్యాలు కూడా ప్రజలను ఆకర్షిస్తున్నాయి" అన్నారు.
ఇజ్రాయెల్ వచ్చిన వారిలో ఎక్కువ మంది కేరళ నుంచే వస్తున్నారు. మిగతావారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ వారు కూడా ఉన్నారు.
భారత్‌తోపాటూ ఫిలిప్పీన్స్, నేపాల్, శ్రీలంక ప్రజలు కూడా ఇక్కడ కేర్ గివర్‌గా పనిచేస్తున్నారు.
"ఇజ్రాయెల్లో మాకు భారత్‌లో ఉంటున్నట్టే అనిపిస్తుంది. ఇక్కడివారు మాతో చాలా మర్యాదగా వ్యవహరిస్తారు. మేం వారి ఇళ్లలోనే ఉంటాం. వారితోనే కలిసే తింటాం. ఎదైనా ఫిర్యాదు చేయాలన్నా, ఏదైనా ఏజెన్సీతో మాట్లాడాలన్నా వెంటనే సాయం అందుతుంది" అని రవి సోమ చెప్పారు.
"ఇక్కడ జీతాలు కూడా బాగుంటాయి. భారతీయ కరెన్సీ ప్రకారం ఇక్కడ ఇచ్చే వేతనం లక్ష వరకూ ఉంటుంది. ఇదే పనికి గల్ఫ్ దేశాల్లో రూ.30 నుంచి రూ.40 వేలే ఇస్తారు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కనీస మెడికల్ కేర్ తెలిసుంటే చాలు
ఇజ్రాయెల్ వెళ్లాలంటే పెద్ద పెద్ద లాంగ్వేజ్ పరీక్షలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. హిబ్రూ తెలిసుండాల్సిన అవసరం లేదు. ఇంగ్లిష్ వస్తే చాలు. కానీ, దానికి ఐఈఎల్‌టీఎస్ లాంటి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు.
అక్కడకు వెళ్లేవారు కేర్ గివర్ పని చేయడానికి నర్స్ కావాల్సిన అవసరం కూడా లేదు. కానీ, ఆ పనిలో అనుభవం ఉండాలి.
"కేర్ గివర్ పని చేయడానికి మెడికల్ కేర్ గురించి కనీస సమాచారం ఉంటే చాలు. అంటే, బీపీ, షుగర్ చెక్ చేయడం, మందులు ఇవ్వడం లాంటివి తెలియాలి. అలాంటి వాటిని నేర్పించడానికి భారత్‌లో షార్ట్ టర్మ్ కోచింగ్ కూడా ఇస్తున్నారు" అని రవి సోమ చెప్పారు.
ఇజ్రాయెల్‌లోని భారతీయుల్లో వజ్రాల వ్యాపారులు కూడా ఉన్నారు. వారి సంఖ్య చాలా తక్కువే ఉంది. కానీ, వారికి ఇజ్రాయెల్‌తో చాలా పురాతన సంబంధాలు ఉన్నాయి.
1983లో ఇజ్రయెల్ వచ్చిన 30 భారతీయ జైన కుటుంబాలు వజ్రాల వ్యాపారం చేసేవారు. వారంతా ఇప్పుడు దాదాపు అక్కడే స్థిరపడ్డారని హరేంద్ర మిశ్రా చెప్పారు.
భారత్-ఇజ్రాయెల్ మధ్య 1992లో దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ వాళ్లకు ప్రత్యేక అనుమతులు ఉన్నాయి. వారికి ఇప్పటికీ భారతీయ పౌరసత్వమే ఉంది. ఎందుకంటే యూదులకు మాత్రమే ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది.
భారత్-ఇజ్రాయెల్ మధ్య జరిగే ద్వైపాక్షిక వాణిజ్యంలో భద్రతా సంబంధిత వాణిజ్యం పక్కన పెడితే మిగతా 50 శాతం పైగా వజ్రాల వ్యాపారమే జరుగుతోంది. అందుకే, ఇజ్రాయెల్ వారికి ప్రత్యేక హక్కులు ఇచ్చింది.
"రెండు దేశాల సంబంధాలు వృద్ధి చెందిన తర్వాత ఇక్కడకు ఐటీ నిపుణుల రాక కూడా పెరిగింది. ఇక్కడి ఐటీ కంపెనీలు భారత్‌లో తమ కంపెనీలు కూడా తెరిచాయి. వారికి ఉద్యోగాలు ఇస్తూ, ట్రైనింగ్ కోసం ఇక్కడికి ఆహ్వానిస్తుంటాయి" అని హరేంద్ర మిశ్రా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








